ఇండియా ఇకనుం'చైనా' తేరుకోవాలి...
posted on Oct 14, 2016 @ 3:53PM
మన ప్రధాన శత్రువు అమెరికా. భారత్ తో మనకు సఖ్యత అవసరం. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? హఫీజ్ సయీద్! పాకిస్తాన్ లోని పేరుమోసిన ఉగ్రవాదుల్లో హఫీద్ సయీద్ ఒకడు. ముంబై ఉగ్రదాడులకి, కసబ్ లాంటి పది మంది కసాయిల్ని మన దేశంపైకి పంపింది అతనే. కాని, ఇప్పుడు హఠాత్తుగా హఫీజ్ స్వరం మారింది. సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బకి దెయ్యం దిగివచ్చింది!
ఇండియా పాక్ పై చేసిన మిలటరీ దాడి అద్భుత విజయం సాధించింది. పాకిస్తాన్ పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోలోన అవమానంతో రగిలిపోతోంది. కాని, ఏం చేయలని స్థితి. అయితే, ఇదంతా చూస్తూ మనం సంతోషించాల్సిన పరిస్థితి కూడా లేదు. పాక్ పై ఒక్క అంతిమ సమరం చేసి కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని సుబ్రమణ్యం స్వామి లాంటి వారు అంటున్నప్పటికీ కిటుకంతా చైనా వద్ద వుంది!
ఇండియా ప్రధాన శత్రువు పాక్ కావొచ్చు. కాని, ప్రమాదకర శత్రువు చైనానే. ఈ విషయం మన వాళ్లకు తెలియంది కాదు. అయినా కూడా చైనా రోజు రోజుకు తన ప్రాబల్యం పెంచుకుంటూ పోతోంది. ఇండియాకి ప్రతీ చోటా అడ్డుపడుతోంది. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించమని ఇండియా ఐక్యరాజ్య సమితిని అడిగితే అక్కడ చైనా వీటో చేసింది. అలాగే, పాకిస్తాన్ పై ఇప్పటికిప్పుడు మనం యుద్ధానికి వెళితే ఆ దేశం తరుఫున ఎదురు నిలిచే శక్తి కూడా చైనానే. మరో వైపు ఇండియాను అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సరిహద్దుల్లో డ్రాగన్ విసిగిస్తూనే వుంది. ఇలా ఏ విధంగా చూసినా మన మీద చైనా దాదాగిరి సుస్పష్టం...
చైనా అన్ని విధాలా మన మీద ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలు వున్నా ఒక్క చోట మాత్రం కాస్త బలహీనంగా వుంది. అదే వాణిజ్య సంబంధాలు. గత కొంత కాలంగా ఇండియా చైనా నుంచి భారీగా వస్తువులు కొనుగోలు చేస్తుంది. బిలియన్ల డాలర్ల లాభం చైనాకు ఈ వ్యాపారం వల్ల లభిస్తోంది. అదే భారత్ ను తీసుకుంటే... చైనాకు మనం పంపే వస్తువులు చాలా తక్కువ. కొన్ని మిలియన్ల డాలర్ల ఎక్స పోర్ట్స్ తప్ప మనకు చైనాతో పెద్దగా ఆర్దిక లావాదేవీలు లేవు. అందుకే, ఇప్పటికిప్పుడు చైనా వస్తువుల్ని మనం బహిష్కరిస్తే ఆ దేశానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది!
చైనా వస్తువులు ఇండియా వాడకపోతే ఆ దేశానికి నష్టం. ఈ ఫార్ములాతోనే సొషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది ఈ మధ్య. ఫలితంగా చైనా వస్తువుల వాడకంలో దాదాపు 20శాతం తరుగుదల కనిపించిందని కూడా అంటున్నారు. అది నిజమో కాదోగాని చైనీస్ మీడియా మాత్రం భారతదేశంలో తమ ప్రాడక్ట్స్ పై వివక్ష కొనసాగుతోందని బెంబేలెత్తుతోంది. ఫ్రీ మార్కెట్ లో ఇలా దుష్ప్రచారం చేయకూడదని నీతులు చెబుతోంది! కాని, పాకిస్తాన్ కు చైనా చేస్తోన్న సపోర్ట్ గురించి ఒక్క మాటా మాట్లాడటం లేదు...
భారతదేశానికి ఎప్పటికైనా అతి పెద్ద ముప్పు చైనానే. పాకిస్తాన్ ను మూడు ముక్కలు చేశో... నాలుగు ముక్కలు చేశో పీడ విరగడ చేసుకోవచ్చు. కాని, డ్రాగన్ అలా కాదు. ఆ దేశంతో మనం మొండిగా ముందుకు పోయి యుద్ధం చేయలేం. అలాగని సంధి కూడా చేసుకోలేం. సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు అమాంతం చైనీస్ గూడ్స్ బాయ్ కాట్ చేయటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, చైనీస్ వస్తువుల్ని మనం వాడటం మానేస్తే చైనా కన్నా తీవ్ర నష్టం మన వ్యాపారులకు వస్తుంది. ఇంత కాలం చీప్ చైనీస్ వస్తువుల్ని అమ్మిన ఇండియన్ ట్రేడర్స్ ఒక్కసారిగా దుకాణాలు మూసుకోవాల్సి వస్తుంది. అందుకే, చైనా పై ఎక్స్ పోర్స్ట్ , ఇంపోర్ట్స్ యుద్ధం అంత ఈజీ కాదు. ఇండియా ముందు పాక్ కన్నా ఎక్కువ దృష్టి మన అంతర్గత మార్కెట్లపై పెట్టాలి. చైనీస్ వాళ్లు చీప్ గా అమ్ముతున్న వస్తువుల్ని మనం మన దేశంలోనే ఎందుకు ఉత్పత్తి చేసుకోకూడదు. ఎందుకు చేసుకోలేం ఆలోచించుకోవాలి. పరిష్కారాలు, మార్గంతరాలు కనుక్కోవాలి. అప్పుడు చైనీస్ దిగుమతులపై ఆధారపడ్డ మన వ్యాపారస్తుల బతుకులు దుర్భరంగా మారకుండా బండ కింద నుంచి చేయి తీసుకున్నట్టు వ్యవహారం నుంచి బయటపడవచ్చు. ఒక్కసారి మన ఈ మేకిన్ ఇండియా ఐడియా వర్కవుట్ అయితే డ్రాగన్ ను ఆటాడుకోవటం పెద్ద కష్టమేం కాదు! మోదీ ఈ దీర్ఘకాలిక వ్యూహం పై కన్నేయాలి...