పాక్ గడ్డపై నిల్చొని పాక్‌కే వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్

సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశాల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వెళ్లిన భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్..ఆ దేశ గడ్డపై నిల్చొని ఆ దేశానికే వార్నింగ్ ఇచ్చారు. సమావేశంలో భాగంగా ప్రసంగించిన రాజ్‌నాథ్ ఉగ్రవాదులకు సహకరిస్తూ..ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని చెప్పడం, ఉగ్రవాదులను కీర్తించడం, ఉగ్రసంస్థలను ప్రోత్సహించడం మానుకోవాలని పాక్‌కు రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అని విడిగా లేవని, ఉగ్ర చర్యల్ని కంటితుడుపు చర్యగా ఖండించకూడదని పేర్కొన్నారు. ఆతిథ్య దేశ ప్రధాని షరీఫ్, హోంమంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ ప్రసంగంలో ఉగ్రవాదాన్ని కేవలం ఖండించడాన్ని రాజ్‌నాథ్ తప్పుబట్టారు.

నేడు రాజ్యసభ ముందుకు ప్రత్యేక హోదా బిల్లు..

  పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లుపై చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. గత వారం రోజుల క్రితం ఈ బిల్లుపై చర్చ జరిగినా అది నామ మాత్రంగానే జరిగింది. అంతేకాదు దానిపై కొంతసేపు చర్చ జరిపిన అనంతరం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు.. అయినా దీని గురించి ఆలోచిస్తున్నాం అని..దీన్ని ద్రవ్యబిల్లుగా పేర్కొంటూ పక్కన పెట్టేశారు. ఇక అప్పటినుండి అటు పార్లమెంట్లో ఏపీ ఎంపీలందరూ.. ఇటు ఏపీ రాష్ట్రమంతటా నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చివరికి ఆ బిల్లును ప్రైవేటు సభ్యుల వ్యవహారాల్లో చేర్చారు. దీంతో ఈరోజు మళ్లీ ఈ బిల్లుపై చర్చ జరపనున్నారు. బిల్లు సభలోకి పరిశీలనకు వచ్చిన సమయంలో తమ ఎంపీలంతా సభలోనే ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే విప్ జారీ చేసింది. మరి ఈ రోజైనా బిల్లుపై చర్చ జరిగి ఓటింగ్ జరుగుతుందో లేదో చూడాలి.

మీలాంటి ముఖ్యమంత్రులే దేశానికి కావాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆగస్టు 12 నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా సీఎం రాష్ట్రపతిని ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మీరు ప్రతి అంశంలో సానుకూల దృక్పథంతో ఉంటారు. అందరు ముఖ్యమంత్రులు మీలా పనిచేస్తే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఆ విషయంలో అందరికంటే మీరు ముందుంటారు అని ప్రణబ్, చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్ని ఏపీ సీఎం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

పుష్కరాలకు ఏపీ రండీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. ఆగస్టు 12 నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా సీఎం రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ను టీడీపీ ఎంపీలతో పాటు కలిసిన చంద్రబాబు..ఆయనకు శాలువాకప్పి, పుష్పగుచ్ఛం అందించి కృష్ణాపుష్కరాలకు రావాలంటూ ఆహ్వానించారు. ఎంపీలతో కలిసి ఆయన కొద్దిసేపు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. అంతకు ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేఎస్ ఖేహర్‌లను విడివిడిగా కలిసి పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

మోడీపై బీజేపీ నేతల డౌట్..!

  తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు ఓ విషయంలో తెగ బాధపడిపోతున్నారంట. ఇంతకీ ఏంటా విషయం.. బీజేపీ నేతలని అంతలా బాధ పెడుతున్నదేమిటీ.. అని అనుకుంటున్నారా..? ఎవరి విషయంలోనో కాదు ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో బీజేపీ నేతలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.   అసలు సంగతేంటంటే.. ఈనెల 7న తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి రానున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రానికి వచ్చిన ఆయన అటు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమావేశాల్లో పాల్గొననున్నారు. అయితే ఇక్కడే బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన కేంద్ర మంత్రలు ప్రభుత్వ తీరును ప్రశంసించి వెళుతున్నారు. శభాస్ అని మెచ్చుకొని మరీ వెళుతున్నారు. ఇదే టీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. అంతేకాదు వారి సమావేశాల్లో కూడా ప్రశంసల్ని తమకు అనుకూలంగా మార్చుకొని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రే రాష్ట్రసర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తే, తమ పరిస్థితి ఏంటని జుట్టుపీక్కుంటున్నారు. ఎక్కడ రాష్ట్రంలో పాలనను ఆకాశానికెత్తేస్తారో అని బాధపడుతున్నారు.   అసలే తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిపక్ష పార్టీగా తాము మాత్రమే వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రజెంట్ అయితే మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంపై తెలంగాణ సర్కార్ పై మాటాల తూటాలు పేల్చుతూ.. రైతులకు సంఘీభావంగా బీజేపీ నేతలు వేదికలు పంచుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మోడీ ఎలాంటి ప్రసంగం చేస్తారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రానికి ప్రధానమంత్రి రావాలని తొలుత ఆహ్వానించింది రాష్ట్ర బీజేపీ నేతలే. ఆ తర్వాతే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి మోడీని రమ్మని ఆహ్వానించారు. పార్టీ పరంగానే ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఉంటే బాగుండేదని, ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడం సరికాదని కొందరు బీజేపీ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి మోడీ ఏం చేస్తారో.. పార్టీని చిక్కుల్లో పడేస్తారా..? లేక కాపాడుతారా..? చూడాలి.

కేసీఆర్ తిన్న హైకోర్టు మొట్టికాయలు ఇవే..

  కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టుతో మొట్టికాయలు పెట్టించుకోవడం కొత్తేమి కాదు. ఎన్నో అంశాల్లో.. ఎన్నోసార్లు కోర్టు చేత మొట్టికాయలు పెట్టించుకుంది. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది. ఈ రెండు సంవత్సరాల్లో ఏ రాష్ట్రం నమోదు చేయని ఒక రికార్డును తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసింది. ఆవేశంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. దీని నుండి తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం.. ఆఖరికి వ్యవహారం కాస్త కోర్టుకు వెళ్లడం..అక్కడ చివాట్లు తినడం ఇదే సరిపోయింది.   * రాష్ట్ర విభజన జరిగి అధికారంలోకి వచ్చిన తరువాత మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో.. తెలంగాణలో వాహనాలన్నీ మళ్లీ తెలంగాణ రాష్ర్టం కోడ్ తో మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేసీఆర్ సర్కారు ఆదేశించింది. దీనిపై కోర్టు ఆభ్యంతరం వ్యక్తం చేసింది.   * ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారం.. ఏపీ ఉన్నత విద్యామండలితో తమకు సంబంధం లేదని.. తాము ఇప్పుడప్పుడే అడ్మిషన్లు నిర్వహించబోమని టీ సర్కారు భీష్మించుకు కూర్చుంది. అసలు ఏపీ విద్యామండలికి తెలంగాణలో కౌన్సెలింగ్ నిర్వహించే అధికారం ఏముందని ప్రశ్నించింది.   * మహాజన సర్వే విషయంలో కూడా కోర్టు ప్రభుత్వం తీరుపై మండిపడింది.  అసలు బలవంతంగా సర్వే చేయాల్సిన అవసరమేమొచ్చిందని కోర్టు సర్కారును ప్రశ్నించింది. దీంతో దిగొచ్చిన సర్కార్.. సర్వే స్వచ్ఛందమేకానీ నిర్బంధం కాదని..ఇచ్చిన వివరాలు నమోదు చేసుకుంటామేకానీ బలవంతం చేయబోమని చెప్పింది.   * తాత్కాలిక పన్ను విధింపు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తొందరపడింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలు ట్యాక్స్‌ చెల్లించాలంటూ నానా హడావుడి చేసింది. అయితే ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని... మరో ఏడు నెలలు సమయం ఉందని చెప్పడంతో అప్పుడు వివాదం సద్దుమణిగింది.   * ఇంకా తెలంగాణ ప్రభుత్వం చేసిన వీసీ నియామకాలపై కూడా హైకోర్టు స్పందించి.. రెండు రోజులు ఆగలేకపోయారా.. వీసీలను నియమించినంత మాత్రాన అయిపోయిందా అంటూ ప్రశ్నించింది.   * ఫాస్ట్ పథకం గురించి మరో వ్యాజ్యంలో కోర్టు చాలా సీరియస్ అయ్యింది. తెలంగాణలో భారత్ లో అంతర్భాగమే కదా… మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. చట్టానికి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఫాస్ట్ పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉంది. ఆరు వారాల పాటు విచారణను వాయిదా వేసిన కోర్టు ఫాస్ట్ పై వెంటనే పునరాలోచన చేసుకుని రావాలని ఆదేశించింది.   * స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లోఉన్న అకౌంట్లకు సంబంధించి కోర్టుకు వెళితే అక్కడా చుక్కెదురైంది.   * గ్రేటర్ ఎన్నికలు.. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పట్టు లేక.. ఎల‌క్షన్స్ ను వాయిదా వేస్తూ వ‌స్తున్న ప్రభుత్వానికి  కోర్టు అక్షింత‌లు వేసింది. డిసెంబ‌ర్‌లోగా ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని డెడ్ లైన్ విధించింది. మీ వ‌ల్ల కాలేక‌పోతే మేం జోక్యం చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని గ‌ట్టిగా మంద‌లించింది.   * పార్లమెంట‌రీ సెక్రట‌రీ హోదా అనే కొత్త ప‌ద‌విని తెరపైకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ ప‌ద‌వులు ప్రజాధ‌నం వృథా చేయ‌డ‌మే అవుతుంద‌ని దీన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ స‌హించబోమ‌ని కోర్టు తేల్చిచెప్పింది.   * కొత్త సచివాలయ నిర్మాణం కూడా కోర్టు కేసుల్లో చిక్కుకుంది. చెస్ట్ ఆసుపత్రి భవంతి హెరిటేజ్ జాబితాలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.   * హైకోర్టు విభజన.. హైకోర్టు విభ‌జ‌న అంశంలోనూ తెలంగాణ ప్రభుత్వం స్పీడుకు బ్రేకులు ప‌డ్డాయి. ఒకే ప్రాంతంలో రెండు రాష్ట్రాల‌కు హైకోర్టులు ఉండ‌టం స‌రికాద‌ని కోర్టు తేల్చి చెప్పింది. అసలు హైకోర్టు ఏర్పాటు విష‌యంలో తెలంగాణకు సంబంధం లేద‌ని చెప్పింది.   * ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వియంలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెంబర్: 123,124 లని రద్దు చేసింది. భూసేకరణ వ్యవహారంలో 2013 చట్టాన్నే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.   ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వస్తూనే ఉంటాయి. ఒక‌టి కాదు రెండు కాదు చాలాసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం.. కోర్టు చేత తిట్లు తినడం. ఇంకా ముందు ముందు ఎన్ని చివాట్లు తింటారో చూద్దాం..

పోకేమన్ తెచ్చిన తిప్పలు.. 3 లక్షల ఫోన్ బిల్లు

  సాధారణంగా ఫోన్ బిల్లు కాస్త ఎక్కువ వచ్చిందంటేనే మనం లబోదిబో అంటాం. అలాంటిది ఏకంగా మూడు లక్షల బిల్లు వస్తే ఎలా ఉంటుంది. అదీ ఫోన్ మాట్లాడకుండా.. మరి ఇంతకీ అంత బిల్లు ఎలా వచ్చిందనుకుంటున్నారా..? ఇంకెందుకు పోకెమన్ ఆట వల్ల. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది నిజం. ఈమధ్య కాలంలో పోకేమన్ గో ఫీవర్ అంతలా ఏర్పడింది. కనీసం ఎక్కడ ఆడుతున్నాం.. ఎంతసేపు ఆడుతున్నాం అని కూడా తెలియకుండా ఆడేస్తున్నారు. ఈ గేమ్ వల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ గేమ్ కు కోహి యుచిమెరా అనే జపాన్ కు చెందిన ఓ కుర్రాడు బలైపోయాడు. ఇతను అతను జపాన్ కు చెందిన స్టార్ జిమ్నాస్ట్. రియోలో పోటీ పడబోతున్నాడు కూడా. అయితే రియో కు వచ్చిన కోహి పోకేమెన్ గేమ్ డౌన్ లోడ్ చేసుకొని ఆడాడు. దానికి అతనికి వచ్చిన బిల్లు దాదాపు మూడు లక్షల ముప్ఫై వేల రూపాయలు. తన బిల్లు చూసుకొని షాక్ తిన్న కోహి కంపెనీకి ఫోన్ చేసి పరిస్థితిని చెప్పాడు. దీంతో వాళ్లు అంతా ఒకసారి కట్టక్కర్లేదని రోజుకు 1800 రూపాయల లెక్క కట్టమని ఆఫర్ ఇచ్చారు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు ఆ జిమ్నాస్ట్. మొత్తానికి పోకేమన్ గేమ్ వల్ల ఎక్కడో దగ్గర.. ఎవ్వరో ఒకళ్లు బలవుతూనే ఉన్నారు. ఇంకా ఎంత మంది ఈగేమ్ బాధితులు అవుతారో చూడాలి.

భిక్షాటన చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు..

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాష్ట్రమంతటా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి తోచిన పద్దతిలో వాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత.. పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో జోలె పట్టి భిక్షాటన చేసిన గాలి ఏకంగా రూ.15 వేలు సేకరించారు. ఈ నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ కు జమ చేస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలు కొత్త కోర్కెలు ఏమీ కోరడం లేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారన్నారు.

భారత బాలిక కిడ్నాప్.. కథ సుఖాంతం

  బహ్రెయిన్ లో  ఐదేళ్ల సారా అనే భారత బాలిక కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. వివరాల ప్రకారం.. సారాను కారులో ఉంచి తన తల్లి మంచినీళ్లు బాటిల్ తేవడానికి ఓ షాపుకు వెళ్లగా అక్కడ ఇద్దరు వ్యక్తులు కారుతో సహా కిడ్నాప్ చేశారు. దీంతో సారా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు 25 పహారా వాహనాలను పంపి ముమ్మరం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు జనరల్ డైరెక్టర్ కలోనియల్ ఖలీద్ ఆల్ థవాది మాట్లాడుతూ.. హూరా ప్రాంతంలో నిందితురాలి ఇంట్లో పాపను గుర్తించామని చెప్పారు. సారాకు ఎటువంటి ముప్పు తలపెట్టలేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని ఆమె మేనమామ అనిశ్ చార్లెస్ తెలిపాడు. హూరా పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి పాపను తమకు అప్పగించారని చెప్పారు. కాగా ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఈ కిడ్నాప్ లో పాప తండ్రి హస్తం ఉందని.. మేనమామ అనిశ్ ఛార్లెస్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పాప తండ్రి భారత్ లో ఉంటున్నాడని, మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారని, అయితే ఆయన కుట్రచేసే అవకాశం ఉందని అనిశ్ ఆరోపించాడు.

మహారాష్ట్ర వంతెన‌ ప్రమాదం: రంగంలోకి అయస్కాంతాలు

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సావిత్రి నది ఉప్పొంగి ఆ ప్రవాహంలో ముంబై-గోవా హైవేలో వంతెన కూలింది. ఆ సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న నాలుగు బస్సులు, రెండు కార్లు నది ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు నీటి అడుగున వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో గల్లైంతైన వాహనాలను గుర్తించేందుకు 300 కేజీల భారీ అయస్కాంతం సాయంతో గాలిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక సిబ్బంది ఒక మృతదేహన్ని గుర్తించారు. ప్రమాద స్థలికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ మృతదేహం లభ్యమైంది.    

బీజేపీపై "లెజెండ్" నిప్పులు

బీజేపీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చేరిగారు హిందూపురం శాసనసభ్యులు, హీరో నందమూరి బాలకృష్ణ. హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ..ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుంటే అందుకు జరిగే పర్యవసానాన్ని బీజేపీ అనుభవించి తీరుతుందని ఆయన హెచ్చరించారు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హోదాపై బెంచీల మీద గుద్ది మరి చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టింది. అప్పుడు అన్ని రకాలుగా హామీలిచ్చిన బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనాథ రాష్ట్రం..తిరిగి ఏపీని నిలబెడతామన్నారు అందుకు కట్టుబడి ఉండాలని మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాను కూడా. లేకుంటే పర్యవసానాలను అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు బాలయ్య.

గుజరాత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఈబీసీ బిల్లు చెల్లదు..

  గుజరాత్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మే 1న ఆనందీ బెన్ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని వ్యతిరేకించిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈబీసీలకు రిజర్వేషన్లను తప్పుబట్టింది.  ఈ ఆర్డినెన్స్ అమలైతే, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినట్లవుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం కన్నా దిగువనే రిజర్వేషన్లు ఉండాలని పిటిషన్ దారులు వాదనలు వినిపించారు. వీరి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈబీసీ బిల్లు చెల్లదని తేల్చిచెప్పేసింది.

ఏపీ ప్రత్యేక హోదా పై ఓటింగ్.. మళ్లీ అదే తంతు..

  ఏపీ ప్రత్యేక హోదాపై రేపు పార్లమెంట్లో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే అసలు రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా అన్న సందేహాలు మరింత అందరిలో రేగుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో తెలుగు ఎంపీలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై ఎన్నో అడ్డంకుల నేపథ్యంలో ఏదో నామ్ కే వాస్త్ చర్చ జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి జైట్లీ కూడా ప్రత్యేక హోదా రాదు అని పరోక్షంగా వెల్లడించారు. దీంతో ఏపీ రాష్ట్రమంతటా నిరసలు, ధర్నాలు మొదలు పెట్టారు. ఇక ప్రతిపక్ష, విపక్ష పార్టీలు కూడా కలిసి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మిత్రపక్షమైనప్పటికీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ అధిష్టానం కాస్త కొంచెం దిగొచ్చినట్టు కనిపించింది. ఇక వెంకయ్య నాయుడు కూడా మోడీని హెచ్చరించినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై మరోసారి చర్చను రేపు జరిపిస్తామని చెప్పారు.   అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. సాధారణంగా.. ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రతి రెండో శుక్రవారం నాడు సభలో ప్రవేశపెడతారన్న సంగతి తెలిసిందే. అయితే రేపు ఉత్తరాదిన 'తీజ్' పండగ. వ్యాపారులు తమ వ్యాపార వృద్ధి కోసం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మన దక్షిణాదిన తొలి శ్రావణ శుక్రవారం కూడా. పండుగ రోజు కాబట్టి కొంతమంది ఎంపీలు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే మళ్లీ రెండో శుక్రవారం వచ్చే లోపు పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోవచ్చు. దీంతో మళ్లీ వచ్చే శీతాకాల సమావేశాల వరకూ బిల్లు పెండింగ్ లో ఉన్నట్టే. అంటే రేపు సభ జరుగుతుందో లేదో అన్న విషయం స్పీకర్ కురియన్ పై ఆధారపడి ఉంది. ఒకవేళ స్పీకర్ కనుక సెలవు ప్రకటిస్తే మరోసారి ఏపీ ప్రజల చెవిలో కేంద్రం పువ్వు పెట్టినట్టే.. హోదా బిల్లుపై చర్చ, ఓటింగ్ జరుగుతుందని ఆశిస్తున్న ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్టే. ఏం జరుగుతుందో మరి చూడాలి.

రాజ్‌నాథ్ పర్యటనపై పాక్‌లో భగ్గుమన్న నిరసనలు

భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనపై పాకిస్థాన్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ వస్తున్నారని తెలిసినప్పటి నుంచి అక్కడి టెర్రర్ గ్రూపులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 26/11 పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయిద్ రాజ్‌నాథ్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు కశ్మీర్‌లో భారత ప్రభుత్వం అమాయక ప్రజలను చంపుతుంటే పాక్ ప్రభుత్వం భారత నేతలకు ఎలా పలుకుతారని ఆయన ప్రశ్నించారు. దీనిపై తాము నిరసన తెలుపుతామని హఫీజ్ హెచ్చరించారు. ఆయన చెప్పినట్లుగానే ఇవాళ నిరసనలు ఊపందుకున్నాయి. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ సహా పలువురు నిరాహార దీక్షలు చేపట్టారు. రోడ్లపై రాజ్‌నాథ్ దిష్టిబొమ్మలను ఆందోళనకారులు తగులబెట్టారు. దీంతో రాజ్‌నాథ్ పర్యటన సాగే మార్గాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసింది పాక్ ప్రభుత్వం.  

కేజ్రీవాల్ కు కోర్టులో చుక్కెదురు.. అధికారాలను తగ్గించలేం

  కేజ్రీవాల్ సర్కార్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారించిన కోర్టు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను తగ్గించలేమని శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. దేశం నలుమూలల నుంచి ఎందరో వీఐపీలు వచ్చి వెళుతుండే రాజధానిలో భద్రత కేంద్రం చేతుల్లో ఉంటేనే మంచిదని న్యాయమూర్తి తెలిపారు. కాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేజ్రీవాల్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.

కువైట్ లో భారతీయులకు ఉరిశిక్ష...

  లోక్ సభలో కువైట్లో ఉరిశిక్ష విధించబడిన భారతీయుల గురించి చర్చ జరిగింది. వైసీపీ పార్టీ సభ్యులు అవినాశ్ రెడ్డి, బుట్టా రేణుకలు కువైట్ జైళ్లలో మరణదండన విధించబడిన భారతీయుల సంఖ్యపై ప్రశ్నించగా దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్ సమాధానమిచ్చారు. కువైట్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయుల్లో వారు అత్యధికులు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారని.. మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. కాగా కువైట్ లో వివిధ రకాల నేరాలకు పాల్పడిన 13 మంది భారతీయులకి ఉరిశిక్ష పడింది. అంతేకాదు పులువురు పలు కేసుల్లో అక్కడి వివిధ జైళ్లలో మగ్గుతున్నారు.