లేని పోని చిక్కుల్లో రాహుల్ గాంధీ..

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ లేని పోని చిక్కుల్లో పడుతూనే ఉంటారు. ఏదో చేద్దామనుకుంటారు.. అది కాస్త ఇంకేదో అయి ఆఖరికి విమర్శలు పాలవుతుంటారు. ఇటీవలే పార్లమెంట్ సమావేశంలో నిద్రపోతూ కెమెరా కళ్లకి చిక్కి బుక్కయ్యారు. గుజరాత్ లోని దళితులపై జరిగిన దాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రతిపక్ష, విపక్ష నేతల వాదనలతో దద్దరిల్లిపోతుంటే.. రాహుల్ గాంధీకి జోల పాడినట్టు అనిపించిందేమో చక్కగా నిద్రలోకి జారుకున్నారు. ఇక రాహుల్ గాంధీ చేసిన ఈ పనికి కాంగ్రెస్ నేతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకొని కూర్చున్నారు. అయితే ఓ రెండు రోజులు దానిపై రాహుల్ గాంధీపై సెటైర్లు విసురుకున్నా ఆ తరువాత రాహుల్ గాంధీ ఆ దళిత కుటుంబాలను పరామర్శించి కాస్త కవర్ చేశారు.   అయితే ఇప్పుడు విచిత్రంగా ఆ విషయంలో కూడా రాహుల్ గాంధీ వివాదంలో ఇరుక్కున్నారు. గుజరాత్ దళితుల కుటుంబాలను పరామర్సించడానికి వెళ్లిన ఆయన వారి కుటుంబ సభ్యులను హత్తుకుని ఓదార్చారు. అందరితో పాటే అక్కడే ఉన్న రామాబెన్ ముచ్చాదియా (55) అనే మహిళను రాహుల్ ఆలింగనం చేసుకున్నారు. అంతే ఇప్పుడు ఇది పెద్ద వివాదమైంది. ఇంతకీ ఆమె ఎవరూ... ఆమెను ఆలింగనం చేసుకోవడం వల్ల వివాదం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఆమెపై ఆమెపై హ‌త్యాయ‌త్నం, దోపిడీ, బిల్డ‌ర్‌ కు బెదిరింపులు, ప్ర‌భుత్వ అధికారులను విధి నిర్వ‌హించ‌కుండా అడ్డుకోవడం వంటి పలు కేసులు ఉన్నాయి. పోయి పోయి రాహుల్ గాంధీ ఆమెను ఆలింగనం చేసుకున్నారు.   ఇక ఈ విషయం తెలిసిన బీజేపీ పార్టీ నేతలు ఊరుకుంటారా. ఎప్పుడు ఛాన్స్ దొరికితే.. అప్పుడు రాహుల్ గాంధీని విమర్శించడానికి రెడీగా ఉంటారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిద్ర పోయినప్పుడు కూడా నిప్పులు చెరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన బీజేపీ.. హంతుకురాలిని హత్తుకుని కౌగిలించుకుంటావా? అని విమర్శలు మొదలుపెట్టింది. ఇక దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీని కవర్ చేసే పనిలో పడ్డారు. ఆమె తప్పుడు పాస్ తో అక్కడికి వచ్చిందని, బాధితురాలిగా భావించి రాహుల్ ఆమెను ఓదార్చారని, ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయవద్దని అంటున్నారు. ఇక ఆమె కూడా స్పందించి.. సాటి ద‌ళితురాలిగా చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌ేందుకు వెళ్లాన‌ని తెలిపింది. బాధితులను చూసి క‌ంటనీరు పెట్టుకుంటున్న సమయంలో రాహుల్ ఓదార్చే ప్రయత్నం చేశారని ఆమె తెలిపింది. మరి బుక్కయిన తరువాత ఎంత కవర్ చేసినా ఏం లాభం.. ఇక ముందైనా రాహుల్ గాంధీ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

షార్‌లో రాకెట్ ప్రయోగం వాయిదా..ఏఎన్-32నే కారణం

ఆరు రోజుల క్రితం గల్లంతైన భారత వాయుసేన ఏఎన్-32 విమానం కోసం సైన్యం అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అయినప్పటికి విమానం జాడ మాత్రం తెలియరాలేదు. దీని ప్రభావం భారత అంతరిక్ష రంగంపై పడింది. ఇస్రో తయారు చేసిన అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ వాహక నౌకను నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించాల్సి ఉంది. అయితే ఈ ప్రయోగాన్ని ఇస్రో వాయిదా వేసినట్లు సమాచారం. ఆదృశ్యమైన విమానం కోసం పలు నౌకలు, విమానాలు, చాపర్లు బంగాళాఖాతంలో గాలిస్తున్నందున ఈ రాకెట్ ప్రయోగానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లభించలేదని సమాచారం. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేశామని, దీన్ని తిరిగి ఎప్పుడు ప్రయోగించేది త్వరలోనే నిర్ణయిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి.

అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న రవిచంద్రన్ అశ్విన్..

టీమిండియా-వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విరాట్ కోహ్లి డబల్ సెంచరీ చేసి అద్భుతమైన ఆటను కనబరచగా.. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్ తో చెలరేగిపోయి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐసీసీ టెస్ట్ బౌలర్ల విభాగంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీపీ ఆల్ రౌండర్ల విభాగంలోనూ అశ్విన్ టాప్ ప్లేస్ లో కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా టెస్ట్ బౌలర్ల విభాగంలోనూ అతను టాప్ ప్లేస్ నిలబడటం విశేషం.

ఈమెను చూసి స్పూర్తి పొందండి నేతలు..!

  సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు పలు సందర్భాల్లో దీక్షలు చేసే ఉంటారు. అయితే ఏదో సాయంత్రం మొదలు పెట్టేసి సాయంత్రానికి దీక్ష విరమించేవారు కొంత మంది ఉంటే.. ఆమరణ దీక్ష పేరుతో ఒకటి రెండు రోజులు.. మా అయితే ఓ పది రోజులు దీక్ష చేపట్టి.. ఆతరువాత ప్రభుత్వ పెద్దలు ఏవో మాటలు చెప్పి.. అవి జరగవని తెలిసినా.. వాటికి ఒప్పుకుంటూ దీక్ష విరమిస్తారు. అయితే ఇదంతా ఒక కేటగిరికి చెందిన నేతల సంగతి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారేళ్ల నుండి దీక్ష చేపడుతూ ఉక్క మహిళగా పేరు పొందారు ఇరోమ్ షర్మిల.   మణిపూర్ ఉక్కు మహిళ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఇరోమ్ షర్మిల. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలంటూ ఆమె 16 ఏళ్ల నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంఫాల్‌ విమానాశ్రయం సమీపంలోని ఓ బస్టాప్ వద్ద అసోం రైఫిల్స్‌ సైనికులు పదిమంది పౌరులను దారుణంగా ఊచకోత కోసింది. దీనికి నిసనగా ఆమె 2000 సంవత్సరం నవంబర్ రెండో తేదీన దీక్షను మొదలుపెట్టగా.. గత పద్నాలుగేళ్లుగా షర్మిల ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో ముక్కుకు వేలాడుతున్న ఫ్లూయిడ్స్ పైపుతో దీక్షలోనే ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఆమె ఇన్ని సంవత్సరాల నుండి దీక్ష చేస్తున్నా కానీ.. ఎంత మంది అధికారంలోకి వచ్చినా కానీ ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడం. దీంతో ఆమె కూడా దీక్ష విరమించాలని నిర్ణయింకుంది. వచ్చే నెల 9వ తేదీన ఆమె దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆమె ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు ఆమె రాజకీయ ఆరంగేట్రానికి మణిపూర్ యువత నుండి మంచి స్పందనే లభించింది. మరి ఏదో నామ్ కే వాస్త్ ఓ రెండు రోజులు దీక్ష చేసేసి.. ఏదో సాధించాం అనే నేతలు ఇరోమ్ షర్మిలను చూసి స్పూర్తి పొందాల్సిన అవసరం ఉంది.

ఫేమ్ కోసం తుపాకీతో కాల్చుకున్నాడు..

పిచ్చి పలురకాలు.. ఒక్కోసారి ఒక్కొక్కరి పిచ్చ ఒక్కోరకంగా బయటపడుతుంది. ఆ పిచ్చి కాస్త ముదిరితే ఇదిగో ఇలాగే ఉంటుంది. సోషల్ మీడియా సైట్లలో ఫేస్ బుక్ ఎప్పుడూ ముందుంటుంది. అంతేకాదు ఫెస్ బుక్ లో ఏదో ఒక వెరైటీ వీడియో పెట్టడం.. ఫేమస్ అయిపోవడం.. ఈమధ్య ఈ పిచ్చి అందరికీ ఎక్కువైంది. ఇప్పుడు లండన్ కు చెందిన కాస్పర్ నైట్ అనే యువకుడు కూడా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవాలని భావించి.. ఏం చేస్తే అవుతాం అని బాగా ఆలోచించి.. ఓ పని చేయాలని భావించాడు. ఇంతకీ ఏం చేశాడనుకుంటున్నారా.. తుపాకీతో తనను తాను కాల్చుకొని. అనుకున్నదే తడవుగా తుపాకీ తీసుకొని బయలుదేరాడు. తన బుగ్గను తానే కాల్చుకుంటానని.. వీడియో తీయాలని పలువురిని కోరాడు. అయితే అందరూ అతన్ని తిట్టడంతో.. లాభం లేదని తానే వీడియో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే తుపాకీతో తన బుగ్గను కాల్చుకుంటూ వీడియో తీసుకొని దానిని పోస్ట్ చేశాడు. ఇంకేంటి అతను అనుకున్నట్టే.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయి ఫుల్ ఫేమస్ అయిపోయాడు. కానీ ఫేమస్ అయితే అయ్యాడు కానీ.. పాపం ఆఖరికి ఫేస్ బుక్ అకౌంట్ నుండి సస్పండ్ అయ్యాడు.

దారుణం.. మూడేళ్ల పసి పిల్లాడిని జైల్లో పెట్టిన పోలీసులు

  తమిళనాడులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని మూడేళ్ల పసి పిల్లాడిని జైల్లో పెట్టారు పోలీసులు. వివరాల ప్రకారం.. తమిళనాడులోని మదురై సమీపంలో ఓ జాతర జరుగుతుండగా.. అక్కడికి ఓ కుటుంబం బొమ్మలు అమ్ముకోవడానికి వచ్చింది. అయితే ఈ జాతరలో మఫ్టీలో వచ్చిన పోలీసులు దొంగతనం చేశారంటూ సదరు బాలుడి తండ్రి, అత్తయ్య, మామయ్యలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వారితో పాటు ఆ పసి బాలుడిని కూడా తీసుకెళ్లారు. తల్లి మేరీ ఎంత చెబుతున్నా వినకుండా పోలీసులు బాలుడ్ని తీసుకెళ్లి.. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అయితే బాలుడి తల్లి తన కొడుకున అప్పగించాలని కోర్టును కోరినా.. న్యాయమూర్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా వారికి 35 రోజుల కస్టడీ విధించారు. దీంతో ఆమె మదురైలోని మద్రాస్ హైకోర్టు బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు.. తల్లి సంరక్షణ లేకుండా బాలుణ్ని జైలుకు ఎందుకు పంపారంటూ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలుణ్ని అరెస్టు చేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బాలుడికి రిమాండ్ విధించిన జడ్జి నుంచి వివరణ కోరింది. మరి పెద్ద పెద్ద నేరాలు, దొంగతనాలు, హత్యలు చేసిన వాళ్లని అంత తొందరగా పట్టుకొని, శిక్షించ విధించలేని పోలీసులకు మూడేళ్ల బాలుడు దొరికినట్టున్నాడు కస్టడీ విధించడానికి..

నా మౌనం వల్లే కాంగ్రెస్ రెచ్చిపోతుంది.. మళ్లీ లేచిన స్వామి..

  బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది వివాదాస్పద వ్యాఖ్యలు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయమంటే ఎప్పుడూ ముందుంటారు. ఏదో ఒక విషయంపై కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేస్తుంటారు. ఒక ఇష్యూ అయిపోయిందంటే.. మరో ఇష్యూని రెడీగా చేసుకొని.. కాంగ్రెస్ పై తన మాటల తూటాలు పేల్చుతుంటారు. అయితే కొన్ని రోజుల నుండి స్వామిగారు ఎందుకో తన నోటికి పని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదనుకోండి.   కొద్ది రోజుల క్రితం స్వామి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలపై తను ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు గుప్పించారు. అయితే ముందు అందరూ సైలెంట్ గా ఉన్నా ఆతరువాత మాత్రం అందరూ విమర్శలు గుప్పించారు. ఇక ప్రధాని మోడీ కూడా స్వామి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ అధిష్టానం కూడా చివాట్లు పెట్టింది. దీంతో ఆయన కొన్ని రోజుల నుండి సైలెంట్ గా ఉన్నారు. అయితే మాట్లాడని వాళ్లని సైలెంట్ గా ఉండటం కష్టం కాదు కానీ.. కాస్త నోరు ఎక్కువున్న స్వామి లాంటి వాళ్ల నోటిని కట్టడి చేయడం కొంచం కష్టమైన పని.   ఇప్పుడు ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ ను విమర్శించారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రత్యేక హోదాపైనా.. గుజరాత్ దళితులపై దాడుల గురించి చర్చ జరగాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ కావాలనే చర్చ జరగకుండా అడ్డుపడుతోందని.. చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇక వీటన్నింటిని చూసి స్వామి ఊరుకుంటాడా.. తన మౌనం వల్లనే రాజ్యసభలో కాంగ్రెస్ రెచ్చిపోతోందని అన్నారు. "రాజ్యసభలో నేను నోరెత్తకుండా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇది యాదృశ్చికమా?" అని ప్రశ్నించారు. మరి నిజంగా స్వామి అన్నట్టు.. ఈయన సైలెంట్ గా ఉన్నందుకే కాంగ్రెస్ రెచ్చిపోతుందా.. చూద్దాం.. మరి ఆయన ఎన్నిరోజులు సైలెంట్ గా ఉంటారో..  

ఫ్రాన్స్‌పై మరోసారి ఉగ్రపంజా..భగ్నం చేసిన పోలీసులు

ఉగ్రవాద దాడులతో ఫ్రాన్స్ వణికిపోతోంది. బ్యాస్టిల్ డే సెలబ్రేషన్స్‌ను లక్ష్యం గా చేసుకుని నీస్ నగరంలో జరిగిన మారణకాండను మరచిపోకముందే మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇద్దరు సాయుధులైన దుండగులు ఉత్తర ఫ్రాన్స్‌లోని నార్మాండిలోని ఒక చర్చిలోకి చొరబడి అక్కడి వారిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు చర్చి ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న వారిలో ఒక ఫాదర్, ఇద్దరు నన్స్ మరో ఇద్దరు భక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది.  

జల్లికట్టు పై సుప్రీం నో..

తమిళనాడు  రాష్ట్రంలోని సాంప్రదాయక క్రీడ ‘జల్లికట్టు’పై గతంలో యూపీఏ ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ నిషేదాన్ని కాస్త ఎత్తివేసింది. కానీ ఎన్డీఏ తీసుకున్న నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అప్పటి నుండి దీనిపై విచారణ జరుగుతూనే ఉంది. అయితే ‘జల్లికట్టు’ నిషేధంపై స్టే విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నిషేధం ఎత్తివేతకు ‘నో’ చెప్పింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

తమిళనాడు అసెంబ్లీ.. పేరు కోసం రచ్చ..

తమిళనాడు అసెంబ్లీలో ఓ విషయంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సాధారణంగా అసెంబ్లీలో ఏ రాజకీయ పరమైన అంశమో లేక.. ఏదైనా కుంభ కోణానికి సంబంధించిన విషయం గురించో చర్చ జరుగుతుంది. ఇక ఇప్పుడు బడ్జెట్ గురించిన సమావేశాలు కాబట్టి దాని గురించి చర్చ జరుగుతుంది అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అవి కాకుండా ఇంకా ఏ విషయంపై చర్చ జరిగిందబ్బా అనుకుంటున్నారా..? అదేంటంటే.. సీఎంను ఎలా పిలవాలి అనే అంశంపై. దీనిపై సభలో పెద్ద దూమారమే రేగింది. సీఎం జయలలితను పేరు పెట్టి పిలవవద్దని.. మాజీ సీఎం అయితే ఓకే.. పిలవచ్చు అని స్పీకర్ తేల్చి చెప్పారు.   ఇంతకీ అసలు సంగతేంటంటే.. చర్చలో భాగంగా అన్నాడీఎంకే నేత నరసింహన్ మాట్లాడుతూ కరుణానిధి అని సంబోధించాడు. అంతే దీనిపై డీఎంకేనేతలు ఒక్కసారిగా లేచి ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పెద్దాయనను ఇలా పేరు పెట్టి పిలవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలుస్తామని.. మీరు చూస్తూ ఉండగలరా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో స్పీకర్ కల్పించుకొని శాసనసభ్యుడి పేరును గౌరవ సూచకంగా సంబోధించవచ్చు కానీ ముఖ్యమంత్రిని అలా పిలవకూడదని, ఇది తన ఆదేశమని అన్నారు. దీనికి డీఎంకే నేతలు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. సభ నుండి వాకౌట్ చేశారు. మొత్తానికి పేరులో ఏముంది అని అనుకుంటాం కానీ.. ఆ పేరులోనే అంతా ఉందన్న విషయం దీనిద్వారా అర్ధమైంది.

ప్రధాని మోడీ డ్రైవర్ ఆత్మహత్య..

భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాన్వాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సోమశేఖర్ న్యూఢిల్లీలోని తన క్వార్టర్స్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా కొర్లమిట్లకు చెందిన సోమశేఖర్ 1999లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరి తన ప్రతిభతో ప్రమోషన్లు తెచ్చుకుని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌లో పనిచేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ కాన్వాయ్‌లో పనిచేస్తున్నారు. సోమశేఖర్ ఉరేసుకుని ఉండటాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయన మృతదేహన్ని చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు. సోమశేఖర్ గతంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలకు బాడీగార్డుగా పనిచేశారు. ఆయన మరణవార్తతో కొర్లమిట్టలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అదృశ్యమైన విమానం కోసం ఆపరేషన్ 'తలాష్'..

  తమిళనాడులో భారత వాయుసేన విమానం అదృశ్యమై ఇప్పటికి దాదాపు ఐదురోజులైపోయింది. అయినా ఈ విమానం గురించి  ఇంకా ఎలాంటి సమాచారం లభించలేదు. ఒకపక్క నేవి దళాలు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్న ఎలాంటి ఆచూకీ దొరకడంలేదు. తమిళనాడు నుండి పోర్ట్ బ్లెయిర్ కు వెళుతున్న విమానం కొంత సేపటికి గల్లంతవ్వగా.. అది బంగాళఖాతంలో పడిపోయిందా అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ ను మరింతగా విస్తరించిన అధికారులు, బంగాళాఖాతంలోని మరింత ప్రాంతాన్ని జల్లెడ పట్టాలని నిర్ణయించి, సెర్చ్ ఆపరేషన్ కు 'తలాష్' అని పేరు పెట్టారు. ఐదో రోజు సెర్చ్ లో 17 నౌకలు, 23 విమానాలు, ఓ సబ్ మెరైన్ పాల్గొంటుండగా, సుమారు 14 వేల నాటికల్ మైళ్ల గాలింపు పరిధి విస్తీర్ణాన్ని కలిగివున్న ఆత్యాధునిక 'సాగరనిధి' స్పెషల్ షిప్ రంగంలోకి దించాలని నిర్ణయించారు.

నా వేలు పట్టుకొని నడిపించారు. ప్రణబ్ పై మోడీ

  ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్ రెండో ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీకి నేను వచ్చినప్పుడు అంతా కొత్తగా ఉండేదని.. ఆ సమయంలో రాష్ట్రపతి నా వేలు పట్టుకుని నడిపించారు అని అన్నారు. నాకు చాలా విషయాల్లో అవగాహన ఉండేది కాదు.. ఆయన వల్లే చాలా విషయాలు తెలిశాయి.. పలు అంశాల్లో సలహాలు ఇచ్చేవారు.. ఆయన  నాకు చాలా దగ్గరి సంబంధాలున్నాయి అని అన్నారు.   కాగా ప్రదర్శనశాలలో మాజీ రాష్ట్రపతులకు సంబంధించిన రెండు వేల కళాకృతులు, వస్తువులు, పుస్తకాలను ఉంచారు. ప్రదర్శన శాలను తిలకించేందుకు అక్టోబర్ 2 నుంచి సందర్శకులను అనుమతిస్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ లో ఉగ్రపంజా.. తొమ్మిది మంది హతం..

ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక రకంగా దాడి జరిపి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు బంగ్లాదేశ్ లో కూడా ఉగ్రదాడికి పాల్పడ్డారు. గత నెలలో ఓ కేఫ్ పై దాడి జరిపి 22 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఇంకా ఢాకా ప్రజలు ఆ ఘటన నుండి తేరుకోకముందే ఇప్పుడు మరోసారి ఉగ్రదాడి జరిపారు. ఢాకాలోని ఓ భవనంలోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని.. ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ కాల్పుల్లో పోలీసులు తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చారు. మరికొందరిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుండి భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. అయితే వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో ఇంకా తెలయలేదని పోలీసులు వెల్లడించారు.