ఏపీలో హెల్త్ కేర్ ఏటీఎంలు.. ఒక్క క్లిక్ తో..

  ఏపీ ప్రభుత్వం మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మరింత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలో ఒకటి.. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి.. మొత్తం 25 హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఏటీఎం సెంటర్లలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఔషధాలు లభిస్తాయి. తలనొప్పి, మధుమేహం, జ్వరం వంటి రోగాలకు ఔషధాలు ఒక్క క్లిక్ తో లభిస్తాయి. వీటి ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వాలన్నది మోదీ సర్కారు నిర్ణయం. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా వీటిల్లో ఔషధాలను నింపుతారు. ఒకవేళ రుగ్మత అధికంగా ఉంటే, ఏటీఎం మెషీన్ ద్వారానే సమీపంలోని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చేందుకు కూడా వీలుంటుంది. కాగా హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని మార్చిలోనే కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసింది.

చంద్ర‌బాబు తాక‌ట్టు పెడుతున్నార‌ు. జగన్

  ఏపీలో ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ధర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ‌లో నిర్వ‌హిస్తోన్న ధ‌ర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై మండిప‌డ్డారు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేశార‌ని, నిరుద్యోగులు తీవ్ర నిరాశ‌లో ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. రాజకీయ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కోసం చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెడుతున్నార‌ని జ‌గ‌న్‌ ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో చంద్ర‌బాబు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మవుతుంద‌ని అన్నారు. చంద్ర‌బాబు వెన్ను పోటు వ‌ల్లే ప్ర‌త్యేక హోదా రావ‌డం లేద‌ని జ‌గ‌న్‌ వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్లో లోకి సండ్ర వెంకట వీరయ్య.. మిగిలింది రేవంత్ ఒక్కడే..?

  తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లోకి ఇప్పటికే టీడీపీ నేతలు వరుస పెట్టి జంప్ అయిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుండి గెలుపొందగా ఆఖరికి ముగ్గురు మాత్రమే మిగిలారు. అయితే ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈయన ఎంట్రీ దాదాపు ఖరారైపోయినట్టేనని, టీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనిపై ఆయనను ఆడుగగా.. ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మాత్రం చెప్పి అప్పటికి తప్పించుకున్నారట. దీంతో టీడీపీలో ఉన్న ముగ్గురిలో సండ్ర కూడా టీఆర్ఎస్లో చేరితే మిగిలింది ఇద్దరు.. ఈ ఇద్దరిలో ఆర్.కృష్ణయ్య టీడీపీ తరుపున క్రియాశీలకంగా లేరు కాబట్టి.. ఇక మిగిలేది రేవంత్ రెడ్డి ఒక్కడే.

జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు అరెస్ట్... ఓవర్ టేక్ చేసినందుకే చంపేశా

బీహార్లోని గయలో తన కారును ఓవర్ టేక్ చేశాడని చెప్పి బీహార్ అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు రాఖీ యాదవ్ ఓ ఇంటర్ విద్యార్ధిపై దాడి చేసి తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై రాఖీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గరనుండి పారిన్ మేడ్ పిస్టల్ ను స్వాదీనం చేసుకున్నారు. దాడి జరిగిన తర్వాత తప్పించుకుని చివరకు పోలీసులకు చిక్కగానే రాఖీ యాదవ్ తన తప్పును ఒప్పేసుకున్నాడు. తన కారును ఓవర్ టేక్ చేసిన కారణంగానే తాను ఆ విద్యార్ధిని కాల్చేశానని అతడు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. రాఖీ యాదవ్ తనకు తానుగా లొంగిపోలేదని గయ ఎస్పీ గరిమా మాలిక్ చెప్పారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు వెల్లడిస్తామని ఆమె తెలిపారు.

నెహ్రూగారినే "డిలీట్" చేసిన బీజేపీ ప్రభుత్వం..!

  రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పట్ల తీవ్ర అపచారం చేసింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో భారత చరిత్రను చెబుతూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వీరసావర్కర్, భగత్‌సింగ్ తదితరులతో పాటు స్వాతంత్ర్య సమరయోధుడిగా పెద్ద పరిచయం లేని హేము కలానీ వంటి వారి పేర్లను స్వాతంత్ర్య పోరాట యోధులుగా ప్రచురించింది. అయితే దీనిలో ఎక్కడా నెహ్రూ ప్రస్తావనే లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెబుతూ ఓ చాప్టర్‌నే పొందుపరిచారు. దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అని పేర్కొన్నారు. కానీ తొలి ప్రధానిని గురించి చెప్పలేదు. ఈ చర్యను ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, నవ భారత నిర్మాతగా, తొలి ప్రధానిగా దేశ చరిత్రనే తిరగరాసిన వ్యక్తిని మరచిపోవడం కావాలని చేసిన చర్యగా కాంగ్రెస్ ఆరోపించింది. జరిగిన తప్పిదాన్ని వెంటనే సరిచేసుకోవాలని, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

మోడీ విద్యార్హతలపై వెనక్కి తగ్గని ఆప్..

ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే తనకు తెలియజేయాలని సమాచారహక్కు కమిషనర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వారు కూడా మోడీ గుజరాత్ యూనివర్శిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ నుండి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారని.. మోడీ సంబంధించిన విద్యార్హతల గురించి తెలియజేశారు. అంతేకాదు.. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా మోదీ డిగ్రీ స‌ర్టిఫికెట్ల‌ను బ‌య‌ట‌పెట్టిన సంగతి కూడా విదితమే. అయితే మోదీ డిగ్రీ ప‌త్రాలు న‌కిలీవంటూ ఆమ్ ఆద్మీ పార్టీనేత‌లు ఆరోపిస్తోన్నారు. ఈ విషయంలో వారు  ఏ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. దీనిలో భాగంగానే.. నేడు ఢిల్లీ వ‌ర్సిటీలో ఆప్ నేత‌లు ప్ర‌ధాని మోదీ డిగ్రీ వివ‌రాల‌పై ఆరా తీయ‌నున్నారు. అమిత్ షా మీడియాకు చూపిన స‌ర్టిఫికెట్లు ఫోర్జరీ చేసిన‌వేన‌ని, ఢిల్లీ వ‌ర్శిటీకి తాము వెళ్లి, స‌ద‌రు పత్రాల‌ను ప‌రిశీలించి తీరుతామ‌ని ఆప్ నేత‌లు తెలిపారు.

ఉత్తరాఖండ్ సంక్షోభం.. బలపరీక్షలో గెలుపెవరిది..?

గత కొన్ని రోజుల నుండి ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజుతో కీలక ఘట్టానికి తెర దిగనున్నట్టు తెలుస్తోంది.  ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న బలపరీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తన బలాన్నినిరూపించుకోనున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 36 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపు సాధించారు. దీంతో మెజార్టీ కాంగ్రెస్ సాధించుకుంది. అయితే బీజేపీ విసిరిన వలకు 36 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అయితే ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సుప్రీం ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో మొత్తం 61 మంది ఎమ్మెల్యేల్లో 27 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. వీరితో పాటు ఇద్దరు సభ్యుల బలమున్న బీఎస్పీ, ఓ యూకేడీ ఎమ్మెల్యే, ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు పలికారు. దీంతో రావత్ బలం 33కు చేరింది. ఈ సభ్యులంతా హరీశ్ రావత్ కు మద్దతు పలికితే బీజేపీకి షాక్ తగలడం ఖాయమే.   మరి ఈ రోజు జరగబోయే పరీక్షలో ఈ బలంతో రావత్ విశ్వాస పరీక్ష నెగ్గుతారా? ఫిరాయింపులు మరింత పెరిగి ఓడుతారా? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మా ప్రాణాలకు లెక్కలేదా..వెలగపూడిలో కార్మికుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం వెలగపూడిలో కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై అక్కడ పనిచేస్తున్న కార్మికులు భగ్గుమన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేందర్ అనే కార్మికుడు కాంక్రీట్ మిల్లర్‌లో పడి దుర్మరణం పాలయ్యాడు. కళ్లేదుటే తమ తోటి కార్మికుడు ప్రాణాలు కోల్పోవడంతో కార్మికులు తట్టుకోలేకపోయారు.   శరవేగంగా సాగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆందోళనకు దిగారు. దేవేందర్ మృతదేహన్ని తరలించేందుకు పోలీసులు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దేవేందర్ కుటుంబానికి న్యాయం చేసిన తర్వాతే మృతదేహన్ని తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన అంబులెన్స్‌కి వారు నిప్పు పెట్టారు. అక్కడితో ఆగకుండా ఎల్‌అండ్‌టీ కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఏపీ ప్రత్యేక హోదా... రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు

  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. కాకినాడలో నిర్వ‌హించ‌నున్న‌ ధర్నాలో వైసీపీ అధినేత‌ వైఎస్‌ జగన్ పాల్గొన‌నున్నారు. ఏలూరు ధ‌ర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌, మేకా శేషుబాబు పాల్గొన‌నున్నారు. తిరుపతిలో వైఎస్‌ఆర్‌సీపీ నేత భూమనకరుణాకర్ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర్నాలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ల ముందు వైసీపీ నేత‌లు నిర‌స‌న తెలియ‌జేయ‌నున్నారు.

సచిన్ కాళ్లపై పడిన యువరాజ్ సింగ్...!

క్రికెట్ ఒక మతమైతే, సచిన్ మా దేవుడు. ఇదీ భారత క్రికెటాభిమానుల మాట. దేశంలో భిన్నరకాల ప్రజలున్నా, అందర్నీ కలిపి ఉంచే కారణాల్లో ఒకటైన క్రికెట్ కు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది సచిన్ టెండూల్కరే. అయితే, సచిన్ ను దేవుడిగా భావించేది అభిమానులు మాత్రమే కాదండోయ్..తోటి క్రికెటర్లు కూడా. ముఖ్యంగా యువరాజ్ సింగ్ కు అయితే సచిన్ అంటే పిచ్చి. ఎంత అంటే, సచిన్ కనబడగానే కాళ్ల మీద పడిపోయేంత. నిన్న సాయంత్రం విశాఖలో సన్ రైజర్స్ కు, ముంబై ఇండియన్స్ కు మధ్య మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున యువరాజ్ ఆడుతుండగా, ముంబైకు సచిన్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత, రెగులర్ హ్యాండ్ షేక్ ల సమయంలో, సచిన్ ఎదురుపడగానే కాళ్ల మీద పడిపోయాడు యువరాజ్. వెంటనే సచిన్ నవ్వుతూ యువరాజ్ ను లేపి హత్తుకున్నాడు. సచిన్ కు కూడా యువరాజ్ అంటే చాలా ఇష్టం. జూలై 2014లో లార్డ్స్ లో జరిగిన బెనిఫిట్ మ్యాచ్ టైంలో కూడా యువరాజ్ సచిన్ కాళ్లకు నమస్కరించిన సంగతి తెలిసిందే.

అగస్టా చర్చ రచ్చ.. ప్రధాని రావాలని ఎలా చెప్పగలను.. స్పీకర్

  అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై రాజ్యసభ ప్రతిపక్ష, అధికారపక్ష వాదనలతో దద్దరిల్లిపోతుంది. ఈ స్కాంలో అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సభకు హాజరై ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. స్పీకర్ పోడియం ముందు చేరి నినాదాలు చేపట్టారు. దీంతో సభా కార్యక్రమాలు ఆగిపోవడంతో.. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ పలుమార్లు నేతలను వారించడానికి ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన విరమించలేదు. దీంతో ప్రధాని స్వయంగా సభకు హాజరు కావాలని తానెలా ఆదేశించగలనని అన్సారీ ప్రశ్నించారు. ఆ హక్కు తనకు లేదని, ప్రధానిని సభకు రావాలని కోరలేనని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ ప్రత్యేక హోదాపై 'అనంత'లో నిరసన దీక్ష

  ఏపీలో ప్రత్యేకహోదాపై నిరసన దీక్షలు మొదలయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయనుండి ప్రత్యేక హోదా సాధన సమితి రిలే దీక్షలు చేపట్టాయి. ఈ దీక్షకు వైసీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, గురునాథ్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డితో పాటు వామపక్షాలు, విద్యార్ధి సంఘాలు మద్దతు పలికాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారీగా నెలకొన్న ఈ ర్యాలీని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుకు కదలనిచ్చేది లేదని పోలీసులు తేల్చిచెప్పగా, అడ్డగింతను సహించేది లేదని వామపక్ష కార్యకర్తలు బారికేడ్లను ఎక్కేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి

వైసీపీ పార్టీ అధినేత జగన్ కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్నే ఎస్వీమోహన్ రెడ్డి టీడీపీలోకి చేరగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన నేపథ్యంలో ఆయన ఆయన టిడిపిలోకి వచ్చేందుకే కలిశారని తెలుస్తోంది.   మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు పార్టీ అధినేత నుంచి పచ్చజెండా కూడా వచ్చిందని తెలుస్తోంది.