అన్నాడీఎం, డీఎంకే ప్రకటనలతో ఇరుక్కుపోయిన నటి..
posted on May 12, 2016 @ 4:21PM
త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి రాజకీయాల్లో వేడి వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో భాగంగా అన్నాడీఎంకే.. డీఎంకే పార్టీలు ఓ ప్రకటనలు చేయించాయి. ఇప్పుడు ఈ ప్రకటనలవల్ల పార్టీల సంగతేమో కానీ.. ప్రకటనలో నటించిన ఓ సీనియర్ తమిళ నటి మాత్రం ఇరుక్కుపోయారు. ఎందుకంటే రెండు ప్రకటనల్లో నటించిది ఆమెనే.. అసలు సంగతేంటంటే..కస్తూరి అనే నటితో అన్నాడీఎంకే ఓ ప్రకటన రూపొందించింది. "నాకు కన్నబిడ్డలే తిండి పెట్టలేదు. అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మనే" అని అమ్మ క్యాంటీన్లను చూపుతూ ప్రకటన చేయించారు. దీనికి రూ. 1500 ఇచ్చారట.
అయితే ఆతరువాత డీఎంకే నేతలు కూడా వచ్చి ఆమెను ప్రకటనలో నచించాలని కోరారు. అయితే తాను అప్పటికే నటించానని చెప్పినా వినకుండా బలవంతంగా తీసుకెళ్లి.. "గాల్లో తిరిగే వారికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఎందుకు? చాలమ్మా.." అంటూ చెప్పించి, ఓ రూ. 1000 చేతిలో పెట్టి పంపారు. దీంతో ఇప్పుడు రెండు ప్రకటనలు టీవీ ఛానళ్లలో పోటా పోటీగా ప్రసారమవుతున్నాయి. మరోవైపు కస్తూరి మాత్రం తనకే పాపం తెలియదని.. డీఎంకే నేతలే బలవంతంగా తీసుకెళ్లి ప్రకటన చేయించారని ఆరోపిస్తున్నారు.