పాక్ ఆఫీసర్ తోనే సర్జికల్ దాడులపై నిజం..
posted on Oct 6, 2016 @ 10:52AM
భారత సైన్యం పాక్ భూభాగంలోకి చొరబడి సర్జికల్ దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకూ పాకిస్థాన్ మాత్రం తమ దేశంలో భారతసైన్యం అలాంటి దాడులు జరపలేదని బుకాయిస్తుంది. అంతేకాదు దానిని నిరూపించడానికి నానా తంటాలు పడుతోంది కూడా. ఇక ఇప్పటికే భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేయాలా? వద్దా? అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. ఇక ఆర్మీ అయితే వీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.
ఇదిలా ఉండగా పాకి చెబుతున్న అబద్దాలను తిప్పికొట్టడానికి భారత్ పూనుకొంది. ఈ దాడుల గురించి వారి నోటితోనే చెప్పించాలని చెప్పి జాతీయ మీడియా ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగానే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ కు ఫోన్ చేసి, తాను ఉన్నతాధికారిని మాట్లాడుతున్నానని చెప్పి, సర్జికల్ స్ట్రయిక్స్ నిజమేనా? ఎలా జరిగాయి? ఏ సమయంలో జరిగాయి? మన ఆర్మీ ఎలా స్పందించింది? అంటూ ప్రశ్నించగా దానికి ఆయన తడబడకుండా సమాధానం చెప్పేశాడు. కాల్పులు జరిగిన మాట నిజమేనని.. సుమారు మూడు గంటలపాటు అంటే తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల ప్రాంతాల్లో దాడి జరిగిందని.. ఈదాడిలో ఐదుగురు సైనికులు చనిపోగా చాలామంది ఉగ్రవాదులు చనిపోయారని.. లెక్క సరిగా తెలియదని.. అందరి మృతదేహాలను ట్రక్కులో వేసుకుని పాక్ సైన్యం వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఏ ప్రాంతాల్లో దాడులు జరిగాయో కూడా చెప్పాడు. మరి దీనికి పాకిస్థాన్ ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.