పార్టీ ఫిరాంయించిన వారిపై వైసీపీ పిటిషన్.. ఆఖరికి ఇక్కడికి రావాల్సిందే.. టీడీపీ
posted on May 14, 2016 @ 1:06PM
వైసీపీ పార్టీ నుండి ఇప్పటికి 16 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ నుండి పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై.. ఆ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. వారిని అనర్హలుగా ప్రకటించడంలేదని తెలుపుతూ.. పార్టీ ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలతో పాటు.. స్పీకర్ ను కలిపి ప్రతివాదులుగా పిటిషన్లో తెలిపింది. అంతేకాదు రాజ్యసభ ఎన్నికల్లో 16 మంది ఎమ్మెల్యేలకు ఓటు వేసే హక్కు కల్పించకూడదని కోరుతున్నారు.
మరోవైపు టీడీపీ నేతలు మాత్రం వైసీపీ వేసిన పిటిషన్ పై మాట్లాడుతూ.. పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. అది తిరిగి అసెంబ్లీ స్పీకర్ దగ్గరకు రావాల్సిందేనని.. అంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన ఏ నిర్ణయమైనా శాసనసభ స్పీకర్ వద్ద జరగాల్సిందేనని, ఎవరు ఎక్కడ పిటిషన్ వేసినా బంతి చివరకు స్పీకర్ కోర్టుకు రావల్సిందేనని అంటున్నారు. మరి దీనిపై వైసీపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.