బాలీవుడ్లో భీభత్సంగా ఆడుతోన్న 'పాకిస్తానీ' సినిమా!
పాకిస్తాన్ తో యుద్ధం, పాకిస్తాన్ కి సింధూ నది నీళ్లు ఆపేయాలి, పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడదీయాలి... ఇలా ఇప్పుడు దేశం మొత్తం పాకిస్తాన్ గురించే ఆలోచిస్తోంది! పాకిస్తాన్ లో ఇంతగా ఇండియా గురించి ఆలోచిస్తున్నారో లేదోగాని ఇండియాలో మాత్రం పాకిస్తాన్ మార్మోగిపోతంది! దాని వెనుక వున్న ఆవేశం, ఆక్రోశం, అసహనం అన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. కాని, పాకిస్తాన్ పేరుకి మన దేశంలో ఎంతగా ఎమోషన్స్ రెచ్చగొట్టే శక్తి వుందో అంతే రాజకీయాల్ని రాజేసే పవర్ కూడా వుంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రాలో పాకిస్తానీ రాజకీయాలు టైం టూ టైం బుస్సుమని పడగ ఎత్తుతుంటాయి...
మహారాష్ట్రా రాజధాని ముంబై. ఆ ముంబై బాలీవుడ్ కి ఫేమస్. ఇండియన్ సినిమాగా ప్రపంచం గుర్తించే హిందీ సినిమాలు మొత్తం ఇక్కడే తయారవుతుంటాయి. అయితే, ఇక్కడే వీర శివాజీ వారసులమని చెప్పుకునే వీర పాకిస్తానీ ద్వేషులు మనకు కనిపిస్తుంటారు. కాకపోతే, వీళ్లు నిజంగా జాతీయ భావంతో రోడ్డు మీదకొస్తే బావుండేది. కాని, అలా కాకుండా ఎప్పటికప్పుడు రాజకీయ డ్రామా కోసం హంగామా చేస్తుంటారు!
మహారాష్ట్రా జనం కోసం పుట్టిన పార్టీలు శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన. ఈ రెండూ మరాఠీల హక్కులు, శ్రేయస్సు కోసం పోరాడటం కాకుండా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పై చెలరేగిపోవటంలో ముందుంటాయి. పాకిస్తాన్ ను తిట్టడం తప్పేం కాకపోయినా శివసేన, ఎంఎన్ఎస్ ల వాలకం మాత్రం అభ్యంతరకరంగా, అనుమానాస్పదంగా వుంటుంది. అప్పుడప్పుడూ ఈ రెండూ పార్టీలు పాకిస్తాన్ క్రికెటర్లని, సింగర్లని టార్గెట్ చేస్తుంటాయి. ఇక్కడికి వారు రావొద్దంటూ ఆందోళనలు, దాడులు చేస్తుంటాయి. అయితే, ఇదంతా కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి లౌకికవాద పార్టీలు అధికారంలో వున్నప్పుడు ఓకే! కాని, తమకు భావ సారూప్యం వున్న బీజేపి అధికారంలో వున్నప్పుడు కూడా చేయటం ఎలా అర్థం చేసుకోగలం?
సాధారణంగా ఎప్పుడూ పాకిస్తానీ నటుల్ని దేశం నుంచి వెళ్లగొట్టమని శివసేన అంటుటుంది. కాని, ఈసారి అధికారంలో వున్న బీజేపితో ఆ పార్టీకి పొత్తు వుండటంతో కాస్త మెత్తటి స్టాండ్ తీసుకుంది. ఈ గ్యాప్ ఎంఎన్ఎస్ తనకు అనుకూలంగా వాడుకుంటూ బాలీవుడ్లో వున్న పాకీ నటులు, నటీమణులు అందరూ తిరిగి వెళ్లాలని అల్టిమేటం ఇచ్చింది. 48గంటలు అని డెడ్ లైన్ పెడితే ఫవాద్ ఖాన్ అనే పాకిస్తానీ హీరో ఇప్పటికే స్వదేశానికి రవాణా అయిపోయాడు!
ఎంఎన్ఎస్ దెబ్బకు ఒక పాకీస్తానీ యాక్టర్ ఇంటి ముఖం పట్టడం చాలా మంది భారతీయులకి ఆనందం కలిగించేదే! పైగా ఇక మీదట పాకిస్తానీ ముఖాలు హిందీ సినిమాల్లో కనిపించకుంటే మరింత సంతోషిస్తాం. కాని, సమస్యల్లా ఎంఎన్ఎస్ లాంటి పార్టీల హింసాత్మక శైలే! అసలు పాకిస్తానీల్ని ముంబైకి ఎవరు రానిస్తున్నారు? కేంద్రం ప్రభుత్వం! అలాగే, వారికి రక్షణ కల్పించి ముంబైలో షూటింగ్ లు ఎవరు చేయించుకోనిస్తున్నారు? మహారాష్ట్ర ప్రభు్త్వం! ఈ రెండూ బీజేపీ లాంటి జాతీయ వాద పార్టీవే! మరి అటువంటి బీజేపిని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని వదిలి పెట్టి రోడ్లపైకి రావటం ఎంత వరకూ సబబు? ఇక్కడే మరాఠీ పార్టీల చిత్తశుద్దిపై అనుమానాలు కలిగేది! నిజంగా పాకిస్తాన్ మీద ఆగ్రహం కంటే పొలిటికల్ మైలేజే వీరికి ఎక్కువగా కావాలన్నట్టు అనిపిస్తుంది...
ఒకవైపు శివసేన, ఎంఎన్ఎస్ లాంటి పార్టీలు పాకిస్తాన్ కు వ్యతిరేక రాజకీయం నడిపితే మరో వైపు సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీ, నితీష్, మమతా బెనర్జీల పార్టీలు పాకిస్తాన్ అనుకూల పాలిటిక్స్ ప్లే చేస్తుంటాయి. మన ఎంఐఎం సంగతి చెప్పే పనే లేదు. ఇండియన్ ముస్లిమ్ లను సమర్థించే పనిలో భాగంగా పాకిస్తాన్ ను కూడా వెనకేసుకు వచ్చేస్తుంటారు వీళ్లంతా!
పాకిస్తాన్ విషయంలో దేశంలోనే రెండు వర్గాలు తయారైతే బాలీవుడ్లో కూడా రెండు వర్గాలు వున్నాయి. సింగర్ అభిజిత్ సావంత్ లాంటి వాళ్లు కరుడుగట్టిన పాకిస్తాన్ ద్వేషులు! అభిజిత్ గతంలో పాకిస్తానీ సింగర్ గులామ్ అలీ భారత్ కు వస్తే భీకరంగా తిట్టిపోశాడు. సిగ్గుండాలి అన్నట్టు ట్వీట్స్ చేసి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు కూడా అభిజిత్ సావంత్ పాకిస్తానీ యాక్టర్స్ కు మద్దతుగా నిలిచిన కరణ్ జోహర్, మహేష్ భట్ లాంటి వాళ్లను ఏకిపారేశాడు. నీచాతి నీచమైన పదజాలంతో ట్వీట్స్ చేసి కసి తీర్చుకున్నాడు! కరణ్ గే కాబట్టి పాకిస్తానీ పఠాన్ లు నచ్చుతారంటూ దాడి చేశాడు!
కరణ్ జోహర్, మహేష్ భట్ లాంటి ఫిల్మ్ మేకర్స్, షారుఖ్ ఖాన్ లాంటి టాప్ యాక్టర్స్ పాకిస్తానీ టాలెంట్ మీద ఎక్కడలేని మక్కువ చూపటం కూడా విడ్డూరమే! ఇంత పెద్ద దేశంలో వాళ్లకి ఎక్కడా తగిన హీరోలు, హీరోయిన్స్, సింగర్స్ దొరకనట్టు పాకిస్తాన్ వెళ్లి తెచ్చుకుంటారు. లక్షలు గుమ్మరించి ఎంకరేజ్ చేస్తారు. ఇంత అతి అవసరమా? నేపాల్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో, శ్రీలంక నుంచో తెచ్చుకోలేని టాలెంట్ పాకిస్తాన్ నుంచే ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎవరికైనా అనుమానం రావటం సహజమే! ఇప్పటికి ప్రూవ్ కానప్పటికీ పాకిస్తానీ మాఫియా సొమ్ము మన బాలీవుడ్లోకి వస్తుండటం తోసిపుచ్చలేని వాదన...
ఒకవైపు పాకిస్తాన్ ని తిట్టే పార్టీలు, మరో వైపు పాకిస్తాన్ ని నెత్తిన పెట్టుకునే పార్టీలు, ఇంకో వైపు ఎందుకో అర్థం కాకుండా పాకిస్తాన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శించే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు... వీళ్లందరి మధ్య పాకిస్తాన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది! అసలు చర్చించాల్సిన కాశ్మీరీలు, ఉగ్రవాదులు, అమర జవాన్లు ఎటో పోయారు!