అలా చేస్తే మేం పీవోకే లోకి ప్రవేశించాల్సి వస్తుంది.. పాక్ కు భారత్ హెచ్చరిక

  భారత్ చేసిన సర్జికల్ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఇప్పటికే పలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. భారత్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడుతుంది. అయితే ఈ విషయంలో భారత్ ఇప్పుడు పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పాక్ భూభాగంలోకి చొరబడి దాడులు చేశాం.. ఉగ్రవాదులకు ఇదే విధమైన మద్దతు పాక్ నుంచి లభిస్తే మాత్రం ఎల్ఓసీ నిబంధనలను తాము పాటించబోమని, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశిస్తామని మరోసారి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పాక్ వైపు నుంచి చొరబాట్లు ఆగని పక్షంలో, ఇండియా వైపు నుంచి కూడా చొరబాట్లు చేసే హక్కు తమకుందని వెల్లడించినట్టు తెలిపారు. ఎల్ఓసీ వెంబడి వున్న పాక్ గ్రామాల నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని, వీటిని పాక్ సైన్యం దగ్గరుండి ప్రోత్సహిస్తూ, ఆపై వారు జరిపే మారణకాండను చూస్తోందని ఆరోపించిన భారత్, ఇకపై అలా జరగనివ్వబోమని పాక్ కు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.

రెండో డిబెట్ లోనూ హిల్లరీదే పైచేయి..

  మొదటి ప్రెసిడెన్షియల్ డిబెట్ లో హిల్లరీ క్లింటన్ మంచి మార్కులు సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్, హిల్లరీ క్లింటన్ మధ్య జరిగిన రెండో బిగ్ డిబెట్ లోనూ హిల్లరీ క్లింటనే ఆధిక్యం సాధించినట్టు తెలుస్తోంది. మొదటి డిబెట్ లో తాము ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాం అన్న దానిపై మాట్లాడిన ఇరువురు.. ఈసారి డిబెట్ లో మాత్రం వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. ఇక ఈ డిబేట్ అనంతరం ఓ టీవీ చానల్ పోల్ నిర్వహించగా, అత్యధికులు హిల్లరీవైపు నిలిచారు. 5 పాయింట్లకు గాను హిల్లరీకి సరాసరిన 3.56, ట్రంప్ కు 2.59 పాయింట్లు లభించాయి. మొత్తానికి తన నోటి దురుసుతోనే ఇన్నాళ్లు అధ్యక్ష పదవి ట్రంప్ కే దక్కుతుంది అని అనుకున్నా.. ఆఖరి క్షణాల్లో మాత్రం అదే అతనికి చిక్కులు తెచ్చిపెడుతుంది. మరి నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..

వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. ప్రస్తుత స్కోర్ 123/1

  ఇండోర్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టు మొద‌టి ఇన్సింగ్స్ లో టీమిండియా 557 పరుగులు చేసింది. ఇక మొదటి ఇన్సింగ్స్ లో ఆధిక్యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా న్యూజిలాండ్ బ‌రిలోకి దిగింది. గుప్టిల్, లాథ‌మ్ క్రీజులో ఓపెన‌ర్లుగా దిగగా.. న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 37 ఓవర్లకి 123 పరుగులు తీసింది. మొద‌టి, రెండ‌వ టెస్టుల్లో ఇరు జట్లలో బౌల‌ర్ల హ‌వా కనిపించ‌గా, మూడో టెస్టులో మాత్రం బ్యాట్స్‌మెన్ హ‌వా క‌నిపిస్తోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించిన విషయం విదితమే.

మారిన చైనా... ఎన్ఎస్జీ సభ్యత్వానికి సహకరిస్తాం..

  చైనా, పాకిస్థాన్ లు ఎప్పుడూ భారత్ కు పక్కలో బల్లెంలా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒకపక్క పాక్-భారత్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు చైనా ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన ప్రకటించింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ఇండియా ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి అగ్రరాజ్యాలు సైతం ఓకే చెప్పినా చైనా మాత్రం అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. అంతేకాదు ఇండియాకు సభ్యత్వం ఇచ్చినప్పుడు పాక్ కు కూడా ఇవ్వండి అంటూ మధ్యలో పుల్ల పెట్టింది. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో ఇండియా చేరేందుకు తాము సహకరిస్తామని చైనా మంత్రి ఒకరు వెల్లడించారు. ఎన్ఎస్జీలో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని ఇండియా పొందేందుకు గల అన్ని అవకాశాలనూ చర్చించనున్నట్టు విదేశాంగ శాఖ సహాయమంత్రి లీ బావోడాంగ్ పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య మంచి సంబంధాలున్నాయని, ఇండియా అణుశక్తి సరఫరాదారుల గ్రూప్ లో చేరే విషయంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయంపై తెగబడ్డ ఉగ్రవాదులు..

ఇప్పటికే పలుసార్లు కాల్పులు జరిపిన పాక్ ఇప్పుడు జమ్మూకాశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడ్డారు.  శ్రీనగర్ శివారుల్లో ఉన్న జమ్ము అండ్ కశ్మీర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐ)కు చెందిన ప్రభుత్వ భవనంలో ఉగ్రవాదులు దాక్కుని కాల్పులు జరుపుతున్నారు. భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉండవచ్చని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. ఈ ఉదయం 6.30 గంటల నుంచి గన్ షాట్స్ శబ్దం వినిపిస్తోంది. మరోవైపు, భద్రతాదళాలు కూడా భవనాన్ని చుట్టుముట్టి, ముష్కరులను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా ఈ కాల్పుల్లో ఒక సైనికుడికి గాయాలయ్యాయి.

దుమ్ములేపిన కోహ్లీ..కెప్టెన్‌గా రెండో డబుల్ సెంచరీ...

న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. కెరిర్‌లో రెండో డబుల్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 347 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో కోహ్లీ 200 మార్క్ చేరుకున్నాడు. తద్వారా కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లలో ఇప్పటికే ధోనిని అధిగమించిన విరాట్..తాజాగా డబుల్ సెంచరీతో టైగర్ పటౌడిని దాటేశాడు. కాగా భారత జట్టు కెప్టెన్లుగా ఉండి సెంచరీలు సాధించిన వారిలో గవాస్కర్ 11 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా..అజారుద్దీన్ 9, సచిన్ 7 శతకాలతో ముందున్నారు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కీవీస్ ఓపెనర్లు గుప్తిల్ 10, లాథమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మాయావతి ర్యాలీలో తొక్కిసలాట

బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం పదో వర్ధంతితో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఎస్పీ అధినేత్రి మాయవతి నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. లక్నోలోని కాన్షీరాం సమరక్ స్థల్ వద్ద చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి..ఇద్దరు మరణించగా..13 మంది గాయపడ్డారు. మరణించిన ఇద్దరు మహిళలు..పైగా వృద్ధులు. సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైదానంలోని గేట్ నెంబర్ 1 నుంచి పెద్దసంఖ్యలో జనం ఒకేసారి వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని లోక్‌బంధు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. జరిగిన దుర్ఘటనపై మాయవతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలో లీకేజ్ కలకలం..

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లీకేజ్ కలకలం రేగింది. కార్గో టెర్మినల్‌ వద్ద రేడియో యాక్టివ్ రసాయనం లీకైంది. ఎయిర్ ఫ్రాన్స్ విమానం ద్వారా వచ్చిన మెడికల్ పార్శిల్‌లో ఈ లీక్ సంభవించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అధికారులకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా కార్గో టెర్మినల్ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. లీక్ అయిన రేడియో యాక్టీవ్ రసాయనం క్యాన్సర్ చికిత్సలో వాడే న్యూక్లియర్ మెడిసిన్‌‌కు సంబంధించినది అని, ఇప్పుడు విడుదలైన రసాయనం తీవ్రత చాలా తక్కువ అని అధికారులు వెల్లడించారు. ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి ప్రమాదము లేదని తెలిపారు.

పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్ మార్పు.. ?

  పాక్‌ గూఢచార సంస్థల్లో ఒకటైన ఇంటర్‌-సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ) లెఫ్టినెంట్‌ జనరల్‌ రిజ్వాన్‌ అఖ్తర్‌ను ఆ పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్దవాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు చేయదలచుకున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాద అంశంలో అంతర్జాతీయంగా వివాదాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో అఖ్తర్‌ను ఆ పదవి నుంచి మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా లెఫ్టినెంట్‌ జనరల్‌ అఖ్తర్‌ ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా 2014 సెప్టెంబర్‌లో నియమితులయ్యారు. జనరల్‌ జహీర్‌ ఉల్‌ ఇస్లామ్‌ స్థానంలో అఖ్తర్‌ను నియమించారు. మూడేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది వరకూ ఉన్నా అప్పుడే అతనిని మార్చే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు మరిన్ని కీలక మార్పులు చేసేందుకు పాక్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ స్కోర్ 267/త్రీ..

  భారత్-పాక్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇండోర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ప్రారంభమైన మ్యాచ్.. తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న కోహ్లీ.. 103 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ లో 13 వ సెంచరీ చేశాడు. ఇంకా కోహ్లీకి భాగస్వామిగా ఉన్న రహానే కూడా 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ, రహానే భాగస్వామ్యంలో 182 పరుగులు చేశారు. బోల్ట్, పటేల్, సాంట్నర్ తలో ఒక వికెట్ తీసుకున్నారు. ఇప్పటికే తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించిన విషయం విదితమే.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కు ‘చావెజ్‌’ శాంతి పురస్కారం..

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అరుదైన పురస్కారం దక్కింది. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ గౌరవార్థం ఓ శాంతి పురస్కారాన్ని ఆ దేశం ప్రారంభించింది. తొలిసారిగా ఈ పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అందజేయనున్నట్లు ప్రస్తుత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మాడ్యురో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతి, సార్వభౌమత్వానికి విశేషకృషి చేస్తున్న వారికి చావెజ్‌ పేరిట శాంతి పురస్కారం ఇచ్చి సత్కరిస్తామని..  శాంతికోసం పోరాడుతున్న రష్యా అధ్యక్షుడు ఈ పురస్కారానికి పూర్తి అర్హుడని కొనియాడారు.  కొలంబియా అధ్యక్షుడు శాంటోస్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం ప్రకటించిన రోజునే చావెజ్‌ పేరిట పురస్కారం ఇస్తున్నట్లు మాడ్యురో వెల్లడించారు.

తమని తాము పేల్చుకున్న ఉగ్రవాదులు..

  టర్కీలో ఉగ్రవాదులు తరచూ బాంబు పేలుళ్లకు పాల్పడుతూనే ఉంటారు. అయితే ఓ కారు బాంబు పేల్చేందుకు ప్రణాళిక వేసుకున్న ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. వివరాల ప్రకారం.. టర్కీ రాజధాని అంకారాలో కారు బాంబు పేల్చేందుకు ప్ర‌ణాళిక వేసుకున్న ఇద్ద‌రు అనుమానిత‌ ఉగ్ర‌వాదులు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉగ్రవాదులను విచారించేందుకు పోలీసులు వారి వద్దకు వెళ్లి... ఆయుధాలు తమకు అప్పగించాలని కోరగా.. ఇంతలో వారు తమ వద్ద ఉన్న ఆయుధాలతోనే పేల్చేసుకున్నారు. ఆ ఇద్ద‌రిలో ఒక ఉగ్ర‌వాది మ‌హిళ అని చెప్పారు పోలీసులు. వీరిరువురికీ కుర్దిష్ వేర్పాటువాదుల‌తో సంబంధాలు ఉన్న‌ట్లు త‌మ‌కు తెలుస్తోంద‌ని పోలీసులు తెలుపుతున్నారు.

అర్ధ శతకం చేసిన కోహ్లీ.. ప్రస్తుతం 3/161

ఇండోర్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. మొదటి రెండు టెస్టుల్లోనూ అర్థశతకం కూడా చేయకుండానే పెవిలియన్ చేరుకున్న కోహ్లి.. మూడో టెస్టులో బాధ్యతాయుతమైన ఇన్నింగ్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ లో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. సాధారణంగా టెస్టుల్లో కూడా దూకుడుగా ఆడే కోహ్లీ... ఈ మ్యాచ్ లో నెమ్మదిగా ఆడుతూ, హాఫ్ సెంచరీకి ఏకంగా 108 బంతులను తీసుకున్నాడు. ప్రస్తుతం 56 పరుగులతో ఆడుతున్న కోహ్లీ మొత్తం 6 ఫోర్లను బాదాడు. మరో ఎండ్ లో అజింక్య రహానే కూడా నెమ్మదిగా ఆడుతూ 21 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు.

ఢిల్లీలో హైఅలర్ట్.. ఉగ్రవాదులు చొరబడ్డారు..

దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్థాన్ కేవలం 10 రోజుల్లోనే 25సార్లు కాల్పులకు తెగబడింది. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వారి కాల్పులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటలిజెన్స్ వర్గాలు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారని..  ఆత్మాహుతి దాడి చేసేందుకు కూడా వారు సిద్ధంగానే ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని హోల్ సేల్ మార్కెట్ కి యాపిల్ పళ్లు తరలిస్తున్న కమర్షియల్ వాహనంలో వీరిద్దరూ నగరంలోకి ప్రవేశించారని.. వీరిద్దరూ జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారని తెలిపాయి. దీంతో, ఢిల్లీలో హైలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో సంచరించే వారు జాగ్రత్తగా ఉండాలని.. రైళ్లు, బస్సుల్లో వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలోని టోల్ ప్లాజాల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఛాందీ చౌక్, పహార్ గంజ్ లాంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు, కొన్ని రోజుల పాటు ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు.

శ్రీనగర్లో మళ్లీ కర్ఫ్యూ... పెల్లెట్‌ గాయాలకు బాలుడి మృతి

  గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న శ్రీనగర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పోలీసులు పెల్లెట్‌ తుపాకులతో జరిపిన కాల్పుల్లో ఓ పన్నెండేళ్ల బాలుడు గాయపడి మృతి చెందాడు. దీంతో మరోసారి అక్క కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని సైద్‌పోరా ప్రాంతానికి చెందిన జునైద్‌ అహ్మద్‌ అనే బాలుడు తన ఇంటిముందర ఆడుకుంటూండగా పెద్ద సంఖ్యలో పెల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించినా అప్పటికే ఆ బాలుడు మరణించాడు. జునైద్‌ మృతితో వందలాది స్థానికులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆందోళనకు ఉపక్రమించారు. దీంతో అక్కడ కర్ఫ్యూ విధించారు.

పెర్ఫ్యూమ్ రీసెర్చర్ దారుణ హత్య...

  గోవాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెర్ఫ్యూమ్ రీసెర్చర్, 'ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్' గా పేరు పొందిన మోనికా గూర్డె దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే మోనికాను 'ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్' అని పిలుస్తుంటారు. ఆమె గోవాలోని సంగోల్డాలో ఉన్న రెంటెడ్ ఫ్లాట్ లో ఉంటుంది. అయితే ఎప్పటిలాగే ఆమె పనిమనిషి మోనికా ఉదయం 9 గంటలకు ఇంటికి వెళ్లగా.. ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో  పొరుగు వారి సహాయంతో మోనికా సోదరుడు ఆనంద్ కు ఫోన్ చేయించింది. ఆమె సోదరుడు, పొరుగువారి సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఆమె చనిపోయిఉండటం చూసి షాకయ్యారు. ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. చేతులు కట్టేసి ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఆమెపై అత్యాచారం చేసి దిండు సాయంతో ఊపిరి ఆడకుండా హత్య చేసి ఉంటారనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు.

రాజకీయ నేతలపై ఉరీ ఉగ్రదాడి బాధితుల ఆగ్రహం.. విషమిచ్చి చంపండి

  భారత సైన్యం చేసిన సర్జికల్ దాడుల నేపథ్యంలో పలువురు దానికి సంబంధించిన సాక్ష్యాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అలా అడుగుతున్న రాజకీయ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉరీ ఉగ్రదాడుల బాధితులు. సాక్ష్యాలు బయటపెట్టాలని అడుగుతున్న నాయకులు దేశ ద్రోహులు.. సర్జికల్ దాడులు చేయాల్సింది ఉగ్రవాదుల మీద కాదు, ఇలాంటి నాయకుల మీద.. అలాంటి నాయకులకు విషం ఇచ్చి చంపాలని అంటున్నారు. సర్జికల్ దాడులు నిజంగానే జరిగాయన్న విషయాన్ని వీళ్లు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని. ఇలాంటి నాయకుల వల్లే ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడుతున్నారని ఆరోపించారు. మన సైనికుల నిబద్ధతను ప్రశ్నించడం ఎంతో బాధను కలిగిస్తోందని అంటున్నారు.