నల్ల ధనం.... మల్ల యుద్ధం!

తేలుకుట్టిన దొంగలు అంటారు... తెలుసు కదా! అలాగే వుంటుంది మన రాజకీయ నేతల వ్యవహారం. మిగతా అన్ని విషయాల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసకున్నా నల్లధనం వద్దకొచ్చే సరికి అంతా ఏకమైపోతారు. దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలు తేలుకుట్టినా కూడా కిక్కురుమనకుండా వున్నట్టు అందరూ ఒకరి గురించి ఒకరికి తెలిసినా సైలెంట్ గా వుంటారు. అవసరం, అనర్థం అలాంటిది!  బ్లాక్ మనీ విషయంలో పాలక పక్షం, ప్రతి పక్షం మధ్య క్విడ్ ప్రోకో వుంటుందని మనకు తెలసిందే. కాని, ఆంద్రప్రదేశ్ లో మాత్రం డిఫరెంట్ రాజకీయం నడుస్తోంది. నల్లధనం విషయంలో కూడా టీడీపీ, వైసీపీ పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నాయి. తేలుకుట్టిన దొంగల ఫార్ములా ఇక్కడ వర్కవుట్ కావటంలేదు. పైగా గుమ్మడికాయల దొంగ సామెత చక్కగా పని చేస్తోంది! కొన్నాళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీ వివరాలు చెప్పేయండంటూ బంపరాఫర్ ఇచ్చింది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా వేలాది కోట్లు ఇనప పెట్టెల్లోంచి బయటకు వచ్చాయి. కాని, మన హైద్రాబాద్ నుంచి ఒకాయన తన నల్లధనం పది వేల కోట్లంటూ గవర్నమెంట్ కి చెప్పేశాడట. ఆయన పేరు, వివరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు. ఆ గ్యారెంటీ వుంది కాబట్టే సదరు పెద్దమనిషి తన నల్ల కష్టార్జితం అంతా బయటపెట్టేశాడు. కాని, అనధికారికంగా ఆ సంగతి, ఆయన పేరు టీడీపీ వారికి తెలియటమే ఇప్పుడు రచ్చకి కారణమవుతోంది...  చంద్రబాబు మీడియా ముందుకొచ్చి మరీ హైద్రాబాద్ లో ఒకరు పది వేల కోట్లు నల్లధనం ప్రకటించారని చెప్పటం... ఆ వెంటనే ఇతర టీడీపీ నేతలు నేరుగా జగన్ పేరు కూడా ప్రస్తావించటం... కలకలం రేపింది. బాబు మోదీకి ఒక లేఖ రాస్తే జగన్ కూడా ఓ లెటర్ రాసేశారు. సీక్రెట్ గా వుంచాల్సిన పేర్లు టీడీపికి ఎలా తెలుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. కాని, ఇక్కడ అసలు సమస్య టీడీపీ వారు ఆరోపించగానే జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని! చంద్రబాబు అండ్ టీమ్ జగన్ని టార్గెట్ చేయటం సహజమైన విషయమే. కాని, వైసీపీ బాస్ టీడీపీ విమర్శల్ని తిప్పి కొట్టకుండా ఢిల్లీకి లేఖ రాయటం ఆయనలోని టెన్షన్ కు సంకేతంలా మారిపోయింది. సీక్రెట్ గా వుండాల్సిన పేర్లు బయటకు ఎందుకు వచ్చాయనటం జగన్ ఉద్విగ్నతకు అద్ధం పడుతుంది. ఎందుకంటే, హైద్రాబాద్ లో పది వేల కోట్లు వున్నది బాబు బినామీలకే అంటూ ఓ వైపు ఆరోపిస్తూ... వారి పేర్లు బయటెలా పెడతారని జైట్లీని ప్రశ్నించటం... లాజిక్ కు అందని విషయం! జగన్ చెప్పినట్టు నిజంగా పది వేల కోట్ల ఆసాములు చంద్రబాబు బినామీలైతే ... వాళ్ల పేర్లు బయటకి వస్తే... జగన్ సంతోషించాలి! అలా జరిగనట్టు కనిపించటం లేదు...  ఆ మధ్య ఓటుకు నోటు అంటూ రెండు రాష్ట్రాల్ని కొన్నాళ్ల పాటూ వార్తల వెల్లువ కుదిపేసింది. ఈ నల్లధనం కూడా అంతే. ఇంకా సూటిగా మాట్లాడుకుంటే ఓటుకు నోటు వ్యవహారం అంత హాట్ కూడా కాదు! జస్ట్ పొలిటికల్ ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం. అంతే. కాని, ఈ మాత్రం దానికే జగన్ అవసరానికి మించి అలర్ట్ అవ్వటం... కాస్త ఆశ్చర్యకరం!      

బ్లాక్ మనీని బ్లాక్ చేయటానికి బాబుగారిచ్చిన ఐడియా ఏంటి?

బ్లాక్ మనీ... ఈ పదం అందరి నోటా వినిపిస్తుంది కాని... ఎక్కడా కనిపించదు. కారణం, నల్లధనం నిజంగా నల్లగా వుండదు. మామూలు రంగులోనే వుంటుంది! మీరు ఎవరికైనా ఇచ్చి ఏదైనా కొనుక్కోవచ్చు. అక్కడే వస్తుంది వున్న తంటా అంతా...  బ్లాక్ మనీ తిరిగి తీసుకొచ్చి దేశ ఆర్దిక స్థితినే మార్చేస్తానని మోదీ ఎన్నికలకు ముందు అన్నారు. కాని, ఇప్పుడు అలాంటి సూచనలు ఏం కనిపించటం లేదు. ఇందులో మోదీ నిస్సహాయత వుంటే వుండొచ్చుగాని... అసలు సమస్య నల్లధనంలోనే వుంది. అది దేశం లోపల వున్నా బయట వున్నా గుర్తించటమే పెద్ద సవాలు. ఏది నల్లదనం, ఏది కాదు అన్నది చాలా క్లిష్టమైన వ్యవహారం. సింపుల్ గా మాట్లాడుకుంటే ఎవరైనా ట్యాక్స్ కట్టకుండా తమ డబ్బు దాచేస్తే అది బ్లాక్ మనీ అవుతుంది. కాని, మనం మాట్లాడుకున్నంత సింపుల్ గా బ్లాక్ మనీని బయటకు తీయించలేం. నల్లదనం దాచేవాడి దగ్గర బోలెడు టెక్నిక్స్ వుంటాయి...  నల్లధనం గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా రాజకీయ నేతల పేర్లు కూడా వినిపిస్తుంటాయి. అసలు దేశంలో అత్యంత ఎక్కువ నల్లధనం మన నేతలే దాచేశారని టాక్. అందుకే, బ్లాక్ మనీని తీసుకురావాల్సిన వాళ్లే దొంగ సాకులు చెబుతూ తీసుకురాకుండా వుండిపోతుంటారు. ఆఫ్ట్రాల్ సీరియస్ గా తీసుకుని బ్లాక్ మనీ తవ్వి తీస్తే నష్టపోయేది పొలిటీషన్సే! మరి వాళ్లెందుకు చేస్తారు? మొత్తంగా బ్లాక్ మనీ ఎప్పుడు బయటకు వస్తుందో, ఎప్పుడు దేశంలోని  పేదలు బాగుపడతారో మనకు తెలియదు గాని ... ఇప్పటికిప్పుడు నల్లదనం నియంత్రణ, మరింత ఎక్కువగా స్విస్ బ్యాంకులకి తరలకపోవటం వంటివి మాత్రం చేయవచ్చు. అందుకు చక్కటి పరిష్కారం ఏపీ సీఎం చంద్రబాబు పీఎంకి సూచించారు. ఆయన రాసిన లేఖలో నరేంద్ర మోదీకి అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు నిషేధించమని చెప్పారు. అలా చేస్తే బ్లాక్ మనీ సర్క్యూలేషన్ కష్టంగా మారుతుందని ఆయన వివరించారు. ఇలాంటి సూచన గతంలోనూ చాలా మంది చేశారు. బాబా రాందేవ్ యూపీఏ హయాంలోనే ఇలాంటి ఐడియా ఇచ్చారు. కాని, అది ఇప్పటి వరకూ వర్కవుట్ కాలేదు. అయితే, చంద్రబాబు లాగా ఒక సీఎం ప్రధానికి బ్లాక్ మనీ అంశంపై లేఖ రాయటం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. చూడాలి మరి... చంబ్రాబు సలహాని, సూచనని మోదీ ఎంత వరకు స్వీకరిస్తారో! బ్లాక్ మనీని ఏ రేంజ్లో బ్లాక్ చేస్తారో...  

సచిన్ ఇచ్చిన బీఎండబ్ల్యూ... నాకు వద్దంటోంది!

భారతదేశం విచిత్రాలకు, విడ్డూరాలకు పెట్టింది పేరు! ఇక్కడ తాజ్ మహల్ వుంటుంది. పూరి గుడిసెలు కూడా కోట్లలో వుంటాయి. ఆకాశంలో విమానాలు ఎగురుతుంటాయి. అదే ఆకాశం కింద ఇళ్లు లేకుండా ఫుట్ పాత్ లపై వుండేవాళ్లు కూడా వుంటారు! ఒక్క మాటలో చెప్పాలంటే, అంబానీలు వుంటారు... అడుక్కుతినే వారు కూడా వుంటారు! ఇండియాలో అన్నీ వుంటాయి. అందరూ కనిపిస్తారు. అదే బలం, అదే బలహీనత! ఆ మధ్య రియో ఒలంపిక్స్ ముగిశాక దేశంలో నానా హడావిడి జరిగింది. గుర్తుంది కదా! మరీ ముఖ్యంగా, మన తెలుగు రాష్ట్రాలు ఒలంపిక్ ఫీవర్ తో వణికిపోయాయి. సింధు సిల్వర్ తేవటంతో కొన్ని రోజుల పాటూ కలకలం రేగింది. కాని, అదే సమయంలో 125కోట్ల మంది జనానికి రెండే మెడల్సా అంటూ నీరసించిపోయిన వారు కూడా వున్నారు. వాళ్లు చెప్పింది నిజమే కూడా! మొత్తం దేశానికి కలిపి రెండే రెండు మెడల్సా? అదీ ఒక్కటి కూడా గోల్డ్ కాదా? ఇండియాలో సమస్య అదే... ప్రపంచంలో మరెక్కడా జనం వద్ద లేనంత బంగారం ఇండియన్స్ వద్ద వుంటుంది! ఒలంపిక్స్ లో మాత్రం ఒక్క బంగారు పతకం కూడా గెలుచుకోలేం...  పతకాల గోల పక్కన పెడితే సింధు, సాక్షి మలిక్, దీపా కర్మకర్ సన్మానాల కోలాహలం కూడా మన దేశంలో జరిగే విన్యాసాలకి చక్కటి సంకేతం! వాళ్లని సన్మానించుకోని ప్రభుత్వం లేదు. బహుమతులు ఇవ్వని సంస్థా లేదు. ఆ క్రమంలో ఏకంగా సచిన్ వచ్చి బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చాడు ముగ్గురు ఒలంపిక్ ఛాంపియన్స్ కి. అంతే కాదు, సింధు, సాక్షి, దీపా కర్మాకర్ లకు బీఎండబ్ల్యూలు ఇస్తోంది సచినేనని కూడా ప్రచారం జరిగింది. కాని, నిజంగా మాస్టర్ బ్లాస్టర్ అవ్వి కొనివ్వలేదు! ఇచ్చింది చాముండేశ్వరినాథ్. హైద్రాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడైన ఆయన దేశానికి గర్వకారణంగా నిలిచిన ముగ్గురు అమ్మాయిలకు అత్యంత ఖరీదైన కార్లు అసొసియేషన్ తరుఫున గిఫ్ట్ గా ఇచ్చాడు...  బిఎండబ్ల్యూ కార్లు తీసుకున్న సింధు, సాక్షి బాగానే తమ తమ పనుల్లో పడిపోయారు కాని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒలంపిక్స్ లో అద్భుత ప్రతిభ చూపిన ఆమె తనకిచ్చిన బీఎండబ్ల్యూ రిటర్న్ చేసేయాలని అనుకుంటోంది! ఆమె ఇంట్లో వాళ్లు, కోచ్ కలిసి తీసుకున్న నిర్ణయమట! ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా? కారణం... దీపా వుండే ఆగర్తలా నగర రోడ్లు! ఒలంపిక్స్ లో పాల్గొని దేశానికి పేరు తెచ్చిన దీపా త్రిపుర రాష్ట్రంలోని అగర్తల నగరానికి చెందిన అమ్మాయి. అయితే, అక్కడ రోడ్లు ఎంత గొప్పగా వుంటాయటా అంటే... బీఎండబ్ల్యూ లాంటి సూపర్ కాస్ట్ లీ కారు తిరగటమే కుదరదట! అంత చిన్నగా, అంత దారుణంగా వుంటాయట! ఇక చేసేదేం ఏం లేక దీపా తన కార్ తిరిగి హైద్రాబాద్ బ్యాడ్మింటన్ అసొసియేషన్ కి ఇచ్చేయాలనుకుంటోంది. అయితే, అంతకు సమానంగా అమౌంట్ దీపాకు ఇవ్వాలని ఆమె కోచ్, ఫ్యామిలి కోరుకుంటున్నారు. వాటితో ఆమె ముందు ముందు మరింత ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్స్ లో పాల్గొంటుందని వారి ఆలోచన! ఒకవేళ అలా కుదరకపోతే ఎంత ఇచ్చినా తమకు ఫర్వాలేదని కూడా దీపా ఫ్యామిలీ చెప్పేసింది. కాని, బీఎండబ్ల్యూ లాంటి కోట్లాది రూపాయాల కార్ తమ వద్ద మాత్రం వుంచొద్దని తేల్చేసింది...  దీపా కర్మాకర్ ఈ బీఎండబ్ల్యూ ఉదంతం మనకు మన దేశం గురించి కొన్ని సత్యాలు బోధిస్తుంది. ఒకటి ఒలంపిక్స్ విజేత స్థాయి కర్మాకర్ ... తనకు గిప్ట్ గా వచ్చిన బీఎండబ్ల్యూ కార్ మెయింటైన్ కూడా చేయగలిగే ఆర్దిక స్థితిలో లేదంటే ... క్రీడలకు దక్కుతున్న ప్రొత్సాహం ఇట్టే అర్థమవుతుంది! మరో వైపు , ఆగర్తాల లాంటి ఒక రాజధాని నగరం... బీఎండబ్ల్యూ కార్ కి కూడా సరితూగటం లేదంటే... ఎలాంటి స్థితిలో వుందో అర్థం చేసుకోవచ్చు! దీపా కర్మాకర్ కార్ కు బదులు డబ్బులు ఇస్తారా? ఇస్తే ఎంత ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పడే సమాధానాలైతే లేవు. కాని, మన దేశంలో క్రీడాకారుల జీవితాలు, ఆ క్రీడాకారులుండే రాష్ట్రాలు, నగరాలు ఎంతో బాగుపడాల్సి వుంది. బీఎండబ్ల్యూ పెద్ద ప్రధానమైన విషయమేం కాదు గాని... దాన్ని దీపా తిరిగి ఇచ్చేయటం, అందుకు ఒక కారణం, ఆమె వుండే అగర్తల కావటం...ఇవీ విషాదకర విషయాలు!  

మహిమాన్విత రొట్టెలే కాదు... మత సామరస్యపు రొట్టెలు కూడా!

భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. ఇది చిన్నప్పుడు అందరూ చదువుకున్నదే. కాని, నిజంగా పెద్దగయ్యే కొద్దీ మన దేశంలో ఏకత్వంలో భిన్నత్వమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒక దేశమే అయినా ఎవరి మతం వారిది, ఎవరి కులం వారిది, ఎవరి వర్గం వారిది, ఎవరి భాష, యాస, ప్రాంతం వారిది. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు! ఎప్పుడో పాకిస్తాన్ పై క్రికెట్ మ్యాచ్ గెలిస్తేనో, లేదంటే ఆ దేశంపై తాజాగా జరిగినట్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగితేనో మన వాళ్లు పెద్ద మొత్తం లో ఏకం అవుతారు. అప్పటికీ భారతదేశంలో నిస్సిగ్గుగా, దుర్మార్గంగా శత్రుదేశం మేలు కోరేవారు చాలా మందే వుంటుంటారు. ఇన్ని వున్నా ఇండియా ఒక్కటిగా ఎలా వుంటోందని మీకెప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా?  భారతదేశాన్ని ఒక్కటిగా వుంచేది, వుంచుతోన్నది ఇక్కడి జనాల విశ్వాసం. అవును, యుగయుగాలుగా మన వాళ్లు విశ్వాసానికి ఇచ్చిన ప్రాముఖ్యత మరి దేనికి ఇవ్వరూ. తిరుమలలో ప్రతీ రోజు లక్షల మంది ఎందుకని పోటెత్తుతారు? పుష్కరాల వంటివి వస్తే ఎందుకు వేలాది మంది తరలి వస్తారు? ఇలా తార్కాణాలు బోలెడు! భారతీయులకి ఒక్కసారి విశ్వాసం కుదిరితే దాన్ని కూల్చేయటం దాదాపు అసంభవం! అలాంటి విశ్వాసానికే ప్రతీకే... రొట్టెల పండుగ! నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఏదో ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాదు. ముస్లిమ్ లు పవిత్రంగా భావించే దర్గాకు పోయి హిందువులు జరుపుకునే అసలు సిసలైన సెక్యులర్ పండుగ! దేశ, విదేశాల నుంచీ బారాషహీద్ దర్గాకు భక్తులు వచ్చినా ముస్లిమ్ లతో పాటూ ఎక్కువగా పాల్గొనేది హిందువులే. మరీ ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల హిందువులు. అసలు రొట్టెల పండుగ వాతావరణం ఒక్కసారి చూస్తే భారతదేశం ఐకమత్యంలోని మర్మం తెలిసిపోతుంది! నెల్లూరు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే రొట్టెల పండుగ నిజానికి పన్నెండు మంది ఇస్లాం మత ప్రచారకుల జ్ఞాపకార్థం జరుపుకుంటారు. వాళ్లు మక్కా నుంచి ఇక్కడికి వచ్చి ఇస్లాం మత వ్యాప్తి కోసం యుద్ధంలో మరణించారు. వాళ్ల సమాధులున్న చోటే బారా షహీద్ దర్గా. అక్కడ గతంలో ఒక నవాబు భార్యకు ఆరోగ్యం బాగుపడటంతో రొట్టెల పండుగ మొదలైంది. నవాబు, ఆయన భార్య బారా షహీద్ దర్గాలో నిద్ర చేశాక తెల్లవారే సరికి ఆమె ఆరోగ్యం కుదటపడటంతో ఆ రాజు తాము తెచ్చుకున్న రొట్టెల్ని అందరికీ పంచాడు. అప్పట్నుంచీ రొట్టెలే ప్రసాదంగా కొనసాగుతూ వస్తున్నాయి. అంతే కాదు, ఇప్పుడు లక్షల మంది ఈ రొట్టెల్ని ఇచ్చిపుచ్చుకుంటూ కోరికలు తీరుతాయని విశ్వసిస్తున్నారు...  రొట్టెల పండుగ వెనుక కథ ఎలా వున్నా దీంట్లోని మత సామరస్యం అద్భుతం. ముస్లిమ్ లు పవిత్రంగా భావించే ఒక దర్గాను హిందువులు కూడా క్షేత్రంగా భావించటం... మన దేశ సంస్కృతికి నిదర్శనం. ఇలాంటి అద్భుతాలు ఎన్నో వున్నాయి భారతదేశంలో. వేములవాడ లాంటి చాలా చోట్ల హిందువులు ప్రధాన ఆలయంతో పాటూ దర్గాల్ని కూడా సందర్భిస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసిన వారు వావర్ స్వామి అనే ముస్లిమ్ మహాత్ముడ్ని శరణు ఘోషలతో తలుచుకుంటూ వుంటారు.... రొట్టెల పండుగలో రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటే నిజంగా కోరికలు తీరతాయా? ఆ విషయం విశ్వాసం కలిగిన భక్తులకే తెలియాలి! కాని, భారతదేశం మతాల ప్రాతిపదికన విచ్ఛిన్నం కావద్దనే కోరిక మాత్రం ఈ రోట్టెలు తప్పక తీరుస్తాయి...   

అపోలోలో అమ్మ... అయోమయంలో తమిళనాడు!

జయలలిత కోలుకుంటోంది. జయలలిత త్వరలోనే సీఎంగా మరోసారి జనం ముందుకు రానుంది. ఇలాంటి వార్తలు గత కొన్ని రోజులుగా వస్తూనే వున్నాయి. అయితే, జనం మాత్రం హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకోవటం లేదు. మరీ ముఖ్యంగా, తమిళనాడులోని పురుచితలైవీ అభిమానులు దినమొక గండంగా గడుపుతున్నారు. మరో వైపు రాజకీయాలు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. రోజుకో సంచలన వార్త అమ్మ గురించి బయటకొస్తోంది....  జయలలిత ప్రాణాపాయం నుంచి బయటపడిందని ఇప్పటికి డాక్టర్లు చెప్పటం లేదు. కాకపోతే, ఆమె ఎలాగైనా దిగ్విజయంగా బయటకొస్తారని అంతా నమ్ముతున్నారు. కాని, ఒకవైపు జయలలిత తిరిగి తమిళనాడు పగ్గాలు పట్టుకుంటారని అంటూనే మరో వైపు ఆమె వారసత్వం కోసం రేసు మొదలైంది. జయలలిత అన్న కూతురు దీప జయకుమార్ హాస్పిటల్ వద్దకి వచ్చి నానా రచ్చ చేసింది. కాని, అన్నాడీఎంకే నేతలు ఆమెని మేనత్త వద్దకి పంపలేదు. మరో వైపు అనూహ్యంగా తమిళ హీరో అజిత్ పేరు కూడా నెక్స్ట్ సీఎం అంటూ వినిపిస్తోంది. జయలలితకు తలా అజిత్ చాలా దగ్గరి వాడవటమే ఈ వదంతలకి కారణం!  జయలలిత తరువాత సీఎం ఎవరు అన్నది ఇప్పుడే తేలే విషయం కాదు. కాకపోతే, ముందు ముందు మరిన్ని పేర్లు తమిళ సీఎం జాబితాలో కనిపించవచ్చు. మనం ఊహించినవి, ఊహించనవి కూడా అందులో వుండవచ్చు. అయితే, ఇప్పటి వరకూ మార్మోగిపోవాల్సిన పేరు, కాని ఆశ్చర్యకరంగా ఎక్కడా వినిపించనిదీ... శశికళ పేరే! జయలలిత, శశికళ ఎంత గొప్ప స్నేహితురాళ్లో చెప్పనవసరం లేదు. కాని, ఆ మద్య వారిద్దరికీ కూడా చెడింది. శశికళ దూరంగా వెళ్లిపోయింది. మళ్లీ దగ్గరైంది. అయితే, ప్రస్తుతం ఎవ్వర్నీ జయలలిత వద్దకు వెళ్లనీయకపోయినా కేవలం శశికళ మాత్రం ఐసీయూలో వుంటుందోట. అంత దగ్గరగా వుంటోన్న ఆమె ఏదో ఒకటి చేస్తుందని భయపడేవారు కూడా చాలా మంది వున్నారు. తాజాగా అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ పుష్పా శశికళ పేరు చెప్పుకుండా ఎవరైనా జయ సంతకం ఫోర్జరీ చేయవచ్చని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతే కాదు , గవర్నర్ , స్పీకర్ వంటి వారికి కూడా పుష్ప కంప్లైంట్ ఇస్తోంది. జయ సంతకంతో ఏదైనా లెటర్ కీలక నిర్ణయం వెల్లడిస్తూ వస్తే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోమంటోంది...  పుష్ప భయానికి కారణం శశికళే. ఆమె జయ సంతకం కాపీ చేసి పార్టీపైన, ప్రభుత్వంపైన పట్టుసాధిస్తుందని ఆమె అంటోంది. అది నిజం అయ్యే అవకాశాలూ లేకపోలేదు. కాకపోతే జయ అనారోగ్యం ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె చుట్టూ వున్న వారి జీవితాల్నే కాకుండా మొత్తం తమిళనాడునే అతలాకుతలం చేసేస్తోంది...   

వచ్చే దసరాకి... బాబు పెట్టుకున్న టార్గెట్ ఏంటి?

   దసరా అంటే దేశం మొత్తానికీ పండగే! ఓ చోట దాండియా అడితే మరో చోట బతుకమ్మ ఆడుతూ సంబరాలకు సిద్ధపడతారు! ఇక ఓ చోట రామ్ లీల నిర్వహించి రావణ దహనం చేస్తే మరో చోట దుర్గామాత ఊరేగింపులు జరుపుతూ జై మాతా దీ అని గర్జిస్తుంటారు! అందుకే, విజయదశమి యావత్ దేశాన్ని తన్మయం చేసే పర్వం...  మొత్తం దేశానికి ఎంతో ప్రధానమై దసరా తెలుగు వారికి కూడా చాలా ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా గతేడాది విజయదశమి, ఈసారి విజయదశమి... నవ్యాంధ్రకి మరింత ప్రత్యేకం. ఎందుకంటే, పోయిన సంవత్సరం ఇదే పండగ వేళ అమరావతి శంఖుస్థాపన జరిగింది. మోదీ వచ్చి ఆంధ్రుల ఆనంద కోలాహలం మధ్య పనుల్ని ప్రారంభించారు. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికల్లా చంద్రబాబు అమరావతిలోనే మకాం చేసి పూర్తి స్థాయిలో పని చేసేట్టుగా ఏర్పాట్లు పూర్తి చేయించారు! ఆయన ఈ విజయదశమి నుంచీ ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ నుంచి ఫుల్ టైం వర్క్ చేయనున్నారు...  విజయదశమి సందర్భంగా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు సీఎం. వచ్చే దసరా నాటికి అమరావతి అద్భుతంగా ఆవిష్కృతం అవుతుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతే కాదు, దుర్గమ్మ ఆశీస్సులు, కృస్ణమ్మ పరవళ్లు రాజధానికి తిరుగులేని బలం అన్నారు. వాటితోనే అమరావతి సుసాధ్యం చేసి చూపిస్తానని అన్నారు...  ప్రపంచపు అయిదు అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా వుండబోతుందని చెప్పారు సీఎం. అయితే, అంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిచబోతున్న మహానగరం మామూలు విషయం కాదని కూడా ఆయన అన్నారు. విభజన ఆదరాబాదరాగా చేసేయటంతో ఆంద్రులకి తీరని నష్టం జరిగిందని అంటూనే అన్ని కష్టాల్ని ఎదుర్కొని బయటపడతామని భరోసా ఇచ్చారు. ఆ లక్షణం తెలుగు వారికి వుందని బాబు అన్నారు.  వేల ఎకరాల భూముల్ని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకి ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు అమరావతి ఏర్పాటులోని ఛాలెంజెస్ ని లోతుగా చర్చించారు లేఖలో. మౌలిక సదుపాయాల కల్పన కీలకమన్నారు. అలాగే, పోలవరం పూర్తి చేయటం, రైతులకి, జనాలకి నీళ్లు అందివ్వటం తమ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్ ఉత్పాదన మీద కూడా తమ దృష్టి వుంటుందని తేల్చారు. ఇక యువత ఉపాధికి ఎంతో కీలకమైన పారిశ్రామిక పురోగతికి కూడా ఆయన పెద్ద పీట వేశారు. ఖచ్చితంగా కేంద్రం సాయంతో ఆంద్రప్రదేశ్ పారిశ్రామికంగా దూసుకుపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు...  దసరా సందర్భంగా చంద్రబాబు జనానికి రాసిన లేఖ ఒక విధంగా ఆయన రోడ్ మ్యాప్ అనుకోవాలి. 2019లోపు సీఎం చెప్పిన అన్ని పనులూ పూర్తైతే అమరావతి అపురూపంగా ఆంధ్రులకి అందుబాటులోకి వస్తుంది. అది చేయగలిగితే నవ్యాంధ్ర తొలి సీఎంగా... నిస్సందేహంగా, చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు... ఆంధ్రుల మనస్సుల్లో కూడా!  

ట్రంపును వెదుక్కుంటూ వచ్చిన ఆడాళ్ల వీడియో!

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచ నాయకుడ్ని ఎన్నుకోవటమే. ఇది కొంచెం అతిగా అనిపించినా, కొందర్ని హర్ట్ చేసినా ... నిజం! అమెరికన్ ప్రెసిడెంట్ ప్రభావం మొత్తం వాల్డ్ పైన వుంటుంది. అందుకే, యూఎస్ లో ఎలక్షన్స్ వచ్చాయంటే ప్రతీ నాలుగేళ్లకోసారి అన్ని దేశాలూ కన్నర్పాకుండా అక్కడి పరిణామాలు గమనిస్తుంటాయి...  ట్రంప్ , హిల్లరీల మధ్య ఈ సారి చారిత్రక పోరు జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే అమెరికాలో ఇంత వరకూ మహిళా అధ్యక్షురాలే లేదు. కనీసం పోటీ కూడా చేయలేదు. ఇప్పుడు తొలిసారి హిల్లరీ టాప్ చెయిర్ కోసం టాప్ గేర్లో పరుగు తీస్తోంది. కాని, అంతే భీభత్సంగా ఆమెను ఓవర్ టేక్ చేయాలనుకుంటున్నాడు డోనాల్డ్ ట్రంప్.వృత్తి రిత్యా ఫక్తు బిజినెస్ మ్యాన్ అయిన ఆయన అమెరికన్లకు ఎప్పటికప్పడు పిచ్చ షాక్ లిస్తున్నాడు. ముస్లిమ్ లను దేశంలోకి రానీయనని , మెక్సికో సరిహద్దులో గోడ కడతానని ... ఇలా ట్రంప్ మాటలు దేనికవే ఆణిముత్యాలు! అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి మరో నెల రోజులు కూడా లేదు. కాని, ట్రంపా... హిల్లరీనా ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. పోటీ నెక్ టూ నెక్ వుంది. ఈ మధ్యలోనే అటు హిల్లరీని కార్నర్ చేయాలని ట్రంప్ వర్గం, ట్రంప్ ను స్మాష్ చేయాలని మిసెస్ క్లింటన్ వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ మధ్య హిల్లరీ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఇంకా అనేక చిన్నా,చితక సమస్యలు హిల్లరీ ఎదుర్కొంటూనే వుంది. కాని, అసలు పెద్ద సమస్యలన్నీ ట్రంపేకే ఎదురవుతున్నాయి...  ఈ సారి ట్రంప్ ప్రత్యర్థి మహిళ కావటంతో లేడీస్ ఓట్లు కీలకంగా మారాయి. అమెరికన్ ఫీమేల్ ఓటర్స్ అధికంగా క్లింటన్ కే పట్టం కడతారని అంతా భావిస్తున్నారు. అయితే, మహిళల్లో ట్రంప్ ఫాలోయింగ్ మరింత తగ్గించాలని చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఆయన గతంలో ఓ టీవీ షోలో కాస్త లూజ్ టాక్ చేసేశాడు. ఇప్పుడు ఆ వీడియో బయటకొచ్చింది. అందులో డొనాల్డ్ ట్రంప్ ఆడవాళ్ల గురించి డ్యామేజింగ్ గా మాట్లాడాడు. స్త్రీలు సెలబ్రిటీలు ప్రయత్నిస్తే పడిపోతారని, శృంగారానికి సై అంటారనీ అన్నాడు! ఇలా ట్రంప్ ఆడవాళ్ల గురించి మాట్లాడటం హిల్లరీకి బాగా కలిసొస్తోంది. అతడి లాంటి వాడ్ని అమెరికన్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టోద్దని ఓటర్లకు చెబుతోంది! ట్రంప్  తన ఫ్లాష్ బ్యాక్ నిర్వాకాలకు పశ్ఛాత్తాప పడుతూ ఫేస్బుక్ లో సారీ చెప్పాడు. తాను మహిళల గురించి అలా మాట్లాడటం తప్పేనని లెంపలేసుకున్నాడు. అంతకు మించి ఎన్నికల ముందు అతడికి వేరే ఛాన్స్ కూడా లేదు! కాకపోతే, హిల్లరీ భర్త ఆడవాళ్లను తనకంటే హీనంగా చూస్తాడని ముక్తాయింపు ఇచ్చాడు! బిల్ క్లింటన్ తన వద్ద పని చేసే వైట్ హౌజ్ ఉద్యోగినితో చేసిన రాసక్రీడలు తెలిసినవేగా!  

ఆ హీరో... 'అమ్మ' రాజకీయ వారసుడట!

నవరాత్రుల వేళ దేశం అంతా పండగ చేసుకుంటోంది. కాని, తమిళనాడులో మాత్రం పండగ బాగానే జరుగుతోన్నా జనంలో ఏదో విషాదం! అందుక్కారణం తమిళుల అమ్మ ఆసుపత్రిపాలవటమే! ఒక దశలో ఆమె గురించిన దుర్వార్త వినాల్సి వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. కాని, క్రమంగా ఒక్కొక్కరూ జయలలిత కోలుకుంటోందని చెబుతుంటే సామాన్య జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. కాని, అదే సమయంలో అమ్మ అనారోగ్యం అక్కడి అధికార వ్యవస్థని మొత్తం మంచం పట్టేలా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే జయ అపోలో ఆసుపత్రిలో చేరిన నాటి నుంచీ తమిళానాడు కూడా స్థంభించి పోయింది...  కరుణానిధితో ఎన్నికల్లో పోరాడి గెలిచిన జయలలిత ఇప్పుడు విధితో పోరాడుతోంది. మళ్లీ ఆరోగ్యంగా సీఎం కూర్చిలో కూర్చునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అదే సమయంలో ఆమె వారసత్వం కూడా ఇప్పుడు పెద్ద డిస్కషన్ అయిపోయింది. పెళ్లి, పిల్లలు లేని జయలలిత తన తరువాత తమిళనాడుకు ఎవరు అన్నది ఎప్పుడూ పబ్లిగ్గా చెప్పలేదు. కాని, ఆమె రాజకీయ వారసత్వం కొనసాగించటానికి చాలా మందే రెడీ అవుతున్నారు.  అన్నాడీఎంకే పార్టీలో అమ్మకు నమ్మకస్థులైన నేతలు చాలా మందే వున్నారు. వాళ్లలో జయ జైల్లో వున్నప్పుడు సీఎం అయిన పన్నీర్ సెల్వం  కూడా ఒకరు. ఆయన కాక మరో మంత్రి పళని స్వామి కూడా రేస్ లో వున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉప ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపడతారని టాక్. కాని, జయలలిత ఆరోగ్యం తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న నేపథ్యంలో ఆమె శాశ్వత వారసులుగా ఎవరో ఒకరు ముందుకు రావాలన్నది చర్చగా మారింది! ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రెండు పేర్లు చెన్నైలో చక్కర్లు కొడుతున్నాయి...  జయలలితకు జయకుమార్ అనే ఓ అన్నయ్య వున్నాడు. కొన్నేళ్ల కిందట చనిపోయాడు. ఆయన కూతురే దీపా జయకుమార్. ఈమె తానే జయకు వారసురాల్ని అంటోంది. కాని, జయలలితకు, దీపా జయకుమార్ కుటుంబానికి ఎప్పట్నుంచో రిలేషన్స్ లేవు. వాళ్లతో పడక తమిళనాడు సీఎం దూరం పెట్టింది. కాని, ఇప్పుడు ఆరోగ్యం బాగా లేని సమయంలో మేన కోడలు దీపా జయకుమార్ తనని అత్త వద్దకి పంపాలని డిమాండ్ చేస్తోంది. అన్నాడీఎంకే నేతలు మాత్రం ఒప్పుకోవటం లేదు. మరి అత్తని చూడటానికే పర్మిషన్ దొరకని దీపా ఆమె వారసత్వాన్ని ఎలా దక్కించుకుంటుంది? ఇది మిలియన్ డాలర్ ప్రశ్నే! జయలలిత వారసుడంటూ వినిపిస్తోన్న రెండో పేరు అందరూ ఆశ్చర్యపోయేదే! ఇప్పటి వరకూ రాజకీయాల జోలికి అస్సలు పోని హీరో అజిత్... జయ వారసుడంటున్నారు! దీనికి కారణం గతంలో చాలా సార్లు ఆమె అజిత్ ను తన వారసుడని దగ్గరి వారితో చెప్పిందట. అలాగే అజిత్ కూడా ఏనాడూ తనకు అమ్మ పై వున్న ప్రేమ దాచుకోలేదు. పబ్లిగ్గా పురుచితలైవికి మద్దతు తెలిపేవాడు. ఆమెతో దగ్గరి అనుబంధం వుంది...  అజిత్ తమిళనాడు సీఎం అవ్వటం... మామూలుగా అయితే నమ్మదగ్గది కాదు! కాని, చైన్నై పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే! చూడాలి మరి జయ వారసత్వం విజయవంతంగా అందుకునేది ఎవరో?   

మోదీ 'సర్జికల్ స్ట్రైక్స్'కి విపక్షాలు విలవిల!

సర్జికల్ స్ట్రైక్స్... ఈ పదం వినగానే మనమేదో పాకిస్తాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనుకోకండి! మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది మన వాళ్ల గురించే! ముఖ్యంగా, ప్రతి పక్షాల గురించి! ఇంతకీ విషయం ఏంటంటే... సర్జికల్ స్ట్రైక్స్ ఆర్మీ ఎవరి మీద జరిపింది? ఉగ్రవాదుల మీద కదా... కాని, పరిస్థితి చూస్తుంటే మన విపక్షాల మీద మెరుపు దాడి జరిగినట్టు అనిపిస్తోంది! అసలు ఎప్పటిలాగే కొన్నాళ్ల కింద పక్క దేశపు ఉగ్రవాదులు మన జవాన్లను యూరీలో బలితీసుకున్నారు. తరువాత ఖండనల పరంపర మొదలైంది. బీజేపీ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు, ఆప్ వాళ్లు, మిగతా పార్టీల వాళ్లు అందరూ జై జవాన్ అంటూ నినదించారు. సోషల్ మీడియా కోపంతో ఊగిపోయింది. మామూలుగా అయితే ఇక్కడితో స్టోరీ క్లోజ్. మళ్లీ ఉగ్రవాదులు తెగబడే దాకా మనం క్రికెట్, బాలీవుడ్, పండుగలు, పబ్బాలు అంటూ గడిపేసే వాళ్లం! కాని, ఈసారి విచిత్రం జరిగింది! సరిగ్గా పది రోజులు కూడా తిరగకుండానే ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది! పాకిస్తాన్ని, ఉగ్రవాదుల్నే కాదు... ఇండియన్స్ ని కూడా షాక్ కి గురి చేసింది! మనం మరో దేశంపై రాత్రికి రాత్రి దండెత్తటమా? ఉగ్రవాదుల్ని కాల్చి పారేయటమా? ఎవ్వరూ నమ్మలేకపోయారు...  సర్జికల్ స్ట్రైక్స్ అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా జరిగిపోవటంతో అందరికి మైండ్స్ బ్లాంక్ అయ్యాయి. మోదీ భక్తులు, దేశభక్తులు బాగానే సెలబ్రేట్ చేసుకున్నా పాకిస్తాన్ , మన విపక్షాలు అస్సలు జీర్ణించుకోలేకపోయాయి. మొదట్లో మోదీని ప్రపంచ దేశాలతో సహా అందరూ పొగుడుతుంటే ఎవ్వరూ ఏమీ అనలేని పరిస్థితిలో కిమ్మనకుండా వుండిపోయినా మెల్లగా అదును చూసి నోరు విప్పారు! పాకిస్తాన్... ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని, ఇంటర్నేషనల్ మీడియాను నమ్మించే ప్రయత్నం చేయటంతో... కేజ్రీవాల్ ది గ్రేట్ రంగంలోకి దిగారు! తన స్వతః సిద్ధమైన రాజకీయ చాతుర్యంతో సాక్ష్యాలు కావాలన్నాడు! అసలు మన ఆర్మీ దాడులు చేసిందంటే అమెరికా , జర్మనీ లాంటి దేశాలు కూడా అనుమానం వ్యక్తం చేయలేదు. అటువంటిది దేశ రాజధాని డిల్లీ ముఖ్యమంత్రి మాత్రం ప్రూఫ్స్ కావాలన్నాడు. వెంటనే పాకిస్తాన్ మీడియా కేజ్రీవాల్ ని హీరోని చేసి కథనాలు ప్రసారం చేసింది. ట్విట్టర్ లో పాక్ స్టాండ్స్ విత్ కేజ్రీవాల్ అంటూ ట్రెండ్ సృష్టించారు! సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ అంతా మోదీకి, తద్వారా బీజేపికి వస్తుండటంతో మన విపక్షాలకి ఎసిడిటీ మొదలైంది. దానికి తొలి సంకేతమే కేజ్రీవాల్ పిచ్చి పిచ్చి మాటలు. మోదీని కార్నర్ చేయాలన్న తపనతో ఆయన ఆర్మీనే శంకించాడు. పాకిస్తాన్ లాగే ఆర్మీ దాడులు చేసిందనే దానికి సాక్ష్యం కావాలన్నాడు. ఇక అరవింద్ బీజేపి వ్యతిరేక ఓట్లు దంచుకుంటున్నాడని అనుమానం రాగానే కాంగ్రెస్ కూడా తన స్పీకర్లు ఆన్ చేసింది. సంజయ్ నిరుపమ్ అనే ట్రేడ్ మార్క్ కాంగ్రెస్ నేత ఇష్టానుసారం మాట్లాడేశాడు. కేజ్రీవాల్ ఇన్ డైరెక్ట్ గా ఆర్మీని అనుమానిస్తే సంజయ్ నిరుపమ్ నేరుగానే దాడులు జరగలేదని చెప్పేశాడు! ఆర్మీనే అబద్ధం చెబుతోంది సిగ్గుమాలిన కామెంట్లు చేశాడు! ఆప్, కాంగ్రెస్ లు బీజేపిని, మోదీని టార్గెట్ చేసి కాసులు బాగానే ఏరుకుంటున్నాయని అర్తం కాగానే సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది లాంటి ఇతర ఉత్తరాది పార్టీలు కూడా తమ ప్రతాపం చూపిస్తున్నాయి. దాడులు కేవలం ఆర్మీ గొప్పతనమేనట! మోదీకి అందులో క్రెడిట్ ఏం లేదట! సర్జికల్ స్ట్రైక్స్ ను కాషాయదళమే రాజకీయంగా వాడుకుంటోందట! అందరూ చకచకా సర్జికల్ స్ట్రైక్స్ ను వాడేసుకోవటంతో మన రాహుల్ బాబా కూడా ఆవేశపడ్డాడు. ఆయన తన ర్యాలీలో మోదీని ఖూన్ కీ దలాల్ అన్నాడు. అంటే... ప్రధాని జవాన్ల రక్తంతో లబ్ధి పొందుతున్నాడని ఆయన ఫీలింగ్. అది నిజమే కావొచ్చేమోగాని... దలాల్ లాంటి పదం వాడటం ఎంత వరకూ సమంజసం? అంత ఆలోచించే సీన్ యువరాజా వారికి లేనేలేదు...  అరవింద్ కేజ్రీవాల్ మొదలు రాహుల్ వరకూ అందరూ సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడటం ఎందుకు? లాజిక్ చాలా సింపుల్. త్వరలో ఆప్ కు పంజాబ్ లో ఎన్నికలు వున్నాయి. కాంగ్రెస్ కు ఉత్తర్ ప్రదేశ్ లో ఎలక్షన్స్ వున్నాయి. అక్కడ ఈ సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిటంతా ఎక్కడ మోదీకి దక్కేస్తుందో అన్నదే వీరందరి బాధ. ఆయనకు ఓట్లు పడకూడదు అనుకోవటం తప్పు కాదు. కాని, అందుకోసం భారత ఆర్మీని కూడా శంకించి బాద్యత రహితమైన కామెంట్స్ చేయటం ఎంత వరకు నైతికం? కేజ్రీ, రాహుల్ లాంటి యువ కిశోరాలకే తెలియాలి! ఇక్కడే ఇంకో విషయం మోదీ వ్యతిరేక లీడర్లు అందరూ గుర్తు పెట్టుకోవాలి. దాద్రి లాంటి దారుణమో, గురుదాస్ పూర్, పఠాన్ కోట్ లాంటి వైఫల్యాలో వస్తే ఎవరు బాధ్యలు? మోదీనే! మరప్పుడు 70ఏళ్లలో ఏ ప్రధాని కూడా చేయని రిస్క్ చేసి నరేంద్ర మోదీ దాడులు చేయిస్తే... దానికి క్రెడిట్ ఎవరికి? ఖచ్చితంగా నమోకే దక్కుతుంది! జనం మరీ అంత ఇంగితం లేని వారు కాదు కదా...    

చంద్రబాబు జోడు గుర్రాల స్వారీ... ఎటు దారితీయనుంది?

సమైక్యాంధ్ర పోయి ఇప్పుడు నవ్యాంధ్రా నెలకొంది! కాని, ఆ నవ్యాంధ్రా స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యేది ఎలా? అంతకంటే ముందు అమరావతి అంతర్జాతీయ స్థాయిని అందుకునేదెలా? ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్న సవాళ్లు. అయితే, ఒకవైపు ప్రభుత్వపరమైన ఛాలెంజ్ లు బోలెడు వుండగానే మరో వైపు పార్టీ కూడా చాలా ప్రధానం. మరో మారు, ఇంకో మారు అధికారంలోకి వచ్చి అభివృద్ధి కొనసాగించాలంటే పార్టీనే కదా కీలకం...  సీఎం చంద్రబాబు... ప్రభుత్వం, పార్టీ ... ఈ జోడు గుర్రాల స్వారీ సమర్థంగా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగాల ఫలితాలు ఎలా వుంటాయో ఇప్పుడే చెప్పలేం. కాని, ముందు ముందు మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో మార్పులు ఖాయంలా తోస్తోంది. దీనికి చక్కటి ఉదాహరణ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో నడుస్తోన్న రెండు ప్రయోగాలే! అమరావతిని రాజధానిగా నిర్ణయించి పనులు ప్రారంభించటం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటేరియట్ కూడా రాజధాని చేరుకున్నాయి. కొంత హడావిడైతే కనిపిస్తోంది. కాని, జనం అనుభవంలోకి వచ్చేలా, అర్థం చేసుకునేలా అభివృద్ధి మాత్రం ఈ రెండేళ్లలో జరగలేదు. అందుకే, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఏపీ సర్కార్. ఏ ఇంటర్నేషనల్ సిటీకైనా అత్యంత ప్రధానమైంది , ప్రతిష్ఠాత్మకమైంది విద్యారంగం. దానిపై దృష్టి పెట్టింది రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ( సీఆర్ డీఏ ). పలు ఇంటర్నేషనల్ స్కూల్స్ మ్యానేజ్ మెంట్లతో డిస్కషన్స్ చేస్తోంది. వాట్ని అమరావతికి రప్పించేలా ప్లాన్ చేస్తోంది. అంతే కాదు, నెక్స్ట్ టార్గెట్ హోటల్స్ అంటున్నారు. ఏ టాప్ సిటీకైనా హోటల్స్ ఎంతో వన్నె తెస్తాయి. అందుకే, పెద్ద పెద్ద హోటల్స్ తో గవర్నమెంట్ చర్చలు చేయాలని ఆలోచిస్తోంది. తమ బిజినెస్ ని అమరావతిలోనూ జరపాలని కోరనుంది.  విద్యా, హోటల్స్ లాంటివే కాదు ఆర్దిక సంస్థలు, సేవా సంస్థలు, ఐట సంస్థలు... ఇలా అన్ని రంగాల్లోని ప్రముఖ సంస్థలతో ఏపీ గవర్నమెంట్ ఒప్పందాల దిశగా ముందుకు సాగుతోంది. ఇవన్నీ సాపీగా జరిగితే అమరావతి కొత్త శోభతో , కొత్త ఉత్సాహంతో వెలిగిపోతుంది!  చంద్రబాబు ఒకవైపు రాజధాని మీద దృష్టి పెడుతూనే పార్టీని కూడా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఎమ్మేల్యేలకు సీల్డ్ కవర్స్ లో వారి పర్ఫామెన్స్ గురించి రిపోర్ట్ అందించారు! ఇది ఏ పార్టీ, ఎప్పుడూ చేయని ప్రయోగం. పైగా సీక్రెట్ రిపోర్ట్స్ లో నేతలకి గ్రేడింగ్ కూడా ఇచ్చారట. ఏబీసీడీల్లో గ్రేడింగ్ తక్కువ వచ్చిన వారికి డేంజర్ బెల్స్ మోగినట్టే! ఎంపీలకు కూడా వాళ్ల పర్ఫామెన్స్ పై సీల్డ్ కవర్ రిపోర్ట్ అందజేసింది ప్రత్యేక అధ్యయన కమిటీ. దీని ద్వారా మిగతా సగం టర్మ్ లో ఆయా నేతలు మరింత సమర్థంగా పని చేసే ఛాన్స్ లభిస్తుంది! అటు పాలన, ఇటు పార్టీ... రెండిటిపై చంద్రబాబు తనదైన ముద్ర వేస్తున్నారు. సరికొత్తగా ముందుకు పోతున్నారు. ఈ కృషికి ఫలితం పూర్తిగా దక్కాలని మనమూ కోరుకుందాం. జనం, కార్యకర్తలు ఇద్దరూ హ్యాపీగా వుంటే... ఆ నాయకుడు సక్సెస్ అయినట్టే కదా!   

మెట్రో రైలు... ఒక జీవిత కాలం మిస్సు!

తెలుగు వారికి హైద్రాబాద్ గర్వకారణం! విభజన తరువాత తెలంగాణకు శాశ్వత రాజధానైనా తెలుగు వాళ్లు అందరూ భాగ్యనగరాన్ని ఎంతో కొంత ఓన్ చేసుకుంటారు. అందుకే, హైద్రాబాద్ లో మెట్రో అంటే అందరూ ఆనందపడ్డారు. కాని, ఇప్పుడు మెట్రో డౌట్ ఫుల్ గా మారిపోయింది. ఇదుగో వస్తుంది అదుగో వస్తుంది అంటూ ఉవ్విళ్లూరించిన రైలు కాస్తా ఎప్పుడు కూత పెడుతుందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయింది! మెట్రో ఆలస్యం అవ్వటం అందర్నీ నిరాశపరిచిందనే చెప్పాలి. నిజానికి ఇప్పటికే రెండు లైన్లలో మెట్రో పరుగులు పెట్టాల్సింది. నాగోల్ - మెట్టుగుడా, మియాపూర్ - ఎస్ఆర్ నగర్ మధ్య మెట్రో మెరిసిపోవాల్సింది. కాని, అలాంటిదేం జరగలేదు. జనం ఎప్పటిలాగే బస్సుల్లో వేలాడుతూ ఆఫీసులకి వచ్చి, వెళుతున్నారు. పైగా నగరం మొత్తం మెట్రో పనుల వల్ల ఇరుక్కుగా, దుమ్మూ, ధూళితో కరుగ్గా మారిపోయింది. అయినా రేపో, మాపో రైలొస్తుంది, రైరైమంటూ ఆకాశంలో తేలిపోతున్నట్టు మెట్రో పిల్లర్స్ పై వెళ్లిపోవచ్చని జనం భరిస్తున్నారు! ఈ మధ్య పడ్డ వర్షాలు హైద్రాబాదీలకు మెట్రో కష్టాలు మరింత ఎక్కువ చేశాయి. మెట్రో గుంతలు, మట్టితో పాటూ వర్షం నీళ్లు కూడా చేరి నరకం చూపిస్తున్నాయి...  మెట్రో రైల్ కల అంతకంతకు దూరం అవుతోంటే మీడియాలో వస్తోన్న వార్తలు జనాన్ని మరింత షాక్ కి గురి చేస్తున్నాయి. మెట్రో డెవలప్ చేయటానికి రంగంలోకి దిగిన ఎల్ అండ్ టీ ఇప్పుడు తన వాటా అమ్మేయాలని భావిస్తోందట. దీనికి ఆధారాలు ఏం లేకున్నా మీడియా మాత్రం ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రకరకాల అనుమతులు ఆలస్యంగా వస్తుండటం , కొన్ని చోట్ల భూసేకరణ కష్టంగా మారటం, ఇలాంటి బోలెడు కారణాలు కూడా చెబుతోంది.  ఎల్ అండ్ టీ తన వాటా అమ్మేసి హైద్రాబాద్ మెట్రో నుంచి పక్కకు తప్పుకుంటే మొత్తం ప్రాజెక్టే ఆగిపోతుందా? అలాంటిదేం లేదు. కాకపోతే, ఇప్పటికే పదివేల కోట్లు పెట్టుబడి పెట్టి వెనక్కి వెళ్లిపోవాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోందంటే చిక్కుముడులు చాలానే వున్నాయని అర్థం. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ ఛాలెంజెస్ ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల లోపు కేసీఆర్ మెట్రో సౌకర్యం హైద్రాబాదీలందరికీ కల్పిస్తే అది ఖచ్చితంగా గొప్ప విజయం అవుతుంది. లేదంటే సిటీలోని సిటీజన్స్ అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం వుంది. ఒకటి... మెట్రో రానందుకు, రెండు... మెట్రో పనుల వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు పోనందుకు!   

ఆటోవాలాలు కాదు యమకింకరులు..!

ఇదివరకటి రోజుల్లో తమ పిల్లలను పొద్దున్నే తయారు చేసుకుని ద్విచక్ర వావానాల మీదనో..లేదంటే నడుచుకుంటూనో వెళ్లి వారిని ఉదయం పాఠశాల వద్ద దించి సాయంత్రం తీసుకుని వచ్చేవారు . కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సెకను కాలం కూడా ఎంతో అమూల్యమైనదిగా భావించడంతో తల్లిదండ్రులు తమ బాధ్యతను ఆటోవాలాల మీద పెడుతున్నారు. ఎంతైనా తల్లిదండ్రులు..తల్లిదండ్రులే. బయటివారు బయటివారే. అంతటి బాధ్యతను మోస్తున్న ఆటోవాలాలు అసలు ఏ మాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.   లాభాపేక్ష కోసం పరిమితికి మించి ఆటోల్లో విద్యార్థులను తరలిస్తున్నారు. ఏ మాత్రం పట్టు తప్పినా..అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఇదొక్కటే కాదు ఆటోవాలాలు భద్రతా పరమైన ఏ నిబంధనను పాటించడం లేదు. దీంతో చిన్నారులకు ఆటో ప్రయాణం ప్రాణగండంగా మారింది. తాజాగా పోలీసుల పరిశోధనలో నిగ్గుతేల్చే వాస్తవం ఒకటి బయటపడింది. పగటి పూట డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు పిల్లలను తీసుకువెళుతున్న ఒక ఆటోవాలాను బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా ఆ డ్రైవర్ రక్తంలో మద్యం శాతం ఏకంగా 250 ఎం.ఎల్‌గా నమోదవ్వడంతో ఖాకీలు ఖంగుతిన్నారు. ఇంత పెద్ద మోతాదులో మద్యం శాతం నమోదైందంటే అతను పీకల దాకా తాగాడని అర్థమైంది.   అతడు ఆటోను పూర్తిగా నియంత్రించలేని స్థితిలో ఉండటంతో పోలీసులు పిల్లలను వేరే ఆటోలో ఇంటికి పంపించారు. గత రెండు నెలలుగా పోలీసులు పిల్లలను పాఠశాలలకు తీసుకువెళుతున్న ఆటోలను పరిశీలిస్తే పదుల సంఖ్యలో ఆటోవాలాలు మత్తులో పట్టుబడ్డారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఏ ప్రమాదమూ జరగలేదు. వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

ఆయిల్ దేశం పని... అయిపోయిందా?

సౌదీ అరేబియా... ఈ పేరు భారతీయులకు బాగానే తెలుసు. దుబాయ్ తరువాత గల్ఫ్ దేశాల్లో మన వాళ్లు ఎక్కువగా వలసపోయేది ఇక్కడికే! కూలీ కోసం వెళ్లే నిరక్షరాస్యులు మొదలు ఇంజనీరింగ్ చేసిన విద్యావంతుల వరకూ చాలా మంది మనోళ్లు అక్కడ వుంటారు. వుండటమే కాదు ఒకప్పుడు ఎంతో కొంత వెనకేసుకున్నారు కూడా. కాని, ఇప్పుడు సీన్ మారిపోయింది. సౌదీకి వెళ్లి కావాల్సినంత సంపాదించుకుని తిరిగొచ్చి సౌక్యంగా వుండొచ్చనేది గతం! అయిల్ తో అలరారే దేశంలో ఆకలితో అల్లాడిపోయే వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు! సౌదీ అరేబియా ఆయిల్ సమృద్ధిగా దొరికే గల్ఫ్ దేశాల్లో ఒకటి. ముస్లిమ్ ల పవిత్ర స్థలమైన మక్కా వుండేది కూడా ఇక్కడే. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత వున్న సౌదీకి మరో విశేషం కూడా వుంది. అదే అక్కడి సంపద. భూమిలోంచి కావాల్సినంత చమురు తోడుకున్న అక్కడి రారాజు ఇంత కాలం కళ్లు బైర్లు కమ్మే వైభోగం అనుభవించాడు. అంతే కాదు, చాలా మంది సౌదీ శ్రీమంతులు కూడా చమురు అమ్ముకుంటూ ఇంతకాలం చెమట కార్చకుండా హాయిగా బతికేశారు. కాని, రాను రాను పరిస్థితి మారిపోతోంది...  ఇంతకీ సౌదీకి ఏమైంది? మరేం లేదు... సౌదీకి ప్రధానమైన ఆదాయమైన అయిల్ రేట్ తగ్గిపోతోంది. ఇక్కడ మనకు పెట్రోల్ ధరలు పెద్దగా తగ్గటం లేదుగాని అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్నాయి. దీని వెనుక భారీ మార్కెట్ ఒడిదుడుకులు వుంటూ వస్తున్నాయి. అవ్వన్నీ పక్కన పెడితే చమురు ధరల పతనం మాత్రం సౌదీ కొంప ముంచుతోంది. రాబడి తగ్గటంతో ఆ దేశ రాజు పన్నులు ఎడాపెడా బాదేస్తున్నాడు! ఎంతగా అంటే వాళ్ల దేశానికి వచ్చే జనానికి వీసా కోసం చెల్లించాల్సిన ఛార్జీల్ని భారీగా పెంచేశాడు. ఒకటి రెండు కాదు ఎనిమిది రెట్లు వీసా ఛార్జీలు పెంచాడు! విదేశీయులపై భారం పడే వీసా ఛార్జీలే కాదు సౌదీ పౌరులకి కూడా చుక్కలు చూపించేలా ధరలు పెంచుతోంది అక్కడి ప్రభుత్వం! ఇంట్లో వాడుకునే ఇంధనం, విద్యుత్, అఖరుకి తాగు నీటిపై కూడా భారీగా పన్నులు పెంచేసింది. ఇది చాలదన్నట్టు సౌదీలోని శ్రీమంతులు ఇతర దేశాల నుంచి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని తెచ్చుకుంటే ... ఆ పారిన్ భార్యలకి అదనంగా పన్నులు వసూలు చేస్తోంది. కేవలం విదేశీ భార్యలే కాదు సౌదీలో వుంటోన్న ప్రతీ విదేశీయుడు గతంలో కంటే చాలా ఎక్కువగా పన్ను చెల్లించాల్సి వస్తోంది ఈ మధ్య! దీని వల్ల మన భారతీయ వలస కూలీల జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి. వచ్చే జీతాలే తక్కువ అంటే దాంట్లోంచి ఈ కొత్త పన్నులు కట్టుకునే సరికి కడుపునిండా తిండి కూడా వుండటం లేదు. ఇక కొందరి పరిస్థితి అయితే ఆల్రెడీ రోడ్డున పడింది. మన వాళ్లు చాలా మంది దయనీయ స్థితిలో వుంటూ సౌదీలో మన ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు...  కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతయని సామెత. దానికి సరైన నిదర్శనం సౌదీ అరేబియా. చమురు డబ్బులు వచ్చినవి వచ్చినట్టు విలాసాల కోసం, విందుల కోసం ఖర్చు చేశారు. అలాగే ప్రజల సంక్షేమం కోసం భారీగానే ఖర్చు చేశారు. కాని, ఇప్పటికీ రాచరికంలో వున్న ఆ దేశంలో మళ్లీ మళ్లీ ఆదాయం వచ్చేలాగా ఏ ఏర్పాటూ చేసుకోలేదు. ఉత్పత్తి రంగం, సేవల రంగం వంటి వాటి మీద దృష్టి పెట్టలేదు. అందుకే, ఇప్పుడు చమురు తగ్గుతోంది. మంట పెరుగుతోంది. ఇదే పరిస్థితి మిగతా అన్ని గల్ఫ్ దేశాల్లోనూ వుంది. మరి ముందు ముందు ఈ చమురు దేశాలు తమ దేశ ఆర్దిక వ్యవస్థని ఎలా మండించుకుంటాయో.... చూడాలి!       

అదే మనకూ..వాళ్లకు తేడా..!

భారత్, పాకిస్థాన్ పేర్లతో పాటు వేష, భాషల్లో, వ్యక్తుల మనస్తత్వాల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. శత్రువైనా సరే ఆపదలో ఉంటే రక్షించే మనస్తత్వం మనది. యుద్ధ ఖైదీలతో పాటు తెలిసో , తెలియకో సరిహద్దు దాటి మన భూభాగంలోకి అడుగుపెట్టిన వారిని పెద్ద మనసుతో మానవతా దృక్ఫథంతో తిరిగి కన్నవారికి అప్పగించిన ఘన చరిత్ర మనది..కాని పాక్ ఇందుకు పూర్తి విరుద్ధం..యుద్ధ ఖైదీలను కానీ సరిహద్దులను దాటి వచ్చిన పౌరులను కాని ఏనాడు సజావుగా అప్పగించిన పాపాన పోలేదు పాక్. చిత్రహింసలు పెట్టి..శరీర అవయవాలు పీకి దారుణంగా చంపి శవాలను కూడా సరిహద్దుల్లో పాడేసిన చెండాలపు చరిత్ర పాక్‌ది.   తాజాగా పాకిస్థాన్‌కూ, మనకూ తేడా తెలిపే ఘటన ఒకటి వెలుగు చూసింది.  తాగు నీటి కోసం వెతుక్కుంటూ..అనుకోకుండా మనదేశ భూభాగంలోకి ప్రవేశించిన 12 ఏళ్ల పాక్ బాలుడిని తిరిగి ఆ దేశానికి అప్పగించింది. పాక్‌లోని కసూర్ జిల్లా ధరి గ్రామానికి చెందిన మహ్మద్ తన్వీర్ అనే బాలుడు దాహం తీర్చుకోవడానికి..ఓ గొట్టపుబావి నుంచి తాగునీటిని వెతుక్కుంటూ మొన్న సాయంత్రం అంతర్జాతీయ సరిహద్దును దాటి మనదేశ భూభాగంలోకి ప్రవేశించాడు. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ బలగాలు బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం పాక్ రేంజర్లను బీఎస్ఎఫ్ అధికారులు సంప్రదించి..మానవతా దృక్పథంతో బాలుడిని వారికి అప్పగించారు.   ఇక పాక్ సంగతి చూస్తే అనుకోకుండా సరిహద్దును దాటి గతవారం పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత సైనికుడిని ఆ దేశం ఇంకా తన అదుపులోనే ఉంచుకుంది. మహారాష్ట్రకు చెందిన బాబూలాల్ చవాన్ అనే సైనికుడు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకుని జమ్మూకశ్మీర్‌లోని మెందర్ ఎల్‌వోసీ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. కొత్తగా విధుల్లో చేరడంతో సరిహద్దులపై పూర్తి అవగాహన లేదు..దీంతో దారి తప్పి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాడు.   అయితే ఇరువైపులా కాపలా కాస్తున్న జవాన్లు దారి తప్పిపోవడం తిరిగి వారి సొంతదేశానికి తిరిగి రావడం ఎప్పుడూ జరిగేదే. అయితే ఉరి ఘటనకు ప్రతీకారంగా భారత్ పీవోకేలో సర్జికల్ స్ట్రక్స్ నిర్వహించి 40 మంది ముష్కరులను హతమర్చడంపై పాక్ రగిలిపోతోంది. అందుకే పట్టుబడిన జవానును ఇంతవరకు తిరిగి అప్పగించలేదు. కాని సర్జికల్ దాడులు నిర్వహించడం..ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తాజా పరిస్థితిలోనూ బాలుడిని అప్పగించి భారత సైన్యం తన ఉదారతను చాటుకుంది.

మోదీ వ్యతిరేకులా... పాక్ ప్రేమికులా...

యాంటీ నేషనల్స్... అంటే దేశ వ్యతిరేకులు! ఇంకా ఘాటుగా చెప్పుకుంటే దేశ ద్రోహులు! ఇలాంటి వాళ్లు ఈ మధ్య దేశంలో ఎక్కువైపోయారు! లేదంటే, ముందు కూడా వున్నా... ఇప్పుడు మాత్రమే మోదీపై కసితో బయటపడుతున్నారనుకుంటా! ఇంతకీ మన తాజా యాంటీ నేషనల్ ఎవరు? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్! మోదీ ప్రధాని అయ్యాక దేశం అడ్డంగా, నిలువుగా చీలిపోయింది. ఒకవైపు మోదీ భక్తులు వుంటే మరో వైపు అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యే మోదీ వ్యతిరేకులు తయారయ్యారు. ఇద్దరిదీ అతి ప్రవర్తనగానే కనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా, తెగ నీతులు చెప్పే సో కాల్డ్ మేధావులు, లిబరల్స్ మరీ హద్దులు దాటుతున్నారు. ఎంతగా అంటే నరేంద్ర మోదీని టార్గెట్ చేసే క్రమంలో దేశాన్ని , దేశ క్షేమాన్ని కూడా వారు లెక్క చేయటం లేదు. అంతగా మోదీ వ్యతిరక రాజకీయం బుసలు కొడుతోంది.  ఓ సారి దాద్రిలో ఒక వ్యక్తి చనిపోయాడని అవార్డ్ లు వాపస్ ఇవ్వటం, ఆ తరువాత హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ ఆత్మహత్య గొడవ... ఇలా మన అంతర్గత రాజకీయాలు ఎప్పుడూ వుండేవే. కాని, తాజాగా దేశం యుద్ధ వాతావరణంలో వుండగా తమ నైజం ప్రదర్శిస్తున్నారు యాంటీ నేషనల్ యాంటీ మోదీ బ్యాచ్. అదే దుర్మార్గమైన ట్రెండ్.  భారత్ పాకిస్తాన్ పై దాడి చేసి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. భారతీయులంతా గర్వంగా, కాస్త రిలీఫ్ గా పీలయ్యారు. ఉగ్రవాదుల దాడికి సమాధానం చెప్పగలిగామని ఆనందించారు. కాని, అంతలోనే మోదీ బద్ధ వ్యతిరేకి అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగాడు. అటు పాకిస్తాన్ దాడి జరగలేదని అంతర్జాతీయ మీడియాని తీసుకొచ్చి నానా తంటాలు పడుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత జవాన్లు రాలేదని బుకాయిస్తోంది. కాని, మన కేజ్రీ చాలా తెలివిగా మోదీకి జైకొడుతూ ఓ వీడియో విడుదల చేశాడు. దాంట్లో ప్రధానిని మెచ్చుకుంటూనే పాక్ చెబుతున్నట్టు దాడి జరిగిందో లేదో అనుమానాలు వున్నాయనీ.... అవ్వి లేకుండా చేయాలని కోరాడు! అంటే... ఢిల్లీ సీఎంకి ప్రూఫ్స్ కావాలన్నమాట! పాకిస్తాన్ అచ్చంగా ఇదే అడుగుతోంది!  అరవింద్ కేజ్రీవాల్ సాక్ష్యాలు కావాలనటంతో పాక్ మీడియాకి కూడా కొండంత అండ దొరికింది. ఢిల్లీ సీఎమ్మే ఆధారాలు అడుగుతున్నాడు అంటూ ప్రచారం మొదలుపెట్టింది! ఇలా పాక్ కు సాయపడటం అరవింద్ కేజ్రీవాల్ ఏ రకమైన రాజకీయం అనుకుంటున్నాడో... ఆయనకే తెలియాలి! ఇక కేజ్రీ ఇచ్చిన కిక్కుతో కాంగ్రెస్ కూడా తన ప్రతాపం చూపించటానికి రెడీ అయిపోయింది. ఏకంగా మాజీ హోమ్ మినిస్టర్ చిదంబరం ప్రూఫ్స్ చూపించమని అడిగేశాడు. అంతే కాదు, పనిలో పనిగా తమ పార్టీ ఖాతాలో కాస్త క్రెడిట్ వేసుకున్నాడు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయట. కాని, వాటి గురించి కావాలనే సీక్రెట్ గా వుంచేశారట! కాని, ఇప్పుడు మాత్రం చిదంబరం వారికి ఆపరేషన్ జరిపిన వీడియోలు, ఫోటోలు అన్నీ కావాలట! ఒక వైపు మోదీపై కోపంతో పాక్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న బ్యాచ్ ఒకటైతే... మరోవైపు పాకిస్తానీ కళాకారుల కోసం కళ్ల నిండా నీళ్లు పెట్టుకుంటున్న పిచ్చోళ్లు మరో వైపు. మహేష్ భట్ లాంటి సీనియర్ డైరెక్టర్ ఉగ్రవాదాన్ని ఆపండి... చర్చల్ని కాదు అంటూ మెంటల్ స్లోగన్స్ ఇస్తున్నాడు. మన సైనికులు పాక్ చేతిలో చచ్చిపోతుంటే ఆయనకి చర్చలు చేయమని చెప్పటానికి మనసెలా ఒప్పి వుంటుంది? సల్మాన్ చెప్పే సొల్లు సంగతైతే మాట్లాడుకోవటమే దండగా! అంతగా పాక్ కళాకారుల గురించి తపించిపోతాడు! ఇక కరణ్ జోహర్ అయితే ఫవాద్ ఖాన్ అనే పాకీ హీరో తిరిగి వెళ్లిపోయినందుకు విరహ వేదనతో తల్లడిల్లిపోయాడు. పాకిస్తాన్ యాక్టర్స్ వెళ్లిపోతే ఉగ్రవాదం ఆగిపోతుందా అంటూ ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నాడు! అసలు సరిహద్దు వద్ద పోరాడుతున్న సైనికుల ప్రాణాల మీద ఈ బాలీవుడ్ బరితెగించిన సెలబ్రిటీలకు ఏమైనా లెక్క వుందా? వాళ్లు బతికినా , చచ్చినా వీళ్ల బాక్సాఫీస్ బాధ వీళ్లదే! బాలీవుడ్ లోంచి బరితెగించి మాట్లాడటం మొదలుపెట్టిన మరో మహానుభావుడు ఓంపురి! ఈయనైతే పాక్ కళకారుల్ని వెనకేసుకొచ్చే తాపత్రయంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల్నే అవమానించాడు. వాళ్లని ఎవరు సైన్యంలో చేరమన్నారని పైత్యం చూపాడు. ఆర్మీలో చేరిన వార్ని మేం చేరమన్నామా? మేం చావమన్నామా? అన్నాడు ఓంపురి! ఇంతకంటే ఘోరంగా దేశ ద్రోహానికి ఎవరైనా పాల్పడగలరా?  రాజకీయ నేతలకి మోదీ వ్యతిరేకత, బాలీవుడ్ వాళ్లకి పాక్ పై ప్రేమ, మేధావులకి జాతీయ భద్రత, జాతీయ భావం అంటే కూడా ఏంటో తెలియకపోవటం... అన్నీ కలిసి కొంపలు ముంచుతున్నాయి. ప్రపంచం ముందు ఇండియా పరువు తీస్తున్నాయి. ఇలా శత్రువుకి తోడ్పడే ఇంటి దొంగల్ని ప్రభుత్వం, జనం గట్టిగా ఓ చూపు చూడాలి. అప్పుడే మరి కొందరు భావప్రకటనా వీరులు బయలుదేరకుండా వుంటారు!       

ప్రత్యేక రాష్ట్రం సాధకునిపైనే... ప్రత్యేక జిల్లాల ఒత్తిడి!

రాష్ట్రం విడిపోయి రెండుగా ఏర్పడ్డాక అటు అంధ్రాలో రాజధాని హడావిడి వుంటే... ఇటు తెలంగాణాలో జిల్లాల హడావిడి కనిపిస్తోంది. ప్రస్తుతం పది జిల్లాల తెలంగాణ... మొదట్లో 17కి చేరుతుందన్నారు. కాని, ఆ సంఖ్య పెరుగుతూ పెరుగుతూ వచ్చి 21కి చేరింది! మొత్తంగా 31జిల్లాలతో కొత్త రాష్ట్రం సరికొత్త రూపు సంతరించుకోనుంది! అయితే, రోజుకో జిల్లా చొప్పున పెరుగుతోన్న ఈ లిస్ట్ గవర్నమెంట్ మీద పని చేస్తోన్న రకరకాల ఒత్తిళ్లకు సంకేతం కావటమే ఆందోళన చెందాల్సిన విషయం...  కొత్త జిల్లాల ఏర్పాటు... ఈ ప్రకటన సీఎం నోటి వెంట వినిపించిన మరు క్షణం నుంచీ వ్యవహారం మొత్తానికి రాజకీయ రంగు పులుముకుంది. నిజానికి పరిపాలనా సౌలభ్యం కోసం అన్న కారణం బలమైందే అయినా రాను రాను డిస్ట్రిక్ట్స్ డిస్టబెన్సులకి కారణం అయ్యాయి. మరీ ముఖ్యంగా, గద్వాల్, సిరిసిల్లా, జనగాం జిల్లాల వ్యవహారం చినికి చినికి గాలివాన అన్నట్టు నడిచింది. నిరాహార దీక్షలు, డీకే ఆరుణ లాంటి నేతల రాజీనామాలు... ఇలాంటి పరిణామాలతో ఫుల్ గా హీటెక్కింది. ఇక్కడే కేసీఆర్ పై ఎక్కడలేని ఒత్తిడి పని చేసింది... జిల్లాల విభజన కొత్త రాష్ట్రంలో చాలా అవసరం. అందుకే, మొదట్లో అందరూ స్వాగతించారు. కాని, అందుకోసం ఒక శాస్త్రీయ పద్ధతిని ఎంచుకోకపోవటమే కొంత మంది ప్రజల్లో అసంతృప్తులకి కారణం అయింది. దానికి స్థానిక విపక్ష నేతల మద్దతు మరింత గందరగోళానికి దారి తీసింది. స్వయంగా సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున సిరిసిల్ల ప్రాంతమే జిల్లా డిమాండ్లతో అట్టుడికింది! అఖరుకు, కేటీఆర్ ముఖ్యమంత్రితో మాట్లాడి సిరిసిల్లా జిల్లాకు ఒప్పించాల్సి వచ్చింది.  సిరిసిల్ల లాగే గద్వాల్ కూడా అనేక వివాదాలకు కారణం అయింది. కేసీఆర్ ఎందుకోగాని ఈ ప్రాంతాన్ని జిల్లా చేసేది లేదంటూ మొండికేశారు. అంతే మొండిగా డీకే అరుణ జిల్లా కోసం ఉద్యమించారు. చివరకు, జనంలో కూడా వ్యతిరేకత వస్తుందనుకున్నారో ఏమోగాని కేసీఆర్ గద్వాలకు జిల్లా హోదా ఇచ్చేశారు. ఇలాగే జరిగింది జనగం జిల్లా విషయంలో కూడా! ఇక జిల్లా రాజకీయాల విషయంలో మరో కోణం... పేర్లు! వికారాబాద్ ను జిల్లాగా ప్రకటించిన కేసీఆర్ దానికి అనంతగిరి జిల్లా అని పేరు పెడతామని చెప్పారు. కాని, ఎంఐఎం అధినేత అందుకు అడ్డు చెప్పి పంతం నెగ్గించుకున్నారు. ఆయన ఒత్తిడి చేసి వికారాబాద్ జిల్లాగానే పేరు వుంచేశారు! మహబూబాబాద్ పరిస్థితి కూడా ఇంతే! పాత పేరే వుంటుందని ఒత్తిడికి తలొగ్గి ముఖ్యమంత్రి చెప్పారంటున్నారు. ఏ పేరు వున్నప్పటికీ పెద్దగా నష్టమేం లేనప్పటికీ... ఇలా రకరకాల ప్రెషర్స్ కి నిర్ణయాలు ప్రభావితం అయితే ఎలా అంటున్నారు విశ్లేషకులు! కొంత మంది చెబుతోన్న దాని ప్రకారం ఇప్పటికే 31కి చేరుకున్న జిల్లాల సంఖ్య దసరా నాటికల్లా మరింత పెరిగే అవకాశం వుందంటున్నారు. అలా జరుగుతుందో లేదో చెప్పలేం. సంఖ్య ఎంత వుంటే మంచిది అన్న అవగాహన కూడా ఇప్పుడు ఎవ్వరికీ లేదు.కాకపోతే, కలెక్టర్లు, కలెక్టరేట్లు, ఇంకా ఇతర అవసరాలను దృస్టిలో పెట్టుకుని జిల్లాలు ఏర్పాటు చేస్తే మంచిది! సంఖ్య విపరీతంగా పెరిగిపోయి కలెక్టర్లు, కలెక్టరేట్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఏర్పడితే... పరిపాలన గాడి తప్పే అవకాం పొంచి వుంది!  

రక్షించి.. భక్షించారు..?

మన సినిమాల్లో నిజాయితీ గల పోలీసు అధికారులు స్మగర్లతో పోరాడి వారి వద్ద నుంచి అక్రమ సొత్తును స్వాధీనం చేసుకుంటారు. కాని సదరు డిపార్ట్‌మెంట్‌కి చెందిన కొందరు అవినీతి అధికార్లు తిరిగి వాటిని స్మగ్లర్ల చెంతకే చేరుస్తారు. అచ్చం ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రపంచం. ప్రాణాలకు తెగించి అటవీ అధికారులు స్మగ్లర్ల నుంచి కాపాడిన వేలాది అటవీ జంతువులు మాయం కావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2010 నుంచి 2014 వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అక్రమ తరలింపుదారుల నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 64 వేలకు పైగా జంతువుల ఆచూకీ నేడు లభించటం లేదని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ వన్యప్రాణుల పరిరక్షణ పరిశోధన విభాగం, ప్రపంచ జంతు పరిరక్షణ సంస్థల పరిశోధనలో తేలింది.   స్మగ్లర్ల బారి నుంచి వాటిని కాపాడినట్లు ఆయా దేశాల్లోని వన్యప్రాణుల పరిరక్షణ విభాగాలు అప్పట్లో స్వాధీనం చేసుకున్నవాటిని మీడియా సాక్షిగా వివరించినప్పటికి ప్రస్తుతం మాత్రం తాజా గణాంకాలను వివరించలేకపోతున్నాయని పేర్కొంది. అంటే దీనిని బట్టి అవి మళ్లీ స్మగ్లర్ల చేతిలోకే వెళ్లాయా..? లేదంటే వాటి భద్రత దృష్ట్యా గుర్తు తెలియని ప్రాంతాల్లో పునరావాసం కల్పించారా అన్నది తెలియాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ సంస్థలు ఇలా అనుమానం వ్యక్తం చేయటానికి అనేక కారణాలున్నాయి.   మిగతా దేశాల సంగతి పక్కన బెడితే మనదేశంలో లంచంతో అవ్వని పనంటూ ఏది లేదు. అనేక విభాగాల్లో నిజాయితీ గల అధికారులతో పాటు అవినీతి అధికారులు కూడా ఉన్నారు.  ఆ అవినీతి అధికారులు చాలా సులభంగా స్మగ్లర్ల ఎరకు చిక్కుతారు. ఇంకేముంది లంచం తీసుకున్న కృతజ్ఞతతో స్మగ్లర్లు చెప్పింది చెప్పినట్లు చేయటమే పనిగా పెట్టుకుంటున్నారు సదరు అవినీతి అధికారులు.   ఏకంగా అధికారులే తమతో కుమ్మక్కవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. దీనికి ఎన్నో ఉదాహరణలు మనం నిత్యం వార్తల్లో చూస్తూ ఉంటాం. అధికారుల అవినీతితో పాటు కొందరు రాజకీయ నాయకుల అండదండలు కూడా పుష్కళంగా ఉండటంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అందుకే ఒకసారి పట్టుకున్న జంతువులను కూడా తిరిగి తమ వద్దకే రప్పించుకోగలుగుతున్నారు. ఫలితంగా ఎన్నో అటవీ ప్రాణులు అంతరించిపోతున్నాయి. ఈ నేపధ్యంలో తమ పరిశీలనలో తేలిన ఈ అంశాలను వన్యప్రాణుల పరిరక్షణ అంశమై ఈ  నెల 27న జోహాన్స్‌‌బర్గ్‌లో ప్రారంభం కానున్న సదస్సులో వెల్లడిస్తామని సదరు సంస్థలు ప్రకటించాయి.

రాహుల్, కేజ్రీ కూడా 'భక్తుల' లిస్ట్ లో చేరిపోయారు!

నరేంద్ర మోదీ క్రేజ్ ఇప్పుడు కాదు... 2014 ఎన్నికల ముందే తార స్థాయికి చేరింది. దాని ఫలితమే చరిత్రలో తొలిసారి బీజేపి స్వంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఎన్నికల్లో గెలుపు, ప్రధాని అవ్వటం ఇవేవీ ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్ లీడర్లను మాత్రం మార్చలేకపోయాయి! వారే రాహుల్ గాంధీ, కేజ్రీవాల్!  జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... మోదీని టార్గెట్ చేయటం కొత్తా కాదు... అందులో విశేషమూ లేదు! అలాగే, కేజ్రీవాల్ కూడా మోదీని విమర్శిస్తూ మీడియా ముందుకి రావటం ఏ మాత్రం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. అంతలా వారు రోజూ మోదీ వ్యతిరేకతలోనే జీవించే్స్తుంటారు. కాని, ఈ మధ్య జరిగిన పాక్ పై సర్జికల్ ఎటాక్స్ ... సీన్ మొత్తం మార్చేశాయి! అసలు సిసలైన వార్తల్ని జనం వద్దకి మోసుకొచ్చాయి!. ఎప్పుడూ మోదీ అంటే అగ్గి మీద గుగ్గిలం అయిపోయే రాహుల్ గాంధీ కొన్ని రోజుల క్రితం ఆయన్ని సమర్థించాడు. మోదీ ప్రధాని అయ్యాక తన స్థాయికి తగ్గ పని తొలిసారి చేశాడని నెగటివ్ టోన్ లోనే మాట్లాడినా ... మద్దతుగా అయితే నిలిచాడు. పాక్ పైన సర్జికల్ స్ట్రైక్స్ బేష్ అన్నాడు! రాహుల్ గాంధీలాగే తాజాగా కేజ్రీవాల్ కూడా మోదీ గ్రేట్ అన్నాడు. ప్రపంచంలో ఏ తప్పు, గందరగోళం జరిగినా దానికి కారణం... మోదీనే అనే కేజ్రీ ఈసారి నమో సూపర్ అన్నాడు. పాక్ పై చేసిన దాడిని సమర్థిస్తూనే కేజ్రీవాల్ ఇండియన్ ఆర్మీని పొగడ్తలతో ముంచేశాడు. కాకపోతే, పాక్ అంతర్జాతీయంగా ఇండియాపై అనుమానాలు రేకిత్తిస్తోందని ... సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్టు ఆధారాలు లేవంటోందని అన్నాడు. పాక్ దుష్ఫ్రచారం తిప్పిగొట్టాలని మోదీకి సూచించాడు! రాహుల్, కేజ్రీవాల్ మోదీకి మద్దతుగా నిలవటం నిజంగా ఆనందకరం. దేశం యుద్ధం ముంగిట్లో వున్నప్పుడు అందరూ ప్రధాని వెనుక నిలవాల్సిందే. కాని, రాహుల్, కేజ్రీవాల్ బేషరతుగా మోదీని మెచ్చుకుని వుంటే మరింత బావుండేది. అంతగా పరిణతి ప్రస్తుత రాజకీయ నేతల నుంచి ఆశించటం దురాశే అవుతుంది!   

మైకు మైకం గుసగుసలు నిజమేనా?

చంద్రబాబు బలం, బలహీనత రెండూ అదే! ఏంటది అంటారా? టెక్నాలజీ! అవును, ఆయన టెక్ బాబు అన్నది అందరికీ తెలిసిందే! కాని, చంద్రబాబు టెక్నాలజీ ప్రేమ ఒక్కోసారి మంచి పేరు తెచ్చిపెడితే.. ఒక్కోసారి బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూంటూంది! ఇప్పుడు రెండోది జరుగుతోందంటున్నారు కొందరు పార్టీ, ప్రభుత్వ వర్గాలు! చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి సీఎంగా వున్నప్పుడు సాఫ్ట్ వేర్ విప్లవం జరిగింది. అందుకే ఆయన గర్వంగా హైద్రాబాద్ ను నేనే డెవలప్ చేశాను అంటుంటారు. దీనిపై ఎవరి అభిప్రాయం ఎలా వున్నా అందులో నిజం లేకపోలేదు. ఆయన నేతృత్వంలో హైద్రాబాద్ సైబరాబాద్ గా ఎదిగింది. అందుకు కారణం ఆధునిక టెక్నాలజీపై సీబీఎన్ కు వున్న ఇష్టమే! ఆయన అప్పట్లోనే పాలనలో సాంకేతికత చొప్పించి కొత్త ఒరవడి సృష్టించారు! దశాద్దమున్నర కిందటే టెలి కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి అధికారుల్ని అలర్ట్ గా వుండేలా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ యంత్రాగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు! టీడీపీ అధికారం కోల్పోయాక ప్రతి పక్షంలో వుండగా అనేక విశ్లేషణలు బయలుదేరాయి. సాఫ్ట్ వేర్, టెక్నాలజీలను పట్టించుకున్నంత వ్యవసాయం వంటి వాట్ని పట్టించుకోలేదన్నది అందులో ప్రధానం. దీన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు పదే పదే పర్యటనలు చేస్తూ జనానికి దగ్గరయ్యారు. తాను మారానని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. నిజంగా మారారు కూడా! ఇంతలోనే రాష్ట్ర విభజన జరిగిపోయి ఆయన మళ్లీ సీఎం అయ్యారు. కాని, కార్యక్షేత్రం ఈ సారి హైద్రాబాద్ నుంచి అమరావతికి మారింది! హైద్రాబాద్ లో సీఎంగా వున్న చంద్రబాబు, అమరావతిలోని ముఖ్యమంత్రి బాబు... బాగా మారారని అంతా అనుకున్నారు. కాని, తాజా గుసగుసల ప్రకారం ఆయన మళ్లీ టెక్నాలజీ బలహీనతకి లొంగుతున్నారని అంటున్నారు. ఉదయం ఏడు గంటలకే చంద్రబాబు టెలి కాన్ఫరెన్సులు, వీడియో చాట్ లు మొదలు పెట్టేస్తున్నారట! మైక్ పట్టుకుని అధికారుల్ని దడదడలాడిస్తున్నారట! సీఎంగారికి ఈ మైక్ మైకమేంటని వాళ్లు లోలోపల క్రుంగిపోతున్నారు. పొద్దు పొద్దున్నే మీటింగ్ లు అంటూ హడావిడి చేసి పది అయ్యే సరికల్లా సీఎం ఇతర పనుల్లో బిజీ అవుతున్నారట. సాధారణంగా పది గంటలకి తమ పనులు మొదలు పెట్టాల్సిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ కాన్ఫరెన్స్ ల గోలతో తెల్లవారు ఝామునే మార్నింగ్ వాక్ లు కూడా మానుకుని ఆఫీస్ లకు వచ్చేస్తున్నారు!  చంద్రబాబు తెల్లవారగానే పని మొదలు పెట్టి అధికారుల్ని హడివిడి చేయటం తప్పేం కాకపోయినా మాడన్ టెక్నాలజీ సాయంతో నడుస్తోన్న ఈ రెగ్యులర్ మీటింగ్లు ఎలాంటి కొత్తదనం లేక సమయం వృథా చేస్తున్నాయట! పైకి ఎవ్వరూ చెప్పకపోయినా చాలా మంది ఉన్నతాధికారులు లోలోన సీఎం, కొందరు మంత్రుల శైలికి తిట్టుకుంటున్నారని వినికిడి! చంద్రబాబు బాగా నమ్మే మంత్రుల్లో ఒకరైన దేవినేని ఉమా కూడా బాస్ లాగే కాన్ఫరెన్స్ లు పెట్టి జలవనరుల శాఖలోని అధికారుల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా అనేక జిల్లాల్లోని ఆఫీసర్స్ అంతా అలెర్ట్ గా అన్ని పనులూ పక్కన పెట్టి హాజరవుతుంటారు. తీరా చూస్తే పరిస్థితి అడిగి తెలుసుకోవటం తప్ప పెద్దగా సూచనలు, సలహాలు, నిర్ణయాలు ఏవీ రావటం లేదట! చంద్రబాబు వివిధ శాఖలతో చేసే కాన్ఫరెన్సులు కూడా ఇదే చందంగా వుంటున్నాయని వాపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు..  కంప్యూటర్లు, జీపీఎస్ సాయంతో కాన్ఫరెన్స్ లు పెట్టుకుని... లైవ్ లో అధికారుల్ని పలకరించటం అస్సలు తప్పు కాదు. పైగా చాలా మంచిది కూడా! కాని, అదే పనిగా ఈ మీటింగ్ లు పెట్టి మైక్ పట్టుకుని మైకంతో ఉపన్యాసాలు ఇస్తూంటే.. అదంతా సమయం వృథా ప్రహసనమే తప్ప మరొకటి కాదు. అంతకు మించి ముఖ్యమంత్రి, మంత్రులపై అధికారులకి, ఉద్యోగులకి అనవసర వ్యతిరేకత కలిగే ప్రమాదం వుంది. మరి కొత్త రాష్ట్రంగా ఏర్పడి బోలెడంత అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరమున్న ఈ తరుణంలో చంద్రబాబు , ఆయన టీమ్ ఓ సారి పునరాలోచించుకుంటే మంచిది! అంతిమంగా ప్రజలకి మేలు జరగటమే అందరూ కోరుకునేది!