ఏపీ హోదాపై చంద్రబాబు ఫైర్.. ఇంక భరించేది లేదు..
posted on Jul 30, 2016 @ 11:51AM
ఏపీకి ప్రత్యేక హోదా రాదని గతంలో బీజేపీ నేతలు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. కానీ ప్రైవేటు బిల్లు.. దానిపై చర్చ అంటూ కాస్త హడావుడి ఎక్కువైంది అంతే. కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ కేవీపీ రామచంద్రారావు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రవేటు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై కూడా ఎప్పుడో జరగాల్సి చర్చ.. ఎన్నో అడ్డంకులు ఎదురై ఆఖరికి నిన్న జరిగింది. ఇక ఈ చర్చలో భాగంగా కేంద్రం అర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పకనే చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం అసలు చట్టలో లేదని.. కానీ గత ప్రధాని ఇచ్చిన హామి నేపథ్యంలో దాని గురించి ఆలోచిస్తున్నామని.. ఏపీకి అన్ని విధాలా సాయంగా ఉంటామని సన్నాయి నొక్కులు నొక్కారు. దీంతో కేంద్రం మళ్లీ ఏపీకి కుచ్చు టోపి వేసిందని అర్ధమైపోయింది.
ఇక ఇప్పుడు కేంద్రం చేసిన వ్యాఖ్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాల కోసం బీజేపీని ఇప్పటిదాకా అభ్యర్థించామని, ఇకపై ఆ పార్టీపై పోరుకు సిద్ధం కాక తప్పని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయమే బీజేపీ కూడా చేస్తోందని కూడా చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాదు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చిన నష్టాలను కూడా ప్రస్తావించారు ఆయన. గత ఎన్నికల్లో సింగల్ డిజిట్ కే పరిమితమైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నాయని.. అయినా అన్నీ ఓర్చుకున్నప్పటికీ కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా తమకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.