వైసీపీకి మరో షాక్...మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీలోకి

  ఇప్పటివరకూ వైసీపీ పార్టీ నుండి చాలామంది నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో నేత కూడా టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణాజిల్లాలో వైసీపీ పార్టీ దాదాపు ఖాళీ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. తన అనుచరులతో భేటీ అయిన ఆయన... ఎక్కువ మంది పార్టీ మారేందుకే మొగ్గు చూపగా ఆయన కూడా టీడీపీ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాదు బూరగడ్డ తనయుడు కిషన్ తేజ్, చంద్రబాబు కుమారుడు లోకేష్ నడుమ ఉన్న స్నేహం కూడా ఒక కారణంగా చెపుతున్నారు. కాగా 2014 ఎన్నికల్లో ఆయన పెడన నుంచి వైకాపా తరఫున పోటీ పడి కాగిత వెంకట్రావు చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ట్రంప్ అయినా.. హిల్లరీ అయినా.. మోడీని కలవాల్సిందే...

త్వరలోనే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న బరాక్ ఒబామా పదవికాలం పూర్తవనున్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్‌ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు పదవి చేపట్టక తప్పదు. అయితే అసలు విషయం ఏంటంటే.. అధ్యక్ష పదవి ఎవరు చేపట్టినా.. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవాల్సిందేనని అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ స్పష్టంచేసింది.  సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అనే సంస్థ చేసిన సర్వే వెల్లడించింది. కొత్తగా ఎన్నికై శ్వేతసౌధంలోకి వెళ్లేదెవరైనా భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని.. కొత్తగా ఎన్నికయ్యే వారు భారత్‌-అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని పేర్కొంది. కీలక ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. కొత్త ప్రభుత్వం ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌లతో కలిసి పనిచేయాలని, పసిఫిక్‌, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అందరికీ ఆసక్తికర అంశాలపై దృష్టి పెట్టాలని వెల్లడించింది.

కారు వెనక్కి ఇచ్చేది లేదు.. కానీ ఒకటే సమస్య...

  రియో ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్ రంగంలో ప్రతిభను చాటిన దీపా కర్మాకర్ కు సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈకారును మెయింటెన్ చేసే స్థోమత లేదన్న కారణంతో దీపా కర్మాకర్ దానిని వెనక్కి ఇచ్చేయాలని నిర్ణం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలపై స్పందించిన దీపా.. సచిన్ టెండూల్కర్ ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును వాపసు ఇవ్వదలచుకోలేదని.. తనకు గిఫ్టుగా వచ్చిన కారును వాపసు ఇవ్వనున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. సచిన్ సర్ ఇచ్చిందంటే అది తనకు గొప్ప కానుక అని.. అయితే వచ్చిన సమస్య ఏంటంటే.. బీఎండబ్ల్యూ కారు షోరూమ్, సర్వీసింగ్ సెంటర్ అగర్తలాలో లేకపోవడమే.. వీలుంటే తనకు వేరే కారును సమకూర్చాలని కోరారు.

న్యూస్ పేపర్లు చదువుతున్న జయలలిత..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత కొద్ది రోజులుగా చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఆమె ఆరోగ్యం గురించి కాస్త గోప్యంగా ఉంచినా.. ఇప్పుడిప్పుడే హెల్త్ బులిటెన్ లు విడుదల చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆమెకు వెంటిలేటర్ తీసేశామని.. పరిస్థితి కాస్త చక్కబడిందని చెప్పిన ఆపోలో వైద్య సిబ్బంది ఇప్పుడు మరింత సమాచారం అందిస్తున్నారు. మునుపటి కంటే ఇప్పుడు జయలలిత పరిస్థితి మెరుగ్గా ఉందని... ఆమె వార్తా ప‌త్రిక‌లు చ‌దువుతున్నారని.. ఆమె త్వ‌ర‌గా కోలుకుంటున్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పార‌ని అన్నాడీఎంకే ప్ర‌తినిధి సీఆర్ స‌ర‌స్వ‌తి తెలిపారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి మాత్రం కాస్త సమయం పడుతుందని సరస్వతి తెలిపారు. కాగా ఇప్పటికే జయకు సంబంధించిన పలు బాధ్యతలను పన్నీర్ సెల్వంకు బదలాయించారు. ప‌న్నీర్ సెల్వమ్‌కు పోర్ట్‌ఫోలియోలు ఇస్తున్న విష‌యాన్ని జ‌య‌కు చెప్పిన‌ట్లు.. దానికి జ‌య కూడా ఓకే చెప్పిన‌ట్లు ఆమె స్పష్టం చేశారు. ఇన్‌ఫెక్ష‌న్ ఉండ‌డం వ‌ల్ల చికిత్స పొందుతున్న జ‌య గ‌దిలోకి ఎవ‌రూ వెల్ల‌డం లేద‌ని, కేవ‌లం డాక్ట‌ర్లు మాత్రం ఆ రూమ్‌లోకి ప్ర‌వేశిస్తున్నార‌ని, సీఎం జ‌య అనుమ‌తి లేకుండా అన్నాడీఎంకే పార్టీలో ఏమీ జ‌ర‌గ‌ద‌ని స‌ర‌స్వ‌తి పేర్కొన్నారు.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఫెడ్ వల్లనే

  స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. సెన్సెక్ 400 పాయింట్లు, నిఫ్టీ 125పాయింట్లు నష్టపోయాయి. అమెరికాలోని ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచవచ్చు అనే వూహాగానాల నేపథ్యంలో మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. భారతీయ రూపాయి దాదాపు 0.4శాతం పడిపోయింది. ప్రధానంగా ఐటీ షేర్లు, విక్రయాల ఒత్తిడి ఎక్కువగాఉంది. టీసీఎస్‌ 1.8శాతం విలువ కోల్పేతే ఇన్ఫోసిస్‌ 2శాతం వరకు విలువపడిపోయింది. యూరప్ మార్కెట్లపై కూడా నష్టాల ప్రభావం పడింది. ఫెడ్‌ రిజర్వు సెప్టెంబర్‌ సమావేశంలో వడ్డీరేట్ల పెంపు విషయాన్ని తీసుకురావడమే దీనికి కారణమని తెలిసింది.

పుణెలో టెన్షన్ వాతావరణం..

  పుణెలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, పుణెలో మరాఠాలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఆ ఆందోళనలు కాస్త ఉద్రిక్తంగా మారాయి.  ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని రద్దు చేయాలని, రిజర్వేషన్లు వద్దే వద్దని మరాఠా యువత ఉద్యమిస్తుండగా.. దళితులు, మరాఠా కార్యకర్తల మధ్య దాడులు జరిగాయి. లాహేగాన్ పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టిన మరాఠాలు నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి అదుపు తప్పుతుందన్న అంచనాతో, వెంటనే స్పందించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి.

అమెరికాలో తెలుగు ఉద్యోగి దుర్మరణం....

  అమెరికాలో తెలుగు ఉద్యోగి దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. అమెరికాలోని  పిట్స్ బర్గ్ ప్రాంతంలో కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన వల్లభనేని హరీష్ (42)  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే బయటకు వెళ్లేందుకు ఆయన కారు తీయగా అది స్టార్ట్ కాలేదు. దీంతో హరీశ్  బోనెట్ ఎత్తి పరీక్షిస్తుండగా కారు ఒక్కసారిగా ముందుకు దూకి..  అతడి ఛాతీ మీదుగా కారు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన జరగడానికి గంట ముందే అతను ఇండియాలోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడారని చెబుతున్నారు. ఇక హరీశ్ చనిపోయినట్టు తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు శోక సంద్రంలో మునిగిపోయారు. దీంతో, ముదినేపల్లిలోని హరీష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.

భారత్ పై దాడులు జరపడానికి అనుమతివ్వండి.. మసూద్ అజర్

  భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కూడా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతూనే ఉంది. అయితే ఇప్పుడు జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కూడా భారత్ పై దాడులు జరపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన.. ఇండియాలోకి దూసుకెళ్లి, సైనిక స్థావరాలపై దాడులను జరిపేందుకు తమకు అనుమతించాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కాశ్మీర్ ను పూర్తిగా ఆక్రమించుకునేలా చారిత్రక అవకాశం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో ఉందని, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే అవకాశం చేజారుతుందని జైషే వార పత్రిక 'అల్ కాలామ్'లో ఆయన పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. భారత్ జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఇవ్వాలని, అందుకు కాశ్మీర్ ను కానుకగా తెచ్చిస్తామని ఆయన అన్నట్టు తెలుస్తోంది.

యూపీ ఎన్నికల్లో గెలుపెవరిది..?

  వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న నేపథ్యంలో పార్టీలన్నీ ఇప్పటినుండే కసరత్తు చేసేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఇప్పటినుండే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడి చేసేస్తున్నారు. అయితే ఎన్నికలు ఉన్నప్పుడు ఏ పార్టీ గెలుస్తుందబ్బా అని సర్వేలు చేయడం కామన్. అలాగే యూపీ ఎన్నికల నేపథ్యంలో చేసిన సర్వేలో ఏపార్టీ గెలుపు సాధిస్తుందో ఓ లుక్కేద్దాం. యూపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో చేసిన తాజా స‌ర్వేలో భార‌తీయ జ‌న‌తా పార్టే ఆ రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తుంద‌ని తేలింది. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకు ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని స‌ర్వే ఫ‌లితాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా  ఇండియా టుడే - యాక్సిస్ నిర్వహించిన మరో సర్వేలో మాత్రం... 115-124 సీట్లతో ప్ర‌తిప‌క్ష బీఎస్పీ రెండోస్థానాన్ని కైవ‌సం చేసుకుంటుంద‌ని, సమాజ్‌వాదీ పార్టీకి 94-103 స్థానాలు వస్తాయని ఆ స‌ర్వే తెలుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం 8-12 మ‌ధ్య సీట్లు వ‌స్తాయ‌ని తెలుస్తోంది. ఈ స‌ర్వే ప్రకారం మాయావతి ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. మరి ఎవరికి అధికారం చిక్కుతుందో చుద్దాం..

మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? పాక్ పత్రిక

  ప్రస్తుతం ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ పై అగ్రదేశాలు పూర్తి వ్యతిరేక భావంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు పాకిస్థాన్ పరువు తీస్తున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు తలెత్తుతున్నాయి. పాక్ పత్రిక 'ది నేషన్' తన సంపాదకీయంలో  హక్కానీ నెట్ వర్క్, తాలిబాన్లు, లష్కరే తోయిబా వంటి సంస్థలకు సైన్యం కోవర్టు మద్దతిస్తోందని ఆరోపించిన పత్రిక, అజర్, సయీద్ వంటి వారిపై చర్యలు తీసుకోవడం మానేసి పత్రికలకు పాఠాలు చెబుతోందని ఆరోపించింది. కాగా, పఠాన్ కోట్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ మసూద్ అజర్, 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ లు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్న సంగతి తెలిసిందే.

ట్రంప్ విజయం... సిద్దాంతి గెలుస్తాడా?.. ప్రొఫెసర్ గెలుస్తాడా..?

అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు రోజు రోజుకు వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలు రేసులో హిల్లరీ ముందంజలో ఉండగా.. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అయింది ట్రంప్ పరిస్థితి. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఈసారి హిల్లరీ క్లింటన్ దే అని శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ అంచనా వేశారు. రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్‌ కు జాతక ప్రకారం ఇప్పుడు ఏలిననాటి శని నడుస్తోందని, మిగతా గ్రహాల గమనం సైతం విజయాన్ని సూచించడం లేదని ఆయన తెలిపారు. జ్యేష్టా నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశిలో ట్రంప్ జన్మించారని, ఆయన జన్మలగ్నం సింహమని తెలిపారు. ఇంకా హిల్లరీది పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన హిల్లరీది కుంభరాశి, జన్మలగ్నం తులా లగ్నమని.. ఆమె జాతకాన్ని పరిశీలిస్తే అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఖాయంగా తెలుస్తోందని వివరించారు. కాగా గతంలో ప్రొఫెసర్ అల్లాన్ లిచ్ మ్యాన్ ఈసారి విజయం ట్రంప్ దే అని చెప్పారు. గత ముప్పై ఏళ్లు పైనుండి ఈయన  తనదైన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఆయన చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి. మరి ఈసారి జాతకం నిజం అవుతుందా.. ప్రొఫెసర్ జోస్యం నిజమవుతుందా తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

సూపర్ రెస్పాన్స్ సంపాదిస్తోన్న పాష్ పోరీస్!

  ఎట్ లాస్ట్ , వెయిట్ ఈజ్ ఓవర్... పాష్ పోరీస్ వచ్చేశారు! అవును...యూత్ ఫుల్ వాల్డ్ ఆఫ్  ఎంటర్టైన్మెంట్ కి నెక్ట్స్ బజ్ వర్డ్... వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ లో భాగంగా తెలుగు వన్ అందిస్తోన్న పాష్ పోరీస్ నెటిజన్స్ ముందుకి వచ్చేశారు. ఎపిసోడ్ వన్ ఈజ్ నౌ అన్ లైన్....   నెటిజన్స్ చాలా మంది నాటిజన్సే కదండి! టీవీల్లో, సినిమాల్లో వచ్చే సో కాల్డ్ మోరల్ స్టఫ్ మళ్లీ ఇక్కడ కూడా చూడాలనుకుంటారా? అస్సలు అనుకోరు కదా? సమ్ థింగ్ రియల్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. సమ్ థింగ్ యూత్ ఫుల్ అండ్ కలర్ ఫుల్ ఆశిస్తారు. వాళ్లందరికీ పర్ఫెక్ట్ లీ సూటబుల్ ఎంటర్టైన్మెంట్ పాష్ పోరీస్. తెలుగువన్ అండ్ యూట్యూబ్ యూజర్స్ ముందుకొచ్చిన పాష్ పోరీస్ ఎపిసోడ్ వన్ సూపర్ రెస్పాన్స్ సంపాదిస్తోంది. వేలాది లైక్స్ అండ్ హిట్స్ తో దూసుకుపోతోంది! న్యూ జెనరేషన్ న్యూ టేస్ట్స్ కి అనుగుణంగా అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది...   

పాంపోర్ లో ముగిసిన మిలిటరీ ఆపరేషన్..

  జమ్మూ కాశ్మీర్ పాంపోర్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) ప్రభుత్వ కార్యాలయంలో ఉగ్రవాదులు దాగి కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ కాల్పులు ఆఖరికి ముగిసినట్టు తెలుస్తోంది. భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య గత మూడురోజులుగా కాల్పులు కొనసాగుతూనే ఉన్నా.. ఈరోజు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో పాంపోర్ లో మిలిటరీ ఆపరేషన్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ నారులా మాట్లాడుతూ.. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. ఉగ్ర‌వాదుల నుంచి రెండు ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. దాదాపు 50 గంట‌ల పాటు జోరుగా సాగిన ఫైరింగ్ లో నిన్న సాయంత్రం ఒక ఉగ్ర‌వాది చ‌నిపోగా, ఇవాళ జ‌రిపిన దాడుల్లో మ‌రో ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు.

అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న అశ్విన్..

న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ విజయం సాధించడంతో పాటు బౌలర్ అశ్విన్ కూడా అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో అశ్విన్ తన బౌలింగ్ తో కివీస్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. గత వందేళ్లలో ఏ బౌలర్‌ సాధించిన స్ట్రైక్‌ రేట్‌ను అశ్విన్‌ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 100 వికెట్లకుపైగా పడగొట్టిన బౌలర్లలో ఈ 30 ఏళ్ల ఇంజినీర్‌ ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. టెస్టుల్లో అశ్విన్‌ స్ట్రైక్‌ రేట్‌ 49.4. టెస్టుల్లో స్ట్రైక్‌ రేట్‌ పరంగా చూసుకుంటే గత వందేళ్లలో అశ్విన్‌ టాప్‌ స్థానంలో నిలువగా.. అతని తదుపరి స్థానంలో మెక్‌గిల్‌ (ఆస్ట్రేలియా) 54 స్ట్రైక్‌ రేటుతో, ఆ తర్వాతిస్థానంలో మురళీధరన్‌ 55 స్ట్రైక్‌రేటుతో ఉన్నారు.

బీఎండబ్ల్యూ కారు వెనక్కి ఇచ్చేస్తున్న దీపా కర్మాకర్... స్థోమత లేకనే...

  రియో ఒలింపిక్స్ లో తన ప్రతిభను కనపర్చి.. దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన పీవీ సింధూ, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్ లకు ప్రభుత్వాలు నజరానాలు అందజేసిన సంగతి తెలిసిందే. వాటితో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా వారికి  ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కూడా బహుకరించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు తనకు ఇచ్చిన కారును వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. దీనికి కారణం.. ఈ ఖరీదైన కారును మెయింటెన్ చేయలేకపోవడమే. దీపా కర్మాకర్ ది పేద కుటుంబం కావడంతో దానిని భరించడం తనకు తలకుమించిన బరువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అగర్తలా వంటి చిన్న నగరంలో అంతటి ఖరీదైన, విలాసవంతమైన కారును ఉపయోగించడం దీప, ఆమె కుటుంబానికి కష్టంగా మారడం.. అగర్తలాలో ఇరుకురోడ్లు గుంతలు, గోతులతో అస్తవ్యస్తంగా ఉండటం వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. అందుకే ఈ కారును ఇచ్చిన చాముండేశ్వరినాథ్‌కు తిరిగి ఇచ్చేయనున్నారు. కాగా వచ్చేనెలలో జర్మనీలో జరగబోయే చాలెంజర్స్‌ కప్‌ కోసం దీప సన్నద్ధమవుతోంది.

ఆ క్రెడిట్ మోడీదే..

  భారత సైన్యం పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్లి సర్జికల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు గాను పలువురు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి... సర్కార్ పై అదే విధంగా మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఇప్పుడు ఈ దాడుల గురించి మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఈ క్రెడిట్ మోడీదే అని చెబుతున్నారు. మెటీరియ‌ల్స్ ఇంజినీరింగ్ టెక్నాల‌జీ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిన ఆయన ఇండియ‌న్ ఆర్మీ నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ దాడుల ఘ‌న‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీదేన‌ని.. ఈ ఘ‌న‌తలో ఎక్కువ భాగం మోదీకే ద‌క్కుతుంది.. నేను కేవ‌లం నిర్ణ‌యాధికారం, ప్ర‌ణాళిక‌లో మాత్రం పాలుపంచుకున్నాను అని చెప్పారు. ఇంకా ఈ సర్జికాల్ దాడులను అనుమానిస్తున్న వారి గురించి కూడా ప్రస్తావిస్తూ..దాడులు జరిగాయా లేదా అని అనుమానిస్తున్న వారు కూడా ఈ ఘనతను పొందవచ్చని కామెంట్స్ విసిరారు.