భారత్ కు ఊరట.. మార్షల్స్ ఐలాండ్స్ కేసు తిరస్కరణ

  భారత్ కు ఐరాస కోర్టులో ఊరట లభించింది. మార్షల్స్ ఐలాండ్స్ కేసును ఐరాస కోర్టు తోసిపుచ్చింది. 1968 నాటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి భారత్, పాక్, బ్రిటన్ తూట్లు పొడుస్తున్నాయని ఆరోపిస్తూ, దాదాపు 50 వేల మంది మార్షల్స్ ద్వీప వాసులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారణకు స్వీకరించేందుకు ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు విచారణ ఐరాస పరిధిలో లేదంటూ భారత్ లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా, కేసులో ముందుకు సాగలేమని జస్టిస్ రోనీ అబ్రహాం 'హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానాని'కి స్పష్టం చేశారు.  ఇక ఇదే కేసులో ప్రతివాదులుగా ఉన్న పాకిస్థాన్, ఇంగ్లండ్ ల విషయంలోనూ న్యాయస్థానం ఎలా వ్యవహరిస్తుందన్నది వేచి చూడాలి. కాగా 1946 నుంచి 1958 మధ్య కాలంలో అమెరికా 67 అణు బాంబులను మార్షల్స్ దీవుల్లో పరీక్షించేందుకు నిర్ణయించి, దీవుల్లోని ప్రజలందరినీ ఇతర ప్రాంతాలకు తరలించింది. 1954లో 'బ్రావో' పేరిట తయారైన హైడ్రోజన్ బాంబును ఇక్కడ పరీక్షించి చూసింది.

బెంగుళూరులో కుప్పకూలిపోయిన ఏడంతస్తుల భ‌వ‌నం..

  బెంగుళూరులో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవంతు కూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం... బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న‌ ఏడంతస్తుల భ‌వ‌నం ఈరోజు మ‌ధ్యాహ్నం కుప్ప‌కూలిపోయింది. ఈ ప్రమాదంలో శిథిలాల‌ కింద మొత్తం 35 మంది కార్మికులు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎన్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 15 మందిని ర‌క్షించారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నారు.

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్..

  ఇప్పటి వరకూ వైద్య రంగంలో.. ఫిజిజ్స్ కు సంబంధించి నోబెల్ బహుమతులు అందించగా ఇప్పుడు రసాయన శాస్త్రానికి సంబంధించి పలువురికి నోబెల్ దక్కింది. అతి సూక్ష్మ యంత్రాల‌ను అభివృద్ధి చేసిన శాస్త్ర‌వేత్త‌ల‌ు జీన్ పెర్రీ సావేజ్‌, స‌ర్ జే ఫ్రేజ‌ర్ స్టొడార్ట్‌, బెర్నార్డ్ ఫెరింగాలు ఈ సారి నోబెల్‌ను గెలుచుకున్నారు. ఈ ముగ్గురూ మానవ శరీరంలోని ప‌ర‌మాణువు యంత్రాల‌ను డిజైన్ చేశారు. ఆ ప‌ర‌మాణువులు చేసే సంశ్లేష‌ణ అంశాన్ని కూడా వీళ్లు విశ‌దీక‌రించారు. స్వీడ‌న్‌లో జ‌రిగిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో నోబెల్ క‌మిటీ ఈ ముగ్గురు శాస్త్ర‌వేత్త పేర్ల‌ను వెల్ల‌డించింది. దేహంలోని సూక్ష్మ యంత్రాల‌ను రూపొందించిన ఈ ముగ్గురూ ర‌సాయ‌నిక శాస్త్రాన్ని తారాస్థాయికి తీసుకెళ్లార‌ని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ అభిప్రాయ‌ప‌డింది. కాగా జపాన్ కు చెందిన యోషినోరి ఒషుమికి వైద్యరంగంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం ద‌క్కింది. ఖగోళంలో రూపు మార్చుకుంటున్న పదార్థాలను అధ్యయనం చేసే ‘టోపాలజీ’ శాస్త్ర‌వేత్త‌ల‌యిన‌ బ్రిటన్ త్రయం డేవిడ్ థౌలెస్, డంకెన్ హాల్దేన్, మైఖేల్ కోస్టెర్‌లిడ్జ్‌లకు నోబెల్ దక్కింది.

బైకుకు అడ్డం వచ్చినందుకు... రెండేళ్ల బాలుడికి నిప్పంటించిన యువకుడు

  హైదరాబాద్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన బైకుకు అడ్డం వచ్చాడన్న కోపంతో ఓ చిన్నరి బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ రాక్షసుడు. వివరాల ప్రకారం. హైదరాబాద్ లోని పాతబస్తీలోని కాలాపత్తర్ లో మహ్మద్ ఫైసల్ ఖాన్ అనే యువకుడు బైక్ పై వెళుతుండగా.. అతనికి మహమ్మద్ అలీషేర్ (2) అనే బాలుడు అడ్డం వచ్చాడన్న కోపంతో పెట్రోల్ పోశాడు. మీద పెట్రోల్ పడడంతో ఏమీ తెలియని ఆ చిన్నారి నవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫైసల్ ఖాన్ వెంటనే నిప్పంటించాడు. అయితే దీనిని గమనించిన బంధువులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అలీ షేర్ తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫైసల్ ఖాన్ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

రాముడిగా మోడీ.. రావ‌ణుడిగా పాక్ ప్రధాని...మేఘ‌నాథుడిగా కేజ్రీవాల్‌

ఇప్పటికే భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్దవాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఎప్పటికప్పుడు కాల్పులు జరుపుతూనే ఉంది. ఇక భారత సైన్యం వారి దాడులను కూడా విజయవంతంగా తిప్పికొట్టేపనిలో ఉంది. ఇదిలా ఉండగా ఒకవైపు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఇప్పుడు వాటికి ఆజ్యం పోస్తున్నట్టు కొన్ని పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ పోస్టర్లలో ప్రధాని మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఫొటో కూడా ఉండటం ఆశ్యర్యకరం. అందరూ దసరా ఉత్సవాలు చేసుకుంటుండగా..యూపీలోని వార‌ణాసి ప్ర‌జ‌లు కొత్త స్టైల్లో సంబురాలు చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని రాముడిగా, పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ను రావ‌ణుడిగా, ఆప్ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మేఘ‌నాథుడిగా పోలుస్తూ వార‌ణాసిలో పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. శివసేన వారణాసి శాఖ పేరుతో విడుదలైన పోస్ట‌ర్‌లో మరో సర్జికల్ దాడులు జరగాల్సిందే అని శివ‌సేన కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. రాముని రూపంలో ఉన్న మోదీ.. రావ‌ణ రూపంలో ఉన్న పాకిస్థాన్ అంతు చూడాల‌ని ఆకాంక్షించారు.  

సాక్ష్యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి ఆర్మీ గ్రీన్ సిగ్నల్..

  ఉరీ దాడి అనంతరం పగతో రగిలిపోయిన భారత్ సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి అక్కడ ఉన్న ముష్కరులను మట్టుబెట్టి వచ్చింది. భారత్ చేసిన ఈ పనికి అగ్రరాజ్యాలు సైతం మద్దతు తెలిపాయి. అయితే మొదట పరిస్థితి బాగానే ఇప్పుడు మాత్రం అసలు భారత్ సర్జికల్ దాడులు చేసిందా.. లేక అలా చెప్పుకుంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పాకిస్థాన్ సంగతైతే చెప్పక్కర్లేదు.. అసలు మా దేశంలో అలాంటి దాడులే జరగలేదని చెప్పుకుంటుంది. దీంతో రోజు రోజుకి పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో ఈదాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోల విడుదలపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఉగ్ర‌స్థావ‌రాల‌పై తాము జ‌రిపిన స‌ర్జిక‌ల్ దాడుల సాక్ష్యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వానికి ఆర్మీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. దీనిపై తుది నిర్ణ‌యం ఇక ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం చేతుల్లోనే ఉంది. సాక్ష్యాల‌ను బ‌య‌ట‌పెట్టి అస‌లు దాడులు జ‌ర‌గ‌లేదంటున్న విమ‌ర్శ‌కులు నోళ్లు మూయించాల‌ని ఆర్మీ భావిస్తున్న‌ట్లు ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారులు వెల్ల‌డించారు.

పాక్ మరో కుట్ర.. రెడీగా 100 మంది ఉగ్రవాదులు

  భారత్ సైన్యం పాక్ పై చేసిన సర్జికల్ దాడుల అనంతరం.. ఉగ్రవాదులు సరిహద్దు ప్రాంతాల్లో తరతూ కాల్పులకు పాల్పడుతున్నసంగతి తెలిసిందే. పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి పలుమార్లు కాల్పులకు దిగింది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో భారీగా మోహరించిన భారత సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. వారి దాడులను తిప్పికొడుతూనే ఉంది. అయితే ఇప్పుడు మరో కుట్రకు పాకిస్థాన్ పన్నాగం పడుతున్నట్టు తెలుస్తోంది. ఇండియాలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు చేయాలని కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. సరిహద్దులు దాటి దాడులకు తెగబడేందుకు 100 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధంగా ఉంచిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దుల్లో సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపాయి. దీంతో ఎల్ఓసీ వెంట భద్రతను పెంచామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ వెల్లడించారు. ఎందరు ఉగ్రవాదులు వచ్చినా వెనకడుగు లేదని, వారిపై విరుచుకుపడి గుణపాఠం చెప్పేందుకు జవాన్లు సిద్ధంగా ఉన్నారని వివరించారు.

ఎవరైనా రెచ్చగొడితే మాత్రం ఊరుకోం...

  సర్జికల్ దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టాలని ఇప్పటికే డిమాండ్ లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు.. మోడీపై ఎప్పుడూ విమర్శలు చేసే కేజ్రీవాల్ ఇంకా పార్టీ నేతలు దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై స్పందించిన వెంకయ్యనాయుడు  బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. దేశంలోని మరే ఇతర పౌరుడికి భారత సైన్యం నిబద్ధత మీద అనుమానాలు ఉండి ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. ఇంకా భారతదేశం ఎవరితోనూ యుద్ధాన్ని లేదా సంఘర్షణను ఎప్పటికీ కోరుకోదని.. కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం వారికి గట్టి సమాధానం చెబుతామని చెప్పారు. ఇటీవల మన జవాన్లు చెప్పిన సమాధానమే అందుకు ఉదాహరణ అని..ఇతరులను పదే పదే విసిగించేందుకు కూడా కొంతమంది జనం ఉంటారని, వాళ్లను తాము నిశ్శబ్దంగానే డీల్ చేస్తామని అన్నారు.

డ్రగ్ రాకెట్... భారత వైమానిక కమాండర్‌ అరెస్ట్..

  బెంగుళూరులో డ్రగ్ రాకెట్ ముఠా బయటపడిన సంగతి తెలిసిందే. దీనిపై విచారిస్తున్న ఎన్‌సీబీ అధికారులు తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న జి.రాజశేఖరరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే వెంకట రామారావు అనే శాస్త్రవేత్తతో పాటు ఆయన భార్య ప్రీతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 231 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను స్మగ్లింగ్ చేయడంలో వింగ్ కమాండర్ రాజశేఖరరెడ్డి కూడా భాగస్తుడని ఎన్‌సీబీ వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన కేంద్రాలుగా సాగుతున్న ఈ డ్రగ్ రాకెట్ గురించి ఎన్‌సీబీ వర్గాలు వివరాలు సేకరించి, రాజశేఖరరెడ్డిని అరెస్టు చేసే సమయానికి అతడు గోవా పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. రాజశేఖర్ రెడ్డితో పాటు మరికొందరు వైమానిక దళం మాజీ అధికారులు కూడా ఉండే అవకాశం ఉందని, వాళ్లందరి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు.

సర్జికల్ దాడుల ఫొటోలు, వీడియోల విడుదలపై చర్చ...

  భారత్ సైన్యం పాకిస్థాన్ భూభాగంలో చొరబడి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం మా దేశంపై అలాంటి దాడులు జరగలేదని.. భారత్ అబద్దాలు చెబుతుందని బుకాయిస్తుంది. ఇప్పుడు పాక్ తోపాటు మరికొంత మంది కూడా దాడి చేసినట్లయితే దానిని సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సమావేశం ప్రారంభమైంది. ఈ సమాశంలో ప్రధాని నరేంద్ర మోడీ.. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ప్రకాశ్ జవదేకర్ తదితరులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు రేగుతుండడంతో వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విడుదల చేయాలా? వద్దా? విడుదల చేస్తే కలిగే లాభాలేంటి? విడదల చేయకపోవడం వల్ల కలిగే నష్టాలేంటి? అన్నదానిపై చర్చిస్తున్నారు.

మూడు రైళ్లలో దొంగల భీభత్సం...

  ఈ మధ్య కాలంలో రైళ్లలో దోపీడీలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మూడు రైళ్లలో దొంగలు భీభత్సం సృష్టించారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ రైల్వేస్టేషన్లో సిగ్నల్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్న వైశాలి ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు సూపర్‌ఫాస్ట్ మూడు రైళ్లలో.. ఆయుధాలతో రైళ్లలోకి ప్రవేశించిన దొంగలు ప్రయాణికులను బెదిరించి, గాయపరిచి విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్లను దొంగిలించారు. దొంగల దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కొంతమంది గన్ లతో బెదిరించారని.. కొంతమంది నిద్రలో ఉన్న తమపై కత్తులతో దాడి చేసి బ్యాగులను, సెల్‌ఫోన్లను దొంగిలించారని ప్రయాణికులు తెలిపారు. గన్‌లతో బెదిరించారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఒబామాపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి ఆగ్రహం... 'గో టూ హెల్'

   ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ గతంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకుగాను ఒబామా రెండు దేశాల మధ్య జరగాల్సిన భేటీని కూడా రద్దు చేశారు. ఆతరువాత రోడ్రిగో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరడంతో మళ్లీ సమావేశం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ తాజాగా రోడ్రిగో డుటెర్టీ  ఒబామాపై విరుచుకుపడ్డారు. క్షిపణుల విషయంలో ఆయన ఒబామాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షిపణులు తదితర ఆయుధాలను తొలుత విక్రయిస్తామని హామీ ఇచ్చిన అమెరికా ఇప్పుడు మాట తప్పిందని.. దీంతో అమెరికా అంటే గౌరవం పోయిందని అన్నారు. అంతేకాదు అమెరికా ఆయుధాలు విక్రయించకుంటే, తామేమీ బాధపడబోమని, రష్యా, చైనాలు అందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతూ 'గో టూ హెల్' అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులను రష్యాకు పంపించనున్నానని, "ఏం బాధపడొద్దు. మీకు కావాల్సిన వన్నీ మా దగ్గరున్నాయి. వాటిని మేము మీకు అందిస్తాం" అని రష్యా నుంచి హామీ లభించిందని తెలిపారు. మరి దీనిపై ఒబామా ఎలా స్పందిస్తారో చూడాలి.

కేజ్రీవాల్ పై మరోసారి ఇంక్ దాడి... దేవుడు వారిని ఆశీర్వదించాలి...

  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై గతంలో ఇంక్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కేజ్రీవాల్ పై ఓ మహిళ ఇంక్ తో దాడి చేసింది. ఇప్పుడు తాజాగా కేజ్రీవాల్ పై మరోసారి ఇంక్ దాడి జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆప్ కు చెందిన స్థానిక నేత శంకర్ సేవాదాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా.. అక్కడ బికనీర్‌ లో ఏబీవీపీకి చెందిన దీనేష్ ఓఝా అనే యువకుడు ఇంకు దాడి చేశాడు. కేజ్రీవాల్ జాతి వ్యతిరేకి అంటూ ఆరోపించాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా తనపై జరిగిన దాడికి స్పందించిన కేజ్రీవాల్.. 'నా మీద ఇంకు పోసిన వాళ్లను దేవుడు ఆశీర్వదించాలి' అని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.

డిబేట్ తరువాత.. ఆధిక్యంలో హిల్లరీ..

  ఇటీవల జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే డెమోక్రటిక్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు తాజా సర్వేలలో కూడా హిల్లరీనే అధిక్యంలో ఉన్నారని వెల్లడించింది. ఈ డిబేట్‌ అనంతరం హిల్లరీకి 45శాతం మద్దతు రాగా, ట్రంప్‌నకు 41శాతం మాత్రమే మద్దతు లభించినట్లు పేర్కొంది. ఇదే పోల్‌ గత నెలలో నిర్వహించినప్పుడు.. ఇరువురు నేతలు 42శాతం మద్దతు దక్కించుకోవడంతో టై అయ్యింది. మరికొన్ని సర్వేల్లోనూ హిల్లరీనే ట్రంప్‌పై ఆధిక్యంలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలో భాగంగా హిల్లరీ, ట్రంప్‌లు మరో రెండు ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌లో పాల్గొననున్నారు. నవంబరు 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ బ‌హుమ‌తి..

వైద్యరంగంలో జపాన్ శాస్త్రవేత్త యొషినొరి ఒషుమికి నోబెల్ బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఫిజిక్స్‌లో నోబెల్ బ‌హుమ‌తికి ఎంపికైన వారి పేర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఏడాది ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం ద‌క్కింది. ఖగోళంలో రూపు మార్చుకుంటున్న పదార్థాలను అధ్యయనం చేసే ‘టోపాలజీ’ శాస్త్ర‌వేత్త‌ల‌యిన‌ బ్రిటన్ త్రయం డేవిడ్ థౌలెస్, డంకెన్ హాల్దేన్, మైఖేల్ కోస్టెర్‌లిడ్జ్‌లకు నోబెల్ ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపింది. రేపు రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన శాస్త్రవేత్తల పేర్లను కమిటీ ప్రకటించనుంది.

దేవాలయాల పరిరక్షణ అందరి బాధ్యత

విజ్ఞాన కేంద్రాలైన దేవాలయాల పరిరక్షణ బాధ్యత అందరిదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ మురళీధరరావు పేర్కొన్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జి.హెచ్.హెచ్.ఎఫ్) మరియు సేవ్ టెంపుల్స్. ఆర్గ్, USA సంయుక్త ఆధ్వర్యంలో ప్రసాద్ లాబ్స్ లో జరిగిన డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ - భారతదేశం ప్రపంచానికే ఆదర్శమైన ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడ వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. దేవాలయాలు విజ్ఞానం, వికాసం, వ్యవస్థ నిర్మాణం తయారయ్యే ఆధ్యాత్మిక కేంద్రాలని చెప్పారు. సేవ్ టెంపుల్స్ పేరుతో డా. గజల్ శ్రీనివాస్ చేపట్టిన ఉద్యమం ఎంతో గొప్పదని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు అభినందనీయులని పేర్కొన్నారు.    జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి మనపై ప్రభావం చూపుతుంటే, పురాతన దేవాలయాలు, సనాతన ధర్మం మన సంస్కృతిని గుర్తుచేస్తాయన్నారు. వాటిని వెలుగులోకి తెచ్చే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్న ఆకాంక్ష ఆయన వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవ నిర్వాహకుడు, జి.హెచ్.హెచ్.ఎఫ్ మరియు సేవ్ టెంపుల్స్. ఆర్గ్, USA సంస్థ ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణకు చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వెల్లడించారు.   నాగసాయి మక్కం నిర్మాణ దర్శకత్వం వహించిన కురుమూర్తి రాయ చిత్రానికి రూ. లక్ష మొదటి బహుమతి, కొత్తపల్లి సీతారాం నిర్మించి దర్శకత్వం వహించిన మహేంద్ర గిరి చిత్రానికి రూ. 75 వేల ద్వితీయ బహుమతి, సత్య ప్రసాద్ దర్శకత్వంలో హరిష నిర్మించిన మనిష్యులు చేసిన దేవుడు చిత్రానికి రూ. 50 వేల తృతీయ బహుమతి లభించినట్లు చెప్పారు. అలాగే రూ. 10 వేల కన్సోలేషన్ బహుమతులు పొందిన చిత్రాలు, ప్రత్యేక స్క్రీనింగ్ విభాగంలో ఎంపికైన చిత్రాలను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. బహుమతి పొందిన విజేతలకు బీజేపీ కార్యదర్శి మురళీధరరావు, జస్టిస్ భవానీ ప్రసాద్ నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ, సినీ రంగస్థల నట శిక్షకులు దీక్షిత్, ప్రముఖ సినీ గేయ రచయిత సిరాశ్రీ, ఎంవీఆర్ శాస్త్రి, శాసనసభ్యులు జి కిషన్ రెడ్డి, సినీనటి కవిత, హీరోయిన్ మధుషాలిని, నటులు రోహిత్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.