భారత్‌కు మరో దెబ్బ..డోపింగ్ టెస్ట్‌లో దొరికిన ఇంద్రజిత్‌

నిన్న గాక మొన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి దొరికిపోయి, ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశ ప్రతిష్టను దెబ్బ తీశాడు. అది మరచిపోకముందే మరో క్రీడాకారుడు డోపింగ్ టెస్ట్‌లో అడ్డంగా దొరికిపోయాడు. షాట్‌పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ సైతం ఉత్ప్రేరకాలు వాడినట్లు వెల్లడైంది. గత నెల 22న నిర్వహించిన డోప్ పరీక్షల్లో ఆయన పట్టుబడ్డారు. ఆపై "బీ" శాంపిల్ పరీక్షల్లోనూ అదే ఫలితం వచ్చింది. రియోలో జరిగే షాట్‌పుట్ విభాగంలో ఇంద్రజిత్ పాల్గొనాల్సి ఉంది. డోపీగా పట్టుబడటంతో, ఆయన బ్రెజిల్‌లో అడుగుపెట్టే ఛాన్స్ మిస్సయ్యింది. రియో ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు ఒక్కొక్కరిగా డోప్ టెస్టుల్లో దొరికిపోవడం భారత క్రీడారంగంపై పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆసియా ఛాంపియన్‌షిప్, ఆసియా గ్రాండ్ ఫ్రీ, వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌లో ఇంద్రజిత్ గతేడాది స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

టీ సర్కార్ పై హైకోర్టు ఫైర్.. రెండు రోజులు ఆగలేకపోయారా..?

  తెలంగాణలోని ఆరు యూనివర్సిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వ తీరుపై మండిపడింది. తెలంగాణలో పలు యూనివర్శిటీ వీసీల నియామకంపై ఎప్పటి నుండో హైకోర్టులో విచారణ జరుగుతుంది. అది ఓ కొలిక్కి రాకముందే టీ సర్కార్ వీసీలను నియమించింది. దీంతో ఉపకులపతుల నియామకం జరపకుండా రేండేళ్లు ఆగిన ప్రభుత్వం మరో రెండు మూడు రోజులు ఆగలేకపోయిందా? అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. వీసీలను నియమించినంత మాత్రాన ఆ తరువాత ఏం చేయాలో తమకి తెలయదని అనుకోవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా టీ సర్కార్ నియమించి వీసీలు వీరే.. 1. జేఎన్టీయూకు ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి 2. ఉస్మానియా వర్సిటీ వీసీగా రామచంద్రం 3. వరంగల్ కాకతీయ వర్సిటీ వీసీగా సాయన్న 4. తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ 5. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సాంబయ్య 6. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు

పంచె కట్టి ఫుట్ బాల్ ఆడిన రాందేవ్ బాబా..

  యోగా గురువు రాందేవ్ బాబా ఫుట్ బాల్ ఆడారు. ఆయన ఫుట్ బాల్ మ్యాచ్ ఆడటం ఏంటనుకుంటున్నారా.. అది సీరియస్ గేమ్ కాదులెండి. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా ఆడారు. అసలు సంగతేంటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్చ భారత్, బేటీ బచావో-బేటీ పఢావో కార్యక్రమాలపై అవగాహన పెంచేందుకు గాను ఓ కార్యక్రమం నిర్విహించారు. బాలీవుడ్ తారలు, పార్లమెంటేరియన్లు కలిసి ఒక ఫుట్బాల్ మ్యాచ్ అడగా.. ఈ కార్యక్రమంలో రాం దేవ్ బాబా కూడా పాల్గొన్నారు. తాను కూడా పంచె పైకి కట్టి ఫుట్బాల్ ఆడారు. కాగా ఈ ఆటను చూడటానికి వచ్చిన సొమ్మును ఈ పథకాలకే విరాళంగా ఇచ్చారు.

ఒక్క పైసాకి 10 లక్షల బీమా..

  ప్రయాణికులకు ఎప్పుడూ ఏదో ఒక ప్రయోజనం కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకునే రైల్వేశాఖ..తాజాగా ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. కేవలం ఒక్క పైసాకే ప్రయాణీకులకు బీమా సదుపాయం కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఒక్క పైసాతో బీమా తీసుకుంటే.. రూ. 10 లక్షల వరకూ చెల్లిస్తారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. * రైలు ప్రమాదాల వల్ల మరణించిన లేదా శాశ్వత వైకల్యానికి గురైన సందర్భంలో రూ. 10 లక్షలను చెల్లిస్తారు. * పాక్షిక వైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలను అందజేస్తారు. * ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరిన వారికి రూ.5 లక్షల వరకు చెల్లిస్తారు. అయితే జనరల్ కేటగిరీలో ప్రయాణించే వారు మాత్రమే ఒక పైసా చెల్లించాల్సి ఉండగా, రిజర్వేషన్ చేయించుకునేవారు ఈ బీమా సదుపాయం కోసం ఐదు రూపాయలు చెల్లించాలి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బీమా పథకం అందుబాటులోకి వస్తుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

అందుకే బీజేపీని వదిలేశా..

  మాజీ బీజేపీ నేత, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తన ఎంపీకి పదవికి రాజీనామా చేసి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన ఆప్ పార్టీలో చేరేందుకే రాజీనామా చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు సిద్దూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేసిన అనంతరం.. తొలిసారి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తన సొంత రాష్ట్రమైన సొంత రాష్ట్రమైన పంజాబ్ కు తనను దూరం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగుసార్లు ప్రయత్నించిందని.. అది సహించలేకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. పంజాబ్ నా మాతృభూమి, నా సొంత రాష్ట్రాన్ని వదిలి ఉండలేనంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజల కంటే పార్టీలు.. పదవులు గొప్పవి కావు.. పార్టీ కంటే సొంత రాష్ట్రమే ముఖ్యం. పంజాబ్ కు మించిన పార్టీ లేదు అని అన్నారు.

అమెరికాలో కాల్పుల కలకలం..

ఒకపక్క ఇప్పటికే జర్మనీ ఉగ్రదాడులతో వణికిపోతుంటే.. ఇప్పుడు తాజాగా అగ్రరాజ్యమైన అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయిర్స్ నైట్ క్లబ్ లో ఓ దుండగుడు కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కాల్పుల గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు ముందు టెక్సాస్‌లోని బేస్ట్రోప్‌ నగరంలో కాల్పులు జరపడంతో నలుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా రెండు రోజుల వ్యవధిలో.. రెండు సార్లు కాల్పులు జరగడంతో అమెరికా వాసులు భయభ్రాంతులవుతున్నారు.

బాలికను ముద్దాడిన బీజేపీ ఎమ్మెల్సీ అరెస్ట్..

  ఈ మధ్య బీజేపీ నేతలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓ ఎమ్మెల్సీ ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆఖరికి అరెస్ట్ అయ్యాడు. వివరాల ప్రకారం.. బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ టున్నా జై పాండే పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ లో హౌరా నుంచి గోరఖ్ పూర్ వెళుతున్నారు. ఈ క్రమంలో అతను ప్రయాణిస్తున్న బోగీలో.. అతని బెర్త్ కు సమీపంలో ఓ 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. అయితే రాత్రి సమయంలో ఆయన ఆ బాలిక బెర్త్ దగ్గరకి వెళ్లి ఆమెను ముద్దుపెట్టుకొని.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన బాలిక రైలు చైను లాగి.. తన తల్లి దండ్రులను పిలచి జరిగింది చెప్పడంతో అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు.  కాగా ఎమ్మెల్సీ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, దిగే స్టేషన్ దగ్గరగా రావడంతో... మొబైల్ ఛార్జర్ ప్లగ్ తీయడానికే బాలిక బెర్తు దగ్గరికి వెళ్లానని చెబుతున్నాడు.

కృష్ణజింకల కేసులో సల్మాన్ ఖాన్ కు పెద్ద ఊరట..

  హిట్ అండ్ రన్ కేసులో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు మరో కేసులో ఊరట లభించింది. కృష్ణజింకలను వేటాడి చంపారన్న కేసులో సల్మాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సల్మాన్ ఎప్పటినుండో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఎట్టకేలకు దీన్ని విచారించిన రాజస్థాన్ సల్మాన్ ను నిర్ధోషిగా తేల్చుతూ తీర్పు నిచ్చింది. అయితే ఈ కేసుపై విచారణ మే నెల చివర్లోనే జరగ్గా.. తీర్పుని మాత్రం ఇప్పటివరకూ రిజర్వ్ లో పెట్టింది. ఈ రోజు అంతిమ తీర్పు నిచ్చింది.   కాగా 1998లో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణజింకలు, చింకారలని వేటాడి చంపినట్టుగా రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సల్మాన్‌కి మొత్తం 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

బిల్లుపై చర్చకు కాంగ్రెస్ పట్టు..

  ఏపీ ప్రత్యేక బిల్లుపై చర్చ నేపథ్యంలో రాజ్యసభలో అధికార, విపక్ష నేతల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ జరగాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనిపై ఆ పార్టీ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే బిల్లుపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుపడుతుందని.. హోదా బిల్లుపై వచ్చే శుక్రవారం చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనికి ఏపీకి చెందిన ఎంపీలు రేణుక చౌదరి, సీఎం రమేష్ లు కూడా మద్దతు పలికారు. దీనికి స్పీకర్ కురియన్.. నిబంధనల ప్రకారం ఆగష్ట్ 5 న చర్చ చేపడతామని.. బీఏసీలో నిర్ణయించినట్లుగా సభ సజావుగా సాగనీయాలని సభ్యులను కోరారు.  

భారత్ ను బెదిరిస్తున్న చైనా.. పక్కలో బల్లెంలా..

  భారత్ కు చైనా పక్కలో బల్లెంలా తయారైంది. ఇప్పటికే ఎన్ఎస్జీ సభ్యతం ఇవ్వడంలో భారత్ కు అభ్యంతంర వ్యక్తం చేస్తున్న చైనా.. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకే పాల్పడుతుంది. ఎందుకంటే చైనా వార్తాసంస్థ జిన్హుహాకు చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని భారత్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారి కదలికలపై నిఘా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో వారిని దేశం నుండి బరిష్కరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిపై స్పందించిన చైనా.. భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వానికి మద్దతు పలకలేదన్న కోపంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ముందు ముందు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. అంతేకాదు దీని ప్రభావం భారత జర్నలిస్టులపై కూడా పడుతుందని అంటున్నారు. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

విజయ కేతనం ఎగరేసిన భారత్.. 63 ఏళ్ల తరువాత..

  భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన సిరీస్లో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ రాజధాని ఆంటిగ్వా లో జరిగిన ఈ మ్యాచ్లో ముందు నుండి ముందంజలోనే ఉన్న భారత్ విజయకేతనం ఎగరేసింది. మొత్తం నాలుగు సిరీస్ లు జరగనుండగా.. మొదటి టెస్ట్ సిరీస్లో 8 వికెట్లకు 566 పరుగులు చేసి భారత్ విజయాన్ని అందుకుంది. కాగా తరువాత బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 243 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ కూడా కేవలం 231 పరుగులే చేసింది. దీంతో సొంతగడ్డపైనే ఘోర పరజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 63 ఏళ్ల తర్వత వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత్‌కు తొలిసారి ఇన్నింగ్స్‌ విజయాన్ని రుచి చూపింది.  

వరుస దాడులతో వణికిపోతున్న జర్మనీ..

  జర్మనీలో ఉగ్రవాదులు మరోసారి తమ పంజా విసిరారు. ఇప్పటికే వరుస దాడులతో బెంబేలెత్తి పోతున్న జర్మనీపై మరో ఉగ్రవాది విరుచుకుపడ్డాడు. ఓ బార్ లోకి ఉగ్రవాది చొచ్చుకొని వచ్చి దాడి చేసి ఆ తరువాత తనను తానే పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి.   కాగా పదిరోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు జర్మనీలోని పలుచోట్ల మూడు దాడులు జరిపారు. వారంరోజులక్రితం జర్మనీలోని ఓ ఉగ్రవాది  రైల్లో గొడ్డలితో దాడిచేసి ప్రయాణికులను గాయపరిచాడు. ఈ దాడి జరిగిన వారం రోజులకే.. జర్మనీలో ఓ ఉగ్రవాది షాపింగ్ మాల్ లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. తాజాగా ఈ ఘటన. దీంతో ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి జరుపుతారో తెలియక జర్మనీ వాసులు భయంతో వణికిపోతున్నారు..

కోదండరాం అరెస్ట్.. ఉద్రిక్త వాతావరణం

  తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం  ఎలాగైనా ప్రాజెక్టును నిర్మించి తీరుతాం అని తేల్చిచెబుతుంది. దీనిలోభాగంగానే నిన్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జీ చేశారు. ఇప్పుడు తాజాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా పోరాడుతున్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరిన కోదండరాంను పోలీసులు ఒంటిమామిడి వద్ద అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకి, జేఏసీ నేతలిక మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఏసీ నేతలు పోలీసులను అదుపు చేయగలిగినా పోలీసులు మాత్రం కోదండరాంను అరెస్ట్ చేశారు.   మరోవైపు కోదండరాం అరెస్ట్ కు నిరసనగా ధర్నా చేపట్టారు. కోదండరాం ను విడుదల చేయాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ఓయూకి పూర్వవైభవం ఖాయం-కేసీఆర్

ఉస్మానియా యూనివర్శిటీ స్థాపించి 100వ ఏడాదిలోకి అడుగుపెడుతుండటంతో శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉత్సవాల ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. అనుభవజ్ఞులు, వర్శిటీతో సంబంధం ఉన్నవారితో సలహా మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉస్మానియాలో చదివి వివిధ వృత్తుల్లో, విదేశాల్లో స్థిరపడిన వారిని ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తామని సీఎం ప్రకటించారు. త్వరలోనే వర్శిటీకి వీసీ నియామకం జరుగుతుందన్నారు.

యాత్రికులకు సహకరించండి..ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

వచ్చే నెల 12 నుంచి మొదలుకానున్న కృష్ణాపుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని స్వచ్ఛంద సంస్థలకు, విజయవాడ నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పుష్కర యాత్రికులకు సంపూర్ణ సహకారం అందించి ఆదరించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 10 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన పూర్తిగా శాకాహారాన్ని అందించే ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పుష్కరాలకు ప్రముఖులను ఆహ్వానించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ సమీక్షా కార్యక్రమలో కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు, పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్, ఇంటెలిజెన్స్ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అలర్ట్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఒడిషా నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడచిన రాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల చెదురుమదురు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో 10, చోడవరం 9, తాడేపల్లిగూడెం 7, విజయనగరం, బాపట్ల 6, నర్సీపట్నం, పోలవరం, గూడురు, ఎమ్మిగనూరు, మదనపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. తెలంగాణలోని కొల్లాపూర్, అశ్వారావుపేటలో 4 సెంటీమీటర్లు, చిన్నారావుపేటలో 3 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.