ఉమ్మడి పౌరస్మృతి... మైనార్టీల భయాలపై ఉప్పు!
posted on Oct 21, 2016 @ 7:02PM
కామన్ సివిల్ కోడ్ ... దీని గురించి మీకు పూర్తిగా తెలుసా? చాలా మంది ప్రజలకు తెలియదు. ఆ విషయాన్నే క్యాష్ చేసుకుంటారు మన రాజకీయ నేతలు. మరీ ముఖ్యంగా దేశంలోని ముస్లిమ్ నేతలు, ముస్లిమ్ ఓట్ల కోసం ఆశించే వీర సెక్యులర్ హిందూ నేతలు! ఈ ఇద్దరూ ముస్లిమ్ లను కామన్ సివిల్ కోడ్ పేరు చెప్పి భయభ్రాంతుల్ని చేసేస్తున్నారు...
ఈ మధ్య ఎంఐఎం హెడ్డాఫీస్ వుండే ఓల్డ్ సిటీలోని దారుస్సలాంలో ఓ మీటింగ్ జరిగింది. ముస్లిమ్ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆ బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ తనదైన స్టైల్లో మాట్లాడాడు. ఉమ్మడి పౌరస్మృతి భారతదేశంలోని ముస్లిమ్ లను అణగదొక్కే ప్రయత్నమట! అసలు మొత్తం భారతదేశాన్నే హిందూ దేశంగా మార్చేసే కుట్రనట! ఈ మాటలకి ఏమైనా లాజిక్ వుందా అనేది ఎవ్వరికీ పట్టదు! మరీ ముఖ్యంగా ఓవైసీ అభిమానులు గుమికూడిన సదరు పాతబస్తీ మైదానంలో ఎవ్వరూ ఆలోచించరు. అసదుద్దీన్ దురుద్దేశాలకి హాహాకారాలు చేస్తూ ఊగిపోతారు!
ఒక్క అసదుద్దీనే కాదు... దేశంలోని చాలా మంది నేతలు కామన్ సివిల్ కోడ్ వ్యతిరేకిస్తున్నారు. అందుక్కారణం మైనార్టీ ఓట్లు, బీజేపి వ్యతిరేకత! ఇంతకు మించి ఏమీ వుండదు. తమ రాజకీయ పబ్బం గడుపుకునే క్రమంలో మన నేతలు ముస్లిమ్ లను దేశానికి ఎంత దూరం తీసుకెళ్లమన్నా తీసుకెళతారు. మోదీ మీద విష ప్రచారం చేస్తూ చాలా మంది ముస్లిమ్ లకు ప్రధాని మీద కనీస గౌరవం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి వారిలో అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ములాయం, నితీష్... వీళ్లంతా ముందు వరుసలో వుంటున్నారు. ఉమ్మడి పౌరస్మృతి కూడా ఇలాంటి వారి వల్లే దుష్ప్రచారానికి గురవుతోంది...
కామన్ సివిల్ కోడ్ అంటే మతాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం. ఇందులో ఎంత వెదికినా దురుద్ధేశాలు ఏమీ వుండవు. కాని, దశాబ్దాలుగా మన దేశంలో దీనిపై కావాల్సినంత రాజకీయం, రాజకీయ దుష్ప్రచారం జరుగుతున్నాయి. కేవలం ముస్లిమ్ లలో వున్న భయాల్ని , అభద్రతల్ని అడ్డుపెట్టుకుని ఓవైసీల నుంచీ రాహుల్ గాంధీ దాకా అందరూ లబ్ధి పొందేస్తున్నారు. అసలు కామన్ సివిల్ కోడ్ బీజేపీ, అరెస్సెస్ లు భుజాన వేసుకోవటం వెనుక వాళ్ల స్వార్థాలు వాళ్లకు వుండవచ్చు. హిందూత్వ కోణం కూడా వుండవచ్చు. కాని, ఒక ప్రజాస్వామ్య దేశంలో కామన్ సివిల్ కోడే సమంజసం. మతానికి ఒక చట్టం వుండటం చట్ట విరుద్ధం.
ముస్లిమ్ పర్సనల్ లా వలన ముఖ్యంగా ముస్లిమ్ మహిళలు చాలా నష్టపోతున్నారు. మూడు సార్లు తలాక్ చెప్పేసి భర్త భార్యను విడిచేయవచ్చు. అలాగే, బహుభార్యత్వం కూడా చట్ట వ్యతిరేకం కాదు. ఇలాంటి ఇంకా అనేక ఇబ్బందికరమైన అంశాలున్నాయి ముస్లిమ్ పర్సనల్ లాలో. నిజంగా ట్రిపుల్ తలాఖ్ ఎంత విరివిగా జరుగుతోంది, బహుభార్యత్వం ఎంత మంది పాటిస్తున్నారు వంటివి కూడా మనం చర్చించాలి. కాని, అసలు మతానికొక ప్రత్యేక చట్టం చొప్పున వుండటం ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం. దీన్ని మన నేతలు తమ సెక్యులర్ రాజకీయాల కోసం అంగీకరించటం లేదు.
ఓవైసీ కామన్ సివిల్ కోడ్ ను బీజేపి, మోదీ చేస్తున్న కుట్రగా అభివర్ణించాడు. బాబ్రీ కూల్చటం, గుజరాత్ అల్లర్లు అన్నీ మరోసారి జనం ముందు వల్లే వేసేశాడు. ఏదో జరిగిపోతందని ముస్లిమ్ లలో భయబ్రాంతులు కలిగించాడు. కాని, నిజంగా జరుగుతోన్నది ఏంటి? సుప్రీమ్ కోర్టు కామన్ సివిల్ కోడ్ పై ఏదో ఒకటి తేల్చబోతోంది. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేయాలని కొందరు ముస్లిమ్ మహిళలే కోర్టును ఆశ్రయించారు. దాని ఫలితమే అన్నీ మతాలకు ఒకే చట్టం అనే చర్చ రావటం. ఇందులో తెర వెనుక బీజేపి, ఆరెస్సెస్ పాత్ర ఎంత వుంటుందో మనకు తెలియదుగాని... ప్రత్యక్షంగా మాత్రం ఏం లేదు. కోర్టు చెప్పిందే అందరూ పాటించాలి. సుప్రీమ్ తీర్పును కూడా ఓట్ల కోసం పార్టీలు వ్యతిరేకిస్తే... అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకి దారి తీస్తుంది...