నరేంద్ర మోడీ మూర్ఖపు ప్రధాని.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

  ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రధానిగా బాద్యతలు చేపట్టి రెండెళ్లు పూర్తవుతున్న సందర్భంగా చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండేళ్ల పాలనలో అత్యంత మూర్ఖ ప్రధానిగా మోడీ నిలిచారనీ, ఆయనపై ఏ చర్య తీసుకోవాలో చెప్పమని స్మృతి ఇరానీని ఉద్దేశించి రషీద్ అల్వీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ కాంగ్రెస్ లో మోడీపై విమర్శలు చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు.. అయితే ఈరోజు హద్దులు దాటారు.. మోడీ ఒక దేశానికి ప్రధాని అన్న విషయం కూడా మరిచిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   మరోవైపు రషీద్ అల్వీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోడీ పై చేసిన వ్యాఖ్యలకు రషీద్ అల్వీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రషీద్ అల్వీ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ‘షేమ్ షేమ్ కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేశారు.

టీ కాంగ్రెస్ నయా నిర్ణయం... తిరిగి పార్టీలో చేర్చుకోవద్దు..

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది నేతలు జంప్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పార్టీ ఫిరాయించి వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు మళ్లీ తిరిగి పార్టీలోకి రావాలని చూస్తే వారిని పార్టీలోకి చేర్చుకోకూడదని నిర్ణయించుకున్నారంట. అది చిన్న నేత అయినా కానీ.. పెద్ద సీనియర్ నేత అయినా కానీ.. ఎవరయినా సరే పార్టీలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈరోజు హైదరాబాద్ లో గాంధీ భవన్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో పైన తీసుకున్న నిర్ణయం ఒకటి కాగా.. ఇంకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని.. దీనిలో భాగంగానే.. తెలంగాణ కరపత్రాలుగా మారిన నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్, టీ న్యూస్ వార్తా ఛానెల్ ను బహిష్కరించాలని తీర్మానించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవంపై మరో వివాదం...

  ఇప్పటికే మత పరమైన విద్వేషాలు రగలడానికి.. వివాదాలు తలెత్తడానికి బీజేపీ కారణమంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు యోగాపై కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఓం, వేదమంత్రాలను చదవాలంటూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ హిందుత్వ ఎజెండాను తెరపైకి తీసుకువస్తున్నదంటూ కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేసీ త్యాగి(జనతాదళ్ యు), సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) వంటి పలువురు నాయకులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కు ముందు ఓం, కొన్ని వేద మంత్రాలను చదవాలంటూ బీజేపీ సర్కార్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దీంతో మరో వివాదం తెరపైకి  వచ్చింది. మొత్తానికి బీజేపీ కావాలని చేస్తుందో.. లేక యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు కానీ మతపరమైన వివాదాల్లో మాత్రం ఎప్పుడూ చిక్కుకుంటూనే ఉంటుంది.

పఠాన్ కోట్ దాడి సూత్రధారి మసూద్‌ అజ్‌హర్ కు రెడ్ కార్నర్ నోటీస్

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరం పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి విదితమే. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్‌ అజ్‌హర్ అని కూడా తెలుసు. అయితే ఇప్పుడు అజ్‌హర్ కు, అతని సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌లపై ఇంటర్నేషనల్‌ పోలీస్‌ అసోసియేషన్‌ (ఇంటర్‌పోల్‌) నేడు రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది. ఉగ్రదాడికి సంబంధించి అజ్‌హర్‌, అబ్దుల్‌ రవూఫ్‌లపై నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అనంతరం ఎన్‌ఐఎ వారిద్దరిపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ చేయాలని ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించించగా.. ఇంటర్‌పోల్ రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది.   కాగా ఈ దాడుల జరిగినప్పుడు భారత్ తగిన ఆధారాలు చూపించిన పాక్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు అజహర్ ను అరెస్ట్ చేశాం.. గృహనిర్భంధంలో ఉంచా.. అని ముందు చెప్పి ఆ తరువాత మాట మార్చేసింది.

మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ..

  ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భేటీ ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటు ఇంకా పలు అశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు 12 ముఖ్యమైన అంశాలతో కూడిన నివేదికను ప్రధానికి అందించినట్టు సమాచారం. 2014-15 రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతికి నిధులు, వెనుకబడిన 7 జిల్లాలకు అభివృద్ధి కింద సాయం, విభజన చట్టం షెడ్యూల్‌ 9,10లోని సంస్థల ఏర్పాటు, పారిశ్రామిక రాయితీలు, విశాఖ రైల్వేజోన్‌, నియోజకవర్గాల పునర్విభజన, ప్రత్యేక ఆర్థిక సాయం అంశాలతో కూడిన నివేదికను ప్రధానికి ఇచ్చారు.   అయితే చర్చలో భాగంగా ప్రధాని మోడీ ఏం హామీ ఇచ్చారు.. ప్రత్యేక హోదాకు అనుకూలంగా స్పందిచారా.. లేదా.. అన్న విషయం చంద్రబాబు ఇంకా చెప్పలేదు. మోడీ భేటీ ముగిసిన అనంతరం ఆయన నేరుగా ఏపీ భవన్ కు వెళ్లిపోయారు. సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించనున్నారు.

కృష్ణా పుష్కరాలు..అతి పెద్ద పుష్కర్ ఘాట్

కృష్ణా పుష్కరాలు మరో రెండు నెలల్లో రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్కరాల దృష్ట్యా అతి పెద్ద పుష్కర్ ఘాట్ ను నిర్మించనున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి వద్ద పుష్కర ఘాట్లను మంత్రి పుల్లారావు, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.453 కోట్లతో పుష్కరాల పనులు ప్రారంభిస్తున్నామన్నారు. కృష్ణా నదిలో ఏడు పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయనున్నామని, భక్తుల సౌకర్యార్థం అమరావతిలో 1.3 కిలోమీటర్ల మేర అతిపెద్ద పుష్కర ఘాట్ ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. జులై 30 నాటికి పుష్కర పనులన్నీ పూర్తి చేస్తామని, గోదావరి పుష్కరాల కంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు పుల్లారావు పేర్కొన్నారు.

కేసుల వరకూ వచ్చిన స్వాముల లడాయి..

  గత వారం రోజుల నుండి స్వాముల మధ్య మత పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. సాయిబాబా పై రమణానంద మహర్షి కి, స్వరూపానంద సరస్వతికి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి విదితమే. అంతేకాదు ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, రమణానంద మహర్షి మ‌ధ్య కూడా గొడవలు చెలరేగాయి. అయితే ఇప్పుడు ఈ గొడవలు కాస్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చేంత వరకూ వచ్చింది. శివశక్తిసాయి ఛాన‌ల్‌లో ప్ర‌సారమ‌వుతోన్న వార్త‌లు అభ్యంత‌రక‌రంగా ఉన్నాయంటూ.. భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారని చాగంటి సత్సంగ్‌ సభ్యులు విశాఖ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి.. ఏ-1గా జ్యోతిర్మయి భవానీ, ఏ-2గా రమణానంద మహర్షిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

రాఘురాం రాజన్ పై మరోసారి సుబ్రహ్మణ్యస్వామి ఫైర్.. రాజ‌నే కావాలంటున్న నెటిజన్లు

గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు రఘురాం రాజన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు మరోసారి ఆయనపై మండిపడ్డారు. రఘురాం రాజన్ గ్రీన్ కార్డు పై ఇక్కడ ఉన్నారు.. ఆయన పరిపూర్ణమైన భారతీయుడు కాదు అని విమర్శించారు. అంతేకాదు దీనిపై ఆయన ప్రధాని మోడీకి కూడా లేఖ రాసినట్టు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ఎంతో మంది భారతీయ జాతీయ భావాలున్న ప్రతిభావంతులు ఉండగా యూపీఏ ప్రభుత్వం గతంలో నియమించిన వ్యక్తే ఇంకా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఎందుకు కొనసాగాలి? రఘురామ్ రాజన్‌ను వెంటనే తొలిగించాలని అని లేఖలో పేర్కొన్నారు.   అయితే రాజన్ పై సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేస్తున్నా.. నెటిజన్ల నుండి మాత్రం ఆయనకు సపోర్ట్ లభిస్తోంది. ఆర్బీఐ గ‌వర్న‌ర్‌గా రాజ‌నే ఫ‌ర్ఫెక్ట్ అని, రెండోసారీ ఆయ‌నే ఈ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని ఓ సర్వేలో తెలిసింది. అంతేకాదు ర‌ఘురాం రాజ‌న్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యస్వామి చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌న్లు ఖండించారు. రాజ‌న్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.

ముగిసిన ఎన్నికలు.. జయలలిత ఎక్కడ..?

  తమిళనాడు ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఫలితాలు ఎల్లుండి అంటే 19వ తేదీన విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు అందరి సందేహం ముఖ్యమంత్రి జయలలిత ఏది అని. అలా ఎన్నికలు ముగిశాయో లేదో.. ఆమె ఎవరికీ దర్శనమివ్వడంలేదట. అంతేకాదు పోయిస్ గార్డెన్ లోని తన ఇంటికి వచ్చిన కొందరు మంత్రులను కలవడానికి కూడా ఆమె నిరాకరించిందట. అయితే దీనికి కారణం ఏంటంటే.. వివిధ సంస్థలు తెలిపిన సర్వేలు ఈసారి ఫలితం జయలలితకు వ్యతిరేకంగా రానుందని చెప్పడమేనట. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ జయలలిత ఎవరికీ దర్శనమివ్వదని సమాచారం.    కాగా ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం ఈసారి డీఎంకే పార్టీ విజయం సాధిస్తుందని అన్నాడీఎంకే ఓటమి పాలవుతుందని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు గత మూడు దశాబ్దాల్లో ఏ పార్టీకీ వరుసగా రెండు సార్లు అధికార పీఠాన్ని ఇవ్వని తమిళనాడు ఓటర్లు మరోసారి సంప్రదాయాన్ని పాటించనున్నారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మరి ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎంత వరకూ నిజమవుతాయి.. ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే ఫలితాల వరకూ ఆగాల్సిందే.

మోడీతో చంద్రబాబు భేటీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేయాల్సిందే..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ ప్రత్యేక హోదా పై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కేంద్ర ఏపీకి ఇచ్చిన నిధులు.. ఇవ్వాల్సిన నిధులు.. ఇతర రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన నిధులు.. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు వంటి తదితర గణణాంకాలు వేసుకొని మరీ నివేదికను తయారు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేయాల్సిందేనని ఆ వినతిపత్రంలో మోదీని చంద్రబాబు కోరారు. చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీఎస్‌ సత్య ప్రకాశ్ టక్కర్, ఉన్నతాధికారులు ఉన్నారు.

జెఎన్యూ.. జాతి వ్యతిరేక నినాదులు చేశారు.. ఆ నినాదాలు ఇవే..

  జెఎన్యూ యూనివర్శిటీ.. ఆఫ్జల్ గురు ఉరిశిక్షకు నిరసనగా చేసిన దీక్ష కారణంగా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అంతే కాదు ఈ దీక్షను ముందుండి నడిపించిన విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ కు కూడా చెప్పలేనంత పేరు వచ్చేసింది. ఫిబ్రవరి 9 వ తేదీన జరిగిన సదస్సులో జాతి వ్యతిరేకత నినాదాలు చేశారంటూ కన్నయ్య కుమార్ తో పాటు మరో నలుగురు విద్యార్ధులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యార్థులు జాతి వ్యతిరేక నినాదాలు చేసిన మాట వాస్తవమేనని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్‌) నిర్ధారించింది. అఫ్జల్ ఉరిని ‘జ్యూడీషియల్ కిల్లింగ్’గా అభివర్ణించిన ఓ వర్గం విద్యార్థులు దేశానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారని..తనకు అందిన వీడియోలను పరిశీలించి  గాంధీనగర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)  నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కాగా సమావేశం సందర్భంగా విద్యార్థులు చేసిన కొన్ని నినాదాలిలా ఉన్నాయి.. * తుమ్‌ కిత్‌నే అఫ్జల్‌ మారోగే, ఘర్‌ ఘర్‌సే అఫ్జల్‌ నిక్లేగే (మీరెంతమంది అఫ్జళ్లను చంపుతారో, ప్రతి ఇంటినుంచి అంతమంది అఫ్జళ్లు పుట్టుకొస్తారు) * పాకిస్తాన్‌ జిందాబాద్‌, కాశ్మీర్‌ మాంగే ఆజాదీ, లడ్కర్‌ లేంగే ఆజాదీ (కాశ్మీర్‌ స్వతంత్య్రాన్ని కోరుతోంది, పోరాడి స్వాతంత్య్రం సాధించుకుంటాం) * భారత్‌ కీ బర్బాదీ తక్‌ జంగ్‌ రహేగి (భారత్‌ నాశనమయ్యే వరకూ యుద్ధం జరుగుతుంటుంది)

మాల్యా ఆఫర్ కు సానుకూలంగా స్పందించిన బ్యాంకులు..

  లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇచ్చిన కొత్త ప్రతిపాదనకు ఇప్పుడు బ్యాంకులు సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. తాను బ్యాంకులకు రుణాలు మొత్తం చెల్లించడానికి సిద్దంగానే ఉన్నానని.. అయితే ఓ హామీ ఇస్తేనే భారత్ తిరిగి వస్తానని.. భారత్ వచ్చిన నన్ను అరెస్ట్ చేయకూడదని.. తగిన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తేనే వస్తానని తెలిపాడు. దీంతో మాల్యా ఇచ్చిన ఆఫర్ కు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం స్పందించింది. తమకు రుణాల వసూలు మాత్రమే ముఖ్యమని.. మాల్యా ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి హామీ లభిస్తే, ఆయన ఇండియాకు వచ్చినా ఇబ్బంది పెట్టబోమన్న సంకేతాలు ఇచ్చాయి. మాల్యా ఇండియాకు వచ్చి బకాయిలు చెల్లిస్తే చాలని వివరించారు.   కాగా 17 బ్యాంకులు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి.. లండన్ లో తలదాచుకున్న మాల్యాను ఇండియాకు రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా మాల్యాను ఎలాగైనా ఇండియాకు తీసుకొస్తామని వెల్లడించారు. మరి ఇప్పుడు మాల్యానే కేంద్రానికి ఆపర్ ఇచ్చాడు.. ఈ నేపథ్యంలో మాల్యా పెట్టిన షరతులకు కేంద్రం ఒప్పుకుంటుందో లేదో.. తాను అడిగిన హామీ ఇస్తుందో లేదో..  చూద్దాం..

ఏపీ డీఎస్పీ.. 10వేల 313 ఉద్యోగాల భర్తీ..

  ఏపీ డీఎస్పీ ఎగ్జామ్ లో ఎంపికైన వారికి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2014 లో మొత్తం 10వేల 313 ఉద్యోగాలకు  భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు తీర్పుతో ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని.. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని.. జూన్‌ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నామని తెలిపారు. నియమితులైన వారికి జూన్‌ 2 నుంచి శిక్షణ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్‌ పాఠశాలల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని తెలిపారు.

'జల'దీక్ష కాదు 'జలగ'దీక్ష.. మంచినీళ్లు కూడా ముట్టుకోని జగన్

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో జలదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ చేసే జలదీక్షపై ఆనం వివేకానంద రెడ్డి విమర్శల బాణాలు సంధించారు. జగన్ చేస్తున్నది 'జల'దీక్ష కాదని అది 'జలగ' దీక్ష అని ఎద్దేవ చేశారు. ఒక్కనాడైనా వ్యవసాయం చేయని వైకాపా అధినేత జగన్ కు రైతు సమస్యలు ఎలా తెలుస్తాయని.. ప్రాజెక్టుల నుంచి తన ఫ్యాక్టరీలకు నీటిని తీసుకు వెళుతున్న జగన్, ధర్నాల పేరు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. అంతేకాదు వరుస ఎమ్మెల్యేల ఫిరాయింపులతో వైసీపీ పార్టీ మరో ఆరు నెలల్లో ఖాళీ అయిపోతుందని.. ప్రతి పక్ష హోదా కూడా కోల్పోతుందని.. ప్రజలు కన్నీరు పెడుతున్నారు అని చెప్పే జగన్ కు.. ఆఖరికి తానే కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.   కాగా తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందన్న నేపథ్యంలో జగన్ నిన్నటి నుండి దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం నుంచి జగన్ దీక్షలో ఉండగా, రాత్రి ఒకసారి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మాత్రమే వేదికను దిగిన ఆయన, రెండు మూడు నిమిషాల్లోనే తిరిగి వేదికపైకి వచ్చారు. ఆపై పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. గత రాత్రి రెండు గంటల వరకూ ఆయన అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు. ఆపై కాసేపు విశ్రమించారు. మళ్లీ ఈరోజు యధావిధిగా దీక్షలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జగన్ చేసే దీక్షకు ప్రజల నుండి మద్దతు బాగానే లభిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ జలదీక్ష వేదిక వద్దకు వస్తున్న ప్రజలు, రైతులు, వైకాపా అభిమానుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోందని తెలుస్తోంది.

లొంగిపోయిన మనోరమాదేవి.. నితీశ్ ఆగ్రహమే కారణమా..!

  గయ కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ యువకుడిని కాల్చివేసిన ఘటనలో ఎమ్మెల్సీ మనోరమాదేవి కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈరోజు ఆమె కోర్టులో లొంగిపోయింది. దీనిపై విచారించిన కోర్టు ఆమెకు 14రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఆమె లొంగిపోవడానికి కారణం నితిశ్ కుమారే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనను.. మీ పార్టీ వారే క్రిమినల్ కేసుల్లో ఎందుకు ఎక్కువగా ఇరుక్కుంటున్నారన్న ప్రశ్న వేయగా ఆయన దానికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆమె గత మూడు రోజులుగా ఆజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో ఇదే ప్రశ్నను నితీశ్ ను అడుగగా.. దానికి కూడా ఆయన ఘాటుగానే సమాధానం చెప్పారు. ఆమె అజ్ఞాతంలో ఉంటే దానికి కారణం నేనా.. నేను ఆమెను దాచానా.. లేక ఎవరైనా దాచారనా మీ ఉద్దేశం.. అంటూ మండిపడ్డారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ తరువాత గంటలోనే మనోరమాదేవి పోలీసుల ముందు లొంగిపోయింది.   కాగా తన కారును ఓవర్ టేక్ చేశాడని చెప్పి మనోరమా దేవి కొడుకు రాఖీ యాదవ్ ఓ విద్యార్ధిని తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాను కూడా పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.

పిన్నమనేని కారు బోల్తా.. భార్య డ్రైవర్ మృతి..

  టీడీపీ సీనియర్ నేత, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు బోల్తా కొట్టి ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ ఈరోజు కారులో వెళుతుండగా.. పహాడీ షరీఫ్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పిన్నమనేని సతీమణి సత్యవాణి, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిన్నమనేని సతీమణి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. పిన్నమనేని చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసిన ఇద్దరు మంత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పిన్నమనేనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.   మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిన్నమనేని ప్రమాదంపై స్పందించి.. ఆయన సతీమణి మృతి పట్ల సంతాపం తెలియజేశారు. పిన్నమనేని పరిస్థితి గురించి ఆరా తీశారు.