టీడీపీ ఆందోళనతో దిగొచ్చిన మోడీ..?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై అరుణ్‌జైట్లీ ప్రకటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ఇవాళ తెలుగుదేశానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దీంతో కేంద్రంలో కదలిక వచ్చింది..ప్రధాని మోడీతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చించారు. ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేయాలని వెంకయ్యకు ప్రధాని సూచించారు. అలాగే చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీకావాలని అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడును కోరారు.
ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేసిన తర్వాత ప్రకటన చేద్దామని వెంకయ్యతో ప్రధాని మోడీ చెప్పినట్లు సమాచారం. అంతకు ముందు ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన వెంకయ్య , తెలుగుదేశంతో దూరం పెరగడం మంచిది కాదని అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీ స్వయంగా ప్రత్యేకహోదా హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాలని వెంకయ్య, మోడీకి సూచించినట్లు తెలుస్తోంది.