ముంబై సిద్ధి వినాయకుని సేవలో యాపిల్ చీఫ్

ఐటీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ భారత పర్యటనలో భాగంగా ముంబైలో సందడి చేశారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ది వినాయక స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆయన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీతో కాసేపు ముట్టడించారు. దర్శనం సమయంలో కుక్ వెంట యాపిల్ ఇండియా హెడ్ సంజయ్ కౌశల్ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ అమ్మకాలు పడిపోతున్న నేపథ్యంలో అమ్మకాలను పెంచుకోవడానికి ఆయన భారత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కుక్ రేపు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో యాపిల్ డిజిటల్ మ్యాపింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. 

కొడాలి నానికి కీలక బాధ్యతలు..

  కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పార్టీ అధినేత జగన్ కీలక భాద్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ అయిన టీడీపీకి కృష్ణజిల్లా కంచుకోట లాంటిది. అలాంటి కృష్ణాజిల్లాలో కొడాలి నాని ఒక విధంగా ఒంటరి పోరాటమే చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేసిన పార్టీ నేత కొలుసు పార్థసారధిని కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.99కే స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే..!

రూ.99కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నమోటెల్ అచ్చే దిన్ సంస్థ ప్రకటించింది. బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీఈవో మాధవరెడ్డి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. దీని అసలు ధర రూ.2,999గా ఉండగా దాన్ని రూ.99కే అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.  రూ.99కే స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే: * 4 అంగుళాల డిస్‌ప్లే  * ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం  * 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌  * 1జీబీ ర్యామ్‌  * 2 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా  * 3 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా  * 1325 ఎంఏహెచ్‌ బ్యాటరీ  * 4జీబీ అంతర్గత మెమొరీ  * ప్రజంట్ బ్లాక్, వైట్ కలర్స్‌లో మాత్రమే ఫోన్ లభ్యం  

రూ.99కే స్మార్ట్‌ఫోన్..! ఆధార్ కార్డు ఉంటేనే ఫోన్

మొన్నామధ్య రూ.251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటిస్తే..ఇప్పుడు ఏకంగా రూ.99కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నమోటెల్ అచ్చే దిన్ సంస్థ ప్రకటించింది. బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీఈవో మాధవరెడ్డి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. దీని అసలు ధర రూ.2,999గా ఉండగా దాన్ని రూ.99కే అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ అని సంస్థ వెల్లడించారు. మేకిన్ ఇండియా ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తయారు చేశామని చెప్పారు. నిన్నటి నుంచే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని మాధవరెడ్డి చెప్పారు.  స్మార్ట్‌ఫోన్‌ కావలసిన వారు ఇలా చేయాలి: *  బి మై బ్యాంకర్‌.కామ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఐడీ, పాస్‌వర్డ్‌ను పొందాలి *  ఇందులో లాగిన్ అయ్యాక ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాలి.  * ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడీ అందుతుంది. * దాని సాయంతో నమోటెల్.కామ్ వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోటో, ఆధార్‌కార్డ్ ఆప్‌లోడ్ చేస్తే బుకింగ్ కన్ఫామ్            అవుతుంది

గోద్రా అల్లర్ల ప్రధాన సూత్రధారి అరెస్ట్..

  గోద్రా అల్లర్లు గుర్తుండే ఉంటాయి కదా.. గుజరాత్ లో సృష్టించిన ఈ అల్లర్లు జరిగి దాదాపు 14 సంవత్సరాలు అవుతోంది. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఎట్టకేలకు ఈ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ మునిసిపల్ కౌన్సిలర్ ఫరూక్ భానాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్‌ సమీపంలో కొందరు వ్యక్తులు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుపై దాడిచేసి దానికి నిప్పుపెట్టడంతో రైలు దహనమైంది. దాదాపు 60 మంది ప్రయాణికులు మరణించారు. అలా మొదలైన అల్లర్లలో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దీనిపై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు మొత్తం 31 మందిని దోషులుగా నిర్దారించి వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవితఖైదు విధించింది. ఇంకా ఆరుగురు నిందుతులు పారిపోయారు. వారిలో ఒకడే భానాను. ఇక అప్పటినుండి పోలీసులు భానాను కోసం గాలిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌  ఈ ఉదయం కలోల్ టోల్ నాకా వద్ద భానాను అరెస్ట్ చేశారు. భానాను ప్రశ్నించిన అనంతరం కోర్టు ముందు హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

గాంధీ పేర్లపై రిషికపూర్.. మీ అబ్బ సొత్తనుకుంటున్నారా?

దేశంలోని పలు కట్టడాలకు గాంధీ పేర్లు పెట్టడంపై బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరును మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలని ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన రిషి కపూర్.. ఢిల్లీలోని వీధుల పేర్లు మార్చినప్పుడు.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని కొన్ని కట్టడాలకు గాంధీ పేర్లు పెట్టారు. భవనాలు రోడ్లేమైనా మీ అబ్బ సొత్తనుకుంటున్నారా?" అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ఢిల్లీ విమానాశ్రయానికి ఇందిరా గాంధీ పేరెందుకని ప్రశ్నించిన ఆయన, మహాత్మా గాందీ పేరు లేదా భగత్ సింగ్, అంబేద్కర్ల పేర్లో లేకపోతే తన పేరో పెట్టాలని.. ప్రతి దానికి గాంధీ-నెహ్రూ కుటుంబం పేర్లెందుకు అని ప్రశ్నించారు.

టీడీపీలో మగాళ్లు లేరా..? చెవిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

  ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి.. ప్రతి పక్ష నేతలు వరుసపెట్టి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్ష నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాలనను పక్కన పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలను కొనే పనిలో పడ్డారు.. అని విమర్శించారు. జగన్ గెలిపించిన ఎమ్మెల్యేలందరూ మగాళ్లు.. ఏం మీ పార్టీలో మగాళ్లు లేరా..? మీ ఎమ్మెల్యేలంతా ఆడంగులా? కాదు కాదు, ఆడంగులంటే మహిళలు ఆగ్రహిస్తారు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆడా, మగా కాని ‘మాడా’లా?’’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ జలదీక్ష చేపట్టిన సంగతి తెలసిందే. 

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపే.. తేలనున్న అభ్యర్ధుల భవితవ్వం..

  తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి, కేరళ ఈ ఐదు రాష్ట్ర్లాల్లో గత రెండు నెలల నుండి ఎన్నికల పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీతో ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల ముగియగా.. ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుండి ఎన్నికల లెక్కింపు ప్రారంభించి.. మూడు గంటల వరకూ ప్రక్రియ కొనసాగించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిపిన తరువాత.. ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజెట్‌ రూపంలో విడుదల చేస్తారు.   కాగా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం తమిళనాడులో ఈసారి డీఎంకే పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఇక కేరళలో కాంగ్రెస్ కు ఆ ఆవకాశం లేదని.. అసోంలో తొలిసారిగా భాజపా జెండా ఎగరనుందని.. ఒక్క పశ్చిమ్‌బంగలో మాత్రమే మరోసారి మమతాబెనర్జీకి అధికారం కట్టబెట్టనున్నారు. ఇక కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో మాత్రం డీఎంకే కూటమితో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో.. ఎవరు అధికారం చేపడుతారో.. తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే.

చెన్నైలో భారీ వర్షపాతం.. తుఫానుగా మారే అవకాశం..

  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో మునిగిపోతోంది. వాయుగుండం చైన్నైకి తూర్పు దిశగా 70 కిలోమీటర్ల దూరంలో ఉందని.. దీనివల్ల తమిళనాడుతో పాటు కేరళ, ఏపీ రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అంతేకాదు ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వాయుగుండం ఏకంగా 25 సెంటీ మీటర్ల వర్షం కురుస్తుందని.. ఇదే కనుక తుఫానుగా మారితే దీనిని 'రావోను' గా పిలవాలని అధికారులు చెబుతున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. గత డిసెంబర్లో వచ్చిన వరదల వల్ల ఎంతో నష్టం జరుగగా.. ఈసారి అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తీరప్రాంత అధికారులు చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాలలో నిరంతరం పర్యవేక్షించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.

కాంగ్రెస్ నేత దారుణ హత్య..

  కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గరయ్యారు. కృష్ణాజిల్లా తిరువూరు మండలం.. అక్కపాలెం సర్పంచి దోమతోటి వెంకటరమణ భర్త నాగేశ్వరరావును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. వివరాల ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున నాగేశ్వరరావు తాగునీటికి విడుదల చేసేందుకు రక్షిత నీటి పథకం ఓవర్‌హెడ్‌ ట్యాంకు దగ్గరకి వెళ్లారు. అక్కడ కొందమంది వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపి ఓ మురుగు నీటి గుంతలో పడేశారు. అనంతరం అక్కడి స్థానికులు నాగేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు కావాలనే పథకం ప్రకారం చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నైకి మరో గండం

గతేడాది భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం తాలుకూ పీడకలను పూర్తిగా మరచిపోకముందే చెన్నైకి మరో గండం పొంచి ఉంది. అది కూడా మళ్లీ వర్షం రూపంలోనే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా మారడం, చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కావడంతో చెన్నై, పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్తతో చెన్నై ప్రజలు ఉలిక్కిపడ్డారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో చెన్నైని వర్షాలు ముంచెత్తాయి. దీంతో వారం రోజుల పాటు మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే నిన్న అర్థరాత్రి నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని..ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేసింది.

కంచ ఐలయ్యపై కేసు నమోదు..

దళిత హక్కుల కార్యకర్త, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య బ్రాహ్మ‌ణులు, హిందూ దేవ‌తల‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. తిని కూర్చునే సోమరుపోతులు బ్రాహ్మణులంటూ కంచ ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎపి బ్రాహ్మణ సేవా సంఘాలు ఐలయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చదువుకుంటే సంస్కారం వస్తుందని, విజ్ఞానం వికసిస్తుందని, కానీ కంచ ఐలయ్య చదువుకున్న మూర్ఖుడని మండిపడ్డారు. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను.. హైద‌రాబాద్, స‌రూర్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. లాయ‌ర్ క‌రుణసాగ‌ర్ ఇచ్చిన ఫిర్యాదుతో 295-A, 298, 153-A సెక్షన్ల కింద కంచ ఐలయ్య‌పై కేసు నమోదు చేశారు.

మానవ తప్పిదాల వల్లే ఏపీలో కరువు.. చంద్రబాబు

ఏపీ ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేకహోదాపై ఆయనతో చర్చించామని.. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించారని.. ఇద్దరికి సమన్యాయం చేయమని కోరా.. విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని తెలిపామని చెప్పారు. ఐదేళ్ల తర్వాత కూడా ఏపీ లోటులో ఉంటుందని.. దీనిలో భాగంగానే ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ప్రధాని మోడీకి అందజేశామన్నారు. అంతేకాదు కరువుపై భేటీ నిధుల కోసం కాదు.. మానవ తప్పిదాల వల్లే ఏపీలో కరువు తీవ్రత పెరుగుతోందని అన్నారు.

ఏపీ కరువుపై మోడీతో చర్చించా.. ఆయన హ్యాపీగా ఫీలయ్యారు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీ కరువుపై ప్రధానితో చర్చించా అని తెలిపారు. కరువు పరిష్కారానికి మోడీతో చర్చ ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించారు. గత పదేళల్లో భారత్ లో సంభవించిన తుపానులన్నింట్లో హుదూద్ పెద్దదని మోదీ చెప్పారని.. అంత పెద్ద ఉత్పాతం నుంచి కోలుకున్న ఏపీ, కరవును సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఆయన చెప్పారని అన్నారు. ఇంకా పలు విషయాలు ఆయనకు వివరించామని.. గత పదేళ్లు తుఫానులు వచ్చాయి.. రెండేళ్ల నుండి కరువు వచ్చింది.. రాష్ట్రంలో రూ. 737 ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నాం.. 18 వేల మెట్రిక్ టన్నుల గడ్డి ఇస్తున్నాం.. 973 గ్రామాలకు తాగునీటి సరఫరా అందిస్తున్నాం..  రెండువేల కోట్లతో కరువును ఎదుర్కొంటున్నాం.. నదుల అనుసంధానం జరగాలి.. ఉన్న నీళ్లను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి.. పంటలకు మైక్రో ఇరిగేషన్ శ్రీరామ రక్షగా ఉంటుంది.. కొత్తగా రెయిన్ గన్ పద్దతిని తీసుకొస్తున్నాం.. ప్రతి ఇంటికీ మంచినీరు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని మోడీకి తెలిపాని చెప్పారు. మేం చెప్పిన వివరాలపై ప్రధాని హ్యాపీగా ఫీలయ్యారని తెలిపారు.