నిర్మాత కేఎస్ రామారావును అరెస్ట్ చేయొద్దు-హైకోర్టు

ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు కేఎస్ రామారావుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24న ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌నగర్ కన్వెన్షన్ సెంటర్‌లో పోర్టికో కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గంపై క్రిమినల్ కేసులు నమోదుచేసి నోటీసులు జారీ చేశారు. దీంతో కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న కేఎస్ రామారావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రామారావును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. క్రిమిలన్ ప్రోసీజర్ కోడ్‌లోని సెక్షన్ 41 నిబంధన పాటించి ఆయన వద్ద వివరణ తీసుకోవాలని సూచించింది. 

శాతవాహనులను తెలుగువారన్న పరబ్రహ్మ శాస్త్రి ఇకలేరు

ఉత్తరాది రాజులుగా పరిగణింపబడుతున్న శాతవాహనులను తెలుగువారిగా నిరూపించే శాసనాలను వెలికితీసిన ప్రఖ్యాత చరిత్రకారులు డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి కన్నుమూశారు. బ్రెయిన్ హేమరేజ్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. పీవీ పరబ్రహ్మ శాస్త్రి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు 1921 జూన్‌లో జన్మించారు.   బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో డిగ్రీ పొందిన ఆయన 1959లో డిపార్ట్‌మెంట్ ఆప్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంలో ఎపిగ్రఫీ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరారు. తెలుగునాట ఎన్నో శాసనాలను వెలికి తీసి, మరుగున పడుతున్న చరిత్రను వెలుగులోకి తెచ్చారు. కాకతీయుల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, ఎన్నో శాసనాల సారాంశాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో 25 సంవత్సరాలపాటు సేవలందించిన శాస్త్రిగారు 2 వేలకు పైగా శాసనాలను పరిష్కరించారు. ఆయన చేసిన సేవలకు గానూ కర్నాటక విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించింది. ఆయన మరణం పట్ల ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు సంతాపం ప్రకటించారు.

సల్మాన్ జింకలను చంపడం నేను చూశా-డ్రైవర్

కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు క్లీన్‌చీట్ ఇచ్చింది. ఈ కేసు ఇక్కడితో ముగిసిపోయిందని అందరితో పాటు సల్మాన్‌ భావిస్తున్న తరుణంలో అప్పుడు సల్మాన్‌ఖాన్ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి బాంబు పేల్చాడు. సల్మానే జింకను కాల్చి చంపారని జిప్సీ డ్రైవర్ హరీశ్ దులానీ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ కోసం సల్మాన్‌తో పాటు మరికొందరు బాలీవుడ్ తారలు జోథ్‌పూర్ వచ్చారని..అక్కడి అభయారణ్యాన్ని చూసేందుకు సల్మాన్‌ ఆసక్తి చూపారని ఆ సమయంలో తాను స్వయంగా జిప్పీలో అడవిని చూపించానన్నాడు. ఈ క్రమంలో జిప్సీ నుంచి దిగిన సల్మాన్ తుపాకీతో కృష్ణ జింకను కాల్చి చంపారని అతను వెల్లడించాడు. దీనిపై 18 ఏళ్ల క్రితం మెజిస్ట్రేట్ ముందు ఏదైతే చెప్పానో..ఇప్పుడూ నేను దానికే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. తనకు ప్రాణహానీ ఉందని అందుకే ఇన్నాళ్లు భయంతో జీవించానని, అంతే తప్ప ఎక్కడా తప్పిపోలేదని హరీశ్ అన్నాడు.

కేసీఆర్‌కు హైకోర్టు షాక్.. వీసీల నియామకం రద్దు..

తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు 9 మంది వైస్ ఛాన్స్‌లర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవోను హైకోర్టు కొట్టివేసింది. అర్హతల ఆధారంగా నియామకాలు జరపాలని సీజే ధర్మాసనం ఇవాళ తీర్పు చెప్పింది. నియామకానికి సంబంధించి అర్హతలు, నిబంధనలు ఉద్దేశిస్తూ జారీ చేసిన జీవోను కూడా నిలిపివేసింది. ఎంపీ, ఎమ్మెల్యే, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి వైస్-ఛాన్సలర్లుగా అవకాశం కల్పించేలా ప్రస్తుత జీవో ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు తీర్పు అమలను నాలుగు వారాల పాటు రిజర్వ్‌లో పెట్టింది.

పాక్‌‌లో అడుగుపెట్టనున్న రాజనాథ్‌..ఇక వార్నింగ్‌లేనా..?

భారత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆగస్ట్ 3న పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ అంతర్గత, హోంమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశాల అనంతరం పాక్ ప్రభుత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్‌కు వెళ్లివచ్చిన రెండు రోజులకే ఉగ్రవాదులు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడ్డారు. అటు తర్వాత సరిహద్దుల్లో కాల్పులు, బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్, కశ్మీర్ అల్లర్లకు పాకిస్థాన్ సపోర్ట్ ఇలా ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో రాజ్‌నాథ్ పాక్ గడ్డపై అడుగుపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఊళ్లోకి వచ్చిన చిరుత..పొలాల్లోకి జనం పరుగులు..

అడవిలో తిరగాల్సిన చిరుత..ఊళ్లోకి వస్తే ఎలా ఉంటుంది. ఇంకేమైనా ఉందా జనం గుండెలు ఆగిపోవు. అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామ ప్రజలకు. ఖజూరి పాండ్యా అనే గ్రామంలోకి ఉన్నట్లుండి ఒక చిరుత ప్రవేశించింది. చిరుతను చూసిన ఒక గ్రామస్తుడు ఈ విషయం మిగిలిన వారికి చెప్పేలోపే కొంతమందిపై అది దాడి చేసింది. చిరుత దాడిలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. చిరుతను చంపేందుకు జనం చేతికి దొరికినదాంతో దాని వెనుక బడ్డారు. కానీ అది వీధుల్లో పరిగెత్తి జనాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించింది. నాలుగు గంటల పాటు ముచ్చెమటలు పట్టించిన చిరుత చివరకు అడవిలోకి పారిపోయింది.

అసోంలో వరద విలయం..12 మంది మృతి

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అసోంలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదస్థాయిని మించి పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకూ 12 మంది మరణించడంతో పాటు సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. వరద బీభత్సం కారణంగా అసోం అసెంబ్లీ సమావేశాలను ఆగస్టు 8 వరకూ వాయిదా వేశారు. ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి సర్చానంద సోనోవాల్ ఆదేశించారు.

మిస్సైల్ మ్యాన్‌కు ఆటోవాలా నివాళులు..

శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు నిరుపమానమైనవి. కలలు కనండి వాటిని నిజం చేసుకోండి అని చెప్పి యువతలో స్పూర్తి నింపిన మార్గదర్శి కలాం. ఆయన మన నుంచి దూరమై అప్పుడే ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న దేశం మొత్తం కలాంకు నివాళులు ఆర్పించింది. అయితే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు, చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్. తేనాంపేటకు చెందిన కలయరసన్‌ కలాం వర్థంతి సందర్భంగా ప్రయాణికులకు ఉచిత సేవలందించాడు. నిన్న ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు అడయార్, కోడంబాక్కం, కెకె.నగర్ తదితర ప్రాంతాల్లో ఉచితంగా విద్యార్థులను, మహిళలను గమ్యస్థానాలకు చేర్చడం లాంటివి చేసి ఇదే తాను ఆ మహనీయునికి ఇచ్చే నివాళిగా పేర్కొన్నాడు.

ఇద్దరు భారతీయులకు రామన్ మెగసెసె అవార్డులు..

2016వ సంవత్సరానికి గానూ రామన్ మెగసెసె అవార్డులను ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఇద్దరు భారతీయులకు ఈ అవార్డు దక్కింది. కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణ, మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనపై అవిశ్రాంతంగా పోరాడుతున్న బెజవాడ విల్సన్‌ను మెగసెసె వరించింది.  చెన్నై బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన కృష్ణ ఆరేళ్ల వయసు నుంచే సంగీతంపై ఆసక్తితో, కృష్ణ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల వద్ద విద్యనభ్యసించాడు. జిడ్డు కృష్ణమూర్తి కాలేజీలో చదివిన టీఎం కృష్ణ..ఆయన ఆలోచనలతోనే సమాజంలోని జాడ్యాలను తొలగించేందుకు నడుంబిగించారు. సామాజిక అంతరాలను తొలగించేందుకు సంగీతం కీలకమైన సాధనమని గుర్తించి..ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఈయన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి మనవడు. కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లో పుట్టారు బెజవాడ విల్సన్. సమాజంలో దళితులకు ఎదురవుతున్న సమస్యలపై పోరాటం చేస్తున్న విల్సన్. చేతులతో మరుగుదొడ్లను శుభ్రం చేయడం, ఈ వ్యర్థాలను తలపై ఎత్తుకుని దూర ప్రాంతాల్లో వేసి రావటంను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. వీరితో పాటుగా కొంచిత కార్పియో, డోంపెట్ ధువాఫా, జపాన్ ఓవర్సీస్ అండ్ కో-ఆపరేషన్ వలంటీర్స్, వీన్‌తియేన్ రెస్క్యూ బృందానికి ఈ ఏడాది మెగసెసె అవార్డులు దక్కాయి.

రాజకీయ నేతల ఘనకార్యాలు ఇవే..

  ఏమైందో ఏమో తెలియదు కాని ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలు వరసపెట్టి ఒకరి తరువాత ఒకరు అడ్డంగా బుక్కవుతున్నారు. ఆవేశంగా అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం.. ఆఖరికి అందరూ చివాట్లు పెడుతుంటే క్షమాపణలు చెప్పడం. గత కొద్ది రోజులుగా ఇదే సరిపోతుంది. ఎవరెవరు ఎంత బాగా బుక్కయ్యారో ఓ లుక్కేద్దాం.. దయాకర్ సింగ్     బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న దయాశంకర్ సింగ్ బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) అధినేత్రి మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమెను ఒక వేశ్యతో పోల్చుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  'డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. ఇక దీనిపై రేగిన దుమారం అంతా ఇంతా కాదు. ఆఖరికి దయాశంకర్ సింగ్ క్షమాపణలు చెప్పినా.. పదవి నుండి సస్పెండ్ చేసినా బీఎస్పీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆయన దిష్టి దొమ్మలు తగలపెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త నెమ్మదిస్తుంది.  టున్నా జై పాండే     బీజేపీ ఎమ్మెల్సీ టున్నా జై పాండే.. ఈయన గారు కూడా ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ టున్నా జై పాండే పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ లో హౌరా నుంచి గోరఖ్ పూర్ వెళుతున్నారు. ఈ క్రమంలో అతను ప్రయాణిస్తున్న బోగీలో.. అతని బెర్త్ కు సమీపంలో ఓ 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. అయితే రాత్రి సమయంలో ఆయన ఆ బాలిక బెర్త్ దగ్గరకి వెళ్లి ఆమెను ముద్దుపెట్టుకొని.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన బాలిక రైలు చైను లాగి.. తన తల్లి దండ్రులను పిలచి జరిగింది చెప్పడంతో అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు.  కాగా ఎమ్మెల్సీ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, దిగే స్టేషన్ దగ్గరగా రావడంతో... మొబైల్ ఛార్జర్ ప్లగ్ తీయడానికే బాలిక బెర్తు దగ్గరికి వెళ్లానని చెప్పుకొచ్చారు.  శ్యాం బహదూర్ సింగ్     జేడీయూ ఎమ్మెల్యే శ్యాం బహదూర్ సింగ్ డ్యాన్సింగ్ గర్స్త్ తో డ్యాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. అది కూడా అభ్యంతరకరమైన పరిస్థితుల్లో. అయితే ఈ ఘటన గత ఏడాది చోటుచేసుకోగా.. గత కొద్ది రోజుల క్రిందట ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా తిరునాళ్లలో, జాతరల్లో నిర్వహించే అభ్యంతరకర నృత్యాలు దాదాపుగా బ్యాన్ అయిన విషయం తెలిసిందే. అలాంటిది వాటిని ఖండించాల్సిన నేతనే ఇలాంటి పనలు చేస్తున్నారంటూ అందరూ తిట్టి పోశారు. భగవత్ మాన్‌సింగ్     ఆప్ ఎంపీ భగవత్ మాన్‌సింగ్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఈయన ఏకంగా పార్లమెంట్ భద్రత సిస్టమ్ నే షూట్ చేశారు. చేస్తే చేశారు.. అక్కడితో ఆగకుండా ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇక ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఆని ఎదురుచూసే విపక్షాలు ఊరుకుంటాయా.. ఆయన చేసిన పనిపై మండిపడుతున్నారు. ప్రజాసామ్యానికి టెంపుల్ లాంటి పార్లమెంట్ భద్రతపై స్టింగ్ ఆపరేషన్ చేయడమేంటని.. పార్లమెంట్ భద్రత వ్యవహారాన్ని వీడియోలు తీయడం దారుణమని.. ఇది భద్రత నియమాలను ఉల్లంఘించడమే కాదు, సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బుక్కయిన తరువాత అందరూ చెప్పినట్టే క్షమాపణలు చెప్పాడు. బహదూర్ సింగ్ కోలీ     ఇప్పుడు తాజాగా మరో బీజేపీ ఎంపీ వివాదంలో చిక్కుకున్నారు. తన వాహనాన్ని అడ్డుకున్నందుకు టోల్ గేట్ ఉద్యోగిని.. ఎంపీ అనుచరులు చితకొట్టారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ బీజేపీ ఎంపీ బహదూర్ సింగ్ కోలీ తన నియోజక వర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో భరత్ పూర్ లోని టోల్ గేట్ వద్ద రుసుం చెల్లించకుండా ఆయన వాహనం వెళుతుండగా, అక్కడి ఉద్యోగి ఆ వాహనాన్ని ఆపాడు. దీంతో సదరు ఎంపీ గారి అనుచరులు రెచ్చిపోయి ఉద్యోగిని కొట్టారు. అయితే అది కాస్త సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డయింది. దీంతో ఆ వీడియో బయటకు రావడంతో ఎంపీ గారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిని ఎంపీ గారు ఏ విధంగా కవర్ చేసుకుంటారో చూద్దాం.. మొత్తానికి పలు పార్టీలకు చెందిన పలు నేతలు ఆవేశంగా తమకు ఇష్టమొచ్చినట్టు వ్యవహిరించి తమకే కాదు.. తమ పార్టీలకు కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. మరి ఇంకా ఎంతమంది బుక్కవుతారో.. ఎంత మంది అధికార దుర్వినియోగానికి పాల్పడతారో చూద్దాం..

భారత్ భూభాగంలో చైనా బలగాలు నిజమే..

  భారత్ కు చైనా రోజు రోజుకి పెద్ద తలనొప్పిలా తయారవుతోంది. పక్కనే ఉంటూ.. మీకు సహకరిస్తాం అంటూ చెబుతూనే చేసే పనులన్నీ చాలా సైలెంట్ గా చేసేస్తుంది. తాజాగా మరో ఘటన బయటపడింది. భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయి. ఈ విషయాన్ని ఉత్రరాఖండ్ సీఎం హరీశ్ రావత్ స్వయంగా చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాలు చొరబడిన విషయం నిజమేనని.. చైనా బలగాలు మన భూభాగంలోకి వచ్చినప్పటికీ అక్కడ కీలకమైన కాలువ దగ్గరికి వెళ్లలేదని, ఇది భారత్‌కు సంబంధించినంతవరకు మంచి విషయమని సీఎం రావత్ చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు. కాగా గతంలోనూ చైనా పలుమార్లు ఉత్తరాఖండ్‌లోకి చొరబడి.. 'చైనా' అనే బోర్డులు పెట్టింది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించి ఎంత త్వరగా చర్యలు చేపడితే అంత మంచిది. లేకపోతే మన భూభాగంలోకి వచ్చి.. మాదే అని చెప్పే సత్తా చైనాకు ఉంది మరి.

టోల్ గేట్ ఉద్యోగిపై ఎంపీ గారి దౌర్జన్యం..

రోజు రోజుకి బీజేపీ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓ బీజేపీ ఎంపీ గారి దౌర్జన్యం బయటపడింది. తన వాహనాన్ని అడ్డుకున్నందుకు టోల్ గేట్ ఉద్యోగిని ఎంపీ అనుచరులు చితకొట్టారు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్ లోని భరత్ పూర్ బీజేపీ ఎంపీ బహదూర్ సింగ్ కోలీ తన నియోజక వర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో భరత్ పూర్ లోని టోల్ గేట్ వద్ద రుసుం చెల్లించకుండా ఆయన వాహనం వెళుతుండగా, అక్కడి ఉద్యోగి ఆ వాహనాన్ని ఆపాడు. దీంతో సదరు ఎంపీ గారి అనుచరులు రెచ్చిపోయి ఉద్యోగిని కొట్టారు. అయితే అది కాస్త సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డయింది. దీంతో ఆ వీడియో బయటకు రావడంతో ఎంపీ గారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిని ఎంపీ గారు ఏ విధంగా కవర్ చేసుకుంటారో చూద్దాం..

మళ్లీ తెరపైకి గో మాంసం వివాదం.. మహిళలను చితక్కొట్టారు..

  గో మాంసంపై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో గో మాంసంపై దేశంలో పెద్ద దుమారమే రేగగా.. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారంపై వివాదం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గో మాంసం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఇద్దరు దళిత మహిళలను చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లో మన్ సౌ రైల్వే స్టేషన్ లో ఇద్దరు మహిళలు గో మాంసం విక్రయిస్తున్నారని చెప్పి హిందూదళ కార్యకర్తలు దాడి చేశారు. వారిని చితక్కొట్టారు. అయితే పక్కన పోలీసులు ఉన్న వారిని ఆపకుండా ఏదో సినిమా చూస్తున్నట్టు చూడటం గమనార్హం. చివరికి కార్యకర్తలను అదుపుచేసి వారిద్దరిని అరెస్ట్ చేశారు.

అందుకే టీడీపీలో చేరా..

  ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి.. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి పలువురు నేతలు జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తాను ఎందుకు టీడీపీలో చేరారో చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. వైసీపీలో పనిచేసే వారికి గుర్తింపు ఉండదని.. వైఎస్సార్సీపీలో ఉండగా తాను మనోవేదన అనుభవించానని.. మనోవేదన భరించలేకే వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరానని చెప్పారు. రాజమండ్రిలోని వైఎస్సార్సీపీ నేతలకు తనను విమర్శించే అర్హత లేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుతోనే నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్నారు.  

100 మంది ముస్లిం యువకులు అదృశ్యం... ఉగ్రవాదం వైపా..!

  ఈ మధ్య కాలంలో ముస్లిం యువకులు అదృశ్యమై వారు ఉగ్రవాద సంస్ధలో చేరుతున్నట్టు వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవలే కేరళలో పలువురు ముస్లిం యువకులు అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో మరాట్వాడాకు చెందిన ముస్లిం యువకులు అదృశ్యమయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మందికి పైగా ముస్లిం యువకులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. అయితే వీరంతా ఉగ్రవాద సంస్థలో చేరి ఉంటారని భావిస్తున్నారు.   ఇంక దీనిపై  శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ ఐఎస్ఐఎస్ కు మద్దతు ఇస్తోందని అన్నారు. అంతేకాదు పలువురి మనసులు బలవంతంగా ఉగ్రవాదం వైపు ప్రభావితం అయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు.

దళిత మహిలపై దాడి.. రాజ్యసభలో దుమారం..

  ఇప్పటికే గుజరాత్ లో యువకులపై దాడి చేసినందుకు చర్య చేపట్టాలని రాజ్యసభలో పెద్ద దుమారమే రేగుతుంది. విపక్ష పార్టీలన్నీ ఈ దాడి గురించి సభలో చర్చ జరగాలని.. సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల వాగ్వాదాలతో సభ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు దానికి తోడు మరో దాడి జరిగింది.మధ్యప్రదేశ్లో బీఫ్ విక్రయిస్తున్నారని చెప్పి ఇద్దరు దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే వారిని పిచ్చి కొట్టుడు కొట్టారు. గో మాతాకీ జై' అంటూ వారిని కిందపడేసి కొట్టారు. చెంపలు వాయించారు. పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఇప్పుడు ఈ ఘటన అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టయింది. ఈ ఘటనను సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ఎంత మాత్రం చర్చ జరుపుతారో చూద్దాం..  

భారత సైన్యం చేతిలో ప్రాణాలతో పాక్ ఉగ్రవాది...

  జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలకు మరో పాక్ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. గతంలో ఒకసారి పాక్ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడగా.. ఇప్పుడు మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం.. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టారులో ఎన్ కౌంటర్ జరగగా.. దీనిలో లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే బహదూర్ అలీ అలియాస్ సైఫుల్లా అనే ఉగ్రవాది మాత్రం ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతని నుండి సైన్యం మూడు రైఫిళ్లు, రెండు పిస్టల్స్ తో పాటు రూ. 23 వేల భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అ సందర్భంగా హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. "పాక్ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకోవడం పెద్ద సక్సెస్. ఉగ్రవాదం వెనుక పాక్ మూలాలు ఉన్నాయన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలుస్తుంది" అని అన్నారు. కాగా గడచిన రెండు నెలల వ్యవధిలో పాక్ ఉగ్రవాదులు ప్రాణాలతో పట్టుబడటం ఇది రెండోసారి.