డీఎంకే ఎంపీని కిందపడేసి కొట్టిన అన్నాడీఎంకే ఏంపీ..
posted on Jul 31, 2016 @ 11:01AM
తమిళ రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య వైరం గురించి దేశం మొత్తానికి తెలుసు. తమిళనాట చాలాసార్లు ఇరువర్గాలు బాహాబాహీకి దిగి..చొక్కాలు చింపుకున్నారు. తాజాగా ఇది రాష్ట్రాన్ని దాటి దేశ రాజధానికి పాకింది. కొట్టుకోవడానికి ఎక్కడైతే ఎంటీ అనుకున్నారో ఏమో గానీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇరు పార్టీలు ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
అన్నాడీఎంకే ఎంపీ శశికళా పుష్ప, డీఎంకే ఎంపీ త్రిచి శివ జెట్ ఎయిర్‌వేస్ విమానంలో చెన్నైకి టికెట్లను బుక్ చేసుకున్నారు. సెక్యూరిటీ చెక్ వద్ద శశికళకు శివ చాలా దూరంలో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్యా ఏదో విషయంపై వాదన జరిగింది. ఇద్దరూ తమిళంలో మాట్లాడుకోవడంతో ఏం జరిగిందో తోటి ప్రయాణికులకు తెలియలేదు. ఆపై ఆగ్రహంతో శివ వద్దకు వచ్చిన శశికళ, ఆయనపై పిడిగుద్దులు కురిపించారు, కిందపడేసి కాళ్లతో తన్నారు. చుట్టూ ఉన్న వారికి ఏం అర్థం కాలేదు. విషయం ఎయిర్‌లైన్స్ దాకా వెళ్లడంతో ఇద్దరికి విమానం ఎక్కడానికి అనుమతి లభించలేదు.