ప్రియాంక గాంధీ జపం చేస్తున్న కాంగ్రెస్ నేతలు...
posted on May 12, 2016 @ 12:39PM
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ జపం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 2017 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రియాంక గాంధీ ఒక్కటే మార్గమని నేతలు భావిస్తున్నారట. అసలే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ రంగలోకి దిగారు. ఈనేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలతో సమావేశాలు జరుపగా అందరూ ప్రియాంక గాంధీవైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రియాంక గాంధీ వస్తేనే యూపీలో అధికారంలోకి వచ్చే వీలుంటుంది అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారట. దీంతో ఇక ప్రశాంత్ కిషోర్ ఆమెను ఎలాగైనా ఒప్పించి యూపీ ఎన్నికల బరిలో నిలపాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు యూపీ అభ్యర్ధిగా రాహుల్, ప్రియాంక లేదా ఓ బ్రాహ్మణ అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ప్రశాంత్ కిషోర్ కోరినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ పార్టీ నేతలు మాత్రం ప్రియాంక జపమే చేశారు. మరి సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.