రెపో రేటు పావుశాతం తగ్గించిన ఆర్బీఐ...

ఆర్బీఐ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్ పటేల్ తొలిసారి ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించారు. రెపో రేటు 0.25శాతం తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.  ఇప్పటివరకు ఆర్‌బీఐ గవర్నర్‌ మాత్రమే వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయం తీసుకునేవారు. కానీ తొలిసారి ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య పరపతి కమిటీ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొంది. ఇదిలా ఉండగా ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి స్టాక్‌మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా, జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 25 పాయింట్లలకు పైగా లాభాన్ని పొందాయి.

దిగొచ్చిన కర్ణాటక.. తమిళనాడుకు నీరు విడుదల

  కావేరి నీటి విడుదలపై కర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించినా.. కర్ణాటక ప్రభుత్వం మాత్రం నీటిని ఇప్పుడప్పుడే వదిలేది లేదని తేల్చి చెప్పేసింది. అయితే కర్ణాటక సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం.. ఆఖరిగా ఒక్క అవకాశం ఇస్తూ ఈరోజు వరకూ డెడ్ లైన్ పెట్టింది. ఇన్ని రోజులు మొండి పట్టుదల పట్టిన కర్ణాటక చేసేది లేక తమిళనాడుకు నీటిని విడుదల చేసింది. నిన్న రాత్రి 8 గంటలకు  కృష్ణ‌రాయ సాగ‌ర డ్యామ్ నుంచి క‌ర్నాట‌క ప్ర‌భుత్వం త‌మిళ‌నాడుకు నీటిని విడిచిపెట్టింది. రాత్రి సుమారు 6800 క్యూసెక్కుల నీటిని వ‌దిలిన‌ట్లు అధికారులు తెలిపారు.  కాబినీ రిజ‌ర్వాయ‌ర్ నుంచి 3500 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేసినట్లు మైసూర్ అధికారులు స్ప‌ష్టం చేశారు.

సిరీస్ రద్దు చేయాల్సిన అవసరం లేదు...

  బీసీసీఐపై లోథా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను పాటించని కారణంగా బీసీసీఐ ఖాతాలు స్తంభింపజేశారు. బీసీసీఐ నిధుల పందేరాన్ని ఆపాలంటూ బ్యాంకులకు లేఖ కూడా రాసింది. అయితే లోథా నిర్ణయంపై ఇప్పుడు బీసీసీఐ మండిపడుతూ న్యూజిలాండ్.. భారత్ ల మధ్య జరగాల్సిన సిరీస్ లను సైతం రద్దు చేయాలని భావించింది. అయితే దీనిపై స్పందించిన లోథా కమిటీ..  బ్యాంకు ఖాతాలను ఎవరూ స్తంభింపజేయలేదని చెప్పారు. న్యూజిలాండ్‌ భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. రోజువారీ వ్యవహారాలకు నిధులు వెచ్చింకూడ‌ద‌ని బీసీసీఐకి చెప్పలేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రాల‌కు ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వ‌కూడ‌ద‌ని మాత్ర‌మే తాము చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

జయ ఆరోగ్యం గురించి చెప్పాల్సిందే.. హైకోర్టు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సమాచారం తెలుపాలని ట్రాఫిక్ రామస్వామి అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారించిన హైకోర్టు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య విషయంలో ఆందోళన మొదలైనప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం ఆస్పత్రి బాధ్యత అంటూ అపోలో ఆస్పత్రి వైద్యులకు ఆదేశించింది. ఇదిలా ఉండగా అమ్మ(జయలలిత) ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతుండగా మరోపక్క ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆరోగ్యం బాగుపడాలని, సత్వరమే కోలుకోవాలని వినూత్న పూజలు చేస్తున్నారు. ఇంకొందరైతే, అపోలో ఆస్పత్రి ఎదుట అమ్మకోసం ఎదురుచూడటమే కాకుండా ఆమె త్వరగా కోలుకోవాలని నేలపై అన్నం పెట్టించుకుని తింటున్నారు.

బన్సల్ నల్లధనం.. 30కి పైగా బ్యాంకు లాకర్లు..

  కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డైరెక్టర్ జనరల్‌ బీకే బన్సల్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బన్సల్ పరువు పోయిందన్న మనస్తాపంతో గత కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనితో పాటు తన కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికంటే ముందు అతని భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు బీకే బన్సల్‌కు  ఏకంగా 30కి పైగా బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తాజాగా తేలింది. బీకే బన్సల్ ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల ముందే.. తమ వద్ద దాదాపు రూ. 2.4 కోట్ల నల్లధనం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలిపాడు. తర్వాత సీబీఐ వర్గాలు సెక్యూరిటీ కెమెరాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా మరో కొత్త విషయం తెలిసింది. బీకే బన్సల్‌ను అరెస్టుచేసిన మర్నాడు యోగేష్, ఆయన తల్లి బ్యాంకులకు వెళ్లి, మొత్తం 19 లాకర్లను తెరిచారు. దాంతో ఇప్పటికే భారీగా బంగారు, వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్న ఇంట్లో మరోసారి సీబీఐ వర్గాలు సోదాలు చేశాయి. అప్పుడే అక్కడ భారీ మొత్తంలో నల్లధనం దొరికింది.

లోథా కమిటీ ఎక్కువ చేస్తోంది.. డబ్బులివ్వకుండా మ్యాచ్ లు జరుగుతాయా?

లోథా కమిటీ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ సూచనలు పాటించకుండా మెంబర్ క్రికెట్ అసోసియేషన్లకు నిధులను మంజూరు చేయాలని నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. అంతేకాదు బీసీసీఐ నిధుల పందేరాన్ని ఆపాలంటూ బ్యాంకులకు లేఖ కూడా రాసింది. అయితే లోథా నిర్ణయంపై ఇప్పుడు బీసీసీఐ మండిపడుతుంది. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ తో జరగాల్సిన టెస్ట్, సిరీస్ మ్యాచ్లలను రద్దు చేయాలని చూస్తుంది. బ్యాంకు ఖాతాలను జస్టిస్ లోథాకమిటీ స్తంభింపజేసింది.. ఈ సమయంలో "మా ముందు సిరీస్ ను రద్దు చేయడం మినహా మరో మార్గం కనిపించడం లేదు..ఈ మ్యాచ్ లను నిర్వహించేందుకు మా వద్ద డబ్బులేదు. ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? లోధా కమిటీ చాలా ఎక్కువ చేస్తోంది. ఆటగాళ్లకు డబ్బులివ్వకుండా మ్యాచ్ లు జరుగుతాయా? డబ్బులు తీసుకోకుండా మూడో టెస్టును ఆడేందుకు ప్లేయర్లు సిద్ధమైతే మాకూ సంతోషమే. అప్పుడే మ్యాచ్ జరుగుతుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్ ముందు పరువు పోతుందని ఆరోపించారు. మరోవైపు బీసీసీఐ వ్యాఖ్యలను లోథా కమిటీ ఖండించింది. బ్యాంకు ఖాతాలను ఎవరూ స్తంభింపజేయలేదని చెబుతున్నారు.

పాకిస్థాన్‌ పడవ పంజాబ్‌లో..

  భారత్ ను టెన్షన్ పెట్టేందుకు పాకిస్థాన్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తుంది. మొన్నటికి మొన్న బెలూన్లతో బెదిరింపులు పంపించిన పాక్.. నిన్న పావురంతో ప్రధానిని ఉద్దేశించి మరో లేఖ పంపారు. ఇప్పుడు పంజాబ్‌లోని రావి నది వద్ద పాకిస్థాన్‌కు చెందిన పడవను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పడవను దుండగులు వదిలి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందం తరచూ ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సరిహద్దుల్లో పలు కాల్పులకు తెగబడిన పాక్.. ఈరోజు ఉదయం  నౌషెరా సెక్టార్‌లోని కల్సియాన్‌ వద్ద పాక్‌ బలగాలు కాల్పులు జరిపారు.

మరోసారి బీసీసీఐపై లోథా కమిటీ ఆగ్రహం.. సిరీస్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేదు

లోథా కమిటీ మరోసారి బీసీసీఐకి షాకిచ్చింది. గతంలోనే బీసీసీఐ కమిటీ ఆదేశాలను పాటించడం లేదని తెలిపిన నేపథ్యంలో సుప్రీం చేత మొట్టికాయలు తిన్న బీసీసీఐ మరోసారి లోథా కమిటీకి బుక్కయింది. తమ సూచనలు పాటించకుండా మెంబర్ క్రికెట్ అసోసియేషన్లకు నిధులను మంజూరు చేయాలని నిర్ణయించడాన్ని తప్పుపట్టింది.  నిధులను కేటాయిస్తూ సెప్టెంబర్ 30న జరిగిన అత్యవసర సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుందని, ఇది కమిటీ సూచనల ప్రకారం విరుద్దమని లోథా కమిటీ ఆరోపించింది. ఈనేపథ్యంలోనే బీసీసీఐ నిధుల పందేరాన్ని ఆపాలంటూ బ్యాంకులకు లేఖ రాసింది. ఒకవేళ అలా పాటించకపోతే ఈ విషయంపై మరోసారి సుప్రీం కోర్టును వెళతామని హెచ్చరించింది లోథా కమిటీ. ఇదిలా ఉండగా దీనివల్ల భారత్-న్యూడిలాండ్ మధ్య జరిగిన సిరీస్ కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.   అయితే దీనిపై స్పందించిన జస్టిస్ లోథా న్యూజిలాండ్‌తో సిరీస్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేదని తెలిపారు. రోజువారీ వ్యవహారాలకు నిధులు వెచ్చింకూడ‌ద‌ని బీసీసీఐకి చెప్పలేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రాల‌కు ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వ‌కూడ‌ద‌ని మాత్ర‌మే తాము చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. కాగా టీమిండియా-న్యూజిలాండ్ టీమ్‌ల మ‌ధ్య మ‌రో టెస్టు మ్యాచ్, ఐదు వ‌న్డే మ్యాచులు జ‌ర‌గాల్సి ఉంది.

కళ్లు తెరచిన జయలలిత... వెంటిలేటర్ తొలగింపు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఇప్పటికే రాష్ట్రమంతటా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. గత రెండు వారాల నుండి ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి బులిటెన్ ప్రకటించలేదు నేతలు. ఒకపక్క ఆమెకు చికిత్స జరుగుతుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆమె కోలుకుంటున్నారని చెబుతున్నా.. పార్టీ నేతల్లో, అభిమానుల్లో, కార్యకర్తల్లో మాత్రం ఆందోళన అలాగే ఉంది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జయలలిత కాస్త కళ్లు తెరచి స్పృహలోకి వచ్చినట్టు.. ఆ సందర్బంగా కాసేపు వెంటిలేటర్ తొలగించినట్టు చెప్పారు. అమ్మఆరోగ్యం కాస్త మెరుగుపడిందని.. మరిన్ని రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు. దీంతో కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే అమ్మకు సంబంధించిన ఫొటోలు.. పూర్తి సమాచారం లేకపోవడంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.

మోడీ కూడా డబ్బులు పంచిన వాళ్లే.. జేసీ సంచలన వ్యాఖ్యలు

  కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం ప్రధాని నుంచి నా వరకు అందరమూ డబ్బులు పంచినవాళ్లమేనంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రత్యేక హోదా గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ.. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి అని, బుద్ధి లేని వాళ్లే ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షలు గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. జగన్ దీక్ష లతో ఎవరికీ ప్రయోజనం ఉండదని, ఆ దీక్షల వల్ల ఆయన ఆరోగ్యానికే మంచిదన్నారు.  ఇక, పాకిస్థాన్ గురించి మాట్లాడుతూ, పాకిస్థాన్ సమస్య వందేళ్లయినా ఇలాగే ఉంటుందని, పాక్ పై యుద్ధం ప్రకటించడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

మోడీని పొగిడేసిన కేజ్రీవాల్... సెల్యూట్ చేస్తున్న‌ా..

  భారత్ సైన్యం పాక్ పై సర్జికల్ దాడులు చేసిన నేపథ్యంలో ఎప్పుడూ మోడీపై, ఆయన ప్రభుత్వం పై విరుచుకు పడే నేతలు కూడా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ దాడుల నేపథ్యంలో ఆయనను ప్రశంసించిన సంగతి తెలిసిందే. మోడీ రెండున్నరేళ్ల పాలనలో చేసిన మంచి పని ఇదే అని.. ఆయనను కలిసి ఆయనతో మాట్లాడాలని ఉందని అన్న సంగతి విదితమే. ఇప్పుడు ఈ జాబితాలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చేరిపోయారు.  తాము ప‌లు విష‌యాల్లో ప్ర‌ధానితో విభేదించినా.. పీవోకేలో సర‍్జికల్ స్ట్ర‌యిక్స్‌ విషయంలో మోదీ చూపిన మనోబలానికి సెల్యూట్ చేస్తున్న‌ట్లు కేజ్రీ పేర్కొన్నారు. భార‌త సైన్యం తీసుకున్న చ‌ర్య‌ను తాము పూర్తిగా సమర్థిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌న సైనికులు దాడుల‌కు దిగిన త‌రువాత పాక్ ఆర్మీ ఆ అంశంపై చేస్తున్న అసత్యప్రచారాన్ని భారత్ ఎండగట్టాలని మోదీకి తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ మీడియాలు పాకిస్థాన్‌ చెప్తున్న దానికి మద్దతిస్తూ కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిని చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందంటూ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

సిరీస్ మనదే.. ర్యాంకు మనదే.. పాక్ పై మరో విజయం..

  కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్  వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ భారత్ కైవసం కాగా... రెండో టెస్ట్ మ్యాచ్ కూడా భారత్ కైవసం చేసుకుంది. దీంతో మరో టెస్ట్ మ్యాచ్ ఉండగానే సిరీస్ మనకే దక్కింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే.. నంబర్ వన్ స్థానమూ మనకే దక్కింది. 376 ప‌రుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్ టీమ్‌.. 197 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దాంతో 178 ప‌రుగుల భారీ తేడాతో గెలిచింది. అన్నికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో మనకున్న మొదటి ర్యాంకును లాక్కున్న ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ నుంచి అగ్ర‌స్థానం మ‌ళ్లీ టీమిండియా వ‌శ‌మైంది. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియా గెలుపొంది పాక్ పై మరో విజయం సాధించింది.

కొత్త జిల్లాగా సిరిసిల్లా.. సీఎం గ్రీన్ సిగ్నల్

  తెలంగాణలో 17 జిల్లాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 17 జిల్లాలతో పాటు మరో మూడు జిల్లాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్లు వస్తున్న సంగతి కూడా విదితమే. వాటిలో సిరిసిల్లా, జనగాం, గద్వాల్  పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ మూడింటిలో సిరిసిల్ల పట్టణం ఇకపై జిల్లాగా అవతరించనుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్  సిగ్నల్ కూడా ఇచ్చేశారు. తన క్యాంపు కార్యాలయంలో  కరీంనగర్ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులతో ముచ్చటించిన ఆయన సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదిరిందని, కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ ను వరంగల్ జిల్లాలో కలపకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

జయలలిత ఆరోగ్యంపై కోర్టులో పిటషన్...

  గత 13 రోజులుగా తమిళనాడు సీఎం జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యంపై పలు వదంతులు కూడా వస్తున్నాయి. ఇక అన్నాడీఎంకే నేతలు.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంగతైతే చెప్పనక్కర్లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు కూడా చేస్తున్నారు. ఇక లండన్ నుండి వచ్చిన వైద్యులు ఆమె ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉందని.. అయితే కోలుకోవడానికి సమయం పడుతుందని అంటున్నారు. మరో పక్క ప్రతిపక్ష పార్టీలు జయలలిత ఆరోగ్యం గురించి బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ కూడా ధాఖలైంది. జయ ఆరోగ్యానికి సంబంధించి వాస్తవ పరిస్థితులు బయటపెట్టాలని చెన్నైకి చెందిన న్యాయవాది ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు రేపు విచారణ జరపనుంది.

ఢిల్లీ సర్కార్ కు సుప్రీం చీవాట్లు..25 వేల జరిమాన

  దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాధుల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా. అయితే దీనిపై పలువురు ఢిల్లీ ప్రభుత్వంపై.. కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. దీనికి కేజ్రీవాల్.. మాకు అలాంటి అధికారాలు లేవు మోడీని అడగండి అంటూ ట్విట్టర్లో ట్వీట్స్ కూడా చేశారు కూడా. ఇదిలా ఉండగా ఇప్పుడు కేజ్రీవాల్ స‌ర్కారు చూపిస్తోన్న‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ స‌ర్కారు క‌న‌బ‌రుస్తోన్న నిర్ల‌క్ష్యంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన నేపథ్యంలో దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం ఇటీవ‌లే ఈ అంశంపై త‌మ‌కు నివేదిక ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఢిల్లీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను కూడా నిర్లక్ష్యం చేసింది. దీంతో కోర్టు ఉత్త‌ర్వుల‌ను ధిక్క‌రించినందుకు గానూ ఢిల్లీ ప్ర‌భుత్వానికి రూ.25 వేల జరిమాన విధిస్తున్న‌ట్లు తాజాగా పేర్కొంది.

పావురంతో మోడీకి పాక్ బెదిరింపు లేఖ..

నిన్న బెలూన్లతో భారత్ కు బెదిరింపులు పంపిన పాకిస్థాన్ ఈ రోజు పావురంతో తమ బెదిరింపు లేఖను పంపించింది. మా దగ్గర సహనం కత్తులు ఉన్నాయ్, మోడీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీ సత్తా ఎంటో నేరుగా తలపడి చూసుకోవాలి అంటూ పలు రకాల హెచ్చరికలను కాగితాలపై రాసి వాటిని బెలూన్లకు అంటించి విడిచి పెట్టారు. ఇప్పుడు ప్రధాని మోడీని ఉద్దేశించి ఉర్దూలో లేఖ రాస్తూ దానిని పావురంతో పంపించారు. దీనిని బామియల్ సెక్టార్‌లోని సింబాల్ పోస్ట్ వద్ద బీఎస్‌ఎఫ్ జవాన్ గమనించాడు. ఆ లేఖలో ‘మోదీ జీ, 1971లో ఇండో పాక్ యుద్ధంలో దెబ్బతిన్న మమ్ముల్నీ మీరు పరిగణనలోకి తీసుకోరా? ఇప్పుడు ప్రతి బాలుడు కూడా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు.