ట్రంప్ ను చిక్కుల్లో నెట్టిన 11 ఏళ్ల వీడియో..

  ఇంతకు ముందు అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది అంటే కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ కే అన్న వార్తలు వినిపించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎప్పుడూ వివాదాస్ప ద వ్యాఖ్యలు చేసే ట్రంప్ కు.. అవే ప్లస్ పాయింట్ గా ఉండేవి. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనకు మైనస్ అవుతున్నాయి. ట్రంప్ కు సాధారణంగా అందరిపై విమర్శలు చేస్తూనే ఉంటాడు. ఆడవాళ్లపై కూడా కామెంట్లు చేస్తూనే ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాల కిందట ఓ మహిళతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన కొంప ముంచాయి. 11 సంవత్సరాల నాటి ఓ వీడియో బయటపడింది. అందులో "అందమైన మహిళలను ముద్దు పెట్టుకోవాలి. ముద్దు మాత్రమే. ముద్దు కోసం నేను ఎంత మాత్రం వేచి చూడను. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు ఏం చేసినా ఎవరూ ఏమీ అనుకోరు. నిన్ను ముద్దు పెట్టుకోనిస్తారు", ఇలా కొనసాగింది వీడియోలోని సంభాషణ. అంతేకాదు, మహిళల కాళ్లు, వాళ్లతో లైంగిక కార్యకలాపాలు ఇలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి. బిల్లీ బుష్ తో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వీడియోలో ఉంది.   ఇంకేముంది ట్రంప్ కు ప్రత్యర్ధిగా ఉన్న హిల్లరీకి మంచి ఛాన్స్ దక్కింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్సలు గుప్పించింది. ఇలాంటి దారుణమైన వ్యక్తిత్వమున్న వ్యక్తిని అధ్యక్షుడిగా మనం అంగీకరించలేం అని ఆమె అన్నారు. ఇంకా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏం లాభం అన్న సామెత ప్రకారం.. ఇప్పుడు ట్రంప్ కూడా ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణ అని... తన మాటలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. ఇప్పటికే మొదటి ప్రెసిడెన్షియల్ భేటీలో మంచి మార్కులు సంపాదించుకున్న హిల్లరీకి... ఇది కూడా ప్లస్ పాయింట్ అయింది. ఈ వీడియో ట్రంప్ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే నవంబర్ లో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

మాథ్యూ భీభత్సం.. 400మంది మృతి

మాథ్యూ భీభత్సానికి అమెరికాలోని ఫ్లోరిడా, బహమాస్, హైతీ దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. ఇప్పటికే ఈ జల విలయానికి పలువురు ప్రాణాలు కోల్పోగా.. చాలావరకూ ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు 400 మంది పైగా మరణించినట్టు అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు అధికారులు ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఫ్లోరిడా, సౌత్‌కరోలినా రాష్ర్టాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. మాథ్యూను అత్యంత విధ్వంసకరమైన నాలుగోస్థాయి హరికేన్ (పెనుతుఫాను)గా వర్గీకరించారు అధికారులు. గంటకు 195 కి.మీ.ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా.. మాథ్యూ ఎక్కడ అడుగుపెడితే ఆ ప్రాంతమంతా విధ్వంసంగా మారుతున్నది.

సర్జికల్ దాడుల సాక్ష్యాలు బయటపెట్టాల్సిందే...

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పారు. ఇప్పటికే భారత్-పాక్ పై చేసిన సర్జికల్ దాడులకు సంబంధించిన సాక్ష్యాలు బయటపెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో దివాకర్ రెడ్డి కూడా చేరిపోయారు. సర్జికల్ దాడుల గురించిన సాక్ష్యాలు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదని మనోహర్ పారికర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలపై స్పందించిన దివాకర్ రెడ్డి.. భార‌త సైన్యం చేసిన దాడుల‌కు సంబంధించిన వీడియో పుటేజీని విడుద‌ల చేయాల్సిందేన‌ని అన్నారు. భ‌ద్ర‌తా కార‌ణాలు, రహస్య విషయాలు అంటున్నారు.. అలాంటప్పుడు ఆ వీడియోను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మాత్ర‌మే చూపించాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే ల‌క్షిత దాడులు చేశామ‌ని చెప్పుకుంటున్న ఆంశాన్ని బీజేపీ ఎన్నికల ఎత్తుగడగానే అనుకోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు.

బీసీసీఐకి సుప్రీంకోర్టు ఝలక్..

  లోథా ప్యానెల్ సిఫార్సులను అమలు చేయడంలేని నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు బీసీసీఐకి షాకిచ్చింది. నిధుల మంజూరు విషయంపై ప్రస్తావించిన కోర్టు రాష్ట్ర సంఘాల‌కు నిధులు విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని ఆదేశించింది. అంతేకాదు ఇప్పటికే విడుదల నిధులను కూడా వాడుకోవద్దని.. లోథా సిఫార్సులను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని హెచ్చరించింది. ఈ సిఫార‌సుల‌పై ఐసీసీ చీఫ్‌తో ఏం మాట్లాడారో వ్య‌క్తిగ‌తంగా ఓ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు అనురాగ్ ఠాకూర్‌ను ఆదేశించింది.  త‌ర్వాతి విచార‌ణ‌ను ఈ నెల 17కు వాయిదా వేసింది.

జయలలిత స్థానంలో ముఖ్యమంత్రిగా ఆ హీరో..?

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత 17 రోజుల నుండి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మొదట లండన్ నుండి వచ్చిన డాక్టర్ ఆమెకు చికిత్స అందించగా... ఇప్పుడు ఎయిమ్స్ నుండి వచ్చిన వైద్య బృందం ఆమెకు చికిత్స అందించనున్నారు. ఇదిలా ఇప్పుడు తమిళనాట ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న జయలలిత కోలుకోని  బయటకు చాలారోజులే పడుతుంది. ఈనేపథ్యంలో జయలలిత స్థానంలో ఎవరో ఒకరు బాధ్యతలు స్వీకరించాల్సిందే. ప్పటికే సుబ్రహ్మణ్యస్వామి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాయడం కూడా మొదలు పెట్టారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనలో శూన్యత ఏర్పడిందని.. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి ట్వీట్ల యుద్ధం ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.   ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ హీరో పేరు వినబడుతుంది. ఆమె వారసుడిగా, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు ఇప్పటికే రజనీకాంత్ తో చర్చలు జరిపారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆయనకు రాజకీయాలంటే ఆసక్తి లేదు కాబట్టి.. ఆయన ఒప్పుకోలేదట. అయితే ఇప్పుడు మరో స్టార్ పేరు వినబడుతోంది. అతనెవరో కాదు అజిత్. ఈ మేరకు ఆమె వీలునామా రాశారని, డాంబికాలకు దూరంగా ఉంటూ సామాన్యుడిలా ఉండే అజిత్ పట్ల జయలలిత అభిమానం చూపించేవారని, ఆమె వారసుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలు అజిత్ స్వీకరించనున్నాడంటూ తమిళనాడు, సోషల్ మీడియా వేదికల్లో మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. అజిత్ ను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా పార్టీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని, యువత మొత్తం అన్నాడీఎంకే వెన్నంటి ఉంటారని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి జయలలితకు ఆప్తులైన పన్నీర్ సెల్వం, శశికళ ఉండగా ఆ అవకాశం అజిత్ కు దక్కుతుందా..? అసలు అజిత్ కు ఇంట్రెస్ట్ ఉందా.. ? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

భారత్‌-పాక్‌ సరిహద్దును మూసేస్తాం.. రాజ్‌నాథ్‌ సింగ్‌

  భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉరీ దాడి అనంతరం రగిలిపోయిన భారత్.. పాక్ భూభాగంలోకి చొరబడి సర్జికల్ దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇది జీర్ణించుకోలేని పాక్ భారత్ సరిహద్దులో కాల్పులకు తెగబడుతుంది. ఇప్పటికే ఎన్నో సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి.. పలుచోట్ల కాల్పులు జరిపింది. అయితే తరచూ పాక్ కాల్పులకు పాల్పడుతుండటంతో.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సరిహద్దు భద్రతపై  రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రతా కారణాల దృష్ట్యా ముఖ్యమంత్రుల సూచనలతో భారత్‌-పాక్‌ సరిహద్దును 2018 డిసెంబర్‌ వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, విజయ్‌ రూపాని, వసుంధర రాజె, పంజాబ్‌ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ సహా ఆయా రాష్ట్రాల హోంశాఖ మంత్రులు హాజరయ్యారు.

నితీశ్ ప్రభుత్వానికి ఊరట.. మద్యపాన నిషేదానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్...

  బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో మద్యపాన నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం అరాచకాలు ఎక్కువవ్వడంతో కొంతమంది బీహార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. మద్య నిషేధ చట్టాన్ని రద్దు చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నితీశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మద్యాన్ని నిషేధించాలా? విక్రయించాలా? అన్న విషయంలో ప్రభుత్వానిదే నిర్ణయమని అభిప్రాయపడి.. మద్య నిషేధానికి గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.  హైకోర్టు ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది.

తమిళనాడుపై స్వామి కన్ను... రాష్ట్రపతి పాలనకు డిమాండ్..

  ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు తమిళనాడు పై పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత 17 రోజుల నుండి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని స్వామి డిమాండ్ చేశారు. దీనిలో భాగంగానే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్వామి లేఖ రాశారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనలో శూన్యత ఏర్పడిందని.. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగు పడేవరకు ఆరు నెలల పాటు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) అమలు చేయాలని డిమాండ్ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

జయలలితను పరామర్శించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను పరామర్శించడానికి గాను రాహుల్ గాందీ అపోలో ఆస్పత్రికి చేరుకొని ఆమెను పరామర్శించారు. రాహుల్ గాంధీని అపోలో ఛైర్మ‌న్ ప్ర‌తాప్‌రెడ్డితో పాటు, త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రులు జ‌య‌ల‌లిత వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. వైద్యుల‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ... జ‌య‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితిపై వివ‌రాలు తెలుసుకున్నారు. మ‌రోవైపు ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో జ‌య‌ల‌లిత అభిమానుల పూజ‌లు కొన‌సాగుతున్నాయి.   ఇదిలా ఉండగా ఇప్పటికే ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన వైద్యులు జయలలితకు చికిత్స అందించడానికి అపోలో వెళ్లారు. వారి పర్యవేక్షణలో ప్రస్తుతం అమ్మకు చికిత్స జరుగుతోంది.

భారత్ కు నిరాశ...పాక్ ను ఉగ్రదేశంగా ప్రకటించలేం..

  పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని.. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని.. అందుకే పాక్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని అగ్రరాజ్యమైన అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో భారత్ కు నిరాశే ఎదురైంది. ఎందుకంటే పాకిస్థాన్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించలేమని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఈ సందర్బంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి కిర్బీ మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ లు సమస్యల పరిష్కారం దిశగా అర్థవంతమైన చర్చలు జరపాలని.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పారు. భారత్ కు సమస్యాత్మకంగా మారిన ఉగ్రవాద తండాల ఏరివేత కోసం తాము ఇరు దేశాల ప్రభుత్వాలతో కలసి పని చేస్తామని తెలిపింది. అంతేకాదు అణ్వాయుధాలు టెర్రరిస్టులకు దొరకకుండా పాకిస్థాన్ అన్ని చర్యలు తీసుకుందని భావిస్తున్నట్టు తెలిపారు.

పాక్ హ్యాకర్లకు చెమటలు పట్టిస్తున్న భారత హ్యాకర్లు..

  పాక్ భూభాగంలోకి చొరబడి..సర్జికల్ దాడులు జరిపి పలువురు ముష్కరులను మట్టుబెట్టి భారత సైన్యం పాక్ కు చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు తాము కూడా పాక్ చెమటలు పట్టిస్తాం అంటున్నారు భారత హ్యాకర్లు. పాకిస్థానీ ప్రభుత్వ నెట్‌వర్క్‌లోకి సమర్థంగా ప్రవేశించిన హ్యాకర్లు వాళ్ల కంప్యూటర్లు, డేటా మొత్తాన్ని లాక్ చేసేస్తున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక పాక్ సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత హ్యాకర్లకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. తమ కంప్యూటర్లను అన్‌లాక్ చేస్తే భారీ మొత్తం ఇస్తామని అంటున్నారు. అయితే దీనికి భారత హ్యాకర్లు మాత్రం ససేమిరా అంటూ వాళ్ల ఆఫర్లను తిరస్కరించారు. కాగా భారత్ చేసిన సర్జికల్ దాడులకు గాను పాకిస్థాన్.. హ్యాకర్లు కొందరు భారతీయ సైట్లలో కొన్నింటిని హ్యాక్ చేసి, వాటిలో తమ దేశభక్తి గీతాలను పోస్ట్ చేశారు. దీంతో ఒళ్లు మండిపోయిన భారత హ్యాకర్లు ఏకంగా వారి ప్రభుత్వ సైట్లేవీ అసలు పనిచేయకుండా చేసేశారు. అసలే ప్ర‌పంచానికి సాఫ్ట్‌వేర్ల‌ను స‌ప్లై చేస్తోన్న దేశంగా పేరొందిన భార‌త్ తమ సైట్లనే హ్యాకింగ్ చేస్తే ఊరుకుంటుందా.. పాక్ సరైన సమాధానం చెప్పింది.

దొరికిన శకలాలు ఎంహెచ్‌370 మలేషియా విమానానివే..

  రెండేళ్ల క్రితం గల్లంతైన మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్‌370 విమాన శకలాలను ఎట్టకేలకు గుర్తించారు. 2014 మార్చి 8న ఎంహెచ్‌370 విమానం 239 మంది ప్రయాణికులతో గల్లంతైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ విమానం కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికి ఫలితాన్ని సాధించారు. మారిషన్ లో దీనికి సంబంధించిన కొన్ని శకలాలు లభ్యమవ్వగా.. అవి ఎంహెచ్ 370 విమానానివేనా కాదా అన్న సందేహం ఏర్పడింది. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విస్తృత గాలింపు చేపట్టారు. చాలా రోజుల తర్వాత హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల విమాన శకలాలు లభ్యమయ్యాయి. ఆఖరికి మారిషస్‌ తీరంలో దొరికిన విమాన రెక్క భాగం ఎంహెచ్‌370కి చెందినదేనని విచారణ అనంతరం అధికారులు స్పష్టం చేశారు. కాగా కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌ వెళ్తుండగా ఈ విమానం కుప్పకూలిపోయింది. విమాన ప్ర‌మాదంలో 200 మందికి పైగా ప్ర‌యాణికులు, విమాన‌సిబ్బంది మృతి చెందారు.

22 విమానాశ్రయాలకు హెచ్చరికలు.. ఏ క్షణమైనా దాడి జరగొచ్చు

  ఇప్పటికే భారత్ సైన్యం చేసిన దాడులకు గాను పాకిస్థాన్ పిచ్చిపట్టినట్టు భారత సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విమానాశ్రయాలను కూడా టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 22 విమానాశ్రయాలపై ఉగ్రవాదులు ఏ క్షణమైనా దాడి చేయవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీల్లోని 22 ఎయిర్ పోర్టులకు ఈ హెచ్చరికలు అందాయి. దీంతో ఈ విమానాశ్రయాల్లో భద్రత మరింత పెంచాలని అధికారులు సూచించారు. ఈ నాలుగు రాష్ట్రాల పోలీసు చీఫ్లకు, వీటి భద్రను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్, పారా మిలిటరీ దళాలకు కూడా సమాచారాన్ని అందించాయి. ముఖ్యంగా బ్యాగేజీ కౌంటర్లు, పార్కింగ్ ప్రాంతాలపై మరింత సునిశిత దృష్టిని సారించాలని ఐబీ అధికారులు సూచించారు.

ఫ్లోరిడాలో మాథ్యూ తుఫాను భీభత్సం...

  అమెరికాలోని ఫ్లోరిడా తుఫాను ‘మాథ్యూ’ భీభత్సానికి వణికిపోతుంది. ఈ తుఫాను వల్ల ఇప్పటికే ఫ్లోరిడాలో దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాన్ వల్ల పెనుగాలులు, భారీ వర్షాలు వస్తుండటంతో లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఇప్పటికే ఫ్లోరిడా, జార్జియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ ప్రమాదక ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతున్నారు. దశాబ్ద కాలంలో కరేబియన్‌ ప్రాంతంలో సంభవించిన తుఫానుల్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. అమెరికా ఆగ్నేయ రాష్ట్రాలు ఫ్లోరిడా నుంచి నార్త్‌కెరోలినా వరకు అప్రమత్తంగా ఉండాలని ఎమర్జెన్సీ ప్రకటించారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

అపోలోకి ఎయిమ్స్ బృందం.. జయలలిత చికిత్స కోసం

  జయలలిత ఆరోగ్యంపై ప్రస్తుతం కుదుటపడుతుంది అని చెబుతున్నా.. ఆమె అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఇంకా ఆందోళనగానే ఉంది. ఇప్పటికే ఆమెకు అత్యంత మెరగైన వైద్యం అందించడానికి లండన్ నుండి డాక్టర్ వచ్చి వెళ్లగా.. ఇప్పుడు ఎయిమ్స్ కు చెందిన ముగ్గరు డాక్టర్లు జయలలిత వైద్య చికిత్సలో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు. ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ జీసీ కుల్కర్ణీ, గుండె జబ్బుల వైద్యుడు డాక్టర్ నితీశ్ నాయక్, అనెస్థీసియా నిపుణుడు డాక్టర్ అంజన్ త్రిఖా అపోలోకు వచ్చారు. వెంటిలేటర్‌పై ఉన్న జయకు ప్రస్తుతం యాంటీబయాటిక్స్ చికిత్స జరుగుతున్నదని.. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నదని, మరికొన్ని రోజులు ఆమె హాస్పిటల్‌లోనే ఉండాలని అపోలో వర్గాలు తెలిపాయి.