తెలంగాణ రైతులకి గులాబి ముళ్లు గుచ్చుకుంటున్నాయా?
posted on Oct 18, 2016 @ 6:26PM
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆంధ్రుల మీద కోపంతో వచ్చింది కాదు. తమకు దక్కని నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజల్లోంచి పుట్టింది. అది దశాబ్దాల పాటూ సాగి చివరకు కేసీఆర్ నేతృత్వంలో సాకారమైంది. ఇప్పుడు బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోంది! కాని, అంతలోనే స్వరాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రిగారు సురాష్ట్రం కూడా చేసుకునే దిశగా మనసుపెట్టాలి. లేకపోతే ఇప్పుడి్ప్పుడే బలం పుంజుకుంటున్న ఆరోపణలు కొత్త రాష్ట్రం దశని, దిశని చెడగొట్టే ప్రమాదం వుంది.
నిజానికి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోయారు. మొదట్లో విపక్షాలు కూడా ఎలా విమర్శించాలో అర్థం కాక కన్ ఫ్యూజ్ అయ్యాయి. అంతే కాక ఉద్యమ నాయకుడన్న క్రేజ్ జనంలో వుండటంతో ఎవ్వరూ ఏదీ గట్టిగా అనలేని స్థితి వచ్చింది. అయితే, ఇప్పుడు క్రమంగా ఆరోపణల ఘాటు పెరుగుతోంది. సహజంగానే టీఆర్ఎస్ వ్యతిరేక మీడియా తన వంతు కృషి చేస్తోంది. అలాంటి ఓ మీడియా రిపోర్టే తెలంగాణలో తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.
తెలంగాణలో యంత్రలక్ష్మీ పేరుతో సబ్సిడి రేట్లకు వ్యవసాయ యంత్రాలు అందించే పథకం వుంది. దీంట్లో అవకతవకల గురించి మీడియా రాసింది. దాని సారాంశం ఏంటంటే... అర్హులైన రైతులకి తక్కువ ధరకి అందించాల్సిన ట్రాక్టర్లను టీఆర్ఎస్ నేతలు తమ వారికి ఇప్పించుకుంటున్నారు. ఇది ఏ పార్టీ అధికారంలో వున్నా జరిగేదే. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాని, మీడియా రిపోర్ట్స్ ప్రకారం సబ్సిడి ట్రాక్టర్స్ లో తొంభై శాతానికి పైగా పార్టీ వాళ్లకే వెళ్లిపోతున్నాయట. ఇది ఒక్క జిల్లాలో వ్యవహారం కాదు. పాత పది జిల్లాల్లో, కొత్త ముప్పై ఒక్క జిల్లాల్లో... రాష్ట్రమంతటా అదే పరిస్థితి.
మీడియా రిపోర్ట్ చేసినంత మాత్రాన అంతా నిజమని నమ్మేయాల్సిన పని లేదు. కాని, టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి వరకూ తెలంగాణ ప్రజలకి ప్రత్యక్షంగా లబ్ధి కలిగేలా చేసిన పనంటూ ఏం లేదు. అధికార పార్టీ తాము చేసిన పనులు లిస్ట్ వేసుకొని చెప్పొచ్చు. కాని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా వున్నాయి. రైతులు, నిరుద్యోగులు, మహిళలు... ఇలా అన్ని వర్గాల వారు అసంతృప్తిగానే వున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుందన్న వాళ్ల ఆలోచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దీని ప్రభావం వచ్చే ఎన్నికల పై కూడా అవకాశం వుంది. ఇక ఇలాంటి క్రమంలో కేసీఆర్ గవర్నమెంట్ పై అవినీతి ఆరోపణలు కూడా వస్తే అది మరింత ప్రమాదకరం. ప్రభుత్వం ఇచ్చే ట్రాక్టర్లు అర్హులైన రైతులకి అందిలే సీఎం స్థాయి నుంచి చర్యలు చేపట్టాలి. లేదంటే ఊళ్లలో రోజు రోజుకి చెడు ప్రచారం ఎక్కువవుతుంది.
ఏ ప్రభుత్వమైనా తిరిగి ఎన్నిక కావాలంటే ఒక వైపు అభివృద్ధి చేస్తూనే మరో వైపు అవినీతి , అక్రమాల ఆరోపణలు లేకుండా చూసుకోవాలి. వీటికి తోడు శాంతి భద్రతలు చెడకుండా వుండాలి. కేసీఆర్ శాంతి భద్రతల విషయంలో వంద మార్కులు, అభివృద్ధి విషయంలో పాస్ మార్కులు వేయించుకుంటున్నా... పార్టీ నేతల, ప్రజా ప్రతినిధుల ప్రవర్తన విషయంలో కాస్త పట్టించుకుంటున్నట్లు కనిపించటం లేదు! ఇది దీర్ఘ కాలంలో కాలి కింద ల్యాండ్ మైన్ అవ్వొచ్చంటున్నారు విమర్శకులు. గులాబీ బాస్ ఎలా ఈ విమర్శని స్వీకరిస్తారో చూడాలి....