విజయవాడలో వైఎస్ విగ్రహం తొలగింపు, ఉద్రిక్తత

కృష్ణా పుష్కరాలు, నగర అభివృద్ధి, రోడ్ల విస్తరణలో భాగంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. అర్థరాత్రి దాటాక కంట్రోల్ రూం ప్రాంతానికి చేరుకున్న నగరపాలక సంస్థ అధికారులు, భారీ పోలిస్ బందోబస్తు మధ్య వైఎస్ విగ్రహాన్ని తొలగించారు. విషయం తెలుసుకున్న వైసీపి నేతలు వంగవీటి రాధాకృష్ణ, జోగి రమేశ్, కార్పోరేటర్లు, పార్టీ శ్రేణులు ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకుని తొలగింపు పనులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.    

లిప్ట్‌లో ఇరుక్కుపోయిన ట్రంప్..కాపాడిన రెస్క్యూ టీం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటి చేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కొలరాడో స్ప్రింగ్స్‌లో‌ని మైనింగ్ ఎక్స్ఛేం రిసార్టులో జరిగిన కార్యక్రమానికి ట్రంప్ తన అనుచరులతో కలిసి హాజరయ్యారు. బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు..అది ఒకటి, రెండవ ఫ్లోర్ల మధ్య చిక్కుకుపోయింది. బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి వీలు కుదరకపోవడంతో ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. లిఫ్ట్ పై భాగానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పైనున్న మెటల్ రూఫ్‌లను తొలగించి, ఓ నిచ్చెన లోపలికి దించి ట్రంప్‌ను, ఆయన అనుచరులను సురక్షితంగా కాపాడారు. దీంతో ట్రంప్ ఊపిరి పిల్చుకున్నారు.

డీఎంకే ఎంపీని కిందపడేసి కొట్టిన అన్నాడీఎంకే ఏంపీ..

తమిళ రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య వైరం గురించి దేశం మొత్తానికి తెలుసు. తమిళనాట చాలాసార్లు ఇరువర్గాలు బాహాబాహీకి దిగి..చొక్కాలు చింపుకున్నారు. తాజాగా ఇది రాష్ట్రాన్ని దాటి దేశ రాజధానికి పాకింది. కొట్టుకోవడానికి ఎక్కడైతే ఎంటీ అనుకున్నారో ఏమో గానీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇరు పార్టీలు ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అన్నాడీఎంకే ఎంపీ శశికళా పుష్ప, డీఎంకే ఎంపీ త్రిచి శివ జెట్ ఎయిర్‌వేస్ విమానంలో చెన్నైకి టికెట్లను బుక్ చేసుకున్నారు. సెక్యూరిటీ చెక్ వద్ద శశికళకు శివ చాలా దూరంలో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్యా ఏదో విషయంపై వాదన జరిగింది. ఇద్దరూ తమిళంలో మాట్లాడుకోవడంతో ఏం జరిగిందో తోటి ప్రయాణికులకు తెలియలేదు. ఆపై ఆగ్రహంతో శివ వద్దకు వచ్చిన శశికళ, ఆయనపై పిడిగుద్దులు కురిపించారు, కిందపడేసి కాళ్లతో తన్నారు. చుట్టూ ఉన్న వారికి ఏం అర్థం కాలేదు. విషయం ఎయిర్‌లైన్స్ దాకా వెళ్లడంతో ఇద్దరికి విమానం ఎక్కడానికి అనుమతి లభించలేదు.

సిద్దూకి పుత్రశోకం..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు రాకేశ్ అనారోగ్యంతో మరణించారు. రాకేశ్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా క్లోమ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత వారం స్నేహితులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన అనారోగ్యానికి గురికావడంతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఆంట్వెర్ప్ వర్శిటీ ఆసుపత్రిలో చేర్చారు.   నిన్నటి వరకూ రాకేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండగా ఇవాళ పూర్తిగా విషమించడంతో రాకేశ్ చనిపోయినట్లుగా ప్రకటించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో రాకేశ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రాకేశ్ మరణించిన విషయం తెలియగానే సిద్ధరామయ్య కుప్పకూలిపోయారు..ఆయన్ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. కొడుకును చూడటానికి సీఎం రెండో కొడుకు యతీంద్రతో కలిసి బెల్జియం వెళ్లారు. భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ఇవాళ బెంగుళూరుకు తీసుకురానున్నారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.

సిద్ద రామయ్య కొడుకు మృతికి.. కాకికి లింకేంటి..?

కొన్నిసార్లు మనకి చెడు జరుగుతుందో లేదో పక్కన పెడితే కొన్ని నమ్మకాల్ని పాటిస్తాం. అందులో నిజం ఎంతుందో మనకి తెలియదు. అనాదిగా వస్తున్న ఆచారాలు కాబట్టి పాటిస్తే పోయేదేముంది అని అనుకుంటాం. అయితే కొంత మంది మాత్రం ఇవన్నీ ట్రాష్ అని అనుకుంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం కాకిని అశుభసూచకంగా భావిస్తారు. ఈ కారణంగానే అది ఇంటి పరిసరాల్లో వాలడానికి ప్రయత్నిస్తే తరిమి కొడతారు. ఇళ్లలోకి కాకి వచ్చినా, వాహనాలపై వాలిన దాన్ని చెడుకు సంకేతంగానే భావిస్తారు. ఇప్పుడు ఈ కాకి గోల ఏంటబ్బా అని అనుకుంటున్నారా..?అక్కడే ఉంది ట్విస్ట్ అంతా. ఇప్పుడు ఈ కాకి మేటరే పెద్ద హాట్ టాపిక్ అయింది.   ఎందుకంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య ఈ రోజు అనారోగ్యం కారణంగా మరణించారు. గత కొద్దిరోజుల క్రితం బెల్జీయం వెళ్లిన ఆయన మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ప్రాణాలు వదిలారు. అయితే ఇప్పుడు ఈయన మృతికి కాకికి లింక్ పెడుతున్నారు కొంతమంది. అసలు సంగతేంటంటే.. కొద్ది రోజుల క్రితం సిద్ద రామయ్య కారుపై కాలి వాలిందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై అప్పుడు వార్తలు కూడా హల్ చల్ చేశాయి. ఇంకా కాకి వాలినందుకు అప శకునంగా భావించి సిద్ద రామయ్య కారును కూడా మార్చేసి కొత్త కారును తీసుకున్నారు. ఇప్పుడు సిద్ద రామయ్య కొడుకు మృతి చెందడంతో కాకి అపశకునమని చెప్పడానికి ఇదే నిదర్శనమని కొంతమంది అంటున్నారు. మొత్తానికి అది నిజమో..కాదో తెలియదు కానీ.. సిద్ద రామయ్యకు మాత్రం కొడుకు మరణంతో హాని జరిగింది.

పెట్రోల్ రూ.300, డీజిల్ రూ.150.. ఎక్కడ..?

  లీటరు పెట్రోల్ రూ.300, డీజిల్ రూ.150. ఇంతకీ ఎక్కడ ఈ రేట్లు అనుకుంటున్నారా.. మన రాష్ట్రంలో అయితే కాదులెండి. ఇప్పటికే భారీ వర్షాలతో  అతాలాకుతలమై పోతున్న అసోంలో పెట్రోల్ ధరలు ఆకాశానంటాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి. ప్రజలు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ సంగతైతే చెప్పనవసరం లేదు. లీటరు పెట్రోలు రూ.300 పలుకుతుండగా, డీజిల్‌ రూ.150 అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఆందోళలు చేపట్టారు. పెట్రోల్‌ బంకుల ఎదుట టైర్లకు నిప్పుపెట్టి నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

వాట్సాప్ యూజర్లు జర జగ్రత్తా..

స్మార్ట్ ఫోన్ యూజర్లకి వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమ్యునికేషన్ కోసం అందరూ ఉపయోగించే యాప్ లో ఇది మెయిన్ యాప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఇప్పుడు వాట్సప్ ఉపయోగించే వాళ్లు కొంచెం జాగ్రత్త అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెసేజ్ ల ప్రొటెక్షన్ ఉండదట. అసలు సంగతేంటో చూద్దాం.. ఇటీవల  వాట్సాప్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొచ్చినా సంగతి తెలిసిందే. అయితే అది కేవలం మూడు నెలలు మాత్రం కాపాడుతుందట. దీంతో పూర్తిగా మెసేజ్ల ప్రొటెక్షన్ కు ఉపయోగపడదంట. మెసేజ్ లు డిలీట్ చేసిన అవి ఫోన్లోంటి తొలగిపోవట. అలాగే ఉంటాయట. ఈ విషయాన్ని యాపిల్ ఐఓఎస్ సెక్యురిటీ నిపుణుడు జోనాథన్ చెప్పారు. ఇంకా ఆయన చెబుతూ.. మెసేజ్ లు డిలీట్ చేసినా అవి ఫోన్లోనే ఉంటాయని.. ఫోరెన్సిక్, రికవరీ సాప్ట్వేర్ ద్వారా డేటాను రికవరీ చేసుకోవచ్చన్నారు. వాట్సాప్ చాట్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేయాలంటే, వాట్సాప్ను ఫోన్ నుంచి పూర్తిగా తొలగించే మార్గమమే ఉత్తమని ఆయన సూచించారు. మరి వాట్సాప్ యూజర్లు బీ కేర్ ఫుల్..

మేనేజర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే..

  ఈమధ్య నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఘటనలు చాలానే చూశాం. అధికారం చేతిలో ఉంది కదా అని.. సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బిహార్‌లోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎమ్మెల్యే మెహబూబ్‌ఆలం కూడా చేరిపోయారు. ఓ బ్యాంకు అధికారిపై చేయి చేసుకొని ఆయన తన అధికారన్ని చూపించారు. వివరాల ప్రకారం.. మెహబూబ్‌ఆలం గ్వాల్‌టోలిలోని అలహాబాద్‌ బ్యాంకుకు వెళ్లారు. అయితే అక్కడ వెళ్లిన ఆయన మేనేజర్  రాకేశ్‌ రంజన్‌ రూంలోకి వెళ్లి ఆ సీట్లో తను కూర్చుంటానని చెప్పాడు. అయితే దానికి రాకేశ్ ఒప్పుకోకపోవడంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే అతని చెంప మీద కొట్టాడు. దీంతో రాకేశ్ ఈ విషయంపై పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే తనను కొడుతున్న వీడియోను కూడా చూపిస్తూ.. ఆలం ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదని.. గతంలో కూడా ఇలానే చేశాడని ఆరోపించాడు. ఇక రాకేశ్ ఆరోపణలకి స్పందించిన ఎమ్మెల్యే అందరూ ఎప్పుడూ చెప్పిన కథలే చెప్పుకొచ్చాడు. అవన్నీ తప్పుడు ఆరోణలు అంటూ కొట్టిపడేశాడు. పైగా బ్యాంకు మేనేజర్ ప్రవర్తనే సరిగా లేదని చెప్పాడు. మరి ఎవరు చెప్పినదాంట్లో నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఫ్లిప్ కార్ట్ లో 700 మంది ఉద్యోగుల తొలగింపు.. అందుకే అంటున్నయాజమాన్యం

  ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని చెప్పి ఆన్ లైన్ సైట్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న యాజమాన్యం ఇప్పుడు దీనిపై స్పందించి..  పెరుగుతన్న వ్యయాలను కట్టడి చేయడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటించింది. కొంత మంది పనితీరు బాగుండక పోవడంతో వారిని తొలగించాలని చూస్తున్నాము.. వారు మెరుగుపడటానికి అవకాశం ఇస్తాం.. అయినా కానీ వారు పురోగతి సాధించలేక పోతే వేరే అవకాశాలు వెతుక్కోమని చెబుతున్నామని ఫ్లిప్ కార్ట్ కు చెందిన అధికారి తెలిపారు. అయినా కార్పోరేట్ సంస్థల్లో ఇవన్నీ కామన్ అని... స్నాప్‌డీల్‌, అమెజాన్‌ వంటి కంపెనీలతో పోటీపడాలంటే ఉద్యోగుల తొలగింపు తప్పని సరి అని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది.

ఆధార్ కార్డ్ పై వెంకయ్య నాయుడు..

ఈ మధ్య కాలంలో ఏదైనా ఫ్రూఫ్ కావాలంటే ఆధార్ కార్ట్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందాలంటే అధార్ కార్ట్ తప్పనిసరి. అయితే ఇప్పుడు దీనిపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్య నాయుడు ఓ ప్రకటన చేశారు. ఈరోజు రాజ్యసభలో ఆధార్ కార్డు అంశంపై తృణమూల్, లెఫ్ట్, జేడీయు, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కొన్ని డిమాండ్లు చేయగా.. దానికి స్పందించిన వెంకయ్యనాయుడు ఆధార్ కార్డ్ లేదనే ఒక్క కారణంతో దారిద్ర్య రేఖకి దిగువనున్న కుటుంబాలకి ప్రభుత్వం అందించే వివిధ సబ్సీడీలు, పథకాలు, సేవలు అందించడానికి అధికారులు నిరాకరించరాదని స్పష్టంచేశారు. ఆధార్ కార్డు లేని వారికి ప్రభుత్వ పథకాలు, సేవలు, సబ్సీడీల అందజేతలో ఎటువంటి జాప్యం చేయరాదని ఇప్పటికే ప్రభుత్వంలోని వివిధ శాఖలని ఆదేశించడం జరిగిందని.. ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ యాక్టులోని సెక్షన్ 7 ప్రకారం ప్రత్యామ్నాయమార్గాల్లో పనులు జరిగేలా వ్యవహరించాలని ఆదేశించినట్టుగా వెంకయ్య నాయుడు తన ప్రకటనలో వివరించారు.

60 ఏళ్ల వృద్ధుడికి ఆరేళ్ల బాలికతో వివాహం..

అరవైఏళ్ల ఓ వృద్ధుడు ఆరేళ్ల బాలికను పెళ్లాడాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఇలాంటి దారుణమైన ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? ఆప్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ లో జరిగింది. వివరాల ప్రకారం.. కాబూల్ కు చెందిన ముహమ్మద్ కరీం అనే 60 ఏళ్ల వృద్ధుడు ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా వ్యవహారాల శాఖ అధిపతి మాసూమ్ అన్వారీ కరీంను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సందర్బంగా అన్వారీ మాట్లాడుతూ.. ''ఈ మనిషి అంటే నాకు ఎంతో భయం'' అంటూ బాలిక తరచూ అంటుందని..  బాలిక షాక్ కు గురై మట్లాడలేక పోతుందని తెలిపారు. ఇంకా ఆఫ్ఘాన్ స్వతంత్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ సీమా సమార్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో పేదరికం వల్ల ఎక్కువమంది తక్కువ వయసులోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

గో సంరక్షకులపై మంత్రి గారు ఆగ్రహం.. మనుషులను ఎవరు కాపాడతారు..

    ఇటీవల గో మాంసం విషయంలో వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే. గోవుల చర్మాన్ని వలిచారని చెప్పి నలుగురు దళిత యువకులను కారుకు కట్టేసి చితక్కొట్టారు. ఇంకా నాలుగురోజుల క్రితం గో మాంసాన్ని విక్రయిస్తున్నారని చెప్పి ఇద్దరు మహిళలను గో సంరక్షక కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారు. ఇప్పుడు ఈ ఘటనలపై స్పందించిన దళిత నాయకుడు రాందాస్‌ బాండు అథావాలె సంచలన వ్యాఖ్యలు చేశారు.   రాందాస్‌ బాండు అథావాలె ఇటీవలే కేబినెట్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై ఆయన మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు పణంగా పెట్టి గోవుల రక్షణ చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు. గోవుల రక్షణ పేరిట మనుషులను చంపుతూపోతే.. మరీ మానవ రక్షణ ఎవరు చేపడతారని ఆయన ప్రశ్నించారు. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నానని చెప్తున్న మాయావతి ఇంకా ఎందుకు బుద్ధిస్టుగా మారలేదని ఆయన ప్రశ్నించారు.

ఏపీ హోదాపై చంద్రబాబు ఫైర్.. ఇంక భరించేది లేదు..

ఏపీకి ప్రత్యేక హోదా రాదని గతంలో బీజేపీ నేతలు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. కానీ ప్రైవేటు బిల్లు.. దానిపై చర్చ అంటూ కాస్త హడావుడి ఎక్కువైంది అంతే. కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ కేవీపీ రామచంద్రారావు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రవేటు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై కూడా ఎప్పుడో జరగాల్సి చర్చ.. ఎన్నో అడ్డంకులు ఎదురై ఆఖరికి నిన్న జరిగింది. ఇక ఈ చర్చలో భాగంగా కేంద్రం అర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పకనే చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం అసలు చట్టలో లేదని.. కానీ గత ప్రధాని ఇచ్చిన హామి నేపథ్యంలో దాని గురించి ఆలోచిస్తున్నామని.. ఏపీకి అన్ని విధాలా సాయంగా ఉంటామని సన్నాయి నొక్కులు నొక్కారు. దీంతో కేంద్రం మళ్లీ ఏపీకి కుచ్చు టోపి వేసిందని అర్ధమైపోయింది.   ఇక ఇప్పుడు కేంద్రం చేసిన వ్యాఖ్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాల కోసం బీజేపీని ఇప్పటిదాకా అభ్యర్థించామని, ఇకపై ఆ పార్టీపై పోరుకు సిద్ధం కాక తప్పని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయమే బీజేపీ కూడా చేస్తోందని కూడా చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాదు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చిన నష్టాలను కూడా ప్రస్తావించారు ఆయన. గత ఎన్నికల్లో సింగల్ డిజిట్ కే పరిమితమైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నాయని.. అయినా అన్నీ ఓర్చుకున్నప్పటికీ కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా తమకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ కూతురిపై హత్య కేసు..

ఓ హత్య కేసులో ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలపై కేసు నమోదైంది. వివవరాల ప్రకారం.. కర్నూలు జిల్లా నంద్యాలలోని నంది గ్రూప్ కంపెనీస్ అనుబంధ సంస్థ నంది అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పీఆర్ఓ మేడం సుమంత్  హత్యకు గరైన సంగతి తెలిసిందే. ఈకేసులో భాగంగా సుజలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. కాగా పీఆర్ఓగా ఉన్న సుమంత్ కేటాయించిన లక్ష్యం మేరకు అడ్మిషన్లు చేయలేకపోవడం, ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో పాఠశాల యాజమాన్యం తీవ్రంగా పరిగణించి గురువారం పాఠశాలలోనే నిర్భందించింది. ఈ నేపథ్యంలో తన తమ్ముడు సునీల్ వచ్చి సర్ధి చెప్పడానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఆ మరసటి ఉదయం మురళీ, షఫీ అనే వ్యక్తులు సునీల్ కు ఫోన్ చేసి సుమంత్ ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ చేర్పించామని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి సుమంత్ శవమై కనిపించాడు. అయితే సుమంత్ ఒంటి మీద గాయాలు ఉండటం గమనించిన కుటుంబసభ్యులు అతనిని కొట్టి చంపారని పోలీసులకి ఫిర్యాదు చేశారు.a

ట్రంప్ ను పొగిడితే ఇలాంటి ఎక్స్ ప్రెషన్స్ వస్తాయా..

  అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అని మనకి తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఎన్నికల బరిలో అభ్యర్దిగా నిలిచారు అనడంలో అతిశయోక్తిలేదేమో. మరోవైపు ఇలాంటి విద్వేషపూరిత.. విచ్ఛిన్నకరమైన వ్యాఖ్యలు చేసే ట్రంప్ పై విమర్సలు చేసే వాళ్లు కూడా కోకొల్లలు ఉన్నారు. ఆయన కనుక అమెరికా అధ్యక్షుడు అయితే అమెరికా సర్వ నాశనం అవుతుందని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ట్రంప్ ను పొగిడేవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ ఓ టీవీ యాంకర్ మాత్రం ట్రంప్ ను తెగ పొగిడేసింది. అయితే ఈ యాంకర్ మాటలు విన్న ఇంకో యాంకర్ ఆమె మాటలు విని కళ్లుతేలేసింది. ఆమె ఇచ్చిన ఎక్క్ ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది   అసలు సంగతేంటంటే.. ఫిలడెల్ఫియాలో డెమొక్రటిక్‌ జాతీయ సదస్సు సందర్భంగా ఓ ఛానల్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొన్న కేలీ మెక్‌ఎనానీ అనే కన్జర్వేటివ్ కామెంటర్ ట్రంప్ పై ప్రశంసలు కురిపించింది. ట్రంప్‌లో కూడా ఓ గొప్ప ఉదారవాది ఉన్నాడని..  ఆయనకు విశాల హృదయం ఉందని..ట్రంప్‌ ఎన్నో గొప్పపనులు చేశాడని, తన ప్రైవేటు టైమ్‌లో సమాజానికి సేవలు అందించాడని చెప్పుకొచ్చింది. ఇది విన్న సీఎన్‌ఎన్‌ విశ్లేషకురాలు ఏంజెలా రైయి ట్రంప్ పై ఆమె చేసే పొగడ్తలకు విస్తుపోయింది. ఏదో వినకూడని పదాలు ఆమె వింటున్నట్టు కనుగుడ్లు తిప్పుతూ విస్తుపోయింది. దీంతో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అందరూ ఒకటే కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్ గారి గొప్పతనం విని ఇంకెంత మంది ఇలా అయిపోతారో అని సెటైర్లు విసురుకుంటున్నారు. మరి కొన్నిసార్లు ఇలాంటి మాటలు వింటే ఆశ్చర్యపడక తప్పదు మరి.

రాహుల్ గాంధీ పొగిడాడా..! తిట్టాడా..!

  ఒక పార్టీ నేతను, ఇంకో పార్టీ నేత పొగడటం చాలా అరుదు. అలాంటిది పార్టీకే ఉపాధ్యక్షుడు అయినా రాహుల్ గాంధీ ఇప్పుడు ఓ నేతపై ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా.. ఎవరో కాదు.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పై. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఇప్పటినుండే మంచి కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే రాహుస్ గాంధీ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార భేరిని మోగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘యువ ముఖ్యమంత్రిని చూడండి. ఆయన మంచి బాలుడు అంటూ పొగిడారు. అయితే ఆయనను ప్రశంసించారు కానీ.. ఆయన ప్రభుత్వ తీరుపై మాత్రం విమర్శలు చేశారు. ఎస్పీ ప్రభుత్వం హయాంలో యూపీలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని.. ఒకవైపు బీఎస్పీ అవినీతిని ప్రోత్సహిస్తుంటే, మరోవైపు ఎస్సీ గూండాగిరిని ప్రోత్సహిస్తున్నదని.. ఆయన ప్రభుత్వం ఏ మాత్రం పనిచేయడం లేదని ఎద్దేవ చేశారు.

"టోరీ" కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి

ప్రపంచంలోని తెలుగువారందరిని ప్రతి రోజు పలకరిస్తున్న తెలుగువారి ఆత్మీయ వారథి తెలుగువన్ రేడియో (టోరీ) కిర్తీ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన 10 ఎఫ్.ఎం రేడియాల్లో టోరీ ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఆన్‌లైన్ రేడియో వెబ్‌సైట్ "రేడియో గైడ్ " నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్‌ కేంద్రంగా తెలుగులో తొలి ఆన్‌లైన్ రేడియోగా టోరీని ప్రారంభించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు టోరీ ఎండీ కంఠమనేని రవిశంకర్. ఆయన సారథ్యంలో విభిన్న కార్యక్రమాలతో నిత్యనూతనంగా మారుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మనసుల్ని గెలుచుకుంది టోరీ. సుమారు 110 దేశాల్లోని తెలుగువారిని అలరించడమే కాకుండా వారి అనుబంధాల్ని, అంతరంగాల్ని ఏకం చేస్తోంది టోరీ.