మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్...నలుగురు ఉగ్రవాదులు హతం

  భారత్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఇప్పటికే పలుమార్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని విరమించింది. పలుచోట్ల కాల్పులకు పాల్పడ్డారు. పూంచ్ సెక్టార్ సమీపంలోని మాల్తీలో మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. సైనిక శిబిరాలు, జనావాసాలే లక్ష్యంగా దాడులకు దిగగా భారత సైన్యం రంగంలోకి దిగి దాడులకు దీటుగా కాల్పులు జరిపి తిప్పికొట్టింది. మరోవైపు పాక్ ప్రయోగిస్తున్న మోర్టార్ షెల్స్ జనావాసాల్లో పడుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.   ఇదిలా ఉండగా.. కుప్వారా జిల్లాలో ఆర్మీ క్యాంప్‌పై దాడి చేయగా భారత సైన్యం వారిని ఎదుర్కొంది. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టారు. ఇంకా ఉదయం 5.00 గంటల సమయంలో లాంగేట్ సమీపంలోని ఆర్మీ క్యాంప్‌పైకి ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు వారికి తగినరీతిలో జవాబు చెప్పారని అన్నారు.

కాత్యాయనిగా కనకదుర్గ..

శరన్నవరాత్రులంటే తొమ్మిది రోజులనేది జగమెరిగిన సత్యం. కాని ఈసారి విశేషంగా 10 రోజులు పండుగ జరుపుకుంటున్నాం. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి విశేషం సంభవిస్తుంటుంది. దీంతో ఒక రోజు ఉత్సవం పెరిగి అమ్మవారు అదనపు అలంకారంతో భక్తకోటికి దర్శనమిచ్చి తరింపచేస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజైన బుధవారం అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రి నవరాత్రి ఉత్సవాల్లోనే అత్యంత అరుదుగా లభించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాత్యాయని దేవిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

పార్లమెంట్ సాక్షిగా ప్రధాని పోకేమాన్ గో ఆట..

  పోకేమాన్ గో ఈ గేమ్ గురించి తెలియని వారుండరు. అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన గేమ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకూ అందరూ ఈ ఆటకు బానిసలైనవారే. ఎన్ని ప్రమాదాలు జరిగినా కానీ ఈ గేమ్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈ ఆట ఓ ప్రధాని పార్లమెంట్లో కూడా ఆడుతున్నారంటే.. ఆట ప్రభావం ఎంతలా ఉందో అర్దం చేసుకోవచ్చు. నార్వే ప్రధానమంత్రి ఎర్నాసోల్ బర్గ్..  పార్లమెంట్ లో పోకేమాన్ గో ఆడుతూ దొరికిపోయారు. సభలో రసవత్తరమైన డిబేట్ జరుగుతున్నా ఏమీ పట్టనట్లుగా పోకేమాన్ గోలో మునిగిపోయారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాగా గతంలో ఈ గేమ్ ఆడుతూ పలువురు దొరికిపోయారు. అయితే వారు దానికి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నారు. మరి ప్రధానిగారు ఏం రీజన్ చెబుతారో చూడాలి.

బీసీసీఐకి సుప్రీం లాస్ట్ ఛాన్స్...

లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయడంలేదని ఇప్పటికే సుప్రీంకోర్టు బీసీసీఐపై (భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బీసీసీఐకి సుప్రీం ఆఖరి ఛాన్స్ ఇచ్చింది. లోథా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30 నాటికే అయిపోయింది. అయినా బీసీసీఐ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో తర్జనభర్జనలు పడుతుండగా.. ‘సమయాన్ని వృథా చేయడం ఆపండి. సిఫార్సులను ఇప్పటికైనా అమలు చేస్తారా లేక మమ్మల్నే ఆదేశాలు జారీ చేయమంటారా..?’ అంటూ బీసీసీఐని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇంకా  డబ్బు చెల్లింపులపై కూడా బీసీసీఐపై సుప్రీం మండిపడింది. ‘సిఫార్సుల అమలుకు అయిష్టంగా ఉన్న సంఘాలకు డబ్బులు చెల్లించవద్దు. అయినా ఎందుకు ఆగమేఘాలపై వాటికి డబ్బులు చెల్లించాలని ప్రయత్నిస్తున్నారు’ అని బీసీసీఐపై నిప్పులు చెరిగింది.

ఇరోమ్ షర్మిల నిర్దోషి.. ప్రకటించిన కోర్టు

  మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సైనికుల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లు నిరాహార దీక్ష చేసి ఇటీవలే దానిని విరమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు కోర్టులో ఊరట లభించింది. నిరాహార దీక్ష చేస్తున్న ఆమెపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో మణిపూర్‌ జిల్లా న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించినందుకు అభినందనలు తెలుపుతున్నానని.. దీంతో ఇక రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు. కాగా వచ్చే ఎన్నికల్లో పాల్గొని తాను ముఖ్యమంత్రి అయి మ‌ణిపూర్ ప్ర‌జ‌ల‌ మద్దతుతో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించేలా చేస్తాన‌ని చెప్పిన సంగతి విదితమే.

ఫేక్ కాల్ సెంటర్ దందా.. అమెరికన్ల నుండి 500 కోట్లు దోపిడి

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 కోట్లను సంపాదించింది ఓ కాల్ సెంటర్ సంస్థ. అదేదో నిజాయితీగా సంపాదించింది కాదులేంది.. అక్రమంగా సంపాదించింది. పైగా అమెరికా వాసుల దగ్గర నుండి. ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేయాల్సిందే. థానెలోని మీరా రోడ్‌లో మూడు కాల్‌సెంట‌ర్లు అక్ర‌మంగా న‌డుపుతున్న దందా ఇది. ఈ కాల్ సెంటర్లలో పనిచేసే వాళ్లు అమెరికా వాళ్లకు ఫోన్  చేసి.. ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారుల‌మంటూ..  మీరు ట్యాక్స్ ఎగ్గొట్టారు.. ఫైన్ క‌ట్టండి లేదంటే జైల్లో వేస్తామంటూ బెదిరిస్తారు. ప్రాక్సీ సర్వ‌ర్ సాయంతో వీవోఐపీ టెక్నాల‌జీ వాడుతూ రోజూ వంద‌ల కొద్దీ కాల్స్ చేయ‌డ‌మే ఇక్క‌డి ఉద్యోగుల ప‌ని. రోజుకు కోటి నుంచి కోటిన్న‌ర వ‌ర‌కూ సంపాదిస్తున్నారు. ఇలా ఒక ఏడాది లోపులోనే అమెరిక‌న్ సిటిజ‌న్ల నుంచి రూ.500 కోట్లు దోచుకున్నారు. ఇక ఈ దందా గురించి సమాచారం అందుకున్న పోలీసులు కాల్ సెంటర్ పై దాడి చేసి అసలు నిజాలు రాబట్టారు. మొత్తం 70 మందిని అరెస్ట్ చేశారు. కాగా ఈ కాల్ సెంటర్లో పనిచేసే వారు ఎక్కువగా డిగ్రీ అయిపోయినవారే కావడం గమనార్హం. వారు మాత్రం వాళ్లు చెప్పిన సమాచారం చెప్పడమే మా పని అని.. అంతకు మించి ఏం తెలియదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో ఉంటూ ఈ కాల్‌సెంట‌ర్ల‌కు బాధితుల ఫోన్ నంబ‌ర్లు చేర‌వేసిన వ్య‌క్తుల వివ‌రాల‌ను కూడా అమెరికా ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు సేక‌రిస్తున్నాయి.

సర్జికల్ దాడులు వంద శాతం క‌చ్చిత‌మైన‌వే...

  భారత్-పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి చేసిన సర్జికల్ దాడులపై ఇప్పటికీ పలు అనుమానాలు తలెత్తున్న సంగతి తెలిసిందే. అసలు భారత్ ఈ దాడులు చేసిందా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పందిస్తూ.. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఆర్మీ జ‌రిపిన స‌ర్జిక‌ల్ దాడులు వంద శాతం క‌చ్చిత‌మైన‌వ‌ని.. పెద్ద పెద్ద దేశాలు కూడా స‌ర్జిక‌ల్ దాడులు చేస్తాయ‌ని, అయితే అవి కూడా ఇంత విజ‌య‌వంతం కాలేద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేసినంత మాత్రాన దాడుల‌కు సంబంధించిన సాక్ష్యాల‌ను విడుదల చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. దేశ ర‌క్ష‌ణ విష‌యానికి వ‌స్తే తాను కుతంత్రాలు ప‌న్న‌డానికి కూడా సిద్ధ‌మేనిని పారిక‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. కొంత‌మంది త‌న‌ను ముక్కుసూటి మ‌నిషి అని అంటార‌ని, అయితే దేశ ర‌క్ష‌ణ విష‌యానికి వ‌స్తే మాత్రం ర‌క్ష‌ణ మంత్రి సూటిగా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు.

తమిళనాడులో అనుమానిత ఉగ్ర‌వాది అరెస్ట్...

  భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఉగ్రవాదులు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? దాడులకు పాల్పడతారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన సంగతి తెలసిందే. అయితే మూడు రోజుల క్రితం కేర‌ళ‌లో ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న‌ ఆరుగురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ ఈరోజు మ‌రో అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదిని అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కడయనల్లూరులో ఉగ్రవాది సుబహానీ హజా మొయద్దీన్‌ను అరెస్టు చేశారు. అతడు చెప్పిన దానిని బట్టి... తాను ఏడాది పాటు సిరియాలో ఉండి ఇటీవలే భారత్ కి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.

బీసీసీఐ పై మళ్లీ సుప్రీం ఫైర్...రాత్రికి రాత్రి 400 కోట్లు ఎలా బదిలీ చేస్తారూ..

  బీసీసీఐ పై లోథా కమిటీ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను బీసీసీఐ పట్టించుకోవడం లేదని లోథా కమిటీ సుప్రీం కోర్టును ఇప్పటికే ఆశ్రయించింది. ఇంకా నిధులు మంజూరుపై కూడా లోథా కమిటీ బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పుడు దీనిపై మరోసారి బీసీసీఐపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. లోధా ప్యానెల్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయ‌కపోవ‌డంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. లోధా ప్యానెల్ ప్రతిపాదనలు సూచిస్తే వాటిని అమలు చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సుప్రీం మండిపడింది. దీనిలో భాగంగా బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు రూ.400 కోట్ల రూపాయల్ని బదిలీ చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పారదర్శకత విధానం ఉన్నట్లయితే రాత్రికి రాత్రి 400 కోట్లు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. అసలు బీసీసీఐలో ఉన్న వారి అర్హత ఏమిటో చెప్పాలంటూ జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు. అయితే అవి గ‌తేడాది త‌మ బ్రాడ్‌కాస్ట‌ర్స్ ద్వారా వ‌చ్చిన మొత్త‌మ‌ని, వాటిని రాష్ట్ర సంఘాల‌కు చెల్లించాల‌ని అనుకున్న‌ట్లు బోర్డు వివ‌ర‌ణ ఇచ్చింది.

ఉగ్రవాదుల ఏరివేత‌కు న‌వాజ్ ష‌రీఫ్ ఆదేశం..

  భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ దాడులకు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఒకపక్క మా దేశంలో అలాంటి దాడులు జరగలేదని బుకాయిస్తున్న లోపల నిజాన్ని మాత్రం మింగలేక చస్తుంది. అయితే ఇప్పుడు ఉగ్రవాదుల విషయంలో ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త‌మ దేశంలో ఉన్న మిలిటెంట్ల ఏరివేత‌కు న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌భుత్వం ఆ దేశ సైనికాధికారుల‌కు క‌ఠిన‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. స‌ర్జిక‌ల్ దాడుల అంశంపై అఖిల ప‌క్ష పార్టీ స‌మావేశం ఏర్పాటు చేసిన ష‌రీఫ్ ప్ర‌భుత్వం.. భార‌త్‌తో స‌రిహ‌ద్దు ఉన్న నాలుగు స‌మ‌స్మాత్మ‌క రాష్ట్రాల్లో మిలిటెంట్ల ఏరివేత‌ను తీవ్ర‌త‌రం చేయాల‌ని నిర్ణయం తీసుకుంది.  ఒక‌వేళ మిలిటెంట్ల గ్రూప్‌ల‌ను కంట్రోల్ చేస్తే, ఆ రాష్ట్రాల్లో శాంతి భ‌ద్ర‌త వ్య‌వ‌హారం అంశంలో జోక్యం చేసుకునే ప్ర‌స‌క్తి లేద‌ని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. మిలిటెంట్ల ఏరివేత‌కు రాష్ట్రాలు స‌హ‌క‌రించని ప‌క్షంలో సైనిక చ‌ర్య‌ను తీసుకోవాల‌ని ఐఎస్ఐ డీజీ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

రగులుతున్న పీవోకే ప్రజలు.. ఉగ్రవాద క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన

  పీవోకే( పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్) ప్రజలు నిరసనలతో రగులుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాదన్ని పోత్సహిస్తుందని.. ఉగ్రవాదులకు ఆసరాగా నిలుస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ప్రజలు కూడా దీనిపై నిరసన గళమెత్తారు. ఉగ్ర‌వాద క్యాంపుల‌కు  పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ అడ్డాగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పీవోకేలోని ముజ‌ఫ‌రాబాద్‌, కోట్లి, చినారి, మిర్పూర్‌, గిల్గిట్‌, నీల‌మ్ లోయ ప్రాంతాల్లోని ప్రజలు ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. ఉగ్ర క్యాంపుల కార‌ణంగా త‌మ జీవితాలు న‌ర‌కంగా మారాయ‌ని వాళ్లంటున్నారు. పాకిస్థాన్ ప్ర‌భుత్వం, ఆర్మీ బ‌ల‌గాలు ఈ ఉగ్ర క్యాంపుల‌ను అణచివేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇవి త‌మపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయని వాపోతున్నారు. పీవోకేలోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఇండియ‌న్ ఆర్మీ స‌ర్జిక‌ల్ దాడులు చేయ‌డంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డ్డారు. త‌మ ప్రాంతంలోఉగ్ర‌వాద క్యాంపులు ఉన్నాయ‌న్న విష‌యం ఈ దాడుల‌తో స్ప‌ష్ట‌మైంద‌ని భావిస్తున్న ప్ర‌జ‌లు.. వాటిని ఏరివేయాలంటూ ఆందోళ‌న‌లకు దిగారు.

కేజ్రీవాల్ పై వర్మ కామెంట్లు... కేజ్రీవాల్ నిజంగానే కోతి

  వివాదాల వర్మ రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై తన ప్రతాపాన్ని చూపించాడు. భారత్-పాక్ పై చేసిన సర్జికల్ దాడులకు సంబంధించి సాక్ష్యాలు బయటపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులు, నెటిజన్లు కేజ్రీవాల్‌పై మండిపడుతున్నారు. ఇప్పుడు దీనిపై వర్మ స్పందించి.. ‘‘జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్‌ దాడులు చేయాలి. కేజ్రీవాల్‌ వేసుకునే మఫ్లర్‌ చూసి కోతిలా ఉన్నాడనుకునే వాణ్ని. ఇప్పుడు భారత సైన్యంపై కామెంట్లు చేస్తూ నిజంగానే కోతి అని నిరూపించుకున్నాడు. ఆప్‌ పార్టీని ‘పాప్‌’ పార్టీగా మార్చాలి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్‌ చేశారు.

జయలలిత ఆరోగ్యంపై పిటిషన్ కొట్టివేత...

  జయలలిత ఆరోగ్యంపై వేసిన పిటషన్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. జయలలిత ఆరోగ్యం పై వివరణ ఇవ్వాలని.. ఫొటోలు విడుదల చేయాలని పిటిషన్ వేయగా దీనిని విచారణకు స్వీకరించిన రెండు నిమిషాల్లోనే పిటిషన్ ను తోసిపుచ్చింది. చికిత్స ఎన్ని రోజులు అన్నది ఎవరూ చెప్పలేరని.. ఆరోగ్యం మెరుగుపడటానికి ఇన్ని రోజుల సమయమంటూ ఏమీ ఉండదని తెలిపింది. చికిత్స పొందుతున్న వ్యక్తి యొక్క ఫొటోలను విడుదల చేయాలని కోరటం తగదని సూచించింది. పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లా లేదు.. పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లా ఉందని..ఇలాంటివి రాజకీయాల కోసం వాడుకోవద్దని పిటిషనర్ కు సూచించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. దిల్లీ ఎయిమ్స్‌నుంచి ముగ్గురు ప్రత్యేక వైద్యులు గురువారం ఉదయం అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. వూపిరితత్తుల వ్యాధి నిపుణుడు, హృద్రోగ నిపుణుడు, మత్తు వైద్య నిపుణులు కిల్మాని, నితీశ్‌నాయక్‌, అంజన్‌లు ఇప్పటి వరకూ జయకు నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికలు పరిశీలిస్తున్నారు.

ఇస్రో చరిత్రలో మరో విజయం.. జీశాట్‌-18 ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం

  భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో మరో విజయం సాధించింది. జీశాట్‌-18 క‌మ్యూనికేష‌న్ ఉప‌గ్ర‌హాన్ని ఇవాళ విజ‌య‌వంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. ఏరియ‌న్‌స్పేస్‌కు చెందిన అతి భారీ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గ‌యానాలోని కౌరు అంత‌రిక్ష కేంద్రం నుంచి ఏరియాన్‌-5 వీఏ-231 రాకెట్‌ ద్వారా జీశాట్ 18 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. జీశాట్‌-18 ఉప‌గ్ర‌హాన్ని ఇస్రో నిర్మించింది. దీని ద్వారా భార‌త టెలి క‌మ్యూనికేష‌న్ స‌ర్వీసులు మ‌రింత బ‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ఇస్రోకు చెందిన 14 టెలిక‌మ్యూనియేష‌న్ శాటిలైట్లు స‌ర్వీసు అందిస్తున్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు జీశాట్‌-18 క‌లిసింది. ఏరియ‌న్ 5వీఏ-231 రాకెట్ ద్వారా జీశాట్‌ను ప్ర‌యోగించారు. జీశాట్‌తో పాటు స్కైమ‌స్ట‌ర్‌-2 శాటిలైట్‌ను కూడా ప్ర‌యోగించారు. అది ఆస్ట్రేలియాకు బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వ‌ర్క్‌ను అందించ‌నుంది. కాగా వాతావ‌ర‌ణం స‌రిగా లేని కార‌ణంగా ఓ 24 గంటలు ఆల‌స్యంగా ఉప‌గ్ర‌హాన్ని ద‌క్షిణ అమెరికాలోని ఈశాన్య ప్రాంతం నుంచి ప్ర‌యోగించారు.

పాక్ ఆఫీసర్ తోనే సర్జికల్ దాడులపై నిజం..

  భారత సైన్యం పాక్ భూభాగంలోకి చొరబడి సర్జికల్ దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకూ పాకిస్థాన్ మాత్రం తమ దేశంలో భారతసైన్యం అలాంటి దాడులు జరపలేదని బుకాయిస్తుంది. అంతేకాదు దానిని నిరూపించడానికి నానా తంటాలు పడుతోంది కూడా. ఇక ఇప్పటికే భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేయాలా? వద్దా? అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఆర్మీ అయితే వీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.   ఇదిలా ఉండగా పాకి చెబుతున్న అబద్దాలను తిప్పికొట్టడానికి భారత్ పూనుకొంది. ఈ దాడుల గురించి వారి నోటితోనే చెప్పించాలని చెప్పి  జాతీయ మీడియా ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగానే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ కు ఫోన్ చేసి, తాను ఉన్నతాధికారిని మాట్లాడుతున్నానని చెప్పి, సర్జికల్ స్ట్రయిక్స్ నిజమేనా? ఎలా జరిగాయి? ఏ సమయంలో జరిగాయి? మన ఆర్మీ ఎలా స్పందించింది? అంటూ ప్రశ్నించగా దానికి ఆయన తడబడకుండా సమాధానం చెప్పేశాడు. కాల్పులు జరిగిన మాట నిజమేనని.. సుమారు మూడు గంటలపాటు అంటే తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల ప్రాంతాల్లో దాడి జరిగిందని.. ఈదాడిలో ఐదుగురు సైనికులు చనిపోగా చాలామంది ఉగ్రవాదులు చనిపోయారని.. లెక్క సరిగా తెలియదని.. అందరి మృతదేహాలను ట్రక్కులో వేసుకుని పాక్ సైన్యం వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు.  అంతేకాదు ఏ ప్రాంతాల్లో దాడులు జరిగాయో కూడా చెప్పాడు. మరి దీనికి పాకిస్థాన్ ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.

ఆర్మీ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రదాడి...

  ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్ లోని రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు జరిపారు. అయితే వెంటనే రంగలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపి వారిని తిప్పికొట్టారు. సుమారు 30 నిమిషాల పాటు ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగగా.. ఊహించనంత వేగంగా సైనికుల స్పందనను చూసిన ఉగ్రవాదులు వెనుదిరిగారు. దగ్గర ఉన్న అడువుల్లోకి దూరాలని ప్రయత్నించగా.. లాంగ్ గేట్ వద్ద వారిని అడ్డుకోగలిగిన జవాన్లు వారిని మట్టుబెట్టారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల శరీరాలను సైనికుల బుల్లెట్లు ఛిద్రం చేశాయి.

సర్జికల్ దాడులపై పార్లమెంట్లో ప్రధాని షరీఫ్...

  భారత్-పాక్ మధ్య ప్రస్తుతం యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉరీ దాడి జరిగిన తరువాత ఆగ్రహంతో ఉన్న భారత్.. పాక్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. దీనికి ప్రతీకారంగా.. పాక్ కూడా భారత్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతుంది. అయితే దీనిపై ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశ పార్లమెంట్లో ఓ ప్రకటన చేశారు. పాక్ పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ.. భార‌త సైన్యం చేసిన దాడిలో ఇద్ద‌రు మాత్ర‌మే చ‌నిపోయార‌ని చెప్పారు. తాము శాంతినే కోరుకుంటున్నామని.. యుద్ధాన్ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. త‌మ దేశ‌మూ ఉగ్రవాదానికి బల‌యింద‌ని.. భార‌త్‌లోని యూరీ సెక్టార్‌లో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి ఆర్మీని బ‌లిగొన్న అంశంపై మాట్లాడుతూ ఆ దాడికి సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టకుండానే తమ‌ను బాధ్యులమని ఆరోపించడం భావ్యం కాద‌ని ఆయ‌న అన్నారు.

భారత్ కు ఊరట.. మార్షల్స్ ఐలాండ్స్ కేసు తిరస్కరణ

  భారత్ కు ఐరాస కోర్టులో ఊరట లభించింది. మార్షల్స్ ఐలాండ్స్ కేసును ఐరాస కోర్టు తోసిపుచ్చింది. 1968 నాటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి భారత్, పాక్, బ్రిటన్ తూట్లు పొడుస్తున్నాయని ఆరోపిస్తూ, దాదాపు 50 వేల మంది మార్షల్స్ ద్వీప వాసులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారణకు స్వీకరించేందుకు ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు విచారణ ఐరాస పరిధిలో లేదంటూ భారత్ లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా, కేసులో ముందుకు సాగలేమని జస్టిస్ రోనీ అబ్రహాం 'హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానాని'కి స్పష్టం చేశారు.  ఇక ఇదే కేసులో ప్రతివాదులుగా ఉన్న పాకిస్థాన్, ఇంగ్లండ్ ల విషయంలోనూ న్యాయస్థానం ఎలా వ్యవహరిస్తుందన్నది వేచి చూడాలి. కాగా 1946 నుంచి 1958 మధ్య కాలంలో అమెరికా 67 అణు బాంబులను మార్షల్స్ దీవుల్లో పరీక్షించేందుకు నిర్ణయించి, దీవుల్లోని ప్రజలందరినీ ఇతర ప్రాంతాలకు తరలించింది. 1954లో 'బ్రావో' పేరిట తయారైన హైడ్రోజన్ బాంబును ఇక్కడ పరీక్షించి చూసింది.