ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎటు..!

  గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం కావాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రం అంతటా నిరసనలు, ధర్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ అప్పుడు ఫలితం శూన్యం. ఇప్పుడు మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్టం మొత్తం నిరసనలు నిర్వహించారు. మరోవైపు ఏపీ ఎంపీలు కూడా ఈసారి పార్లమెంట్లో గట్టిగానే ఆందోళనలు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని.. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాదనలు వినిపించారు. దీంతో పార్లమెంట్ ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు బీజేపీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.   ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ అధిష్టానం ఎప్పుడో చెప్పకనే చెప్పింది. రాష్ట్ర విభజన ఏర్పడిన తరువాత ఏదో పైపైకి నాన్చుతూ.. హోదా ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని మాటలు చెప్పి.. ఆఖరికి రెండు సంవత్సరాల తరువాత అసలు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ రెండు రోజులు నిరసనలు, ధర్నాలు చేశారు. ఆ తరువాత మళ్లీ కామన్.. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆలోచిస్తున్నామని బీజేపీ పెద్దలు చెప్పడం.. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఇవ్వాలని అని డిమాండ్ చేయడం సరిపోయింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు ప్రేవశపెట్టారు. ఇక ఈ బిల్లు కూడా చర్చకురానివ్వకుండా బీజేపీ నేతలు బాగానే ప్రయత్నించారు. ప్రయత్నించడం కాదు.. అసలు బిల్లును చర్చకు రానివ్వమని బహిరంగంగానే చెప్పారు. కానీ అన్ని పార్టీలు ఒకతాటిపైకి వచ్చే సరికి చర్చించక తప్పలేదు. కానీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అప్పుడు కూడా ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పకనే చెప్పారు. దీంతో మళ్లీ నిరసనలు స్టార్ట్. అయితే ఈసారి మాత్రం పరిస్థితి కాస్త బీజేపీని చిక్కుల్లో పడేసే విధంగానే కనిపస్త్తోంది. కేవలం రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చింది. అందులో భాగంగానే ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది. దీనికి స్పందించిన బీజేపీ పెద్దలు ఐదేళ్లు కాదు తాము కనుక అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికింది. అనుకున్నట్టే అధికారంలోకి వచ్చింది బీజేపీ. అయితే ఇప్పుడు మాత్రం అది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ అని.. అది విభజన చట్టంలో లేదని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఇక రాష్ట్ర విభజన చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దాని ఫలితం అనుభవిస్తుంది. ఏదో ఇప్పుడు కనీసం తమ ద్వారా ప్రత్యేక హోదా అన్న వస్తే కొంతలో కొంత పాపాన్న కడుగున్నట్టు అవుతుందని భావిస్తున్నారు. ఈక్రమంలోనే బీజేపీ కూడా ప్రత్యేక హోదాపై ఇలానే నాన్చితే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక వైసీపీ పార్టీ నేతలు కూడా తమ వ్యూహాల్లో తాము ఉన్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అయోమయంలో ఉంది. ఒకపక్క మిత్రపక్షమైన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ప్రత్యేక హోదాపై ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేయలేకపోతున్నారు. మరి ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో లేరు. అలా ఖచ్చితంగా బీజేపీ తో ఢీకొట్టాలంటే అది కాని పని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే అటు ఏపీ అభివృద్ధికి కాని.. ఏపీకి నిధులు రావాలన్నా కానీ కాస్త ఇబ్బందే. అలా కాకుండా ఉండాలంటే తాను రాజీనామా చేసి వేరేగా వెళ్లడం ఒక్కటే మార్గం. అలాకాకుండా బీజేపీతోనే ఉంటూ.. వారిపై ఒత్తిడి తెస్తూ.. వారిని బతిమాలో.. ఏదో విధంగా ప్రత్యేక హోదా సాధిస్తేనే మంచిదని అంటున్నారు. అంతేకాదు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు సోషల్ మీడియా ప్రచారం కూడా మైనస్ అయిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీకి ప్రత్యేక హోదా రావలంటూ రాష్ట్రమంతటా.. అటు ఢిల్లీలో కూడా ఆందోళనలు జరుగుతుంటే.. నేషనల్ ఛానల్స్ ఒక్కటంటే ఒక్కసారి కూడా దీనిపై వార్తలు రాలేదు. ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్లో కూడా చంద్రబాబు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మరి చూద్దాం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో ఎలా ముందుకు వెళతారో.. ఎలా వారిని ఢీకొంటారో.

చంద్రబాబుతో మాట్లాడా.. హామీలన్నీ నెరవేరుస్తాం.. జైట్లీ

  ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ అటు పార్లమెంట్ ఉభయసభల్లోనూ.. ఇటు ఏపీ రాష్టమంతటా నిరసలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఎంపీలంతా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని ఆందోళనలు చేపట్టారు. ఇక ఏపీలో వైసీపీ రాష్ట్రం మొత్తం బంద్ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   ఇదిలా ఉండగా లోక్ సభలో ఎంపీలంతా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నినాదాలు చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభకు వచ్చి.. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలు తమకు తెలుసని.. ఏపీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాను మాట్లాడానని అన్నారు. ఆయనతో అన్ని విషయాలు చర్చించానని ఆయన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.

హోదా హోరు..లోక్‌సభ రెండు సార్లు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసనలతో లోక్‌సభ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఉదయం సభ ప్రారంభంకావడానికి ముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ, వైసీపీ ఎంపీలు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం అలాగే సభలో అడుగుపట్టి తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానం మేరకు ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై చర్చకు అనుమతించాలని ఎంపీలు స్పీకర్‌ను కోరారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంతసేపు వారిస్తున్నా వినకపోవడంతో ఆమె సభను పదిహేను నిమిషాల సేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఎంపీల నిరసనల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు.

కేసీఆర్ గారూ..ఆ మంత్రులను బర్తరఫ్ చేయండి

తెలంగాణలో ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, ప్రభుత్వం ఎంసెట్-2 రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించాలని ఆదేశించడం చకాచక జరిగిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కూకటిపల్లి జేఎన్‌టీయూ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

బిల్డింగ్‌పై కూలిన విమానం..8 మంది దుర్మరణం

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పైపర్ నవాజో జెట్ విమానం పరానా రాష్ట్రంలోని క్యాంబే ప్రాంతంలో ఉన్న ఎక్సలెన్స్ రవాణా శాఖ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. లోండ్రినా ప్రాంతంలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారని, కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది.. ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ చర్చి కూడా ఉంది, ఆ సమయంలో అక్కడ 300 మంది భక్తులు ప్రార్థనలు చేస్తున్నారని, అదృష్టవశాత్తూ వారికి ఏమీ కాలేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక,  రెస్క్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసి విమానశకలాలను తొలగిస్తున్నారు.

వివేకానందుడిగా టీడీపీ ఎంపీ శివప్రసాద్..

నిరసన అంటే ఫ్లకార్డులు పట్టుకునో లేదంటే బిగ్గరగా నినాదాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్టైలే వేరు. రకరకాల వేషాలు వేసి నిరసన తెలపడం ఆయన పద్ధతి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నారు. సరిగ్గా అదే సమయంలో శివప్రసాద్ అక్కడికి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. స్వామి వివేకానందుడి అవతారంలో దిగారు. తప్పును సరిదిద్దకుంటే అది మరింత ముప్పును తెచ్చిపెడుతుంది అని ఆయన వివేకానందుడి సూక్తులను చెప్పారు. పనిలో పనిగా ఏపీకి ప్రత్యేకహోదా కల్పించేంత వరకు తన వినూత్న నిరసనలు కొనసాగుతాయని శివప్రసాద్ ప్రకటించారు.

కశ్మీర్ విద్యాశాఖ మంత్రి ఇంటిపై బాంబు దాడి

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కశ్మీర్ లోయ రగులుతోంది. నెల రోజుల నుంచి కర్ఫ్యూలు, 144 సెక్షన్లతో ప్రభుత్వం అల్లర్లను ఎంత కంట్రోల్ చేస్తున్నా ఏదో ఒక ప్రాంతంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ ఇంటిపై నిరనసకారులు పెట్రోల్ బాంబులను విసిరారు. నిరసనలో భాగంగా మంత్రి ఇంటి ముందుగా వెళుతున్న ఆందోళనకారులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో మంత్రి నయీమ్ ఆయన ఇతర కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి నుంచి నయీమ్ సహా కుటుంబసభ్యులతా సురక్షితంగా బయటపడ్డారని, వారిని మరో ప్రాంతానికి క్షేమంగా తరలించినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.

ట్రంప్‌ను దగ్గరుండి ఓడిస్తా..

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అమెరికా కుబేరుడు వారెన్ బఫెట్ కూడా చేరిపోయారు. ఇప్పటికే హిల్లరీ క్లింటన్ కు మద్దతు తెలిపిన ఆయన నెబ్రాస్కాలో ఆమెతో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూడోనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని, దగ్గరుండి అతడిని ఓడిస్తానని.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారిని కూడా తాను తీసుకెళతానని అన్నారు. అంతేకాదు ట్రంప్ వ్యాపార రికార్డును, దివాలా చరిత్రను ప్రస్తావిస్తూ.. అసలు ట్రంప్ తన ఆదాయపన్ను రిటర్నులను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. నెబ్రాస్కాలో ఆ రోజు మొత్తం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా 32 సీట్ల ట్రాలీ ఒకదాన్ని రిజర్వు చేసినట్లు చెప్పారు.

ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రమేశ్ రంగనాథన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దిలీప్ బి.భోస్లే పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో ఆయన స్థానంలో రంగనాథన్‌ను నియమిస్తున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.   1958 జూలై 28న ఢిల్లీలో జన్మించిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఛార్డెడ్ అకౌంటెంట్‌గా, కంపెనీ సెక్రటరీగా కూడా అర్హత సాధించారు. అనంతరం బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పొంది..1985లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా నమోదయ్యారు.  1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా, 2000 జూలై నుంచి 2004 మే వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. 2006 ఫిబ్రవరి 20న శాశ్వాత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2015 డిసెంబర్ 29 నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి అమిత్ షా..!

  గుజరాత్ ముఖ్యమంత్రిగా తనను తప్పించాలని చెప్పి ఆనందీబెన్ పటేల్ బీజేపీ అధిష్టానాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఆనందీబెన్ పటేల్ స్థానంలో ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ జోస్యం చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ తప్పుకుంటున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భర్తీ చేస్తారంటూ.. అమిత్ షాను ముఖ్యమంత్రిని చేయాలని మోదీ భావిస్తున్నారని  అన్నారు. ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడం, రాష్ట్రంలో ‘ఆప్’కు మద్దతు పెరుగుతుండడంతోనే ఆనందీబెన్‌ను తప్పిస్తున్నట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

సికింద్రాబాద్‌లో కూలిన భవనం..ఇద్దరి మృతి

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లో పురాతన భవనాలు కూకటి వేళ్లతో సహా కుప్పకూలుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో మరో పాత భవనం కూలింది. చిలకలగూడ ప్రాంతంలోని రెండంతస్తుల భవనం నిన్న అర్థరాత్రి సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా..మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిని అక్భర్, అతడి సహయకుడు వాజిద్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో శిథిలాలు తొలగించారు. ఘటనా స్థలిని మంత్రి పద్మారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఏపీలో కొనసాగుతున్న బంద్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించడంపై కేంద్రప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ విపక్షాలు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు డీపోలకే పరిమితమయ్యాయి. ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకుని ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. వైసీపీ,  సీపీఎం, సీపీఐ నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద వామపక్షాల కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో బంద్‌ జరుగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారిపై రెండు గంటలకు పైగా రాస్తారోకో చేయడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఎమ్మెల్యే సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రిగా నన్ను తప్పించండి.. గుజరాత్ సీఎం

గుజరాత్ ముఖ్యమంత్రి అనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రి నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే బీజేపీ అధిష్టానాన్ని తనను పదవి నుండి తప్పించాలని కోరారు. వయసు మీదపడడంతో ముఖ్యమంత్రి బాధ్యతలు మోయలేకపోతున్నానని, బాధ్యతల నుంచి తప్పించాలని..ఈ మేరకు తన అభిప్రాయాలను ఆమె తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. కాగా, పటేల్ ఉద్యమం తీవ్రతరం కావడంతో అనందీబెన్ పటేల్ పై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో పార్టీ అధిష్ఠానం నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఈ దశలో అనందీ బెన్ పటేల్ పని తీరుపై బీజేపీ గుర్రుగా ఉన్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

నర్సింగ్ యాదవ్‌కి క్లిన్ చిట్.. రియో ఒలింపిక్స్‌లో యాదవ్

  రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈవిషయంలో నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తులో రియోకు నర్సింగ్ యాదవ్ నే పంపాలని నిర్ణయించింది.. దీంతో రియో ఒలపింక్స్ లో నర్సింగ్ యాదవ్ పాల్గొననున్నాడు. 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ యాదవ్ పాల్గొననున్నాడు.   కాగా రియో ఒలంపిక్స్ లో రెజ్లర్ల జాబితాలో నర్సింగ్ యాదవ్ పేరు విడుదలైనప్పటినుండి ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దానికి తోడు డోపింగ్ కు పాల్పడ్డాడంటూ వాడా రిపోర్టులు నిర్ధారించడం.  నర్సింగ్ యాదవ్ నిషేధిత డ్రగ్స్ వినియోగించాడంటూ ఫలితాలు రావడంతో నర్సింగ్ యాదవ్ ఒలింపిక్ కలలు కల్లలయ్యాయి. న్యాయస్థానాల్లో కూడా అతని ప్రాతినిధ్యంపై కేసు నమోదైంది. అయితే ప్రత్యర్థులు చేసిన ట్వీట్ తో తీగ కదిలింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరణ, అనుమానాలు విన్న రెజ్లింగ్ సమాఖ్య...అతనికి అండగా నిలిచింది. ఈ ఆరోపణలపై  సమగ్ర దర్యాప్తు జరిపి.. వివరాలను ఒలింపిక్ సంఘానికి తెలపడం ద్వారా నర్సింగ్ యాదవ్ ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పించారు.

కాబూల్‌లో లారీ బాంబుతో దాడి.. ఇద్దరు ఉగ్రవాదలు హతం

  ఇప్పటివరకూ కారు బాంబులతో దాడులు జరిపిన ఉగ్రవాదులు ఈసారి లారీ బాంబులతో దాడి చేశారు. ఈ ఘటన కాబుల్ లో జరిగింది. వివరాల ప్రకారం.. ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో విదేశీ కాంట్రాక్ట‌ర్లు ఉంటున్న బిల్డింగ్‌పై తాలిబ‌న్లు లారీ బాంబుతో దాడి చేశారు. కాంపౌండ్‌లోని ఉత్త‌ర గేట్‌ను ఉగ్ర‌వాదులు పేల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. దాదాపు కొన్ని గంటల పాటు ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక పోలీసు, ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు. పలువురు పోలీసులకి గాయాలైనట్టు సమాచారం.

మోడీకి వెంకయ్య ఫోన్... ఇది మంచిది కాదు..

  ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటి వరకూ మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ చెబుతుంటే టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ నేతలు గతంలో చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే పాట పాడారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం విషయాన్ని నాన్చి, నాన్చి.. ఆఖరికి ఇచ్చేది లేదని పరోక్షంగా చెప్పింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. అంతేకాదు బీజేపీ పొత్తుతో టీడీపీ చాలానే నష్టపోయిందని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో అసలే బీజేపీ, టీడీపీ మిత్రపక్షమైనప్పటికీ కాస్త దూరంగానే ఉంటున్నాయి.. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా కారణంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది.   ఇప్పుడు ఈ విషయంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రధాని నరేంద్రమోడీకి స్వయంగా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య దూరం పెరుగుతుందని.. ఇది ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ స్వయంగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తద్వారా సమస్యలను పరిష్కరించ వచ్చని వెంకయ్య సూచించినట్టు తెలుస్తోంది. మరి మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.