సొంత పార్టీ నేతలపైనే ట్రంప్ యుద్ధం...

  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రిపబ్లికన్ పార్టీ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రజల్లో వ్యతిరేక భావం నెలకొంటుంది. ఇప్పటికే రెండు ప్రెసిడెన్షియల్ డిబేట్ లో హిల్లరీ క్లింటన్ మంచి మార్కులు కొట్టేయగా.. ట్రంప్ మాత్రం కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన యుద్దానికి దిగారు. ఇప్పటికే పలువురు నేతలు ఆయన పార్టీ నుండి తప్పుకుందామని చూస్తున్న వేళ..ఇప్పుడు హౌస్ స్పీకర్ పాల్ డీ ర్యాన్, (విస్కాన్సిన్), సెనెటర్ జాన్ మెక్ కెయిన్ (ఆరిజోనా)లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మెక్ కెయిన్ నోటి తీరు సరిగ్గా లేదని, ఒకప్పుడు తన మద్దతు కోసం అడుక్కున్నాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి మద్దతు తనకు అవసరం లేదని, ముఖ్యంగా ర్యాన్ వంటి వారితో ఎలాంటి ఉపయోగం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించడం అంటే వారిని వారు తిట్టుకోవడమే అని అన్నారు. కాగా మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను 30 మందికి పైగా రిపబ్లికన్ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపి, ఆయనకు అనుకూలంగా ఓటు వేయబోమని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మరి ట్రంప్ ఇలానే వ్యవహరిస్తే ఎన్నికల్లో గెలవడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జయలలిత బాధ్యతలు పన్నీర్‌ సెల్వంకు...

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరిపాలన విషయంలో తమిళనాడు స్తంభించిన నేపథ్యంలో ఆమె చేపట్టాల్సిన బాధ్యతలపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అయితే ఏకంగా తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాడు. ఈనేపథ్యంలో  జయలలిత శాఖలను ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొందిన రాష్ట్ర ఆర్థికమంత్రి పన్నీర్‌ సెల్వంకు అప్పగించారు. కేబినెట్‌ సమావేశాలు ఏర్పాటుచేసే అధికారం సైతం అప్పగిస్తూ రాజ్‌భవన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జయలలిత తిరిగి విధులు నిర్వర్తించే వరకు ఆమె వద్ద ఉన్న ప్రజా, సాధారణ పరిపాలన, రాష్ట్ర సర్వీసులను పన్నీర్‌ సెల్వంకు బదలాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్త చాంబర్ లో కాలు పెట్టిన చంద్రబాబు... రుణమాఫీ ఫైల్ పై సంతకం

  ఏపీ నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయంలో దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన ఛాంబర్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాంబర్ కూడా పూర్తవడంతో ఆయన ఈరోజు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య తన చాంబర్ లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  ఇకపై పాలన అమరావతి కేంద్రంగానే సాగుతుందని.. హైదరాబాద్ లో పదేళ్ల పాటు ఉండే హక్కు ఉన్నప్పటికీ, పాలన మన నేలపై నుంచి మాత్రమే సాగాలన్న ఉద్దేశంతో వేగంగా భవనాల నిర్మాణాలు సాగించినట్టు వెల్లడించారు. అనంతరం ఆయన ఆపై పెండింగ్ లో ఉన్న డ్వాక్రా మహిళల రుణమాఫీ ఫైల్ పై సంతకం చేస్తూ.. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ. 2,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. అభివృద్ధిని చూసి కొంతమంది అసూయ పడుతున్నారని, వారు చేసే విమర్శలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన రాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, చీఫ్ సెక్రటరీ టక్కర్‌, డీజీపీ సాంబశివరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

రక్తమోడిన కాబుల్.. 14 మంది మృతి

  కాబూల్ లో మరోసారి ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. వివరాల ప్రకారం.. కాబూల్ లో షియా ముస్లింలు తమ ప్రముఖ పండగైన ఆసురాను జరుపుకునేందుకు అందరూ ఒకచోటకు చేరుకున్నారు. ఇదే అదనుగా ఓ దుండగుడు ముస్లింలపై విచక్షణ రహితంగా కాల్పులు జరపగా... 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కాల్పుల సమాచారం అందుకున్న ప్రత్యేక దళాలు వెంటనే అక్కడికి చేరుకుని కాల్పులకు పాల్పడిన దుండగుడిని హతమార్చినట్టు  తెలుస్తోంది. కాల్పుల సమయంలో రెండు గ్రనేడ్లు కూడా పేలినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు ఇంత వరకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు.

తెలంగాణ కొత్త జిల్లాలు ఇవే..

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలతో సరికొత్త స్వరూపాన్ని సంతరించుకుంది.  ఈ జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదుల చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..ఏదో తమాషా కోసం జిల్లాలను ఏర్పాటు చేయలేదని.. చిట్ట చివరి రూపాయి కూడా లబ్ధిదారునికి అందాలన్న ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ జిల్లాలో 2 లక్షల నుంచి మొదలుకొని 4 లక్షల వరకు మాత్రమే జనాభా ఉండాలన్నారు. ఈ విధంగా ఉండటం వల్ల ఆ జిల్లాల్లోని కుటుంబాల పరిస్థితులన్నీ సంబంధిత జిల్లా కలెక్టర్‌కు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా పైకి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణను చూడబోతున్నామని అన్నారు. తెలంగాణ కొత్త జిల్లాలు ఇవే.. 1. ఆదిలాబాద్ 2. మంచిర్యాల 3. నిర్మల్ 4. కొమరంభీం 5. కరీంనగర్ 6. జగిత్యాల 7. పెద్దపెల్లి 8. రాజన్న 9. నిజామాబాద్ 10. కామారెడ్డి జిల్లా 11. వరంగల్ అర్బన్ 12. వరంగల్ రూరల్ 13. జయశంకర్ 14. జనగాం 15. మహబూబాబాద్ 16. ఖమ్మం 17. భద్రాద్రి 18. మెదక్ 19. సంగారెడ్డి 20. సిద్ధిపేట 21. మహబూబ్‌నగర్ 22. వనపర్తి 23. నాగర్‌కర్నూల్ 24. జోగులాంబ 25. నల్లగొండ 26. సూర్యపేట 27. యాదాద్రి 28. వికారాబాద్ 29. మల్కాజ్‌గిరి(మేడ్చెల్) 30. రంగారెడ్డి 31. హైదరాబాద్

పాంపోర్ లో కొనసాగుతున్న కాల్పులు..

  జమ్మూకాశ్మీర్ పాంపోర్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) ప్రభుత్వ కార్యాలయంలో ఉగ్రవాదులు దాక్కున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా వారు ఆ భవనంలోనే ఉండి కాల్పులు జరుపుతున్నారు. ఈనేపథ్యంలో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య గత మూడురోజులుగా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయినట్టు తెలుస్తోంది. ఒక ఉగ్రవాది హతమైనట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. కాగా శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ బిల్డింగ్‌లోకి కొన్ని రోజుల క్రితం ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారు. జీలం నది ద్వారా బోట్లలో వచ్చి ఈ బిల్డింగ్‌లో చొరబడినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి.

మేనల్లుడికి నా సంపూర్ణ ఆశీస్సులు..

కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన అనంతరం పట్టణంలోని అంబేద్కర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వెళ్లేటపుడు రెండు కళ్లలో నీళ్లు తిరిగాయని..ఈ ప్రాంతం ఏమైపోతుందోనని తాను బాధపడ్డానని, కానీ హరీశ్‌రావు తనకు ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడని ప్రశంసించారు. హరీశ్ కోరినట్లుగా సిద్ధిపేట ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వందకోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇక్కడకు ప్రభుత్వ వైద్యకళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. హరీశ్‌కు తన ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణలో కొత్త అధ్యాయానికి నాంది..!

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పరిపాలనా సంస్కరణ ఈ రోజు అమల్లోకి వచ్చింది. అదే కొత్త జిల్లాల ప్రారంభం. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 11.13 గంటలకు ప్రారంభోత్సవం జరిగింది. సిద్ధిపాట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నిర్ణీత సమయానికి సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న సీఎం ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్, హరీష్‌లు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత సిద్ధిపేట జిల్లా శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అదే సమయంలో మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలను ప్రారంభించారు.

మిస్టర్ కూల్‌ భార్యపై చీటింగ్ కేసు..

టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షిపై చీటింగ్ కేసు నమోదైంది. రితి ఎమ్‌ఎస్డీ అల్మోడే ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీకి సాక్షితో సహా మరో ముగ్గురు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో వీరిందరికి సమాన వాటాలున్నాయి. డెన్నిస్ అరోరా అనే వ్యక్తికి కూడా ఇదే కంపెనీలో 39శాతం వాటా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల అతను కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. ఒప్పందంలో భాగంగా ప్రస్తుత డైరెక్టర్లకే తన వాటా అమ్మేశాడు. అయితే మొత్తం 11 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.25 కోట్లు మాత్రమే వారు చెల్లించారు. తనకు రావాల్సిన సొమ్ము గురించి పలుసార్లు అడినప్పటికి అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో, ధోని భార్య సాక్షి సహా మిగతా వారిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశాడు. అయితే ఈ విషయంపై సాక్షి కాని, ధోనీ కాని స్పందించాల్సి ఉంది.

తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు రేపే..

  తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉన్న పదిజిల్లాలతో పాటు మరో 17 జిల్లాలు ఏర్పాటు చేయదలచుకున్న తెలంగాణ సర్కార్ పై ఇంకా కొన్ని ప్రాంతాలు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో మొత్తం 21 జిల్లాలు కొత్త జిల్లాలుగా ప్రారంభం కానున్నాయి. అయితే రేపు దసరా పండుగ రోజు సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలు ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారంటే? * సిద్దిపేట- ముఖ్యమంత్రి కేసీఆర్‌ * జనగాం - శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ * జయశంకర్‌ జిల్లా - శాసనసభాపతి మధుసూదనాచారి * మెదక్‌ - ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి * జగిత్యాల - ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ * వరంగల్‌ గ్రామీణం - ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి * యాదాద్రి - హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి * పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్‌ * కామారెడ్డి: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి * మంచిర్యాల- మంత్రి పద్మారావు * వికారాబాద్‌- మంత్రి మహేందర్‌రెడ్డి * రాజన్నసిరిసిల్ల- మంత్రి కేటీఆర్‌ * ఆసీఫాబాద్‌- మంత్రి జోగు రామన్న * సూర్యాపేట- మంత్రి జగదీశ్‌రెడ్డి * కొత్తగూడెం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు * నిర్మల్‌- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి * నాగర్‌కర్నూల్‌ - మంత్రి జూపల్లి కృష్ణారావు * మహబూబాబాద్‌- మంత్రి చందూలాల్‌ * జోగులాంబ - మంత్రి లక్ష్మారెడ్డి * మేడ్చల్‌ (మల్కాజ్‌గిరి) - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ * వనపర్తి- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి

జయలలిత హెల్త్ బులిటెన్ విడుదల... కృత్రిమ శ్వాస అందిస్తున్నాం..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత 18 రోజులుగా ఆమెకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని... ఆమె కోలుకుంటుందని.. జయలలితకు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు చెప్పారు. చికిత్సకు సంబంధించి యాంటీ బయటిక్స్ అందిస్తున్నామని..ఇక న్యూట్రిషీయన్ సపోర్టుతో పాసివ్ ఫీజియో తెరఫీ చేస్తున్నామని వివరించారు. ఎయిమ్స్ డాక్టర్ జీ ఖిల్నానీ పర్యవేక్షణలో జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

299 ప‌రుగుల‌కే న్యూజిలాండ్ ఆలౌట్..

  ఇండోర్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 557 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. ఇక బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 258 ప‌రుగులు భారీ ఆధిక్యం ద‌క్కింది. కివీస్ ప‌త‌నంలో అశ్విన్ మ‌రోసారి కీల‌క‌పాత్ర పోషించాడు. ఆరు వికెట్లు తీయ‌డంతోపాటు త‌న బౌలింగ్‌లోనే ఇద్ద‌రిని ర‌నౌట్ చేశాడు. ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయ‌డం అశ్విన్‌కిది 20వ సారి కావ‌డం విశేషం. మ‌రో స్పిన్న‌ర్ జ‌డేజా రెండు వికెట్లు తీశాడు. ఇప్పటికే తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించిన విషయం విదితమే.

మ‌సూద్‌ అజర్ విషయంలో భారత్ కు చైనా అడ్డుకట్ట...

ఒకపక్క ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో భారత్ కు మద్దతుగా ఉంటామంటూనే.. మరోపక్క ఉగ్రవాదం విషయంలో మాత్రం పాక్ ను వెనకేసుకొస్తుంది. జైషే మొహ్మ‌ద్ ఉగ్ర‌వాది మ‌సూద్‌ అజర్ ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించి, అత‌నిపై నిషేధం విధించాలని ఎప్పటినుండో భారత్ ఎప్పటినుండో చూస్తుంటే..ఇప్పుడు చైనా దానికి కూడా అడ్డుకట్ట వేసింది. పీవోకేలో చేసిన స‌ర్జిక‌ల్ దాడులు చైనా పాకిస్థాన్ ఎక‌న‌మిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్ట్‌పై తీవ్ర ప్ర‌భావం చూపడంతో.. ఇవ‌న్నీ మ‌న‌సులో పెట్టుకున్న చైనా అంత‌ర్జాతీయ స‌మాజంలో ప‌బ్లిగ్గా పాకిస్థాన్‌, ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తిస్తోంది. కౌంట‌ర్ టెర్ర‌రిజం పేరుతో భార‌త్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు చూసుకుంటోంద‌ని.. నీతులు చెబుతోంది. అంతేకాదు.. మ‌సూద్‌ అజర్ పై నిషేధం విధించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను సాంకేతిక కార‌ణాలు చూపుతూ మ‌రో మూడు నెల‌ల పాటు నిలిపేసింది చైనా.

జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసే అవకాశం ఉంది...

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత రెండు వారాలకు పైగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతున్న ఆమెను చూడటానికి పార్టీ నేతలు మాత్రం ఎవ్వరినీ అనుమతించట్లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం జయలలితను కలుసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. జయలలితకు సన్నిహితురాలైన ఒక్క శశికళ మాత్రమే ఆమె దగ్గర ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ శశికళ పుష్ప ఆమెపై విమర్శలు గుప్పించారు. జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ.. అది కూడా ''ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్న కొంతమంది వ్యక్తులు'' అంటూ శశికళను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసి, అన్నాడీఎంకే పార్టీకి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీని నియమించాలనుకుంటున్నారని.. అందువల్ల జయలలిత నుంచి అధికారికంగా ఏదైనా లేఖ వస్తే మాత్రం అందులో ఆమె సంతకాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేయాలని గవర్నర్‌ను ఆమె కోరారు.

ఫాలో ఆన్ గండంలో న్యూజిలాండ్...

ఇండోర్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కాస్త తడబాటుతోనే ఆడుతూ వికెట్లు కోల్పోతుంది.  లంచ్ త‌ర్వాత కేవ‌లం 23 ప‌రుగుల వ్య‌వ‌ధిలో నాలుగు వికెట్లు తీసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. అశ్విన్ 4, జ‌డేజా ఒక వికెట్ తీసుకోగా.. గ‌ప్టిల్ ర‌నౌట‌య్యాడు. ఒక ద‌శ‌లో 148 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న కివీస్‌ను నీష‌మ్ (37 నాటౌట్‌), వాట్లింగ్ (23) ఆదుకున్నారు. ఈ ఇద్ద‌రూ ఆరో వికెట్‌కు 53 ప‌రుగులు జోడించ‌డంతో కివీస్ కాస్త కోలుకున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన నేపథ్యంలో, ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయట పడాలంటే న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులను దాటాల్సి వుంది. అయితే ఇప్ప‌టికీ ఇంకా ఫాలోఆన్ గండం గ‌ట్టెక్కాలంటే న్యూజిలాండ్ 141 ప‌రుగులు చేయాల్సి ఉంది.

ఆప్ కు మళ్లీ కష్టాలు.. మరో ఎమ్మెల్యేపై కేసు..

  ఆప్ నేతలు తెలిసి చెస్తారో.. తెలియక చేస్తారో తెలియదు.. కానీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు.. కేసులు నమోదు అవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఈపార్టీకి చెందిన పలువురు నేతలు పలు కేసుల్లో ఇరుక్కోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలోని రెసిడెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హెన్రీ జార్జ్ ను ఎమ్మెల్యే నరేష్ బల్యన్ కొట్టారన్న ఆరోపణలపై  ఎఫ్ఐఆర్ నమోదయింది. తన కార్యాలయంలోకి అనుచరులతో కలసి ప్రవేశించిన బల్యన్ తనపై దాడి చేసి, చంపేస్తానని బెదిరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు జార్జ్. దీంతో, బల్యన్ పై పోలీసులు కేసు బుక్ చేశారు. మరోవైపు, తమపై జార్జ్ దాడి చేశాడంటూ ఎమ్మెల్యే బల్యన్ అనుచరులు కూడా కేసు పెట్టారు. దీనిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.