'డ్రోనా'చార్యుడి చూపు ఇకనైనా నేల మీదకి రావాలి!
షిమ్లాలో వున్నవాడు స్వెట్టర్ వేసుకున్నాడని... రాజస్థాన్ లోని వాడు కూడా స్వెట్టర్ వేసుకుంటే ఏమవుతుంది? ఎర్రటి ఎడారి లాంటి రాజస్థాన్ లో చెమటలు కారి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు! అంతే కాదు, స్వెట్టర్ కొన్నందుకు డబ్బులు కూడా వృథా అవుతాయి! ఇవన్నీ కాకుండా చూసే వాళ్లు నవ్వుకుంటారు కూడా!ఈ విషయం అర్థం కావటం లేదు మన ముఖ్యమంత్రివర్యులకి...
ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన వారు కాదు!ఆయన గతంలోనే సమైక్యాంధ్రను ఏలిన నాయకుడు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పగ్గాలు పట్టుకుని తోలిన వాడు. కాబట్టి ఆయనకు పరిపాలనలో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాని, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్రమంగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు! అదే ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది!
ఆంద్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయాక ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అమరావతితో సహా సిటీలు వున్నా , పరిశ్రమలు వున్నా గ్రామాలు, పొలాలు, రైతులు... ఈ మూడు అంశాలే ఏపీకి ఆయువుపట్టు. అందుకే, చంద్రబాబు కూడా ఎంతో కీలకమైన వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మధ్య వర్షాభావ పరిస్థితులు వస్తే రెయిన్ గన్స్ తెప్పించారు. ఎండిపోతున్న మొక్కలకి మరింత నష్టం కలగకుండా రైతులకి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు! ఇప్పుడే కాదు చంద్రబాబు మొదటి నుంచీ టెక్నాలజీ అంటే అమాంతం ఆసక్తి చూపిస్తారు! అదే ఆయన బలం... బలహీనత కూడా!
భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సాంకేతికత చాలా ముఖ్యం. పైగా ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి దాని పట్ల ఆసక్తి కలిగి వుంటే ప్రజలకు చాలా మంచిది. కాని, మన దేశంలో చంద్రబాబులా న్యూ టెక్నిక్స్ పై దృష్టి పెట్టే పొలిటీషన్స్ చాలా అరుదు. అయినా కూడా ఎప్పటికప్పుడు టెక్నలాజికల్ గా అప్ డేట్ అయ్యే బాబు ఇప్పుడు ఆ అలవాటే మైనస్ గా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ డ్రోన్స్!
డ్రోన్స్ అంటే సాధారణంగా పోలీసులు, ఆర్మీ వాళ్లు వాడే నిఘా పరికరాలు. మనిషితో పని లేకుండా గాల్లో ఎగురుతూ కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీసి సాయం చేస్తుంటాయి. ఈ డ్రోన్స్ తోనే సరిహద్దుల్లో చాలా దేశాలు పక్క దేశాలపై నిఘా పెడుతుంటాయి. ఇండియా, పాక్ కూడా డ్రోన్స్ ను ఎక్కువగానే వాడుతుంటాయి!
డ్రోన్స్ ఉద్ధేశం భద్రత సంబంధమైన విషయాల్లో వాడకమే అయినా పాశ్చాత్య దేశాల్లో ఈ డ్రోన్స్ ను పంట, పొలాలకు కూడా ఉపయోగిస్తుంటారు. డ్రోన్స్ వ్యవసాయ క్షేత్రాలపై చక్కర్లు కొడుతుంటే వాటి చేత మందు పిచికారి చేయించటం లాంటివి చేస్తుంటారు. అలాగే వాటికుండే కెమెరాలు సువిశాలమైన పొలంలోని ప్రతీ మూలా రైతుకి కనిపించేలా చేస్తాయి. అయితే, ఇవి భారతీయ రైతులకి అస్సలు అవసరం లేదు...
పాశ్చాత్యులు వాడిన డ్రోన్స్ మన రైతులు కూడా వాడితే బాగుంటుంది కదా అని ఆలోచించారు చంద్రబాబు. అందుకు తగ్గట్టే డ్రోన్స్... ఆంధ్రా పంట, పొలాల్లో చక్కర్లు కొట్టే ఏర్పాటు చేయించారు. కాని, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, వెస్టన్ ఫార్మర్స్ ఇక్కడి వాళ్లలా చదువుకోని వాళ్లు కాదు. అలాగే వాళ్ల ఫామ్స్ మన వాటిలా రెండు, మూడు ఎకరాల్లో వుండవు. చాలా వరకూ పదులు, వందల ఎకరాల్లో విస్తరించి వుంటాయి. తన పొలమంతా రైతు తిరగాలంటేనే అసాధ్యంగా వుంటుందక్కడ! అందుకే, డ్రోన్లు వాడతారు పాశ్చాత్య రైతులు.
ఇండియాలోని రైతులు, అందులో ఆంధ్రా రైతుల సంగతి అందరికీ తెలిసిందేగా! వుండేదే చిన్న చిన్న పొలాలు, వాటిల్లో పంటలు పండటమే పెద్ద తపస్సులా మారిపోతోంది. అందుక్కారణాలు అనేకం.... విత్తనాలు కల్తీవి వస్తే రైతు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎన్ని మొక్కలు మొలుస్తాయో, ఎన్ని మట్టిలో కలిసిపోతాయో దేవుడికే తెలియాలి. అలాగే, పురుగు మందులు కూడా రైతుని నిండుగా దగా చేసేస్తుంటాయి. ఎక్కడెక్కడికో పోయి డబ్బులు ఖర్చు చేసి... తీసుకొస్తే లాభం కంటే ఎక్కువ నష్టం చేసే పురుగు ముందులున్నాయి మార్కెట్లో! ఇంతే కాకుండా గతంలో వ్యవసాయ శాఖ నుంచి అనుభవం వున్న శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో మాట్లాడేవారు. ఏ పంట వేయాలి, ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి లాంటి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఈ వ్యవస్థ మొత్తం వైఎస్ హయాంలో నీర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు అక్కడక్కడా గవర్నమెంట్ నియమించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వున్నా రైతులకి అవసరమైన సమాచారం అంతా సమయానికి అందటం లేదు! ఇవన్నీ కాకుండా చివరగా రైతుకి అసలు పెద్ద సమస్య విత్తనాలు, మందులు వగైరా వగైరా లాంటి వాటి మీద లేని ప్రభుత్వ పెత్తనం రైతు పండించిన పంట మీద వుండటం! విత్తనాలకు, యూరియాకి ఎక్కడా ఫిక్స్ డ్ రేట్ వుండదు. కాని, రైతు దిగుబడికి మాత్రం ప్రభుత్వం అరకొరగా మద్దతు ధర ఇస్తుంది!
ఆంధ్ర ప్రదేశ్ రైతులకి ఇన్ని రకాల సమస్యలున్నాయి. అవన్నీ కలిసి రైతుని అప్పులు, ఆత్మహత్య అనే రాళ్లతో తిరిగే తిరగలిలోకి విసిరేస్తున్నాయి! కాని, సీఎం చంద్రబాబు వాటి మీద కంటే కొత్తగా వచ్చిన డ్రోన్లపై ఎక్కువ దృష్టి పెట్టి కాలం వృథా చేసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఎంతో ఖర్చు చేసి గాల్లోకి ఎగిరించే డ్రోన్ల వల్ల ఎటువంటి లాభం లేదంటున్నారు. అంతకంటే ముందు బాబు విత్తనాలు, మందులు, మద్దతు ధర వంటి రైతుల నిజమైన సమస్యల నివారణకి కృషి చేస్తే బావుంటుందంటున్నారు...
టెక్నాలజీని అందిపుచ్చుకోవటం మంచి విషయమే. కాని, టెక్నాలజీ మన టెంప్టేషన్ అయితేనే కష్టం. చంద్రబాబు ఈ సత్యం తెలుసుకుంటారని ఆశిద్దాం. డ్రోన్ల కోసం గాల్లోకి ముఖం పెట్టిన ఆయన తొందర్లోనే నేల వైపు చూసి... రైతులకి అండగా నిలవాలని కోరుకుందాం...