సోషల్ మీడియా వెనుక దాగిన సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్!
posted on Oct 17, 2016 @ 6:23PM
ఇంట్లో వున్నా, ఆఫీస్ లో వున్నా, జర్నీలో వున్నా, ఔట్ స్టేషన్లో వున్నా... ఎక్కడున్నా ఇప్పుడు అందరూ వుండేది, వుంటోన్నది మాత్రం... సోషల్ మీడియాలో! అవును, ఫేస్బుక్ , ట్విట్టర్ వగైరా వగైరాల్లో జనం పగలు , రాత్రి తేడా లేకుండా లాగిన్ అయిపోతున్నారు! గంటలు గంటలు లాగించేస్తున్నారు. ఏం పనిలేక తీసుకునే సెల్ఫీ మొదలు హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లే ముందు తీసుకున్న ఫోటో వరకూ... అన్నీ పోస్ట్ చేయాల్సిందే! అలా తయారైంది కొందరి పరిస్థితి!
సోషల్ మీడియా పిచ్చి ఒక్కొక్కరికీ ఒక్కో రేంజ్లో వుంటుంది. కొందరికి కంట్రోల్ లో వుంటే కొందరికి పీక్స్ కి వెళ్లిపోతోంది. అంతే కాదు, కొందరు ఫేస్బుక్ లాంటి చోట్లలో ఎక్కువగా పర్సనల్ ఫోటోలు, వీడియోలు, స్టేటస్ లు పెడితే మరి కొందరు ఎక్కువగా సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. అయితే, ఇదంతా మన పర్సనల్ అనుకుంటే పొరపాటే! ఒక్కసారి సోషల్ మీడియాలో మన పోస్టింగో, ఫోటోనో పెట్టేశాక అది ప్రపంచం ముంగిట నిలుస్తుంది! మీ పేరు తెలిస్తే చాలు ఎవరు ఎక్కడైనా మీ పోస్టు, మీ ప్రొఫైలు చూసేయోచ్చు! అంటే... క్షణాల్లో మిమ్మల్ని అంచనా వేయవచ్చన్నమాట!
సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి ఎలాంటి వాడు అన్న నిర్ణయానికి రావటం పెద్ద విషయమేం కాదు. ఆఫ్ట్రాల్, మనమూ ఎవరైనా కొత్త వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే ఏం చేస్తాం? మ్యుచువల్ ఫ్రెండ్స్, వరుసగా చేసిన పోస్ట్స్, కామెంట్లో వాడిన భాష, భావం... ఇలాంటివన్నీ గమనిస్తాం. అప్పుడే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాం. అంటే సదరు మనిషిని అతడి ప్రొఫైల్ చూసి పసిగట్టేస్తున్నామన్నమాట!
సోషల్ మీడియా అకౌంట్లో చూసి ఎదుటి వారిని అంచనా వేయటం ఇప్పుడు కంపెనీలు కూడా చేస్తున్నాయట! కార్పోరేట్ కంపెనీలు తమ ఎంప్లాయిస్ సెలక్షన్ సోషల్ మీడియా ఆధారంగా చేస్తున్నాయి. ఇంటర్వ్యూ లాంటి పాత పద్ధతులు పాటిస్తూనే వున్నా తమ వద్దకొచ్చిన అభ్యర్థి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్ లాంటివి కూడా ట్రాక్ చేస్తున్నాయి. వాటిల్లో ఆ వ్యక్తి ఏం పోస్ట్ చేశాడు, ఎలా చేశాడు, ఎవరి గురించి, ఎందు గురించి వంటివన్నీ స్టడీ చేస్తున్నారు. దాన్నుంచి క్యాండిడేట్ పై ఓ అవగాహనకు వస్తున్నారు.
సాధారణంగా ఎక్కువగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేది నిరుద్యోగులు. ఎక్కువ ఖాళీ సమయం వుండేది కూడా వారికే. అందుకే, నిరుద్యోగులు తమ ఇష్టానుసారం సోషల్ మీడియా పోస్టులు చేయోద్దంటున్నారు నిపుణులు. కంపెనీలు తరువాత చూసినప్పుడు నెగటివ్ ఫీలింగ్ వచ్చే ప్రమాదం వుందట! రాత్రి బాగా తాగి ఇంకా దిగలేదు లాంటి పోస్టులు పెడితే ఎవ్వరూ ఉద్యోగానికి తీసుకుని టెన్షన్ కొనితెచ్చుకోరు కదా? అలాగే, రకరకాల జనంపై, వివిధ అంశాలపై, సామాజిక వర్గాలపై , మతాలు, కులాలపై నెగటివ్ కామెంట్స్ కూడా ఇబ్బందులు తేవచ్చంటున్నారు! వీటన్నటి కారణంగా సోషల్ మీడియాలో మరీ ముసుగు వేసుకుని రోజూ ఆదర్శాలు వల్లించమని కూడా ఇక్కడ ఉద్దేశ్యం కాదు. అలా చేస్తే నటన కాస్తా ఈజీగా అర్థమైపోతుంది. కాని, మన ప్రోఫైల్ లో సాధ్యమైనంత వరకూ నిజాయితీగా వుండాలి. ఎవ్వర్నీ కించపరటం, దేన్నీ చులకనగా మాట్లాడటం చేయకుండా సంస్కారవంతంగా వుండాలి. ఆ పై మన నిజమైన వ్యక్తిత్వం అంచనా వేసుకున్న సదరు కంపెనీ ఉద్యోగం ఇస్తే ఇస్తుంది. లేదంటే లేదు!
ఉద్యోగాల్లో సోషల్ మీడియా అకౌంట్లు బ్లడ్ రిపోర్ట్స్ లా తయారవుతున్నాయి కాబట్టి అసలు వాడకుంటే అయిపోతుందిగా? లేదంటే దొంగ ప్రొఫైల్ పేర్లు , దొంగ ప్రొఫైల్ పిక్స్ పెట్టుకుంటే అయిపోతుందిగా?ఇలాంటి ఆలోచనలు కూడా చేటు చేస్తాయి. ఎందుకంటే, ప్రస్తుతం నడుస్తోన్న స్మార్ట్ ఫోన్స్ అండ్ 4జీ కాలంలో ఫేస్బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ ఎక్కడా లేనంటే నమ్మటానికి కార్పోరేట్ కంపెనీలు సిద్ధంగా వుండవు. ఒకవేళ వున్నా... టెక్నాలజీకి దూరంగా వుండిపోవటాన్ని మైనస్ గానే పరిగణిస్తాయి... సో సోషల్ మీడియా... హ్యాండిల్ విత్ కేర్!