సిద్దూకి పుత్రశోకం..
posted on Jul 31, 2016 @ 10:44AM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు రాకేశ్ అనారోగ్యంతో మరణించారు. రాకేశ్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా క్లోమ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత వారం స్నేహితులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన అనారోగ్యానికి గురికావడంతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఆంట్వెర్ప్ వర్శిటీ ఆసుపత్రిలో చేర్చారు.
నిన్నటి వరకూ రాకేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండగా ఇవాళ పూర్తిగా విషమించడంతో రాకేశ్ చనిపోయినట్లుగా ప్రకటించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో రాకేశ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రాకేశ్ మరణించిన విషయం తెలియగానే సిద్ధరామయ్య కుప్పకూలిపోయారు..ఆయన్ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. కొడుకును చూడటానికి సీఎం రెండో కొడుకు యతీంద్రతో కలిసి బెల్జియం వెళ్లారు. భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ఇవాళ బెంగుళూరుకు తీసుకురానున్నారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.