మోడీని కలిసిన అజిత్ ధోవల్.. తేలికగా తీసుకోవద్దు..

భారత్ సైన్యం చేసిన దాడులకు పగతో రగిలిపోతున్న పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. గత రాత్రి బారాముల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్ పై ఫిదాయీల దాడి చేసిన ఉగ్రవాదులు.. ఇప్పుడు పూంఛ్ సెక్టారులో సైనికులపై కాల్పులు జరిపారు. అయితే పాకిస్థాన్ చేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై మాట్లాడేందుకు ప్రధాని నరేంద్రమోడీని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కలిశారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోడీ అన్ని అధికారాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎటువంటి చొరబాటు, ఉగ్రదాడి, సరిహద్దులకు ఆవలి నుంచి కాల్పులు వంటి ఘటనలను తేలికగా తీసుకోవద్దని, గట్టిగా స్పందించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇంకా బారాముల్లాలో కాల్పులు నేపథ్యంలో పారిపోయిన ఉగ్రవాదులను కూడా పట్టుకోవాలని.. లేకపోతే ఎన్ కౌంటర్ చేయాలని ఆదేశించారు.

కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం డెడ్ లైన్..

తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరి నీటి జలవివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కర్ణాటక ప్రభుత్వ తీర్పుపై  మండిపడింది. గత విచారణలోనే తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని ఇదే ఆఖరి అవకాశమని చెప్పినా కర్ణాటక ప్రభుత్వం మాత్రం నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని చెబుతోంది. సీఎం సిద్దరామయ్య ఈ ఉదయం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకోకుండా నదిపై ప్రాజెక్టులు నిర్మించుకుంటే, ఇప్పుడు బలిపశువుగా మారినట్లయిందని.. తమిళనాడుకు నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఉన్న నీరు తాగు అవసరాలకు కూడా పరిస్థితి లేదని, ఇక దిగువకు నీరెలా ఇవ్వగలమని ఆయన ప్రశ్నించారు.   ఇదిలా ఉండగా ఈరోజు దీనిపై విచారించిన సుప్రీం కర్ణాటక సర్కార్ కు డెడ్ లైన్ విధించింది. ప్పటివరకూ తమిళనాడుకు ఎంత నీరు వదిలారు? అసలు వదిలారా? లేదా అన్న విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తెలియజేయాలని న్యాయమూర్తి డెడ్ లైన్ విధించారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన నిర్ణయాలు తప్పవని కూడా కోర్టు హెచ్చరించింది. మరి దీనిపై కర్ణాటక సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తెలంగాణ కొత్త జిల్లాల్లోకి మరో మూడు జిల్లాలు...

  తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు తోడుగా మరో 17 జిల్లాలు ఏర్పాటు చేసి మొత్తం 27 జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై అక్కడక్కడ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తమ ప్రాంతాన్ని కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆందోళనలు కూడా చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అయితే గద్వాల్ ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఈనేపథ్యంలో 17 జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలు వచ్చి చేరనున్నట్టు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోని జనగామలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ మూడింటిని జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ చాలారోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై పలువురు నేతలతో చర్చించనున్నారు. ఇదివరకు ప్రకటించిన 17 జిల్లాలకు ఈ మూడు కలిపి మొత్తంగా 20 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కావేరి నీటి పై సుప్రీం ఆగ్రహం.. చేతులెత్తేసిన కేంద్రం...

కర్ణాటకపై తీరుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎన్నిసార్ల్లు చెప్పినా.. కర్ణాటక సర్కార్ మాత్రం పంపలేమనే చెబుతుంది. ఈనేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వానికి ఆఖరి అవకాశ్ని ఇచ్చింది. ఇప్పుడు మరోసారి కర్ణాటకపై సుప్రీం మండిపడుతుంది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయకపోవడంపై తాము ఆదేశిస్తున్నా, కర్ణాటక పట్టించుకోవడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. ఆపై తక్షణం ఇరు రాష్ట్రాల అధికారులు, జల నిపుణులతో కావేరీ రివర్ బోర్డును ఏర్పాటు చేసి, నీటి నిల్వ, పంపిణీపై చర్చించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేమని కేంద్రం తేల్చిచెప్పేసింది. ఉత్తర్వులను సవరించాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసింది.

రాజధాని నుండి పాలన.. సర్వం సిద్దం..

  నూతన సచివాలయం నుండి పరిపాలను సర్వం సిద్దం అయినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 3 నుండి ఏపీ నూతన రాజధాని అమరావతి నుండే పాలన సాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ నుండి వెయ్యిమంది ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లారు. ఈరోజు నుండే వారు విధుల్లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇక సచివాలయంలో ఉద్యోగులు వర్క్ స్టేషన్లు, ఐఏఎస్ ల ఛాంబర్ల  ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఫైనాన్స్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబధించిన ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే ఆదివారం ఏపీ రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి పలు కార్యాలయాల సామగ్రిని తరలించారు. ఎంజే మార్కెట్‌లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏపీకి చెందిన కార్యాలయ టేబుళ్లు, కుర్చీలు, ఫైల్స్, కంప్యూటర్లు, ఫ్యాన్‌లు, ఏసీలు ఇతర సామగ్రిని 18 డీసీఎం వాహనాలలో తరలించింది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏపీ డీఎంఈ, డీహెచ్, వైద్య విధాన పరిషత్ కార్యాలయాలు కూడా ఏపీ రాజధాని అమరావతికి తరలివెళ్తున్నాయి.

నితీశ్ కటారా హత్య కేసు.. సుప్రీం తుది తీర్పు..

  బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీశ్ కటారా హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈకేసులో నిందితులకు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. వివరాల ప్రకారం..  నితీశ్ కటారా.. యూపీకి చెందిన డీపీ యాదవ్ కుమార్తె భారతీ యాదవ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం ఆమె సోదరులైన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు తెలియడంతో వారు.. వారి ప్రేమను వ్యతిరేకించారు. దీంతో పగపెంచుకున్న వికాస్ యాదవ్, విశాల్ యాదవ్.. తన స్నేహితుడైన సుఖ్ దేవ్ సహకారంతో  ఓ వివాహానికి హాజరైన నితీశ్‌ ను కిడ్నాప్ చేసి, సుత్తితో విచక్షణారహితంగా కొట్టి, డీజిల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. అయితే మూడు రోజుల తరువాత నితీశ్ మృతదేహం బయటపడటంతో దానిని పరీక్షలు నిర్వహించిన వైద్యులు అది నితీశ్ కటారా మృతదేహమే అని తేలింది. ఇక కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్, సుఖ్ దేవ్ పహిల్వాన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు వారికి 25 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అయితే శిక్ష తగ్గించాలని వారు సుప్రీంను ఆశ్రయించగా దీనిపై విచారించిన కోర్టు, ఉరిశిక్ష వేయలేమని స్పష్టం చేస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది.

అమ్మ ఆరోగ్యంపై వీడని ఉత్కంఠం.. ప్రత్యేక పూజలు

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత  ఆరోగ్యంపై  ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఒకపక్క అమ్మ ఆరోగ్యంపై అన్నాడీఎంకే అగ్రనేతలు ఆందోళన వద్దంటున్నా.. కార్యకర్తలు, అభిమానులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె చికిత్స పొందతున్న అపోలో ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఆమె త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక వైద్యులు మాత్రం జయ ఆరోగ్యం స్థిరంగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాకపోతే ఆమె కోలుకోవడానికి మరింత సమయం అవసరమని తెలుపుతున్నారు. ఇదిలాఉండగా..మరోవైపు డీఎంకే అధినేత, పార్టీ నేతలు మాత్రం జయలలిత ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేయాలని... ఆమె ఫొటోలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇంత ఆందోళన నెలకొన్నా..కేడర్ కు సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూజిలాండ్ టార్గెట్ 376..

  భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్ లో కొన‌సాగుతున్న ఈ మ్యాచ్లో రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ భారత్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ల్ లో 316 పరుగలు చేయగా.. న్యూజిలాండ్ మాత్రం 204 పరుగులకై ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు బ్యాటింగ్ సాగించిన ఇండియా వరుస వికెట్లు కోల్పోయి.. చాలా పేలవమైన ప్రదర్సనతో 263 పరుగలు చేసి అలౌటయింది. దీంతో దీంతో న్యూజిలాండ్ టీమ్ ముందు 376 ప‌రుగుల ల‌క్ష్యం ఉంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా భారత్ చేతిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

పాక్ ఉగ్రదాడి.. ఉగ్రవాదులు మృతి

  భారత్ -పాక్ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ చేసిన సర్జికల్ దాడులకు గాను పాక్ భారత్ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి ఉగ్రదాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లోని పలు దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు.. నిన్న రాత్రి బారాముల్లా సెక్టార్ లోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు తిరిగి కాల్పులు జరపగా.. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదలు మరణించగా..ఒక జవాను మృతిచెందినట్టు తెలుస్తోంది. అయితే ఆర్మీ సెంటర్ లోకి ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు చొరబడి ఉండవచ్చని.. మిగిలిన వారు తప్పించుకొని పారిపోయి ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని.. ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహిస్తున్నట్టు సైన్యాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు బారాముల్లాలో పరిస్థితిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

ఇండియాలోకి బెలూన్లను వదిలిన పాక్..

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ రగిలిపోతోంది. దీంతో ఏ క్షణంలోనైనా భారత్‌పై విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ నుంచి బెలూన్లు ఎగిరివచ్చి మనదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పడుతున్నాయి. ఆ బెలూన్లపై ఉర్దూ భాషలో హెచ్చరికలు, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు ఉన్నాయి. మా దగ్గర సహనం కత్తులు ఉన్నాయ్, మోడీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీ సత్తా ఎంటో నేరుగా తలపడి చూసుకోవాలి అంటూ పలు రకాల హెచ్చరికలను కాగితాలపై రాసి వాటిని బెలూన్లకు అంటించి విడిచి పెడుతున్నారు. వీటిని చూసిన స్థానికులు సమాచారాన్ని భద్రతా బలగాలకు తెలియజేయడంతో వారు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

భారత జలాల్లో పాక్ బోటు..

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడి అనంతరం పాక్ ప్రతీకార దాడులకు దిగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది..సరిహద్దులతో పాటు సముద్రంలోనూ గస్తీని పెంచారు. ఈ పరిస్థితుల్లో భారత జలాల్లోకి ఒక పాకిస్థాన్ బోటు దూసుకొచ్చి కలకలం రేపింది. ఇవాళ ఉదయం 10.15 ప్రాంతంలో గుజరాత్ సముద్ర తీరంలో ఐసీజీఎస్ సముద్ర పావక్‌లోని కోస్టు గార్డు దళాలు పాకిస్థాన్ బోటును గుర్తించి వెంబడించాయి. బోటును, బోటులోన ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వారంతా మత్య్సకారులని తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని పోరుబందర్‌కు తరలించారు.

దసరా వేడుకలపై పాక్ గురి..

పీవోకేలో భారత్ మెరుపు దాడులతో ఏం చేయాలో పాలుపోని పాకిస్థాన్‌ను దొంగదెబ్బతీయాలని భావిస్తోంది. ఈ నేపథ్యలో దసరా వేడుకల్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా కోస్టుగార్డు దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నెల్లూరు జిల్లాలోని షార్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. షార్‌లోని మొదటి,రెండు గేట్లతో పాటు, సముద్రం వైపున సాధారణ రోజుల కన్నా బలగాలను పెంచారు. షార్ అడవుల్లోనూ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఐఎస్ఎఫ్ బలగాలకు ఆదేశాలు జారీ చేశారు.

ఏకాకైనా పాక్... సార్క్ సదస్సు వాయిదా

  పాక్ భారత్ విజయం సాధించింది. ఉరీ దాడి అనంతరం పాక్ పై ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో భారత్ రోజుకో ఎత్తు వేస్తుంది. ఇప్పటికే సార్క్ సదస్సుకు హాజరుకానని కానని చెప్పిన భారత్ బాటలో పలు దేశాలు చేరాయి. ముందు భారత్ తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ దేశాలు కూడా మద్దతు పలికి తాము కూడా సదస్కుకు రానని చెప్పేశాయి. నిన్న ఆ దేశాలకు తోడుగా శ్రీలంక, మాల్దీవులు కూడా సార్క్ సదస్సుకు హాజరుకామని తేల్చిచెప్పేసింది. దీంతో సార్క్ సభ్య దేశాల్లో పాక్ ఏకాకి అయ్యి.. ఇస్లామాబాద్ లో జరగాల్సిన 19వ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది.

పాక్ లో భారత్ ఛానెళ్లు రద్దు...

  భారత్ చేసిన దాడులకు ఏం చేయాలో తెలియని పాకిస్థాన్ వాళ్లు ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవాలి అనుకుంటున్నట్టు ఉన్నారు. అందుకే తమకు నచ్చినది చేసుకుంటూ పోతున్నారు. దీనిలో భాగంగానే.. భారతీయ చానెళ్లు ఏవీ కూడా పాకిస్థాన్‌లో ప్రసారం కాకుండా ఆ దేశం నిషేధం విధించనుంది. ఈ నెల 15 తర్వాత భారతీయ చానెళ్లు ఏవీ కూడా దేశంలో ప్రసారం కాకుండా పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా నియంత్రణ సంస్థ (పీఈఎంఆర్‌ఏ) నిర్ణయం తీసుకున్నట్టు ఓ పత్రిక తెలిపింది. ఎవరైనా కేబుల్‌ ఆపరేటర్లు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పాకిస్థానీ కళాకారులపై, పాక్‌ టీవీ కార్యక్రమాలపై భారత్‌లో నిషేధం విధించారని, అందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు పేర్కొంది.

రెండో టెస్ట్ రెండో రోజు ముగిసింది.. వెనుకంజలో కివీస్

భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు మ్యాచ్ ముగిసింది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిన్న ప్రారంభమైన మ్యాచ్లో భారత్ టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న 239 పరుగులు తీసి 7 వికెట్లు కోల్పోయిన భారత్.. ఈరోజు మ్యాచ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వికెట్లు కోల్పోయి.. 316 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఇక బ్యాటింగ్ కు దిగిన కివీస్ మొదటినుండి కాస్త తడబాటుతోనే బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఇక కొద్దిసేపటికే చిరుజల్లులు పలకరించడంతో మ్యాచ్ ఆగిపోయింది. దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 316 పరుగుల చేయగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ నాలుగు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. దాంతో 188 పరుగుల తేడాతో న్యూజిలాండ్ వెనుకబడిఉంది.

ఐడీఎస్ వెలుగులోకి తెచ్చిన నల్లధనం..రూ.65,250 కోట్లు

  మొన్నటివరకూ పనామా పేపర్స్.. బహమాస్ పేపర్స్ నల్లధనం కుబేరుల పేర్లు బయటపెట్టి పలువురికి చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐడీఎస్ (ఆదాయం వెల్లడి పథకం) ద్వారా కొన్ని కోట్ల విలువైన బ్లాక్మనీ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గడువు నిన్నటితో ముగియడంతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమావేశం ఏర్పాటుచేసి నల్లధన వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్ల పాలనలో పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుందని.. మొత్తం 64,275 దగ్గర్నుంచి రూ.65,250 కోట్లు సేకరించినట్టు వెల్లడించారు. రూ.8,000 కోట్లను హెచ్ఎస్బీసీ జాబితా ద్వారా గుర్తించినట్టు చెప్పారు. రూ.16వేల కోట్లను ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుందని తెలిపారు.

ఎమ్మెల్యే పదవికి డీకే అరుణ రాజీనామా..

  కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గద్వాల్ ను కూడా ఆమె జిల్లాగ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆమె గత కొద్దికాలంగా పోరాటం చేస్తున్నారు కూడా. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తన రాజీనామా లేఖను చదివి వినిపించారు. గద్వాలను జిల్లాగా చేయాలని ఏడాదిగా పలుమార్లు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చామని..జిల్లా కోసం శాంతియుత ఉద్యమాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు జరిగాయని, ప్రజల ఆకాంక్షను సీఎంకు అనేక రూపాల్లో తెలిపామని వివరించారు. ప్రజల అభ్యంతరాలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు కానీ.. చివరకు వాటిని పట్టించుకోలేదని అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

జయలలిత ఆరోగ్యంపై ఆందోళన... చికిత్స కోసం లండన్ డాక్టర్

  గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చైన్నె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మెరుగైన చికిత్స అందించడానికి విదేశీ వైద్యులు కొద్దిసేపటి క్రితం చెన్నైకి చేరుకున్నారు. లండన్‌కు చెందిన కన్సల్టెంట్‌ ఇంటెన్సివిస్ట్‌ డా.రిచర్డ్‌ జాన్‌ బేలే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రిచర్డ్‌ పర్యవేక్షణలోనే ఆమెకు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ ప‌రీక్ష‌లు కొన‌సాగుతాయ‌ని వైద్యులు తెలిపారు.   మ‌రోవైపు జయలలిత ఆరోగ్యంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే వదంతులు సృష్టిస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి జయలలిత ఆరోగ్యం గురించి హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అపోలో ఆసుప‌త్రికి వెళ్లి ఆమెను పరామర్శిస్తారు. అమ్మ అభిమానులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.