యూనిఫామ్ సివిల్ కోడ్ తేనె తుట్టె కదులుతోందా?
posted on Oct 14, 2016 @ 11:55AM
బీజేపికి ఒకప్పుడు రెండు సీట్లు వుండేవి పార్లమెంట్లో. ఇప్పుడు రెండు వందల ఎనభై రెండు సీట్లున్నాయి. ఇన్ని రెట్లు ఎంపీలు పెరిగినా కాషాయ దళం ఎజెండాలో మారకుండా వున్న ఒకట్రెండు అంశాలు మాత్రం ఎప్పుడూ వివాదాస్పదమే. అయోధ్యలో రామ మందిరం అలాంటిదే! కాశ్మీర్లో ఆర్టికల్ 370 మరొకటి! ఇక దేశ వ్యాప్తంగా ప్రతీసారి తీవ్ర చర్చకు కారణమయ్యేది... యూనిఫామ్ సివిల్ కోడ్! ఈ మాట వినగానే మైనార్టీలు, సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే వారు అందరూ అమాంతం ఉలిక్కిపడుతుంటారు. అంతటి పొలిటికల్ ఎఫెక్ట్ దీని స్వంతం...
సుప్రీమ్ కోర్టులో ప్రస్తుతం ట్రిపుల్ తలాక్ పై కేసు నడుస్తోంది. భారతీయ ముస్లిమ్ లలో మూడు సార్లు తలాక్ చెప్పి భర్త భార్యను వదిలేయటం పదే పదే వివాదాస్పదం అవుతూనే వుంది. అదేమంత దారుణం కాదని ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ వాదిస్తున్నా ఆధునిక వాదులు దాన్ని అంగీకరించటం లేదు. షరియా చట్టం ప్రకారం మూడు సార్లు తలాక్ అనేసి... అదీ కాక ఎస్ఎంఎస్, స్కైప్ లాంటి వాటి సాయంతో కూడా విడాకులు ఇచ్చేయటం.... కలకలం రేపుతోంది. మొత్తంగా ట్రిపుల్ తలాక్ వ్యవహారమే వుండవద్దని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కోర్టులో కూడా అదే కోరుతు పిటీషన్స్ వేశారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం ఈ మూడు సార్లు తలాక్ అనేసే షరియా చట్టాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. త్వరలో తలాక్ పై తీర్పు కూడా రానుంది...
పరిస్థితి చూస్తుంటే సుప్రీమ్ దాదాపూ ట్రిపుల్ తలాక్ రద్దు చేసే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ముస్లిమ్ స్త్రీల భద్రతని, గౌరవాన్నిదారుణంగా దెబ్బతీసే ట్రిపుల్ తలాక్ పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా లేదు. షరియా చట్టం పుట్టిన సౌదీ అరేబియాలో కూడా లేదు. కాని, మన దేశంలో మాత్రం ముస్లిమ్ పర్సనల్ లా పేరుతో చెలామణి అవుతోంది. దీని కారణంగా ఎంతో మంది పేద ముస్లిమ్ అమ్మాయిలు, ఆడవాళ్లు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. భర్త తన ఇష్టానుసారం వదిలేస్తే రోడ్డున పడుతున్నారు. సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది కూడా బాధిత ముస్లిమ్ స్త్రీలే...
అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో ప్రస్తుతానికి సస్పెన్సే కాని ట్రిపుల్ తలాక్ వ్యవహారం రాజకీయ వేడి కూడా రాజేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో వున్నంత కాలం ముస్లిమ్ లను హర్ట్ చేయకుండా బండి లాక్కొచ్చింది. కాని, మోదీ సర్కార్ సుప్రీమ్ కు స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేసింది. ట్రిపుల్ తలాక్ ఖచ్చితంగా తప్పేనని అభిప్రాయపడింది. దీంతో ఆలిండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్ట్ అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. బీజేపి పుట్టినప్పటి నుంచీ ఎజెండాలో వున్న యూనిఫాం సివిల్ కోడ్ ఈ విధంగా అమలు చేసే కుట్ర జరుగుతోందని పర్సనల్ లా బోర్ట్ ఆరోపిస్తోంది. వాళ్ల మాటల్లో నిజాలు లేకపోలేదు. ఎందుకంటే, ఒక్కసారి సుప్రీమ్ ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తే షరియా చట్టం మొత్తం అదే కోవలో అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం మద్య యుగాల నాటి దారుణమైన శిక్షలు అందులో వుంటాయి. అంతే కాదు బహు భార్యత్వం లాంటివి కూడా అనుమతింపబడతాయి. ఇవేవీ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే కుదిరేవి కావు. అంటే... ట్రిపుల్ తలాక్ తో మొదలు పెట్టి సుప్రీమ్ మొత్తానికి మొత్తంగా ముస్లిమ్ పర్సనల్ లా అనేదే లేకుండా చేయవచ్చు. దీనికి పూర్తి మెజార్టీతో అధికారంలో వున్న హిందూత్వ పార్టీ బీజేపి ఎలాగూ కృషి చేసే అవకాశాలే ఎక్కువగా వున్నాయి...
యూనిఫామ్ సివిల్ కోడ్ తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే, ముస్లిమ్ ల ఓట్లతో నెట్టుకొచ్చే ఎంఐఎం, సమాజ్ వాది లాంటి ఇంకా బోలెడు సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు కూడా అంగీకరించే అవకాశమే లేదు. అయినా కూడా పాలిటిక్స్ కు అతీతంగా చూసినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆహ్వానించదగ్గదే. బీజేపి అభిమానులో, ఆరెస్సెస్ వాదులో దీన్ని మైనార్టీల మీద రుద్దుతున్నట్టు పైకి కనిపించినప్పటికీ ఆధునిక సమాజంలో అందరికీ ఒకే చట్టం వుండటం సమంజసం. న్యాయబద్ధం కూడా. ఎందుకంటే, మతం ఆధారంగా ఎవరి చట్టం వారికి వుంటే ఆయా మతాల్లోని బలహీన వర్గాలు అన్యాయమైపోయే అవకాశమే ఎక్కువ. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వల్ల ఇస్లామ్ లోని స్త్రీలకు అదే జరుగుతోందని చాలా మంది వాదిస్తున్నారు. ఇక దీనిపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీమ్ కోర్టే!