ఫేక్ కాల్ సెంటర్ దందా.. అమెరికన్ల నుండి 500 కోట్లు దోపిడి
posted on Oct 6, 2016 @ 4:53PM
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 కోట్లను సంపాదించింది ఓ కాల్ సెంటర్ సంస్థ. అదేదో నిజాయితీగా సంపాదించింది కాదులేంది.. అక్రమంగా సంపాదించింది. పైగా అమెరికా వాసుల దగ్గర నుండి. ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేయాల్సిందే. థానెలోని మీరా రోడ్‌లో మూడు కాల్‌సెంటర్లు అక్రమంగా నడుపుతున్న దందా ఇది. ఈ కాల్ సెంటర్లలో పనిచేసే వాళ్లు అమెరికా వాళ్లకు ఫోన్ చేసి.. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ.. మీరు ట్యాక్స్ ఎగ్గొట్టారు.. ఫైన్ కట్టండి లేదంటే జైల్లో వేస్తామంటూ బెదిరిస్తారు. ప్రాక్సీ సర్వర్ సాయంతో వీవోఐపీ టెక్నాలజీ వాడుతూ రోజూ వందల కొద్దీ కాల్స్ చేయడమే ఇక్కడి ఉద్యోగుల పని. రోజుకు కోటి నుంచి కోటిన్నర వరకూ సంపాదిస్తున్నారు. ఇలా ఒక ఏడాది లోపులోనే అమెరికన్ సిటిజన్ల నుంచి రూ.500 కోట్లు దోచుకున్నారు. ఇక ఈ దందా గురించి సమాచారం అందుకున్న పోలీసులు కాల్ సెంటర్ పై దాడి చేసి అసలు నిజాలు రాబట్టారు. మొత్తం 70 మందిని అరెస్ట్ చేశారు. కాగా ఈ కాల్ సెంటర్లో పనిచేసే వారు ఎక్కువగా డిగ్రీ అయిపోయినవారే కావడం గమనార్హం. వారు మాత్రం వాళ్లు చెప్పిన సమాచారం చెప్పడమే మా పని అని.. అంతకు మించి ఏం తెలియదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో ఉంటూ ఈ కాల్‌సెంటర్లకు బాధితుల ఫోన్ నంబర్లు చేరవేసిన వ్యక్తుల వివరాలను కూడా అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు సేకరిస్తున్నాయి.