ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు..అంతటా ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీలను కలవనున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు కేంద్రప్రభుత్వ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు. ఆ తర్వాతి రోజే టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగడంతో ఎన్‌డీఏ, టీడీపీల మధ్య కాస్త దూరం పెరిగింది. ఇలాంటి వాతావరణంలో సీఎం ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నెల 12 నుంచి జరిగే కృష్ణాపుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్రమంత్రులను ఆహ్వానించేందుకే ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై పలువురి విమర్శలు ఇలా..

  మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిని వ్యతిరేకించిన కొంతమంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు భూసేకరణ జీవో 123 కొట్టేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారు. జీవో కొట్టివేతపై పలువురి స్పందనలు ఇలా.. ప్రొఫెసర్ కోదండరాం.. టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం జీవో కొట్టివేతపై స్పందించి తెలంగాణ సర్కార్ పై విమర్శలు చేశారు. భూ సేకరణ జీవో 123 ను హైకోర్టు కొట్టివేయడంపై టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న జీవోలను తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పే వస్తుందని ఊహించానని అన్నారు. బలవంతపు భూసేకరణకు సాధనంగా 123 జీవోను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుందని విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టం హక్కులను ప్రభుత్వం కాలరాసిందని, ప్రభుత్వం తన బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించాలని కోదండరాం సూచించారు. డీకే అరుణ.. కాంగ్రెస్ నేత డీకే అరుణ స్పందించి జీవో 123ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. హైకోర్టు తీర్పు మల్లన్నసాగర్ రైతుల విజయమని అన్నారు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలు విడనాడి, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా ప్రభుత్వం చూడాలని ఆమె హితవు పలికారు. హేతుబద్ధమైన భూసేకరణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి.. టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు జీవో 123ను కొట్టివేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పినట్టు అయింది. ప్రభుత్వం తప్పును హైకోర్టు సరిదిద్దిందని అన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే...తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని.. పోరాటానికి సైతం దిగుతామని హెచ్చరించారు. హరీశ్ రావు.. ఇంక తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సర్వసాధారణమని.. 123 జీవో కొట్టివేతపై హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తరువాత మాట్లాడతానని అన్నారు.

జీఎస్టీ బిల్లుతో పెరిగే, తగ్గే ధరలు ఇవే..

పార్లమెంట్లో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎట్టకేలకు సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై గతంలోనే అరుణ్ జైట్లీ.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ పార్టీలతో మంతనాలు జరిపారు. దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక ఈ పార్టీకి ఎప్పటినుండో అడ్డంకిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త మెత్తబడినట్టే కనిపిస్తోంది. ఇక అన్నీ కుదిరితే ఈబిల్లు ఆమోదం పొందడం ఒక్కటే ఆలస్యం. అంతేకాదు బిల్లు కనుక ఆమోదం పొందితే వచ్చే ఏడాది నుండి అమలు చేయాలని కూడా బీజేపీ భావిస్తుంది. మరి ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఏ ధరలు పెరుగుతాయో.. ఏ ధరలు తగ్గుతాయో చూద్దాం. ధరలు తగ్గేవి.. * ఎంట్రీ లెవల్ కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు * కారు బ్యాటరీల ధరలు కూడా దిగొస్తాయి. * పెయింట్, సిమెంట్ ధరలు తగ్గుతాయి. * వినోదపు పన్ను గణనీయంగా తగ్గుతుంది కాబట్టి సినిమా టికెట్ ధరలు దిగొస్తాయి. * ఫ్యాన్లు, లైటింగ్, వాటర్ హీటర్లు, కూలర్ల తదితరాలపై పన్నులు తగ్గి ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి. ధరలు పెరిగేవి.. * పొగాకు మీద జీఎస్టీ పన్ను మరింతగా పెరుగుతుంది కాబట్టి సిగరెట్లు, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. * ఇప్పుడున్న సేవా పన్నుతో పోలిస్తే మొబైల్ రంగంపై పన్ను భారం పెరుగుతుంది కాబట్టి సెల్ ఫోన్ల ధరలు పెరుగుతాయి. * దుస్తులు, బ్రాండెడ్ ఆభరణాల ధరలూ పెరుగుతాయి.

ఔరా అనిపించుకున్న మేరీ కోమ్... సచిన్ కూడా వస్తే బావుంటుంది..

పార్లమెంట్ ఉభయ సభల్లో పలు రకాల నేతలు ఉంటారు. వారిలో క్రీడారంగానిక చెందిన నేతలు కూడా ఉన్నారు. ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఇంకా ఇటీవలే రాజ్యసభ బాధ్యతలు స్వీకరించిన బాక్సర్ మేరీ కోమ్ కూడా ఉన్నారు. అయితే వీరిలో సిద్దూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ పిచ్ లో ఉన్నప్పుడు సిక్స్ లు కొట్టినట్టే ఆయన మాటలు కూడా అంత షార్ప్ గా ఉంటాయి. మాటలతోనే ప్రతిపక్ష నేతలతో నీళ్లు తాగిస్తారు.   ఇక సచిన్ టెండూల్క్ర్ గురించి చెప్పాలంటే ఆయన సభకు పెద్దగా వచ్చిందే లేదు. ఎన్నికైన తర్వాత మూడేళ్లకు గాని ఓ ప్రశ్నను సంధించలేకపోయారు.  పార్లమెంటు సమావేశాలకు హాజరు శాతంలోనే ఆయన వెనుకబడిపోయారు. అయితే ఇప్పుడు బాక్సర్ మేరీ కోమ్ మాత్రం బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే సభలో తొలి ప్రశ్న వేసి ఆమె అందరిచేత ఔరా అనిపించుకున్నారు. సభలో ఆమె మాట్లాడుతూ..  ఇంటర్నేషనల్ ఈవెంట్లకు వెళ్లే భారత క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని..  శిక్షణా సమయాల్లోనూ క్రీడాకారులకు అవసరమైన మేర పోషకాహారాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్. క్రీడాకారులపై మరింత శ్రద్ధ పెడతామని ప్రకటించారు. దీంతో సచిన్ కూడా అప్పుడప్పుడు సభకు వస్తే బావుంటుందని పలువురు కామెంట్లు విసురుతున్నారు.

జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ..

  కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు రాజ్యసభలో జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో సవరణ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్బంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లు జీఎస్టీ అని, ఈ బిల్లు ఆమోదం వల్ల పలు రాష్ట్రాలకు ఉపయోగముంటుందని జైట్లీ అన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఉండాలని, వస్తు, సేవల పన్ను సవరణల బిల్లుకు అన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. జీఎస్టీ బిల్లుపై విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపామని, ఈ బిల్లుపై ఎంపిక కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు.

చంటి బిడ్డను.. తల్లిని బయటకు పంపించిన ట్రంప్..

ఇప్పటికే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు తయారైంది ఆయన వ్యవహారం. ఆయనకు ఏది నచ్చితే అది మాట్లాడేసి నిరంతరం వార్తల్లో ఉంటారు. ఈసారి కూడా అలాంటిదే చేసి మరోసారి తన మార్క్ చూపించుకున్నాడు. వర్జీనియాలోని ఎన్నికల ర్యాలీ నిర్వహించగా.. ఈకార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నాడు. అయితే తాను ప్రసంగిస్తున్న సమయంలో ఓ చంటి బిడ్డ ఏడుపు వినిపించింది. దీనికి స్పందించిన ట్రంప్.. పిల్లలంటే తనకు ఇష్టమని.. ఆ బిడ్డ గురించి పట్టించుకోవద్దు అని ప్రేమ కురిపించారు. అయినా కూడా ఏడుపు ఆగకపోయేసరికి ఆమెను బయటకు వెళ్లాలని కోరారు. ఆమె వెళ్లిన తరువాత ఈ ఘటన వివాదం రేపుతుందేమోనన్న ఉద్దేశంతో జోకులేసి నవ్వించాలని చూశారు. మరి దీనిపై ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి.

లోక్ సభలో అదే తంతు.. ఈ గొడవేంటి..

గత రెండు రోజులుగా ఏపీ ప్రత్యేక హోదాకోసం లోక్ సభలో ఎంపీలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూలాగే ఈరోజు కూడా సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. తమ సీట్ల నుండి లేచి వెల్ లోకి వచ్చి నినాదాలు చేపట్టారు.   దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారించినా వారు వినకుండా నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు."రోజూ ఏమిటిలా? మీరు దయచేసి ప్లకార్డులు చూపవద్దు. సభలో ప్లకార్డులపై నిషేధం ఉంది. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏదో చెప్పారుగా? కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. వారికి కాస్తయినా సమయం ఇవ్వకుండా ఈ గొడవేంటి? మాట్లాడుకొని వారు ఓ నిర్ణయానికి వస్తారు. ఆపై అనుమానాలు ఉంటే తీర్చుకోవచ్చు. నేను మిమల్ని కేవలం రిక్వెస్ట్ మాత్రమే చేయగలను. దయచేసి మీ సీట్లలోకి వెళ్లిపోండి. ప్లకార్డులు ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు" అని సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు.

ఆనందీ బెన్ పటేల్ రాజీనామా ఆమోదించిన బీజేపీ..

  గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ తనను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలని బీజేపీ అధిష్టానాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన రాజీనామాను సమర్పించగా.. ఆనందీ బెన్ పటేల్ రాజీనామాను బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆమోదించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ నాయకత్వం వృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆమె రాజీనామా చేశారని చెప్పారు. గుజరాత్ కు పరిశీలకులను పంపుతామని, ఆపై వారు ఎమ్మెల్యేలతో చర్చించి నివేదిక ఇచ్చిన తరువాత, తదుపరి సీఎం ఎవరన్న విషయాన్ని వెల్లడిస్తామని అన్నారు.

రాజ్యసభ ముందుకు జీఎస్టీ బిల్లు

ప్రతిష్టాత్మక వస్తు , సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును కేంద్రప్రభుత్వం ఇవాళ రాజ్యసభ ముందు ప్రవేశపెడుతోంది. రాజ్యసభలో ఎన్డీఏకు తగినంత మద్ధతు లేకపోవడంతో బిల్లు నెగ్గించుకోవడం కోసం ప్రతిపక్షాలు సూచించిన సవరణలకు అంగీకరించి సవరణలు చేపట్టింది. కాంగ్రెస్ చేసిన డిమాండ్లలో ఒకటైన ఒక శాతం అదనపు పన్నును తొలగించింది. అలాగే బిల్లుపై కాస్త విముఖతగా ఉన్న సమాజ్‌వాడీ, బీజేడీ, తృణమూల్, ఆర్జేడీతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని నరేంద్రమోడీ మరోసారి సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో బిల్లుకు కాంగ్రెస్ సహా ఇతర ముఖ్య రాజకీయ పార్టీలన్నీ మద్ధతు తెలుపుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

అమెరికా అధ్యక్ష బరిలో హిల్లరీ.. జయలలితే కారణమట..!

  త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్నికల బరిలో దిగటానికి కారణం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితేనట.. ఆమె నుండి స్ఫూర్తి పొందిన జయలలిత ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారట. అవునా..? నిజమా..? అనుకుంటున్నారా. ఇందులో నిజమెంతుందో తెలియదు కాని.. ఆ పార్టీ నేతలు మాత్రం అలాగే చెబుతున్నారు. మామూలుగానే జయలలిత అంటే పార్టీ నేతలకు కాస్త భక్తి ఎక్కువే. అలాంటి నేపథ్యంలో కూనూరు ఎమ్మెల్యే రాము అసెంబ్లీలో జయలలిత గురించి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ఎన్నికల్లో గెలిచి మొట్ట మొదటి మహిళగా రికార్డ్ సాధిస్తారని.. ఆమె విజయానికి కారణం పురచ్చితలైవి అమ్మ అని ప్రశంసించారు. 2011లో అమెరికాకు విదేశాంగ మంత్రిగా ఉంటూ చెన్నైకి వచ్చిన వేళ, జయలలిత పాలన చూసిన హిల్లరీ ఎంతో స్ఫూర్తిని పొందారని, ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అధ్యక్ష బరిలో ఉన్నారని రాము వ్యాఖ్యానించారు. అయితే రాము వ్యాఖ్యలు విన్న పార్టీ నేతలు ముందు కాస్త విస్తుపోయినా.. ఆతరువాత బల్లలు చరుస్తూ మద్దతు పలకాల్సి వచ్చింది. మొత్తానికి జయలలితపై పార్టీ నేతలకు ఉండాల్సిన భక్తి కంటే కాస్త ఎక్కువైనట్టే కనిపిస్తోంది. మరి హిల్లరీకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో..

మహారాష్ట్రలో వంతెన కూలి 4 కార్లు, 2 బస్సులు మిస్సింగ్

వరుణుడు.. ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు షిఫ్టయినట్లున్నాడు. వారం రోజుల క్రితం ఢిల్లీ-గుర్గావ్ రహదారిలో ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాదాపు 17 గంటలపాటు తిండి,తిప్పలు మాని రోడ్లపై గడిపారు ఢిల్లీ జనాలు. తాజాగా మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. సావిత్రి నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. మహారాష్ట్ర-గోవాల మధ్య హైవేపై ఉన్న ఓ బ్రిడ్జి ఉన్నపళంగా కుప్పకూలింది. ఆ సమయంలో బ్రడ్జిపై నుంచి వెళుతున్న నాలుగు కార్లు, రెండు బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. వాహనాల్లో ఉన్న 30 మంది గల్లంతయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ప్రారంభించింది. వంతెన కుప్పకూలడంతో మహారాష్ట్ర-గోవా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

జగన్ పై ఆనం ఫైర్.. బుద్దుందా నీకు..!

  ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీ నిన్న రాష్ట్రమంతటా బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి స్పందించి వైసీపీపై.. పార్టీ అధినేత జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఒకపక్క ఏపీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతుంటే.. మరోపక్క చంద్రబాబు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తురన్నారు అని అన్నారు.. వైసీపీ చేపట్టిన బంద్‌లు ప్రత్యేకహోదా కోసం కాదని, జగన్ తన హోదా పెంచుకోవడానికి ఆడిన డ్రామాగా ఆయన ఆరోపించారు. ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవాలని, ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవాలని చూస్తున్నారని.. బుద్ధుందా నీకు?... అంటూ జగన్‌పై ఆనం తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకు 67 శాతం... ఏపీకి 33 శాతం వాటా మాత్రమే వచ్చింది..ఇప్పుడు జగన్ ఇలాంటి బంద్ లు చేయడం వల్ల ఏపీకి వచ్చే లాభం ఏంలేదు.. ఇంకా నష్టం తప్ప అని మండిపడ్డారు.

బెజవాడలో కలకలకం..టీడీపీలోకి దేవినేని నెహ్రూ..?

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు భారీ స్కెచ్ గీసింది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇప్పటికే వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం కృష్ణాజిల్లాకి చెందిన కీలకనేత, విజయవాడ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన దేవినేని నెహ్రూ తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ చీలక సమయంలో ఎన్టీఆర్ తరపున నిలబడ్డారు దేవినేని. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జనం సమాధి కట్టడంతో నెహ్రూ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్లీ తన సొంతగూటికి చేరేందుకు సిద్ధమవతున్నారు. నెహ్రూతో పాటే కృష్ణాజిల్లాకే చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు.