రెండో టెస్ట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 316..

భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నసంగతి తెలిసిందే. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్నారు. నిన్న 239 పరుగులు తీసి 7 వికెట్లు కోల్పోయిన భారత్.. ఈరోజు మ్యాచ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వికెట్లు కోల్పోయి.. 316 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఏడు వికెట్ల‌కు 239 ప‌రుగుల వ‌ద్ద‌ రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ మ‌రో 77 ప‌రుగులు జోడించి మూడు వికెట్ల‌ను కోల్పోయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 21 రన్స్ చేసింది. టేలర్, నికోలస్ క్రీజ్ లో ఉన్నారు. భువనేశ్వర్, షమీలు చెరో వికెట్ తీసుకున్నారు.

జయలలిత హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి.. కరుణానిధి డిమాండ్

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత వారం క్రితం అస్వస్థకు గురైన ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గత రెండు రోజుల నుండి మాత్రం ఆమె ఆరోగ్యంపై ఎలాంటి న్యూస్ అప్ డేట్స్ రాకపోవడంతో పలవురు పలు వదంతులు పుట్టిస్తున్నారు. మరోవైపు డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి జయలలిత ఆరోగ్యం గురించి హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని  డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వదంతులు పుట్టించిన పది మంది డీఎంకే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

భారత్‌, పాకిస్థాన్‌ జట్లను ఒకే గ్రూపులో పెట్టొద్దు... ఐసీసీకి బీసీసీఐ

  ప్రస్తుతం పాక్-భారత్ ల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే దీని ప్రభావం ఇప్పుడు క్రికెట్ పై పడినట్టు కూడా తెలుస్తోంది. దీనిలో భాగంగానే బీసీసీఐ, ఐసీసీకి ఓ సూచన చేసింది.  భవిష్యత్తులో ఏ టోర్నీలోనూ భారత్‌, పాకిస్థాన్‌ జట్లను ఒకే గ్రూపులో పెట్టొద్దని ఐసీసీని కోరింది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలన్న ప్రభుత్వ కొత్త వ్యూహాన్ని, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని బహుళ దేశాలు పోటీపడే టోర్నీల్లో భారత్‌, పాక్‌లను ఒకే గ్రూపులో పెట్టొద్దని ఐసీసీకి విజ్ఞప్తి చేశాం’’ అని తెలిపారు.  ఒకవేళ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడాల్సి వస్తే.. ఆ పరిస్థితి తప్పించుకోలేమని అన్నాడు. కాగా భారత్‌ ఇప్పటికే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే.

పాక్ అణుబాంబు బెదిరింపులను తప్పుబట్టిన అమెరికా..

పాకిస్థాన్ ఉరీ దాడులకు ఆగ్రహంతో ఊగిపోయిన భారత్.. పాక్ కు సరైన బద్ది చెప్పడానికి సరైన సమయం కోసం వేచి.. పక్కా ప్లాన్ తో పాక్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ముష్కరులను మట్టుబెట్టింది. అసలు ఏం జరుగుతుందో అని పాక్ తెలుసుకునే లోపే భారత్ సైన్యం చకచకా తన పని చేసుకొని వచ్చేసింది. ఇక భారత్ చేసిన ఈ పనికి ఖంగుతిన్న పాకిస్థాన్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఇక అప్పటినుండి తప్పుడు వార్తలతో.. బెదిరింపులతో కాలయాపన చేస్తుంది. అసలు సర్జికల్ దాడులు జరగలేదని ఒకరోజు అంటే.. భారత్ జవాన్లను పాక్ సైన్యం మట్టుబెట్టింది అని ఇంకోరోజు అని వాళ్లని ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అణ్వాయుధాల‌ను ప్ర‌యోగిస్తామ‌ని చెబుతున్నారు. పాక్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఖ్వాజా సర్జికల్ దాడులపై స్పందించి.. భార‌త్ మ‌ళ్లీ దాడులు చేస్తే తాము అణ్వాయుధాల‌ను ప్ర‌యోగిస్తామ‌ని.. త‌మ‌పై భార‌త్ యుద్ధం ప్ర‌క‌టిస్తే, ఆ దేశాన్ని నాశ‌నం చేస్తామ‌ని అన్నారు. అయితే దీనిపై స్పందించిన అమెరికా  పాక్ కామెంట్స్‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది. పాక్‌కు ఈ అంశంపై త‌మ అభిప్రాయాల‌ను స్ప‌ష్టంగా వినిపించిన‌ట్లు అమెరికా ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. అయితే ఏ స్థాయిలో పాకిస్థాన్‌కు ఆ హెచ్చ‌రిక‌లు జారీ చేశార‌న్న విష‌యాన్ని మాత్రం ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. అణ్వాయుధాల వినియోగాన్ని ప్ర‌తిక్ష‌ణం స‌మీక్షిస్తున్నామ‌ని అమెరికా అధికారి తెలిపారు.

కావేరి జలవివాదం.. మాజీ ప్రధాని నిరాహారదీక్ష

  కావేరి జలాల వివాదం రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం పట్టింకోని నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆఖరిగా ఒక్క అవకాశం ఇచ్చింది. ఈరోజు నుండి 6 వ తేది వరకూ ప్రతిరోజు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు కావేరీ న‌దీ జ‌లాల‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్య‌తిరేకంగా మాజీ ప్ర‌ధాని దేవగౌడ ఇవాళ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టారు. బెంగుళూర్‌లోని అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్ర‌హం ముందు ఆయ‌న దీక్ష చేప‌ట్టారు. పలువురు కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు. కాగా గత కొద్దిరోజుల నుండి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నీటి జలాల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు చెబుతుంటే అస‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మిళ‌నాడుకు కావేరీ జ‌లాల‌ను వ‌దిలేది లేద‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా నిర్ణ‌యించింది.

భారత్ కు రష్యా మద్దతు.. పాక్ కు వార్నింగ్

  భారత్.. పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి సర్జికల్ దాడులు జరిపి ముష్కరులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. భారత్ చేసిన ఈ పనికి పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి కూడా. ఇప్పుడు భార‌త ఆర్మీ బ‌ల‌గాలు నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ దాడుల‌ను ర‌ష్యా స‌మ‌ర్థించింది. ఉగ్రవాదానికి రష్యా ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుందని.. ఉగ్ర‌వాదుల‌ను తుదముట్టించేందుకు ర‌ష్యా ఎప్పుడూ ముందుంటుంద‌ని ఆ దేశం ప్ర‌క‌టించుకుంది. అంతేకాదు ఈ సందర్భంగా పాక్ కు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఉగ్రవాదులను అదుపుచేయాలని పాకిస్థాన్ కు ఎప్పటినుండో చెబుతున్న పట్టించుకోవడం లేదని.. ఇకనైనా వారిని అదుపు చేసేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పింది. పొరుగుదేశాలు ఎటువంటి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగ‌కూడ‌ద‌ని, చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్యను ప‌రిష్క‌రించుకుంటే మంచిద‌న్న అభిప్రాయాన్ని ర‌ష్యా వినిపించింది.

రెండో రోజు స్కోర్ కోసం టీమిండియా పాట్లు..

  భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ కోల్ కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్ లో కొనసాగుతుంది. నిన్న ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టిమిండియా మాత్రం వరుస వికెట్లు కోల్పోయి.. పేలవమైన ప్రదర్శనతో అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచారు. 237 పరుగులు తీసి 7 వికెట్లు కోల్పోయిన ఇండియా.. ఈరోజు మూడు వికెట్లతో ఆట ప్రారంభించింది. ఇక క్రీజులో ఉన్న సహా, రవీంద్ర జడేజా స్కోరును అందించేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. మెల్ల‌గా రాణిస్తూ మైదానంలో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాగా భారత స్కోరు ప్రస్తుతం 272/7 (96.1 ఓవర్లకి)గా ఉంది.

సార్క్ సదస్సుకు మేం కూడా రాం.. శ్రీలంక ఔట్..

  నిన్నటి వరకూ భారత్ తో పాటు భూటాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు మాత్రమే సార్క్ సదస్సు సమావేశాలకు హాజరు కామని చెప్పాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో దేశం చేరిపోయింది. తాజాగా శ్రీలంక తాము కూడా సార్క్ సదస్సు సమావేశాలకు హాజరుకామని చెప్పేసింది. ఇదిలా ఉండగా నేపాల్ మాత్రం సరైన సమయానికే ఈ సదస్సు నిర్వహించాలని చూస్తోంది. ఈసారి  సమావేశాల బాధ్యత నేపాల్ పైనా ఉన్నందున ముందు రద్దుచేయాలని చూసినా.. మళ్లీ అదే సమయానికి నిర్వహించాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు సభ్యదేశాలన్నీ సహకరించాలని గట్టిగా కోరింది. ఇప్పుడు మరో దేశం డ్రాప్ అయింది. ఇంకా ఎన్ని దేశాలు డ్రాప్ అవుతాయో చూడాలి. కాగా పాక్ ఉరీ దాడి నేపథ్యంలో భారత్ సార్క్ సమావేశాలకి హాజరుకావద్దని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

ముద్దులగుమ్మ బతుకమ్మ

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి సందర్భమొచ్చినా..ఏ పండుగొచ్చినా ప్రత్యేక గీతానికి రూపకల్పన చేయడం, దానికి ప్రాచుర్యం కల్పించడంలో తెలుగువన్ ముందుంటుంది. అలాగే గతేడాది బతుకమ్మ సందర్భంగా తెలుగువన్ రిలీజ్ చేసిన "ముద్దులగుమ్మ బతుకమ్మ" పాటకు అనూహ్య స్పందన లభించింది. నాడు ఆ పాటలో తెలంగాణ జాగృతి సంస్థ ఛైర్మన్, ఎంపీ శ్రీమతి కవిత, తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, సినీనటి మంచు లక్ష్మీ పాల్గొన్నారు. ఇక చెప్పుకోవాల్సిన మరోకరు రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచిన పీవి సింధు. పట్టు పరికిణిలో మెరిసిపోతూ..బతుకమ్మను చేతబూని సింధు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బతుకమ్మ ఆశీర్వద ఫలితంగా సింధు ఒలింపిక్స్‌లో సత్తా చాటింది. మహిళా లోకానికే తలమానికంగా భాసిల్లుతున్న వీరి ఆటపాటను మీరు చూడాలనుకుంటున్నారా..వెంటనే కింద క్లిక్ చేయండి.  

వాళ్లు ఆర్టిస్టులు టెర్రరిస్టులు కాదు.. సర్జికల్ దాడులపై సల్మాన్ ఖాన్

  భారత్ సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడులపై ఇప్పటివరకూ పలువురు పలురకాలుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా స్పందించాడు. బీయింగ్ హ్యూమన్ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సర్జికల్ దాడులపై స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాళ్లు ఉగ్ర‌వాదులు క‌దా, ఆర్మీ తీసుకున్న చ‌ర్య స‌రైందేన‌ని స‌ల్మాన్ అన్నాడు. దీనితో పాటు పాకిస్తాన్ క‌ళాకారులపై నిషేధం విధించాల‌ని.. వారిని దేశం నుండి పంపించాలని డిమాండ్‌ చేస్తున్న దానిపై కూడా స‌ల్మాన్ మాట్లాడాడు. క‌ళాకారులు ఎక్కడైనా ఉండవచ్చని.. వారు టెర్ర‌రిస్టులు కాద‌ని అన్నాడు. అంతేకాదు ఆర్టిస్టుల‌కు ప్ర‌భుత్వ‌మే ప‌ర్మిష‌న్‌, వీసాలు ఇస్తుంద‌ని కూడా తెలిపాడు.

కర్ణాటకపై సుప్రీం మండిపాటు.. ఇదే ఆఖరి అవకాశం

  కావేరి నది జలాల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తమిళనాడుకు కావేరి నీటిని వదలాలని సుప్రీం కోర్టు గత కొద్దిరోజుల నుండి కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూనే ఉంది. అయితే కర్ణాటక మాత్రం నీటిని ఇప్పుడప్పుడే వదిలేది లేదని ఖరాఖండిగా చెబుతోంది. ఇంతకు ముందు విచారణలో సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వానికి చీవాట్లు కూడా పెట్టింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా.. తమిళనాడుకు ఎలాగైనా నీరు ఇవ్వాల్సిందే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా కర్ణాటక సర్కార్ డిసెంబర్ వరకూ నీళ్లు ఇచ్చేది లేదని మొండిగా వ్యవహరించింది. దీంతో దీనిపై మళ్లీ చర్చించిన సుప్రీం.. కర్ణాటక నిర్ణయంపై మండిపడింది. అక్టోబరు 1 నుంచి 6 వరకు తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కర్ణాటకను కోర్టు ఆదేశించింది. తీర్పును అమలు చేసేందుకు కర్ణాటకకు ఇదే చివర అవకాశమని కోర్టు తెలిపింది. అంతేకాదు మంగళవారం లోపు కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి నిర్దేశించింది. రేపటిలోగా బోర్డు సభ్యులను నామినేట్ చేయాలని తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి సుప్రీం ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ పై కర్ణాటక సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మొదటిసారి మోడీని పొగిడిన రాహుల్.. కలవాలని ఉంది

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొట్టమొదటి సారిగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. భారత్ పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ దాడులు నిర్వహించి ముష్కరులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపునే భారతసైన్యం చాలా వేగంగా పని చక్కబెట్టి తిరిగి దేశానికి వచ్చింది. అయితే భారత సైన్యం చేసిన ఈ పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాదు అగ్రరాజ్యాలు సైతం దేశం చేసిన పనిని మెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాందీ కూడా మోడీని ప్రశంసించారు. మోడీ అధికారం చేపట్టిన రెండున్నరేళ్లు అవుతుందని.. ఈరెండున్నరేళ్ల కాలంలో మోడీ చేసిన మంచి పని ఇదేనని.. రాహుల్ గాంధీ మోదీకి అభినందనలు తెలిపారు. మోదీతో మాట్లాడాలని ఉందని దానికి గల కారణం రెండున్నరేళ్ల పాలనలో మొదటిసారి ఆయన ప్రధానమంత్రిలా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తి మద్దతిస్తామని ప్రకటించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, దేశమంతా మోదీకి వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

నితీశ్ మ‌ద్య నిషేధ చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు...

  బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో మద్యపాన నిషేదం చట్టాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నితీశ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయంపై పాట్నా హైకోర్టు షాకిచ్చింది. మ‌ద్య నిషేధ చట్టాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఇది చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిషేద చట్టం ద్వారా అధికారులు ప్రజలపై కఠినమైన శిక్షలు విధిస్తున్నారు.  ఏదైనా ఇంట్లో మ‌ద్యం బాటిల్ దొరికితే ఆ ఇంట్లో ఉన్న పెద్ద‌లంద‌రూ జైలుకెళ్లాల్సిందే. ఇందులో ఉన్న సెక్ష‌న్ల‌న్నీ నాన్ బెయిల‌బుల్ కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ చట్టాన్ని చాలామంది తప్పుబట్టి కోర్టును ఆశ్రయించారు. దీంతో దీనిపై విచారించిన కోర్టు నిషేధ చట్టాన్ని రద్దు చేసింది.

షాహ‌బుద్దీన్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం..

వివాదాస్ప‌ద ఆర్జేడీ నేత మొహ‌మ్మ‌ద్ షాహ‌బుద్దీన్ బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఇటీవలే 12 సంవత్సరాల పాటు జైలులో ఉన్న షాహ‌బుద్దీన్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో షాహ‌బుద్దీన్ కు యావజ్జీవ శిక్ష పడింది. అయితే ఈమధ్యనే పట్నా హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో బయటకి వచ్చారు. అయితే ఆయన విడుదలపై బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని చెప్పాయి. షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. షహాబుద్దీన్ బెయిల్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అత‌న్ని వెంట‌నే క‌స్ట‌డీలోకి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు బీహార్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. కాగా షాహ‌బుద్దిన్‌పై మొత్తం 40 కేసులు ఉన్నాయి.

భారత్ జవాన్ ను వెనక్కి తీసుకొస్తాం.. రాజ్ నాథ్ సింగ్

బాబులాల్ అనే జవాను పొరపాటున ఎల్‌వోసీ దాటి పాక్ భూభాగంలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈయన అక్కడి సైనికులకు చిక్కారు. అయితే ఇప్పుడు ఆయన విడుదల కోసం అన్ని రకాల  ప్రయత్నాలు చేస్తున్నామని.. ఈ విషయాన్ని డీజీఎంవో పాకిస్థాన్‌కు తెలియజేశారని.. సంప్రదింపుల ద్వారా తిరిగి ఆయనను భారత్ రప్పిస్తామని  కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాగా 37 పీఆర్ విభాగానికి చెందిన జవాను గురువారం నియంత్రణ రేఖ దాటి వెళ్లినట్టు, దీనిపై పాక్ దళాలకు డీజీఎంవో టెలిఫోన్ ద్వారా తెలియజేసినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. అనుకోకుండా సరిహద్దులు దాటడం అన్నది అసాధారణం ఏమీ కాదని, ఇలాంటి సమయాల్లో అమల్లో ఉన్న విధానం ప్రకారం వారు వెనక్కి తిరిగి వస్తారని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

ఐఫోన్ 7 ప్లస్ కూడా పేలింది..

  స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ సంస్థ ఇటీవలే ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య ఈ 7 సిరీస్ స్మార్ట ఫోన్లకి అస్సలు కలిసి వచ్చినట్టు కనిపించడంలేదు. ఎందుకంటే.. గతంలో శాంసంగ్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ నోట్7 పేలిన ఘటన చోటు చేసుకోగా.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఐఫోన్ 7 ప్లస్ కు ఎదురైంది. ఐఫోన్ 7 ప్లస్ ను ఆర్డర్ చేసుకున్న ఓ కస్టమర్.. ఆర్డర్ను అందుకుని బాక్స్ తెరిచిచూడగానే పేలిపోయిన ఫోన్ను చూసి షాకయ్యాడు. ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అయ్యే మధ్యలో ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అతను చెబుతున్నాడు. రీప్లేస్మెంట్ కోసం ఆపిల్ సంస్థను ఆశ్రయించాడు. ఇక సంస్థ అధికారులు ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయలేదు. కాగా శాంసంగ్ గెలాక్సీ నోట్7 బ్యాటరీ లోపంతో పేలిపోగా, ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ మోడల్ సరియైన కారణాలు వెల్లడికాలేదు.

సరిహద్దులో భారీగా మోహరించిన భారత సైన్యం..

  భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు దేశాల సరిహద్దులో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈనేపథ్యంలో సరిహద్దు వెంబడి భారత సైన్యం భారీగా మోహరించింది. సరిహద్దు ప్రాంతాలకు యుద్ద సామాగ్రి తరలిస్తున్నారు. ఎయిర్ పోర్స్ విమానాల గస్తీ నిర్వహించారు. కేవలం ఆర్మీ పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఇక జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా హైఅలర్ట్ ప్రకటింటారు. ఇదిలా ఉండగా.. భారత్-పాక్ ల మధ్య కొనసాగుతున్న యుద్ద వాతావరణం వల్ల హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.