ఆర్ కే. పచౌరికి ఎదురుదెబ్బ.. ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకున్న కోర్టు...

  ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్ కే. పచౌరి లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తన సహోద్యోగిని లైంగికంగా వేధించాడంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఆయనకు గట్టి ఎదురుదెబ్బే తగిలేలా కనిపిస్తోంది. ఎందుకంటే..ఆయన మీద పోలీసులు నమోదు చేసిన ఛార్జ్ షీట్ ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఆర్ కే. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకు సాగించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని.. ఆర్ కే. పచౌరి చార్జిషీట్ పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ శివానీ చౌహాన్ ఈ కేసు విచారణను జూలై 11వ తేదికి వాయిదా వేశారు.   కాగా 2015లో ఆర్ కే. పచౌరి ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) కి అధిపతిగా ఉన్నప్పుడు ఆయన సహోద్యోగిపై లైంగికంగా వేధింపులు జరిపారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు.

బీహార్లో జవాన్లపై దుండగుల కాల్పులు.. ఒక జవాను మృతి

  బీహార్లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన జవాన్ల పై కాల్పులు జరిపారు. వివరాల ప్రకారం.. బీహార్లో వారణాసి- బక్సర్ ల మధ్య నడిచే పాసింజర్ రైల్లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అయితే వీరిని అడ్డకోవడానికి రైల్వే ప్రొటెక్షన్ షోర్స్ (ఆర్పీఎఫ్) జావాన్లు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మరణించగా.. పలువురు జవాన్లకు తీవ్ర గాయాలవ్వగా... ఒక జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం. కాగా దుండగుల కాల్పుల్లో మరణించిన జవాను అభిషేక్ సింగ్ అని..తీవ్రగాయాలైన మరో జవాను నంద్ లాల్ యాదవ్ అని రైల్వే అధికారులు చెప్పారు.

పామును ముక్కలు ముక్కలుగా నమిలాడు... చనిపోయాడు..

  పామును చూస్తేనే భయపడతాం.. అలాంటిది పామును నోటితో ముక్కలు ముక్కలుగా చేయడం.. వింటేనే భయంగా ఉంది కదా.. కానీ జార్ఖండ్ లో ఇలాంటి విచిత్రమైన ఘటనే చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జార్ఖండ్, లతేహార్ జిల్లాలోని రంతు ఓరన్ (50) అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రపోతున్నాడు. అయితే సడెన్ గా పక్కింట్లో నుండి అతనికి పెద్దగా కేకలు వినిపించడంతో పరుగుపరుగున వెళ్లి చూడగా అక్కడ అతనికి ఓ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. ఈ క్రమంలో దానికి పట్టుకోవడానికి ప్రయత్నించిన అతనిని పాము మూడుసార్లు కాటేసింది. దీంతో కోపం వచ్చిన రంతు వెంటనే పామును తీసుకొని నోటితో కొరికి ముక్కలు ముక్కులుగా చేసేశాడు. కానీ పాము కాటేయడం వల్ల అప్పటికే విషం శరీరమంతా వ్యాపించడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతను మరణించాడు. కాగా కాటేసిన పామును కొరికి చంపడం వల్ల శరీరంలోకి ఎక్కిన విషం విరిగిపోతుందని జార్ఖండ్ లోని గిరిజనుల నమ్మకం.

వారి చెంప చెళ్లుమనిపించాలి.. ప్రత్యేక హోదాపై శివాజీ ఘాటు వ్యాఖ్యలు

  ఏపీకి ప్రత్యేక హోదా కోటీశ్వరుల కోసం కాదని.. భావి తరాల కోసం.. విద్యార్ధుల కోసం అడుగుతున్నామని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమైఖ్య సంఘ అధ్యక్షుడు శివాజీ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఉద్యమానికి పార్టీలతో సంబంధం లేదు..ప్రత్యేక హోదా వచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది...తెలంగాణ రాష్ట్రం ఎలా సాకారమైందో.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది అని అన్నారు. ఏపీని కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువ ముంచింది.. బీజేపీకి ఏపీలో మొహం చెల్ల్లే అవకాశం లేదు.. తమిళనాడు, కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి తెలుగు ప్రజలు బుద్ది చెప్పాలి అని సూచించారు. టీడీపీ పార్టీ పై భజన చేయడం.. వైసీపీ పై విమర్శలు చేయడం మా పని కాదు అని అన్నాడు..పోరాడి, ప్రత్యేక హోదా సాధించుకుంటాం.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదన్న వారి చెంప చెళ్లుమనిపించాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

డాక్టర్ దారుణ హత్య.. ముగ్గురు యువకులు అరెస్ట్

  తమిళనాడులో లేడీ డాక్టర్ రోహిణి ప్రేమకుమార్ దారుణమైన హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై దర్యాప్తు ముమ్మరంగా చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు.  గాంధీ ఇర్విన వీధిలో డా.రోహిణి ప్రేమకుమారి (63) గత 8వ తేదీ అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య దేని కోసం చేశారు.. ఎవరు చేశారో తెలుసుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. ఆరు నెలలుగా కష్టపడితే అసలు నిందితులు బయటపడ్డారు. విచారణలో పోలీసులకు నిందితులు చెప్పిన వివరాల ప్రకారం.. హరి (20), రాజా(21), మరో బాలుడు ముగ్గురూ 7వ తేదీన రోహిణి ప్రేమకుమారి ఇంటిలోకి ప్రవేశించారు. అయితే ఇంట్లో కుక్క వారిని చూసి మొరగడంతో బయటకు వచ్చిన రోహిణిని ముగ్గురూ కలిసి హత్య చేసి.. ఆతరువాత కాళ్లు చేతులకు ప్లాస్టర్లు చుట్టి.. కాంపౌండ్‌ వాల్‌ పక్కనే పడేశారు.

కాంగ్రెస్ లోకి నాగం జనార్దన్ రెడ్డి... అంతా ఉత్తిదే అంటున్న నాగం..!

  బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఈయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కారణంగా.. ఈ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన దానం మాత్రం తాను పార్టీ మారే ప్రసక్తే లేదని... తాను బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే నేను రాజకీయాల్లోకి వచ్చానని.. అలాంటిది నేను కాంగ్రెస్లోకి వెళ్లడం జరగని పనని అన్నారు. కావాలనే నాపై దుష్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.   కాగా నాగం ముందు టీడీపీ పార్టీలో ఉండేవారు. ఆ తరువాత తెలంగాణ పేర ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అనంతరం తెలంగాణ రాష్టం ఏర్పడక ముందే బీజేపీలో చేరారు. అయితే, బిజెపిలో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే ప్రచారం కూడా ఉంది.

గండిపేటలో దొంగల బీభత్సం..దోపిడి, బాలికపై అత్యాచారయత్నం

హైదరాబాద్ గండిపేటలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు అందినకాడికి దోచుకున్నారు. అక్కడితో ఆగని దొంగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల పాప నోట్లో గుడ్డలు కుక్కి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు. అయితే బాలిక చాకచాక్యంగా వారి నుంచి తప్పించుకుంది. చుట్టుపక్కల వారు బాలిక ఏడుపువిని పరిగెత్తుకు రావడంతో దొంగలు పరారయ్యారు. ఇంటి నుంచి మూడు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్ టాప్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజ్యసభ సభ్యుడిగా డీఎస్.. కవిత రికమండేషన్..!

  తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారా అని ఎదురుచూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో ఒక స్థానం సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ కు దక్కే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఈయన పేరు ఖరారైందని.. నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకుడు రాజ్యసభలో టీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని కేసీఆర్ కూతురు కవిత డీఎస్ పేరును ప్రతిపాదించగా.. దానికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి డి.శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.  రాజ్యసభకు ఖరారు కాగా... నేడో, రేపో అధికారికంగా ప్రకటన వెలువడనుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

పార్టీ ఫిరాంయించిన వారిపై వైసీపీ పిటిషన్.. ఆఖరికి ఇక్కడికి రావాల్సిందే.. టీడీపీ

  వైసీపీ పార్టీ నుండి ఇప్పటికి 16 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ నుండి పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై.. ఆ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. వారిని అనర్హలుగా ప్రకటించడంలేదని తెలుపుతూ.. పార్టీ ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలతో పాటు.. స్పీకర్ ను కలిపి ప్రతివాదులుగా పిటిషన్లో తెలిపింది. అంతేకాదు రాజ్యసభ ఎన్నికల్లో 16 మంది ఎమ్మెల్యేలకు ఓటు వేసే హక్కు కల్పించకూడదని కోరుతున్నారు.   మరోవైపు టీడీపీ నేతలు మాత్రం వైసీపీ వేసిన పిటిషన్ పై మాట్లాడుతూ.. పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. అది తిరిగి అసెంబ్లీ స్పీకర్ దగ్గరకు రావాల్సిందేనని.. అంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన ఏ నిర్ణయమైనా శాసనసభ స్పీకర్ వద్ద జరగాల్సిందేనని, ఎవరు ఎక్కడ పిటిషన్ వేసినా బంతి చివరకు స్పీకర్ కోర్టుకు రావల్సిందేనని అంటున్నారు. మరి దీనిపై వైసీపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

తమిళనాడులో మద్యం సీసాతో ప్రచారం... వెరైటీ హామీలు..

  తమిళనాడులో ఇంకా రెండు రోజుల్లో ఎన్నికలు షురూ కానున్నాయి. ఇప్పటికే నేతలందరూ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ఒక వ్యక్తి మాత్రం చాలా వెరైటీగా ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు తను ఇచ్చే హామీలు కూడా అంతే వెరైటీగీ ఉన్నాయి. ఇంతకీ అతనెవరంటే.. ఎంఎస్‌ ఆరుముగం అనే వ్యక్తి అంబత్తూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. ఈయన తమిళనాడు మద్యం సేవన ప్రియుల అవగాహనా సంస్థకు చెందిన వ్యక్తి. ఈయన ఎన్నికల గుర్తు కూడా మద్యం సీసానే. ఈ నేపథ్యంలోనే ఆరుముగం.. తన ప్రచారంలో కూడా మందు సీసాను తలపై పెట్టుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఆయన ఇస్తున్న హామీలపై కూడా ఓ లుక్కేయండి..   1. మద్యం మహమ్మారికి భర్తను కోల్పోయిన మహిళలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 2. మద్యం సేవించి తండ్రిని కోల్పోయిన పిల్లలకు 21 యేళ్ళ వరకు విద్య ఉపాధి ప్రాధాన్యత ఇవ్వాలి. 3. మద్యం కారణంగా కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు నెలకు రూ.3 వేల నగదు సాయం చేయాలి.   మరి ఈ హామీలు సామాన్య ప్రజలకు నచ్చుతాయో లేదో తెలియదు కానీ.. మందు బాంబులకు నచ్చుతాయేమో..

కన్యా కుమారి పేరు మారింది.. ఇక నుండి కన్నియా కుమారి

  తమిళనాడులో ఉన్న కన్యాకుమారి పేరు అందరికి తెలిసిందే. అయితే ఇక నుండి కన్యాకుమారి పేరు కాస్తా కన్నియా కుమారి పేరుగా మారనుంది. కన్యాకుమారి పేరు కన్నియా పేరుగా ఉంచాలంటూ ఆ ప్రాంత వినియోగదారుల హక్కుల సంఘ అధ్యక్షుడు పోరాటం చేయగా.. చివరికి విజయం సాధించారు. కన్యా కమారిని.. కన్నియా కుమారిగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.   అయితే కన్యా కుమారి అసలు పేరు కన్నియా కుమారినే. అయితే బ్రిటిష్ పాలకుల సమయంలో వారు కన్నియా కుమారిని కాస్త కన్యా కుమారిగా ఉచ్చరించడంతో ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది. వాడుక బాషలో కన్యా కుమారిగా ఉన్నా.. కేంద్ర ప్ర‌భుత్వం, రైల్వేశాఖల్లో మాత్రం క‌న్నియా కుమారిగానే ఉంది. అక్క‌డ రైల్వేస్టేష‌న్ల‌లో ఏర్పాటు చేసిన బోర్డుల‌తో పాటు టిక్కెట్ల పంపిణీలో కూడా క‌న్నియా కుమారి అనే రాసేవారు. దీంతో వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు కన్యా కుమారి అసలు పేరైనా కన్నియా కుమారి పేరునే ఉంచాలని కోరడంతో.. కేంద్రం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే కన్యాకుమారిగా పేరును తొలగించి, కన్నియాకుమారి బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో క‌న్యాకుమారిగా పాపుల‌ర్ అయిన ఈ ఊరు పేరు ఇక నుంచి క‌న్నియా కుమారిగా మారింది.

బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకం.. బౌద్ధ సన్యాసి దారుణహత్య

బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదుల అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇతర మతస్తులు, లౌకికవాదులు, ప్రొఫెసర్లే లక్ష్యంగా హత్యలకు దిగుతున్నారు. ఇటీవల ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్‌ను హత్య చేసిన తీవ్రవాదులు తాజాగా 70 ఏళ్ల బౌద్ధ సన్యాసిని దారుణంగా హత్య చేశారు. బందర్‌బన్ జిల్లాలోని ఓ గ్రామంలో బౌద్ధ ఆలయం సమీపంలోని కొలనులో మౌంగ్‌షూ అనే బౌద్ధ సన్యాసి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పదునైన ఆయుధంతో నరికి చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 

ఎట్టకేలకు జెఎన్యూ విద్యార్థులు దీక్ష విరమించారు.. 16 రోజుల తర్వాత...

  జేఎన్యూ విద్యార్ది సంఘ నేత కన్నయ్య కుమార్ గత 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. యూనివర్శిటీ తమపై విధించిన జరిమానాకి గానూ.. తమను సస్పెండ్ చేసినందుకు గాను దానిని వ్యతిరేకిస్తూ కన్నయ్య కుమార్ దీక్షకు దిగారు. అయితే ఈ దీక్ష చేస్తున్న క్రమంలో కొందరు విద్యార్ధుల పరిస్థితి విషమంగా మారింది.. అయితే తొలుత కన్నయ్య తోపాటు నలుగురు విద్యార్ధులు దీక్ష విరమించగా.. మిగిలిన వారు దీక్షను కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై విచారణ జ‌రిపిన‌ హైకోర్టు విద్యార్థుల స‌స్పెన్ష‌న్‌పై కండీష‌న‌ల్ స్టే విధించింది. హైకోర్టు నుంచి వర్సిటీకి ఆదేశాలు అందిన వెంటనే తాము నిరాహార దీక్ష‌ను, ఆందోళ‌న‌ను విర‌మిస్తున్న‌ట్లు విద్యార్థులు పేర్కొన్నారు.   కాగా ఆఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన నేపథ్యంలో కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ తో పాటు మరో ముగ్గురు విద్యార్ధులను నిందితులుగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే.. కన్నయ్యకుమార్ తో పాటు మిగిలిన విద్యార్థుల‌కు శిక్ష‌, జరిమానా విధించిన సంగ‌తి విధిత‌మే.

తమిళనాడు ఎన్నికల వేడి... తనిఖీల్లో పట్టుబడిన 570 కోట్లు....

  తమిళనాడులో ఎన్నికలు జరగనున్న సందర్భంగా పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలోనే నగదు దొరుకుతుంది. ఇంకా రెండు రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయగా తిర్పూరు సమీపంలో 3 కంటెయినర్లలో రూ. 570 కోట్లు లభ్యమయ్యాయి. అలాగే కోయంబత్తూర్‌ సమీపంలో మరో రూ. 195 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంత డబ్బు బ్యాంకులకు సంబంధించినవేనా కాదా అని అధికారులు పరిశీలిస్తున్నారు. సదరు వ్యక్తులు మాత్రం బ్యాంకులకు చెందినవేనని చెబుతున్నారని..దీనిపై దర్యాప్తు చేయాలని అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే ఈ తనిఖీల్లో 500 నకీలీ ఈవీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

గుంటూరు జిల్లాలో పుష్కర పనులు వేగవంతం..

రానున్న కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు జిల్లాలో పనులు వేగవంతమయ్యాయి. జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, నగర కమిషనర్ నాగలక్ష్మీ ఇతర అధికారులు గుంటూరు నగరంలో పర్యటించి పనులను పరిశీలించారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దీంతో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రహదారులను విస్తరిస్తున్నారు. నగరంలోని పట్టాభిపురం, గుజ్జనగుండ్ల, చినపలకలూరు, అమరావతి రోడ్డు తదితర ప్రాంతాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. నగరంలో పుష్కర పనుల కోసం రూ.68 కోట్లతో ప్రతిపాదనలు పంపగా...50 కోట్లు మంజూరయ్యాయని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. యాత్రికుల సౌకర్యం కోసం పెదకూరపాడులో ఎక్స్‌ప్రెస్ రైల్లు ఆగేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

నేరాన్ని ఆంగీకరించిన రాఖీ యాదవ్.. అవును నేనే కాల్చా...

  జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడు రాకీ యాదవ్..తన కారును ఓవర్ టేక్ చేశాడని చెప్పి నడిరోడ్డుపై ఒక యువడికి కాల్చి చంపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు రాఖీ యాదవ్ యువకుడిని కాల్చింది తనేనని తన నేరాన్ని అంగీకరించాడు. ఈరోజు జరిగిన విచారణలో రాఖీ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తొలుత తాను ఢిల్లీలో లేనని, కాల్చింది తాను కాదని ముందు బుకాయించిన రాకీ, ఆపై పోలీసుల విచారలో నిజం చెప్పాడు. మరోవైపు మనోరమదేవి రాఖీకి యాంటిసిపేయిటరీ బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.   ఇదిలా ఉండగా ఈకేసులో భాగంగా సోదాలు చేస్తున్న వారికి మనోరమాదేవి ఇంట్లో భారి ఎత్తున మద్యం సీసాలు లభించిన సంగతి తెలిసిందే. అయితే బీహార్లో ఇటీవలే సంపూర్ణ మద్యపాన నిషేందించిన సందర్భంగా.. నియమాలు అతిక్రమించినందుకు ఆమెను ఆరెళ్ల పాటు పదవి నుండి సస్పెండ్ చేసి.. కేసు నమోదు చేసుకున్న సంగతి తెలసిందే. 

ఒకేరోజు ఇద్దరు జర్నలిస్టుల హత్యలు..

బీహార్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ జర్నలిస్టును కాల్చి చంపేశారు. వివరాల ప్రకారం.. బీహార్, సివాన్ జిల్లాలో  రాజ్ దేవ్ రంజన్ అనే సీనియర్ జర్నలిస్టు హిందీ దినపత్రిక హిందూస్థాన్ లో పనిచేసేవాడు. అయితే తన ద్విచక్రవాహనంపై వెళుతున్న అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. సమాచారం అందకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా సివాన్ చిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న శక్తులపై రాజ్ దేవ్ రంజన్ తన వార్తా పత్రికలో వరుస కథనాలు రాస్తున్న నేపథ్యంలో ఈ హత్య జరిగుంటుందని పోలీసులు చెబుతున్నారు.     ఇదిలా ఉండగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ లోనూ చోటుచేసుకుంది. జార్ఖండ్ లోని ఛాత్రా జిల్లాలో నిన్న రాత్రి అఖిలేష్ ప్రతాప్(35) అనే జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఒక స్థానిక ఛానెల్ లో పనిచేస్తున్న అతనిపై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.