ఆధార్ కార్డ్ పై వెంకయ్య నాయుడు..
posted on Jul 30, 2016 @ 1:13PM
ఈ మధ్య కాలంలో ఏదైనా ఫ్రూఫ్ కావాలంటే ఆధార్ కార్ట్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందాలంటే అధార్ కార్ట్ తప్పనిసరి. అయితే ఇప్పుడు దీనిపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్య నాయుడు ఓ ప్రకటన చేశారు. ఈరోజు రాజ్యసభలో ఆధార్ కార్డు అంశంపై తృణమూల్, లెఫ్ట్, జేడీయు, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కొన్ని డిమాండ్లు చేయగా.. దానికి స్పందించిన వెంకయ్యనాయుడు ఆధార్ కార్డ్ లేదనే ఒక్క కారణంతో దారిద్ర్య రేఖకి దిగువనున్న కుటుంబాలకి ప్రభుత్వం అందించే వివిధ సబ్సీడీలు, పథకాలు, సేవలు అందించడానికి అధికారులు నిరాకరించరాదని స్పష్టంచేశారు. ఆధార్ కార్డు లేని వారికి ప్రభుత్వ పథకాలు, సేవలు, సబ్సీడీల అందజేతలో ఎటువంటి జాప్యం చేయరాదని ఇప్పటికే ప్రభుత్వంలోని వివిధ శాఖలని ఆదేశించడం జరిగిందని.. ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ యాక్టులోని సెక్షన్ 7 ప్రకారం ప్రత్యామ్నాయమార్గాల్లో పనులు జరిగేలా వ్యవహరించాలని ఆదేశించినట్టుగా వెంకయ్య నాయుడు తన ప్రకటనలో వివరించారు.