ఢిల్లీలో రేపులే కాదు... ఇవి కూడా మస్తుగా జరుగుతున్నాయట!

ఢిల్లీ... ఈ పేరు చెప్పగానే మనకు దేశ రాజధాని, విశాలమైన రోడ్లు, ఖరీదైన కార్లు, కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్ అన్నీ గుర్తొస్తాయి. వాటి వెంటనే నిర్భయ ఉదంతం కూడా గుర్తొస్తుంది! ఈ మధ్య కాలంలో ఢిల్లీలో శాంతి భద్రతల సమస్య పదే పదే చర్చకొస్తోంది. మరీ ముఖ్యంగా రేపుల విషయంలో ఢిల్లీ పేరు ఎప్పుడూ న్యూస్ లో వుంటోంది. నిర్భయ రేప్ కేస్ అప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా ఢిల్లీ పేరు కావాల్సినంత ఇన్ ఫేమస్ అయిపోయింది. ఢిల్లీలో జరిగే రేపుల గురించి విపరీతమైన పబ్లిసిటీ రావటం సాధారణం అయిపోయింది. ఏ చట్టం చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారినా కూడా పరిస్థతి అలాగే వుంటోంది. కాని, ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, ఢిల్లీలో అత్యధికంగా జరిగే నేరం అత్యాచారం కాదు! కిడ్నాప్, అబడక్షన్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయట!  దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే చిన్నది ఢిల్లీ. కాని, అక్కడ ప్రతీ రోజూ జరిగే అపహరణ కేసులు ఎన్నో తెలుసా? సగటున 21! ఇది దేశంలోనే అత్యధికం! దేశానికి రాజధాని అయిన చోట ఇంతలా కిడ్నాప్ లు , అపహరణలు జరగటం ఆందోళనకరమే! ఢిల్లీలో ప్రతి లక్ష మందికి 37 కిడ్నాప్, అబడ్క్షన్ కేసులు నమోదు అవుతున్నాయట! ఈ విషయం బయటపెట్టింది నేషనల్ క్రైమ్స్ రెకార్డ్ బ్యూరో.  2015లో ఢిల్లీ తరువాతి స్థానంలో  ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు వున్నాయి.సంఖ్యాపరంగా యూపీ, మహారాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువగా  వున్నా ఢిల్లీ చిన్న రాష్ట్రం కాబట్టి తక్కువ సంఖ్యతోనే అగ్రస్థానంలో నిలిచింది! సంవత్సరం మొత్తం మీద కలిపి ఢిల్లీలో 7,730 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇక తరువాతి క్రమంలో బీహార్, మధ్యప్రదేశ్, బెంగాల్, అస్సామ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు వున్నాయి.  ఢిల్లీలో రేపుల్ని కూడా మించిపోయిన కిడ్నాప్ కేసులు చాలా వరకూ డబ్బుల కోసమే జరుగుతుంటాయంటున్నారు పోలీసులు. ఇంకా కొన్ని కేసులు వుంటాయనీ... కాని, అవ్వి పోలీసుల వరకూ రావని అంటున్నారు. ఎందుకంటే, కిడ్నాపర్ల బెదిరింపులకి లొంగి కిడ్నాప్ అయిన వారి తల్లిదండ్రులు, బంధువులు డబ్బులు ముట్టజెబుతుంటారని అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీలో నేరాల్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రధానితో పాటూ సీఎం కూడా వున్నప్పటికీ విచ్చలవిడిగా క్రైమ్స్ జరగటం ... తీవ్రంగా ఆందోళనపరిచే అంశం!

బండలు టైంకి పరవలేదని.... బంధించేసింది!

భారతదేశంలో అధికారం అంటే బాధ్యత కాదు! ఇక్కడ అధికారం అంటే అహంకారం! ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే తాను సీఎంగా వున్నప్పుడు మోదీ ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదనీ... కామన్ మ్యాన్ అని చెప్పారు. అందుకు తగ్గట్టే ఆయన నిరంతరం కష్టపడుతూ అప్పుడు రాష్ట్రానికి, ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నారు. కాని, తనని తాను సేవకుడని నిగర్వంగా చెప్పుకునే మోదీ క్యాబినేట్లో మాత్రం అందరూ అంత హుందాగా వుండటం లేదు!  అనుప్రియ పటేల్... ఎవరీమే అంటారా? ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఒక యువ రాజకీయ నాయకురాలు. పార్టీ అప్పాదళ్. కొద్దోగొప్పో ఓబీసీల బలం వుండటంతో ఎన్డీఏలో చేర్చుకున్నారు ఈ మధ్యే. పైగా అప్నాదళ్ నేత అనుప్రియకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అలా అధికారం దక్కటంతో అనుప్రియా కళ్లు సహజంగానే అందరూ ఇండియన్ పొలిటీషన్స్ లా నెత్తికెక్కాయి! తన ఇంట్లో ప్రభుత్వం తరుఫున పని చేయటానికి వచ్చిన అధికారుల్ని రూంలో వేసి బంధించే దాకా వెళ్లాయి! అసలేమైందంటే... అనుప్రియ కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని తన అధికార నివాసాన్నిమరమ్మత్తు చేయించుకోవాలనుకుంది. వెంటనే ప్రభుత్వం తరుఫున ఆ పని చేసే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారుల్ని పిలిపించింది. వాళ్లకు టైల్స్ పరవమని పురమాయించింది. అంతే కాదు, ఆలస్యం చేస్తే రూంలో వేసి బంధిస్తానని హెచ్చరించింది! కాని, అధికారులు అన్న టిైంకి పని పూర్తి చేయలేదు. అలా గవర్నమెంట్ అధికారులు చెప్పిన టైంకి పని పూర్తి చేయకపోవటం మన దేశంలో అత్యంత సాధారణం. అందువల్ల సామాన్య ప్రజలు నానా తిప్పలు పడటం కూడా మామూలే! కాని, అనుప్రియా మేడం కేంద్ర మంత్రి కదా... అమాంతం కోపం నషాళానికి అంటింది! వెంటనే అన్నంత పని చేసింది! మంత్రిగారి మనుషుల చేత గదిలో బంధింపబడ్డ అధికారులు ఎలాగో మరో అధికారికి ఫోన్ చేసి బయటపడ్డారు. కాని, అసలు ఈ దౌర్జన్యం ఏంటని అడిగేవారు మాత్రం లేరు? ఎక్కడ ఏం జరిగినా చెప్పుకోవాల్సింది మోదీ సర్కార్ కే! కాని, ఆయన గవర్నమెంట్లోనే భాగస్వామి అయిన అప్నాదళ్ నాయకురాలు గూండాగిరి చేస్తే ఇక చెప్పేదెవరికి? ఇలాంటి వాళ్లని స్వయంగా ప్రధానే ఓ కంట గమనిస్తే బావుంటుంది! దీర్ఘ కాలంలో వచ్చే ముప్పు తప్పుతుంది... 

కవిత అంటే కాషాయదళానికి ఎందుకంత కోపం?

కల్వకుంట్ల కవిత... కేవలం కేసీఆర్ కూతురిగా మాత్రమే కాదు... నిజామాబాద్ ఎంపీగా కూడా ఇప్పుడు ఢిల్లీలో ఫుల్ ఫేమస్! పార్లమెంట్ లో ఆమె వీలున్నప్పుడల్లా తన వాక్ చాతుర్యంతో ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పుడే కాదు కవిత ఎప్పట్నుంచో పొలిటికల్లీ యాక్టివ్. ఉద్యమ సమయంలో కూడా ఆమె కేసీఆర్ కూతురిగా ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలకి పరిమితం కాలేదు. జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మ ఉత్సవాలు జరిపిస్తూ ఉధృతంగా జనంలోకి వెళ్లారు. అందుకే, ఎన్నికల్లో అవలీలగా ఎంపీ స్థానం కైవసం చేసుకున్నారు! కవిత గురించి మాట్లాడుతుంటే పెద్దగా నెగటివ్ పాయింట్స్ ఏం వుండవు చెప్పకోటానికి. కాని, అలాంటి యంగ్ అండ్ డైనమిక్ నేతని చూసి తెలంగాణ బీజేపి రగిలిపోతందని కొందరి టాక్! ఎందుకు అంటారా? అందుక్కారణం కూడా బీజేపియే! అవును... కేంద్ర బీజేపీ కవితకు ఇస్తోన్న ఇంపార్టెన్స్ చూసి రాష్ట్ర కాషాయదళం కస్సుమంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.... కల్వకుంట్ల కవితకు జాగృతి అనే ఓ స్వచ్ఛంద సంస్థ వున్నమాట అందరికీ తెలిసిందే. దాని ఆధ్వర్యంలోనే యేటేటా బతుకమ్మ సంబరాలు నిర్వహింస్తుంటుంది కవిత! అయితే, తెలంగాణ ఏర్పాటు తరువాత జాగృతి పరిధిని విస్తరించి జనానికి ఉపయోగపడే పనులు చేయిస్తున్నారు నిజామాబాద్ ఎంపీ.  జాగృతి ఆధ్వర్యంలో ఈ మధ్య స్కిల్ డెవలప్ మెంట్ వర్కషాపులు జరిగిన వార్త అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వున్న పదిహేడు జాగృతి సెంటర్స్ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేశారు కూడా! ఇది నిజంగా సంతోషకరమైన విషయమే! కాని, దీని వల్లే తెలంగాణ బీజేపి అసంతృప్తికి లోనవుతోంది! ఎందుకంటే, మొత్తమంతా జాగృతి సంస్థ తన స్వంత డబ్బులతో చేస్తున్నట్టుగా వున్న స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారమంతా కేంద్రం నిధులతో నడుస్తోంది కాబట్టి! మోదీ సర్కార్ మొదలు పెట్టిన కుశల్ వికాస యోజన కింద జాగృతికి భారీగా నిధులు వస్తున్నాయి. వాట్ని ఉపయోగించి కవిత చాలా మందికి రకరకాల నైపుణ్యాల్లో శిక్షణ ఇస్పిస్తున్నారు. కాని, ఇదంతా జరుగుతోంది మోదీ సర్కార్ డబ్బులతో అని మాత్రం ఎక్కడా ప్రచారం జరగటం లేదట. జాగృతి సంస్థ శిక్షణ ఇప్పిస్తుండటంతో జనమంతా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత భావిస్తున్నారట! ఇదే తెలంగాణ బీజేపి నేతల ఆవేదన! ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ గొప్పతనంగా ప్రకటించుకోవటం, ప్రచారం చేసుకోవటం ఎప్పుడూ జరిగేదే! కాని, ఈసారి కాస్త విచిత్రంగా జాగృతి లాంటి ఎన్జీవో రంగంలోకి దిగి టీఆర్ఎస్ కి మేలు చేస్తోంది. జాగృతిలో కేంద్రం డబ్బులతో శిక్షణ పొందిన వారంతా చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు, అభిమానులు, జాగృతి కార్యకర్తలు అవుతున్నారు! ఇది కొంత వరకూ బీజేపి ఆలోచించుకోవాల్సిన విషయమే! జాగృతితో పాటూ బీజేపికి , సంఘ్ పరివార్ కు దగ్గరగా వున్న ఎన్జీవోలకు కూడా ఈ కుశల్ వికాస్ యోజన కింద నిధులిస్తే 2019లో ఫలితాలు మరింత బాగా వుండొచ్చు. అలాగే, రాష్ట్ర బీజేపి కూడా కాస్త ఉత్సాహంగా పని చేసే ఛాన్స్ వుంటుంది.  ముందు ముందు పొత్తుల రాజకీయంలో టీఆర్ఎస్ తో ఎలాంటి ఉపయోగం వుంటుందో అన్న భావంతో కూడా కేంద్రం కవిత నడిపే జాగృతికి ఇలా ప్రొత్సాహం అందిస్తోందని కూడా కొందరంటున్నారు. అదీ నిజమే కావొచ్చు. కాని, ఢిల్లీలో అధికారంలో వుండి కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలకి, బీజేపి అభిమానులకి ఆ పార్టీ మేలు చేసుకోలేకపోతే.... అది ఎప్పటికైనా నష్టమే!

పవన్ ఏంటో... కాకినాడ సభ క్లారిటీ ఇచ్చిందా?

పవన్ కళ్యాణ్... ఈ పేరు సినిమా ప్రపంచంలో సంచలనం! మెగాస్టార్ తరువాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న విలక్షణ స్టార్ పవన్ కళ్యాణ్. అదే ఆయన రాజకీయాల్లోకి వస్తే కూడా కలకలానికి కారణమైంది. ప్రజారాజ్యం టైంలో యువరాజ్యం నాయకుడిగా పవన్ కళ్యాణ్ బాగానే వేడి రాజేశాడు. ఆయన అప్పట్లో అన్న పంచెలు ఊడదీసే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగే! ప్రజారాజ్యం కాంగ్రెస్ లో అస్తమించటం , చిరంజీవి అదే పార్టీలో హస్తమించటం మనకు తెలిసిందే. కాని, ఎంజీఆర్, ఎన్డీఆర్ ల కాలం చెల్లిపోయిందనీ, ఇప్పుడు సినిమా వాళ్లు సీఎంలు అయ్యే ఛాన్స్ లు దాదాపు లేవని మాత్రం ఆయన నిరూపించారు. మెగాస్టార్ గా మొదలై కేంద్ర మంత్రిగా పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించారు. పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పకున్నా ప్రస్తుతం 150వ సినిమా చేస్తూ అచ్చొచ్చిన యాక్టింగ్ తిరిగి ప్రారంభించారు! అన్నయ్య కథ ఎక్కడో మొదలై ఎక్కడో ఆగితే తమ్ముడు పవన్ కళ్యాణ్ తన కథని ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడెక్కడికో తీసుకెళుతున్నాడు. ప్రజారాజ్యం ఎపిసోడ్ తరువాత చాన్నాళ్లు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ జనసేన అంటూ 2014 ఎన్నికల ముందు మన గబ్బర్ సింగ్ ప్రత్యక్షమయ్యాడు. తన పార్టీ వున్నా అభ్యర్థుల్ని రంగంలోకి దింపకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికాడు. ఇక్కడ నుంచే పవన్ రాజకీయ అపరిపక్వత కనిపిస్తూ వస్తోంది! కమ్యూనిస్ట్ అయిన చేగువేరా నుంచి ప్రేరణ పొందుతూ బీజేపి లాంటి సంప్రదాయవాద పార్టీతో జతకట్టడం ఆయన లాజిక్కే అందే విషయం. అంతే కాదు, మోదీ, బాబులకు అదికారం ఇప్పించి మరోసారి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు! ఎన్నికల తరువాత తన మానానా తాను సినిమాలు చేసుకుని ప్రశ్నించటం ఏమైంది అంటే సమాధానం ఇవ్వలేదు పవన్. కాని, రెండున్నర ఏళ్ల తరువాత భారీ స్థాయిలో జనం ముందుకు వచ్చేశాడు. అప్పుడప్పుడూ రాజధాని రైతుల బాగోగుల గురించి మాట్లాడినా మొన్నటి తిరుపతి సభ సమయంలోనే మళ్లీ ఫుల్ టైం గా జనం ముందుకొచ్చాడు జనసేనాని! అసలు ఒక అభిమాని చనిపోతే వెళ్లి అక్కడికక్కడే బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇది కొందరు డైనమిజం అంటుండవచ్చు. కాని, రాజకీయాల్లో ఇలాంటి ఆవేశం మంచిది కాదు. హడావుడిగా సభ పెట్టిన ఆయన ఆ రోజు పెద్దగా ఏం తేల్చకుండానే కాకినాడ సభలో అంతా చెబుతానన్నాడు. మూడు దశల్లో పోరాటం అని కూడా ప్రకటించాడు. అంతా పవన్ క్లారిటీతో వున్నాడనే భావించారు. కొందరైతే జనసేన పార్టీలో తమ బెర్త్ ల కోసం ఖర్ఛీఫులు కూడా రెడీ చేతిలో పట్టుకున్నారు.  రాష్ట్రంలో ప్రధాన సమస్య హోదానే కావచ్చు. కాని, పవన్ ప్రత్యేక హోదాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మిగతా వాట్ని కూడా వాడుకుంటే బావుంటుంది. కాని, కాపుల రిజర్వేషన్ లాంటి కీలకమైన అంశం కూడా ఎంత మాత్రం పట్టించుకోకుండా వుండిపోయాడు పవన్ కళ్యాణ్. అదే కాకినాడ సభలో అందర్నీ నిరాశపరిచింది.  పవర్ స్టార్ కాకినాడ సభ కంటే ముందే కేంద్రం తనకు వీలున్నంత లాభదాయకమైన ప్యాకేజ్ ప్రకటించేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనివార్యంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష వైసీపీ హోదానే కావాలంటూ అసెంబ్లీలో , బయట రచ్చ చేస్తోంది. ఇందరి మధ్యా పవన్ మరోసారి హోదా కావాల్సిందేనని అన్నాడు. బీజేపిని బాగా టార్గెట్ చేశాడు. కాని, టీడీపీ పట్ల కాస్త మెతకగా వున్నట్టు కనబడ్డాడు. అదంతా పక్కన పెడితే ఏవో రెండు పాచిపోయిన లడ్డూలు అన్నాడు. అవేంటో చివరిదాకా చెప్పలేదు. ఇక సభ ప్రారంభంలోనే ఏ దేశమేగినా అంటూ పాట పాడి... అది గురజాడ రాశాడంటూ తప్పుగా చెప్పాడు. దాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. ఇలా ఎంత మాత్రం ప్లానింగ్, ప్రిపరేషన్ లేకుండా పవన్ కాకినాడ వ్యవహారం కానిచ్చేశాడు! అవంతీ శ్రీనివాస్ ను రాజీనామ చేయమనటం మొదలు టీజీ వెంకటేష్ ను విమర్శించటం వరకూ ఏ దిక్కు, దిశా లేకుండా సాగింది పవన్ ఉపన్యాసం.  గొంతు చించుకుని అరుస్తూ పవన్ ఎంతగా పంచ్ డైలాగ్స్ వేసినా కాకినాడ సభలో అసలు పాయింట్ మిస్సైపోయింది. కనీసం ప్రత్యేక హోదా కోసం జరిగే బంద్ లో పాల్గొనాలా వద్దా వంటి విషయం కూడా క్లియర్ గా చెప్పలేదు పవన్ కళ్యాణ్. మూడు దశల్లో పోరాటం కూడా చర్చలోకి రాలేదు. తరువాతి సభ ఎక్కడా అన్నది ఎవ్వరికీ తెలియదు! సభ అనంతరం ఒక అభిమాని చనిపోవటంతో ఇక మీదట తాను సభలు పెట్టనని పవన్ అన్నట్టు సమాచారం. అదే నిజమైతే పవన్ అస్థిమితమైన నిర్ణయాలకి ఇది మరో తార్కాణం. రెండు సభలు ఆవేశంగా పెట్టేసి ఇక మీదట అలాంటివి వుండవు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రస్తుతానికి సస్పెన్స్! అంతేనా? ఇలా అయితే, జనం సమస్యలు తీరేదెప్పుడు, వాటి కోసం జనసేన, జనసేనాని పోరాడేదెప్పుడు? ఏ పద్ధతిలో పోరాటం నడుస్తుంది?  కాకినాడ సభతో పవన్ చాలా వరకూ తనని నమ్ముకున్న వారికి భ్రమలు తొలిగించాడు. కలగాపులంగా స్పీచ్ ఇచ్చి ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఉధృతంగా దూసుకొస్తాడన్న ఆశల్ని ఆవిరి చేశాడు! ముందు ముందు మరీ అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప పవన్ రాజకీయంగా కింగో, కింగ్ మేకరో అవ్వటం కష్టం...    

గలాటాకే అయితే... గల్లీలు చాలు... అసెంబ్లీ ఎందుకు?

చట్ట సభల్లో గొడవలు, ఆందోళనలు మామూలే. అఖరుకి మైక్ లు విరిచేయటాలు, పేపర్లు విసిరేయటాలు కూడా కామన్ అయిపోయాయి. కాని, ఏ రాష్ట్ర చట్టసభలో అయినా హంగామా చెలరేగటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. పార్లమెంట్లో కూడా పేప్పర్ స్ప్రే ఉదంతాలు అడపాదడపా జరుగుతూనే వుంటాయి. కాని, మన ఏపీ అసెంబ్లీ మరీ దారుణంగా తయారైంది. అప్పుడప్పుడు సభలో గందరగోళం కాదు అసలు సభే గందరగోళంగా నడుస్తోంది! తెలంగాణ విభజనతో ఏర్పడ్డ నవ్యాంధ్ర అసెంబ్లీ ఏనాడూ ప్రశాంతంగా ముందుకు పోవటం లేదు. వాయిదాల మీద వాయిదాలు, వివాదాల మీద వివాదాలు... ఇంతే తప్ప ప్రజా సమస్యలు ఎంత మాత్రం పట్టింపులో వుండటం లేదు. మరో వైపు తెలంగాణ అసెంబ్లీ ఎంతో కొంత హుందాగా నడుస్తోంది. అక్కడా వెల్ లోకి వెళ్లటం లాంటివి జరుగుతూనే వున్నా ఆంధ్రా శాసన సభంత దయనీయంగా వుండటం లేదు! దీనికి కారణం ఏంటి?  కేవలం తెలంగాణతో పోల్చుకోవటం కాదు అసలు మొత్తం దేశంలోనే మన ఆంధ్రా చట్టసభలంత గందరగోళంగా మరేక్కడ జరగటం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షమనే చెప్పాలి. అధికార పక్షానిది ఎలాంటి తప్పు లేదని ఏ ఒక్కరూ అనలేరు. కాని, టీడీపీ ప్రభుత్వం కాస్త ఆధిపత్యం చెలాయించినా ప్రజా సంక్షేమం కోసం ఓపిక పట్టాల్సిన ప్రతిపక్షం అంతకంతకూ మొండికేస్తోంది. లోపల స్పీకర్ సమక్షంలో, బయట మీడియా సమక్షంలో రెండు చోట్లా వైసీపీ ఎమ్మేల్యేలు నిప్పు తొక్కినట్లు చిందులేస్తున్నారు. పోని ఇదంతా జనం బాగు కోసమా అంటే అదేం కాదు. ప్రభుత్వం ప్రతి పక్షం కోరినట్టు చర్చ చేపట్టినా ఎవ్వరూ పెద్దగా గవర్నమెంట్ ను బోనులో నిలబెట్టింది ఏమీ వుండటం లేదు. ప్రతీసారి చర్చ జరిగినప్పుడు ఆంధ్రా అసెంబ్లీలో వినిపించే ఆరోపణ జగన్ కు తగినంత టైం ఇవ్వలేదు అని! కాదంటే అసలు మైకే ఇవ్వలేదని! ప్రతిపక్షం నేతలు సభలో కూడా బహిరంగ సభల్లో మాట్లాడినట్టు తమకు తోచినంత సేపు మాట్లాడితే ఏ స్పీకర్ అయినా చర్యలు తీసుకోక తప్పదు. అప్పుడు ఇక ఆయన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు మన ప్రతిపక్షం వారు! ఆయన పక్షపాతం వహిస్తున్నారని రొటీన్ గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాని, తాము , తమ ప్రవర్తన ఎలా వుంటుందో విశ్లేషించుకోవటం లేదు! అధికార పక్షంలో కూడా కొందరు నోటి దురుసు నేతలు వుండొచ్చు. కాని, ప్రతిపక్ష నేతలు పదే పదే ఉన్మాద చర్యలకు పాల్పడటం క్షమించరానిది. జనం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం చేయాలిగాని... చంద్రబాబు వర్గాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా అరుపులు, కేకలు, విపరీత చేష్టలు, సైగలు... వీటి వల్ల అపోజిషన్ కే నష్టం! ఇతర రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ప్రతిపక్షం ఎలా పని చేస్తుందో కాస్త గమనిస్తే ఎంతో మంచిది. లేకపోతే ఇప్పుడు సంవత్సరం పాటూ, నెలల పాటూ సస్పెండ్ అవ్వటమే కాక వచ్చే ఎన్నికల్లో జనం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది! అప్పుడు అధికార పక్షం మమ్మల్ని సభలో మాట్లాడనీయలేదు అంటే ప్రజలు హర్షించరు. ప్రతిపక్ష ఎమ్మేల్యేలుగా మీరెంత కృషి చేశారు అన్నదే ఆలోచిస్తారు!  

కర్మయోగికి ... ఏంటి ఖర్మ!

అనగనగా ఓ అభాగ్యుడు! అతను రోడ్డుపై వెళుతుంటే హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు! అప్పుడే అటుగా వెళుతున్న ఓ పెద్దాయన అతడ్ని చూసి తల్లడిల్లిపోయాడు. అరెరే పాపం అనుకుని తన వద్ద వున్న నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లాడు. లేపి కూర్చోపెట్టి కాసిన్ని మంచి నీళ్లు తాగించాడు. మొత్తానికి సృహ తప్పిన అభాగ్యుడు ఇప్పుడు లేచి కూర్చున్నాడు! అంతలోనే ఏమైందో తెలుసా?  స్పృహ తప్పిన అభాగ్యుడి బంధువులు ఎక్కడ్నుంచో రొమ్మలు బాదుకుంటూ వచ్చి పడ్డారు. తమ వాడు స్పృహ తప్పే దాకా చేష్టలుడిగి చూసిన ఆ దిక్కుమాలిన సంత ఇప్పుడు మాత్రం మా వాడికి కేవలం మంచి నీళ్లు తాగిస్తావా? కొబ్బరి నీళ్లు ఎందుకు తీసుకురాలేదు? సెలైన్ ఎందుకు ఎక్కించలేదు? అంటూ పెద్దాయన మీద పెంట పందుల్లా పడిపోయారు! దీన్నేమందం? తాను ధరించే పంచె తెల్లదనం, తాను వేసే పంచుల్లో వుండే హాస్యం ఎంత నిఖార్సుగా వుంటాయో... అంత నిఖార్సైన సీన్సియర్ అండ్ సీనియర్ నేత వెంకయ్య నాయుడు! ఆయనే ఇంతదాకా మనం చెప్పుకున్న కథలో పెద్దాయన! హఠాత్తుగా స్పృహ తప్పిన అభాగ్యుడే... అవశేష ఆంధ్ర రాష్ట్రం! ఇక బంధువులు ఎవరు అంటారా? ఎవరైతే హైద్రాబాద్ కు దూరమై, నానా హైరాన పడి ఇంకా కోలుకోలేకపోతోన్న నవ్యాంధ్ర ఏర్పాటుకి కారకులో... వారే! అంటే ఇక్కడా, అక్కడా అధికారంలో వుండి సమైక్యాంధ్రని సమస్యాత్మకంగా విభజించిన కాంగ్రెస్! ఆ కాంగ్రెస్ లోంచే కపటంగా పుట్టుకొచ్చిన పిల్ల కాంగ్రెస్!  2009 నుంచీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశాన్ని నాన్చి, నాన్చి, కుళ్లిపోయేలా చేసి, దేశమొత్తం దుర్వాసన వ్యాపించేలా చేసి... అప్పుడు విభజనకి పూనుకుంది కాంగ్రెస్. 2014లో చిట్టచివరి రోజున పార్లమెంటు తలుపులు మూసేసి తెలుగు ప్రజల మధ్య తన ఇష్టానుసారం అడ్డుగీత గీసి రాష్ట్ర విభజన అయిందనిపించింది. అటువంటి సమయంలోనే మన వెంకయ్య నాయుడు రాజ్యసభ వేదికగా గళమెత్తారు. అసలు అనాడు రాష్ట్రం తరుఫున సభలో కూర్చున్న ఏ తెలుగు ఎంపీ అడగకున్నా ... కర్ణాటక నుంచి ఎంపీ అయిన ఆయనే... ప్రత్యేక హోదా కోసం గొంతు చించుకున్నారు. మాట్లడటమే మహాబాగ్యం అన్నట్టు కూర్చునే  మౌనమోహన సింగ్ చేత మాట ఇప్పించారు. ప్రత్యేక హోదా ఇస్తామనిపించారు! అంటే... ఆ రోజు ఇదే వెంకయ్య ... నాకుందుకయ్యా అనుకుంటూ ఊరుకుని వుంటే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమై వుండేది? ఇవాళ్ల ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ సర్కాస్ చేస్తోన్న జోకర్ సన్నాసులంతా సోదిలో కూడా వుండేవారు కాదు! ఈ మధ్యే ఏర్పడ్డ ఛత్తీస్ గడ్, జార్ఖంఢ్ లకు కేంద్రం ఏ  ప్రత్యేక హోదా ఇస్తోంది? అలాగే మనమూ మట్టిగొట్టుకు పోయేవాళ్లం.  అనాడు కాంగ్రెస్ పన్నిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అమోదం అనే పద్మవ్యూహంలో వెంకయ్య తెగించి నిలిచారు. నినదించి ప్రత్యేక హోదా హామీ సాధించారు. ఆ ఒక్క పని వల్లే ఇవాళ్ల ఆయన పంచె వుడదీసి కొడతామని పిట్టల దొరల్లా మాట్లాడుతోన్న కామెడీగాళ్లకు విషయం దొరికింది. ఊడదీయాల్సింది వెంకయ్య పంచె కాదు... తరిచి చూడాల్సింది ఆయన మనసులోని నిజాయితీ. ఆంధ్రుడై పుట్టినందుకు అవమానాలు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా, అడ్డమైన వాళ్ల విమర్శలు వినాల్సి వస్తోన్న ఆయన ఢిల్లీలో తెలుగు సంక్షేమం సాధిస్తున్నారు! సింహం లాంటి సింహపురి పెద్దాయన తనే స్వయంగా చెప్పినట్టు ... తన వల్లే చర్చలోకి వచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తనకే వ్యతిరేకంగా సంధిస్తున్నారు లెఫ్టు లిల్లీపుట్లు, వైసీపీ వైరీ పక్షం వారు. కాని, దేశం మొత్తంలోని అన్ని పార్టీలు కలిసి అమోదించిన 14వ ఆర్దిక సంఘం సిఫారసులు ప్రత్యేక హోదా అసాధ్యం చేశాయి. ఇది 2014లో వెంకయ్య హోదా అడిగిన నాడు లేని పరిస్థితి. కాని, ఇప్పుడంతా తలకిందులైంది. అయినా ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ప్రకటనగా మారింది! దీనికి కారణం ఎవరు? వైసీపీ ఎంపీలా? పోనీ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులా? 282సీట్లున్న మోదీ సర్కార్ సైకిల్ ను చూసి నిజంగా గజగజ వణికిపోతుందా? అసలు వాస్తవ పరిస్థితుల్లో జైట్లీ లాంటి ఉత్తరాది నేతలు మన తెలుగు నేతల మాటలు వింటారా? పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనోళ్ల హిందీ ఢిల్లీ నాయకులకి అర్థం అవుతుందా? ఈ అన్ని ప్రశ్నలు సరిగ్గా వేసుకుంటే వచ్చే సమాధానం... వెర్సటైల్ వెంకయ్య నాయుడు!  బీజేపిని శాసించే అరెస్సెస్ నుంచి లాలూ నడిపించే ఆర్జేడీ వరకూ వెంకయ్యని గౌరవించనిదెవరు? ఇంగ్లీష్లో ట్రబుల్ షూటర్ అంటూ జాతీయ మీడియా కూడా చెప్పుకొచ్చే వెంకయ్య గారి అనర్గళమైన హిందీనే ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికొచ్చినంతైనా తీసుకొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి... మొన్నటి దాకా కర్ణాటక నుంచి, ఇప్పుడు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ నాయుడుగారే లేకుంటే... కొత్త రాష్ట్రం ఎంతగా నాశనం అయ్యేదో! ఊరికే మాటలు కాదు... వెంకయ్య వేయి మార్గాల్లో ప్రత్యేక హోదా అనే టానిక్ తప్పి పోయిన ఏపీకి... టాబ్లెట్స్ వేయిస్తున్నారు! అవ్వేవీ లేకపోతే, ఇక ముందు ఆయన చొరవతో వచ్చేవి రాకపోతే... ఏపీ కూడా మరో కొత్తగా ఏర్పడ్డ వెనుకబడిన రాష్ట్రమైపోతుంది! ఇది ఒట్టి మాట కాదు... గట్టి తార్కణం వున్న సత్యం.మోదీ ప్రధానిగా కొలువుతీరిన మొట్ట మొదటి క్యాబినేట్ నిర్ణయాలు గుర్తున్నాయా? పోలవరం ముంపు మండలాల్ని ఆంద్రలో కలిపారు! అంటే పాలన మొదలైన మొదటి రోజు నుంచే ఏపీకి లబ్ది చేకూరుతోంది. ఇందులో సాక్షాత్తూ మోదీ కంటే సీనియర్ అయిన మన వెంకయ్య నాయుడు పాత్రేం లేదంటారా? పోలవరం ఆంధ్రలకి అమృత కలశం లాంటిది. దాన్ని సుసాధ్యం చేయటానికి కేంద్ర మంత్రిగా ఆయన చేస్తున్న కృషేం లేదంటారా? ఆయన ప్రమేయం లేకుండానే ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాలన్నీ పోలవరం కట్టుకొమ్మని చెప్పేస్తాయా? అసలు వేల కోట్ల పోలవరానికి వంద శాతం కేంద్ర నిధులు ఎవరు తీసుకొచ్చారు? ఖాళీ సమయం దొరికినప్పుడు సభలు, ప్రెస్ మీట్లు పెట్టే గడ్డం పెంచుకున్న టాలీవుడ్ హీరోలా? ఈ రియల్ హీరోనే కదా... జనానికి నేరుగా కడుపునింపే ప్రతీ పైసా ఢిల్లీ నుంచి తెస్తోంది! తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ తొలి రొజులు గుర్తున్నాయా? ఆంధ్రప్రదేశా? అంధ ప్రదేశా అన్న అయోమయం వుండేది. అంతటి విద్యుత్ లోటు ఈ విల్లు చేతిలో లేని వీరుడే కదా పూడ్చింది. మోదీ సర్కార్ 24గంటల ఉచిత విద్యుత్ తమ బీజేపి రాష్ట్రాల్ని పక్కన పెట్టి టీడీపీ పాలిత రాష్ట్రానికి ఎందుకిచ్చింది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెంకయ్య నాయుడి స్వరాష్ట్రం కాబట్టి! బీజేపి నేతల దృష్టిలో ఏపీకి వుండే గుర్తింపు అదే! ఒక గుజరాత్ మోదీది, ఒక ఉత్తరప్రదేశ్ వాజ్ పేయ్ ది, ఒక ఆంధ్రా వెంకయ్యది! అంతలా ఆయన తన మాతృభూమి కోసం ఆరాటపడతారు. అందుకు ఏ మాత్రం సిగ్గుపడరు. ఒక సారి తెలంగాణ వాదులు నిందమోపినా, ఇప్పుడు తెంపరితనంతో ఆంధ్ర నేతలే అమానుషంగా మాట్లాడుతున్నా.... ఆయన అనుక్షణం తెలుగు తల్లి కోసం తల్లడిల్లుతూనే పుంటారు! అదే ఆయన గొప్పతనం, ఇంకా చెప్పాలంటే తెలుగుజాతి కోసం తపించే వెంకయ్యదనం! కేవలం పోలవరంతో నీళ్లు ఇచ్చి, విద్యుత్ వెలుగులతో ఇళ్లు వెలిగించి చేతులు దులుపుకోలేదు ఈ తెలుగు వారి రెండో వెంకన్న! తిరుపతి లడ్డుల్లాంటి ఎన్నో తియ్యనైన , మహా ప్రసాదం లాంటి ప్రాజెక్ట్ లు తీసుకొచ్చారు. విద్యారంగమైన ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, ఐఐటీ సహా ఎన్ని సంస్థలు వచ్చాయో తరచి చూసుకోండి. పారిశ్రామిక రంగమైతే ఇప్పటికే వచ్చిన ఫ్యాక్టరీలు, రేవులు కాదు రానున్న విశాఖ, చేన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటో తెలుసుకోండి. దాని వల్ల కలిగే లాభాలేంటో ఓపికున్నంత సేపు చర్చించుకోండి! రోడ్ల కోసం గడ్కరీని, విమానాల కోసం మన వాడే అయిన అశోక్ గజపతిని, రైల్వేల కోసం సురేష్ ప్రభూని, మొత్తంగా ఆంధ్రా మౌలిక సదుపాయాల కోసం వీలున్నప్పుడల్లా మోదీని... ఎవరు అడుగుతున్నారు? అప్రమత్తం చేస్తున్నారు?  ఇలా చెబుతూ పోతే అత్యంత సుదీర్ఘమైన వెంకయ్య రాజకీయ జీవితంలానే అంతం లేకుండా పోతుంది ఆయన నూతన తెలుగు రాష్ట్రానికి చేసిన మేలు కూడా! ఇక్కడ చెప్పుకోవాల్సింది కర్మయోగి లాంటి వెంకయ్య చేసిన పనుల గురించి కాదు! ప్రతిఫలం ఆశించని ఆయనకు ఈ విమర్శల ఖర్మేంటని? అసలు మీడియా, ప్రతిపక్షాలు, మేధావులు అందరూ కలిసి ఒక రాజస్తాన్ కు చెందిన రాజ్యసభ సభ్యుడ్ని తెలుగు వారికి ద్రోహం చేశాడంటున్నారంటేనే... ఆయనేదో జనానికి ఉపయోగపడే నిజమైన మంచి పని చేసుంటాడని అర్థం! అలాంటి జనం వైపున్న వారికే దాదాపుగా అందరికందరూ వ్యతిరేకం అవుతారు!  వెంకయ్య గారు... మీరు మా నవ్యాంధ్ర రథానికి శ్రీకృష్ణుడి వంటి సారథి. ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు కాబట్టి కురుక్షేత్రంలో కృష్ణుడి పాత్రేం లేదనుకునే వాళ్లని ఎవ్వరం బాగుచేయలేం. అలాగే మీరు తెలుగు వారికి ఏం చేయలేదని వార్ని కూడా సరి చేయలేం! ఆ తోకలు వంకరే...      

ఆ గణపతికి తొండం వుండదు! ఎందుకో తెలుసా?

వినాయక నవరాత్రులు దేశమంతటా మహా వైభవంగా సాగుతున్నాయి. అయితే, ఏ దేవుడ్ని పూజించినా తొలి పూజ తాను అందుకుని మనకు అనుజ్ఞ ఇచ్చే విఘ్నేశ్వరుడు ఈ నవరాత్రి ఉత్సవాల వేళ మరింత ముఖ్యమైపోతాడు! అంతే కాదు, గణపతి మిగతా అందరు దేవుళ్లకంటే చాలా చాలా పాప్యులర్ కూడా! చిన్న పిల్లలు మొదలు వృద్ధుల దాకా అందరికీ ఆయన ఫేవరెటే! సామాన్యంగా దేవుడి జోలికి పెద్దగా వెళ్లని యూత్ ని కూడా సినిమాలు, ప్రేమ, దోమా లాంటి అన్ని వ్యాపకాల నుంచి పదకొండు రోజులు దూరం చేసి మండపాల్లో బుద్దిగా కూర్చోబెడతాడు గణఫయ్య! అయితే, లంబోదరుడికి ఊరూరా , వీధి వీధినా పూజలందుకునే ప్రత్యేకతే కాదు ఇంకా బోలెడు విశేషాలున్నాయి. ఆయన్ని భక్తులు ఎవరికి తోచిన రూపంలో వారు పూజిస్తారు. ఒకరు మట్టితో చేస్తే మరోకరు సీసంతో, ఇంకొకరు గరికతో, మరొకరు ఆకుకూరలతో , పళ్లతో ఇలా ఇప్పటి వరకూ గణపతి రకరకాలుగా తయారు చేసుకున్న వారు బోలెడుమంది! మట్టితో మొదలు రాతితో వరకూ... ఏ పదార్థంతో చేసినా వినాయకుడి తల ఎలా వుంటుంది? ఏనుగు ముఖంతో వుంటుంది. అందుకే, ఆయనని గజాననుడని, ఏక దంతుడని, గజవక్త్రృడని రకరకాలుగా కీర్తిస్తుంటాం. దీనికి కారణం కూడా మనకు తెలిసిందే. పార్వతీ దేవీ నలుగు పిండితో బాలుడిని చేసి ద్వారం వద్ద వుంచితే శివుడొచ్చి ఆ బాలుడి తల నరికేస్తాడు. ఆ పసివాడు పరమేశ్వరుడ్ని అడ్డగించడమే కారణం. తరువాత గణపతికి ఏనుగు తల పెట్టి తిరగి బతికిస్తాడు శంకరుడు! ఇక అప్పట్నుంచీ గజ ముఖంతోనే అందరికీ దర్శనమిస్తుంటాడు లంబోదరుడు.  పార్వతీ దేవీ చక్కనైన బాలుడిగా ప్రాణం పోసిన ఆది గణపతికి మనందరి లాగే నర ముఖం వుండేది. మరి ఆ ముఖంతో ఇప్పుడు మనం గజాననుని చూడలేమా? మామూలుగా అయితే చూడలేమనేదే సమాధానం. కాని, తమిళనాడులోని ఆ ఒక్క ఆలయానికి వెళితే మాత్రం నర ముఖంతో వున్న గజ ముఖుని చూడొచ్చు!  తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో కూతనూర్ వద్ద పూన్ తొట్టమ్ కి దగ్గర్లో వుంటుంది తిలతర్పణపురం. పేరు వినగానే అర్థమైపోతోంది కదా దీని విశేషం ఏంటో? తిలలతో తర్పణాలు ఇవ్వటం ఇక్కడ మహా ప్రశస్తం. కాశీ, రామేశ్వరాల్లో ఎలాగైతే పితృ దేవతలకు తిల తర్పణాలు ఇస్తారో ఇక్కడ కూడా అలాగే సమర్పిస్తుంటారు. దీని వల్ల పితృ దోషం పోతుందని విశ్వాసం.  తిలతర్పణపురం అధిష్టాన దైవం ముక్తేశ్వర స్వామి. ఈ శివుడి అర్థాంగి అయిన అమ్మవారి పేరు సువర్ణవళ్లి. సువర్ణవళ్లి, ముక్తేశ్వరుల దర్శనానికి వెళ్లిన భక్తులకు మొదట్లోనే కనిపిస్తాడు నర ముఖ గణపతి. శివాలయానికి ముందు భాగంలో ఈ ఆదిగణపతి ఆలయం వుంటుంది. మిగతా అందరు హిందూ దేవుళ్ల మాదిరిగా ఇక్కడ గజాననుడు మనిషి ముఖంతో భక్తుల్ని తరింపజేస్తుంటాడు. పార్వతీ దేవీ ప్రాణం పోసిన ఆదిమ సమయంలోని నర ముఖంతో వుంటాడు కాబట్టి ఇక్కడ ఈ వినాయకుడ్ని ఆది గణపతి అంటారు! తిలతర్పణ పుర ఆది గణపతి కేవలం రూపంలో మాత్రమే విభిన్నంగా వుండడు. ఆయన్ని పూజిస్తే కలిగే ఫలితాలు కూడా విభిన్నమే. ఆయన్ని స్వయంగా ఆగస్త్య మహర్షి సేవించాడంటారు! అంతే కాదు, ఈయన్ని మనం పూజిస్తే ఇంట్లో వారి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందట! విద్యార్థులు, పిల్లలు ఈ ఆది దంపతుల తనయుడైన ఆది గణపతిని పూజిస్తే తిరుగులేని జ్ఞాపకశక్తి, తెలివితేటలు ప్రసాదిస్తాడని కూడా చెబుతారు! పెద్ద తొండం, పెద్ద పెద్ద చెవులు, ఏక దంతం... వీటితో దర్శనమిచ్చే మనకు తెలిసిన అపురూప గణపతి కొత్త రూపంలో కావాలంటే తిలతర్పణ పురం తప్పక వెళ్లండి! ఆదిశంకరుడు, అమ్మవారి కృపతో పాటూ ఆది గణపతి అనుగ్రహం కూడా పొందండి!      

ఆంధ్రా మేదావి... ఆటలో అరటిపండు అవుతారా?

ఆయన దేవదాసులా వుంటాడు! కాని, పాపం ఆయనది లవ్ ఫెయిల్యూర్ కాదు! భుజాన శాలువా వేసుకుని భోరున తన్నుకొస్తున్న ఏడుపును అణిచిపెట్టుకుని ఆయన టీవీ స్టూడియోల్లో తిరుగుతుంటాడు! అయినా ఆయన బాధ మీరనుకున్నట్టు తాళలేని విరహం కాదు! ఆయన ఉద్వేగమంతా, ఉక్రోషమంతా, నిర్వేదమంతా, నిర్లిప్తతంతా ఆంద్రప్రదేశే! అవును... ఆంధ్రుల అలుపెరగని, అందరికీ తెలిసిన, ఎవ్వరికీ అర్థం కాని, ఏకైక మేధావి... చలసాని శ్రీనివాస్! ఎవరీయన? ఏంటి ఆయన తహతహ? ఇవేనా మీ ప్రశ్నలు... నిజానికి మా కొశన్స్ కూడా అవే! ఆంద్ర మేధావుల సంఘం తరుఫున కాలికి బలపం కట్టుకుని తిరిగే చలసాని వారి మహోన్నత ఉద్దేశ్యాల్ని ఎవ్వరం తప్పు పట్టలేం. తమ సంఘంలో మరో మేధావి ఎవరైనా వున్నారా లేదా అన్నది ఆయనకే తెలియాలి. కాని, ఆ విషయం పక్కన పెడితే... ఈ ఒంటరి ఆంధ్రా మేధావి అతనే ఒక సైన్యం అన్నట్టు పోరాటం చేస్తుంటాడు. తనను ఆస్థాన ప్యానలిస్టుగా పిలిచే టీవీ స్టూడియోలకి ఓపికగా వెళుతుంటాడు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా గళం విప్పేవాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పరితపించిపోతున్నాడు. ఇది సంతోషకర విషయమే! కాని, ఇక్కడే చలసాని వారి మార్కు మేధావి ట్విస్ట్ వుంది! చలసాని శ్రీనివాస్ డ్రెస్సింగ్, ఆయన వేసుకునే శాలువా ఎప్పుడూ ఒకేలా వుంటాయి! ఆయన ముఖంలోని బాధాతప్త ఎక్స్ ప్రెషన్ కూడా ఏ మాత్రం మారదు! కాని, ఆయన అభిప్రాయాలే పదే పదే మారిపోవటంతో ఆంద్ర ప్రజలు అవాక్కైపోతున్నారు! తెలంగాణ ఏర్పాటు సందర్భంగా మన మీడియా ఛానళ్లు చర్చల పేరుతో వీరంగం వేస్తుంటే ఈయన జై అంధ్రా అంటూ వెళ్లేవాడు. దాంతో చలసాని తమకు పనికొస్తాడని కొంత కాలం తెలంగాణ వాదులు కూడా భ్రమపడ్డారు. కాని, ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిందే కాని హైద్రాబాద్, నది జలాలు, ఉద్యోగాలు, నిధులు వగైరా వగైరా అంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు. చివరకు, జై అంధ్రా అంటూ మొదలు పెట్టిన మన మేధావి సార్ సమైక్యాంధ్ర ఉద్యమకారులతో అన్ని మీటింగుల్లో పాల్గొన్నాడు. తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ వాదుల ముందు బుక్కయ్యాడు. పోనీ ఇటు ఆంధ్ర ప్రజలు ఏమైనా ఈ శాలువా సార్ ని శాలువా కప్పి సత్కరించారా అంటే... ఆయన వాదనేంటో అర్థం కాక అలా వదిలేశారు! రాష్ట్రం రెండు ముక్కలై ఇప్పుడు ప్రత్యేక హోదా రాద్ధాంతం నడుస్తోంటే... చలసాని , ది మేధావి, అలుపెరుగక మరోసారి ఉద్యమం మొదలుపెట్టాడు! ఈ సారి కూడా ఆయనతో అదే ప్రాబ్లం. ఆయన ఏం చెబుతున్నాడో, ఎవరికి చెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో ఏమీ అర్థం కాదు. ఆయన్ని పిలిచి కూర్చోబెట్టే టీవీ చర్చాసురులకైనా తెలుసో... లేదో! ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఈ ముక్క చెప్పటానికి చలసాని అంతటి మేధావి ఎందుకు? ఎవరైనా చెబుతారు! బీజేపి ఇవ్వటం లేదు. ఆ పార్టీ ఈయన మాట వినేలా ఆంద్ర మేధావుల సంఘం తరుఫున ఏం చేస్తున్నాడు? అది ఆ సెగని ఎదుర్కొంటోన్న మోదీకి తెలియాలి! సాయంత్రం టీవీ చర్చలు సరే... పొద్దున్నంతా చలసాని వారి ఉద్యమ కార్యాచరణ ఏంటి? ఇది ఎవ్వరికీ తెలియదు! ఆయన ప్రత్యేక హోదా తెచ్చే బాద్యత భుజాన వేసుకున్నానంటాడు కాని... భుజం పై శాలువా తప్ప క్లారిటీ అస్సలు కనిపించదు! చలసాని శ్రీనివాస్ ను ఒక మహా మేధావిగా... ఆయన గతంలో ఏం సాధించాడో పెద్దగా తెలియకున్నా... ఆంధ్ర ప్రజలు చక్కగా గౌరవిస్తారు. మీడియా సాక్షిగా ఇది అనుమానం అక్కర్లేని సత్యం! కాకపోతే, ఇప్పుడు ప్రత్యేక హోదా రాలేదని కుంగిపోతోన్న తెలుగు ప్రజల బాధంతా ఒక్కటే... ఢిల్లీలోని కేంద్రంతో సాగోతోన్న ఈ మహా కురుక్షేత్రంలో చలసాని ఇంకెంత కాలం యుద్ధం చేస్తాడు? అదీ... గాల్లో కత్తి తిప్పుతూ... తనకు తానే సృష్టించుకున్న పద్మవ్యూహంలో చిక్కుకుని...  రాజకీయ పెద్దలెవ్వరూ పట్టించుకోకుండా... ఎంత కాలం పోరాడతాడు? చివరకు, కొంపదీసి... ఈ నిఖార్సైన నిజాయితీగల టీవీ స్టూడియోల తాలూకూ మేదావి... ఆటలో అరటిపండు అయిపోడు కదా? శ్రీనివాసా... గోవింద!      

ఉత్తరాంధ్రకు... ప్రత్యేక ప్యాకేజీ ఉత్తిదేనా?

జైట్లీ ప్రత్యేక ప్రకటన ఉట్టిదే అంటున్నారు ప్రతిపక్ష నేతలు. కాదు, గట్టిదేనని గట్టిగా వాదిస్తున్నారు అదికార పక్షం వారు. అయితే, హోదా రాలేదన్న అసంతృప్తి ఆంధ్రులకు వుండటం సహజమే కాని జైట్లీ మాటలు మరీ ఉత్తివేం కావు. కనీసం ఉత్తరాంధ్రకైతే కొంత ఆశాజనకంగానే వుంది పరిస్థితి కేంద్ర ఆర్దిక మంత్రి ప్రకటనలో విశాఖపట్నానికి సంబంధించిన కీలకమైన అంశం చెన్నై - విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్. దీని వల్ల విశాఖపట్నానికి పారిశ్రామికంగా మంచి ప్రొత్సాహం లబిస్తుంది. అంతే కాదు, అందుకు అయ్యే ఖర్చంతా కూడా కేంద్రమే భరిస్తుందని జైట్లీ చెప్పారు. విశాఖ పట్నం విషయంలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్ ప్రత్యేక రైల్వే జోన్. దీని గురించి కూడా జైట్లీ ప్రస్తావించారు. అయితే, విశాఖ ప్రత్యేక జోన్ విషయం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చూసుకుంటారని ఆయన అన్నారు విశాఖపై ఎంతో ప్రభావం చూపే పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఆర్దిక మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. పోలవరం కట్టేందుకు అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని ఆయన తేల్చేశారు! ఇక వెనుకబడిన ప్రాంతాలకి ఇచ్చే ఆర్దిక సాయం కూడా తప్పకుండా కొనసాగుతుందని జైట్లీ అన్నారు. అంటే, విశాఖపట్టణం కూడా ఈ వెనుకబడిన జిల్లాల్లో భాగంగా ప్రతీ యేటా కేంద్ర నిధులు పొందుతుందన్నమాట! కేంద్ర ప్రకటనలో జనం ఆశించినంత క్లారిటీ లేకున్నా ఉత్తరాంధ్రకు మాత్రం కొంత మేలు జరిగే సూచనలే కనిపిస్తున్నాయి. కాకపోతే, ఢిల్లీ మాటల్ని ప్రజలు ఎంత వరకూ నమ్ముతారన్నదే ఇప్పుడు ప్రశ్న!  

ప్రత్యేక హోదా గొడవతో పవన్ హోదా పెరగనుందా?

కాశీకి పోయి... అదేదో తెచ్చారంటారు! అలా జరిగింది నిన్నటి జైట్లీ అర్థ రాత్రి ప్రెస్ మీట్! రాష్ట్ర విభజన చేస్తామని చిదంబరం 2009లో చేసిన ప్రకటనని తలపించేలా పరిణామాలు సాగాయి పొద్దంతా! కాని, ఫైనల్ గా జైట్లీ తన అపార అనుభవం ఉపయోగించి ఎక్కడా దేనికీ సీరియస్ గా కమిట్ కాకుండా మీటింగ్ ముగించాడు. ఇటు మీడియాతో సహా మేధావులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తెల్లారితే ఏముంది? ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం దద్దరిల్లిపోయింది!  ప్రత్యేక హోదా కుదరనే కుదరదు. ప్రత్యేక ప్యాకేజ్ మాత్రం ఇస్తాం. అదీ ఎలాంటి టైం బౌండ్ వుండదని కేంద్రం తేల్చాక అన్ని పార్టీల స్పందనా ఊహించినట్టుగానే వచ్చింది. టీడీపీ ఎన్డీఏలో మిత్రపక్షం కాబట్టి... వచ్చింది బావుంది, ఇంకా రావాల్సి వుంది అనేసింది! వైసీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ హోదా ఇవ్వకుండా దగా చేశారంటూ అల్లరి మొదలుపెట్టాయి. బంద్ ప్రకటన దాకా వెళ్లిపోయాయి. అయితే, ఇప్పుడు అందరి దృష్టి ఆటోమేటిక్ గా ఒక్కరిపైకి వెళ్లిపోయి ఆగిపోయాయి! అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్! తిరుపతిలో సభ పెట్టి హోదా ఇవ్వాల్సిందేనని పవన్ తెగేసి చెప్పాడు. అంతే కాదు, కాకినాడలో మరోసారి కదం తొక్కుతానని అన్నాడు. ఆ వెంటనే ఢి్ల్లీలో హడావిడి చేసిన కేంద్రం పెద్దలు, టీడీపీ నేతలు బలంగా ఏం సంకేతం ఇవ్వలేకపోయారు. పైగా హోదా కుదరదన్న సంకేతం మాత్రం గట్టిగా ఇచ్చేశారు. ఇప్పుడిక మిగిలింది వీధి పోరాటాలే! అందులోనూ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడన్నదే ఇప్పుడు అందరి ఆలోచన! రాష్ట్రంలో ప్యాకేజీతో సంతృప్తిగా వున్నది అధికార పక్షం. బీజేపి కూడా టీడీపీ మిత్రపక్షం కాబట్టి వాళ్లూ హ్యాపీనే. ఇక అసలు కీలక పాత్ర వహించాల్సిన ప్రతిపక్షం వైసీపీ. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీ కాబట్టి హోదా నిరసనల్లో వాళ్లు కీలకం కావాలి. కాని, ఎందుకనో జగన్ సేన జనంలోకి ఫుల్ గా వెళ్లినట్టు కనిపించటం లేదు. కేంద్ర బీజేపిని కూడా వాళ్లు తగినంత టార్గెట్ చేసినట్టు కనిపించటం లేదు. తమ అధినేత పైనున్న కేసుల కారణంగా జగన్ సేన స్లోగా మూవ్ అవుతోందని కొందరి అభిప్రాయం. ఆ సంగతి మనకు తెలియదు కాని ... జగన్ సేన చేయాల్సిన పని ఇప్పుడు జనసేన చేసే ఛాన్స్ వచ్చింది!  పవన్ చేతిలో ఒక్క ఎమ్మేల్యే కూడా లేకున్నా ప్రతి పక్షం స్థానాన్ని కాకినాడ సభతో ఆక్రమించే గొప్ప అవకాశం ఇప్పుడుంది. కేంద్రాన్ని తిరుపతి సభలోలాగే ఏకిపారేస్తే జనంలో పవనిజం మరింత పెరిగే ఛాన్స్ వుంది. ఇక తరువాత కమ్యూనిస్టుల్లాంటి చిన్నా చితకా పార్టీలు పవన్ వెంట ఎలాగూ వుంటాయి. జంపు జిలానీల సంగతైతే చెప్పేదే లేదు. మరి 2019కి చక్కటి బాట పరుస్తూ ఎదురొచ్చిన ఈ హోదా అవకాశాన్ని పవన్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి...     

హోదాపై మాట్లాడేందుకు... రోజా హోదా ఏంటి?

రోజా... వైసీపీ వారి ఫ్రైర్ బ్రాండ్. ఆ పార్టీ ఎవర్ని తిట్టాలనుకున్నా ఈ రోజాస్త్రాన్నే ప్రయోగిస్తుంది. ఇక ఆమె మైకు పట్టుకుని మైకంలోకి వచ్చేసిందంటే తిట్లతో ఊగిపోతుంది! అఖరుకి తొలిసారి చట్ట సభలో కాలుపెట్టిన ఆమె స్పీకర్ సాక్షిగానే ముఖ్యమంత్రిని నానా బూతులు తిట్టి సంవత్సరం పాటూ అసెంబ్లోకి వెళ్లకుండా చేసుకుంది. అయితే, అందుకు రోజా సారీ చెప్పింది. కాకపోతే, ఎప్పుడు ప్రెస్ మీట్లలో  ప్రత్యర్థుల్ని దారుణంగా తిడుతూ చెలరేగే రోజా తాజాగా స్పెషల్ స్టేటస్ పై మాట్లాడింది!  వైసీపీలో ప్రత్యేక హోదా లాంటి గంభీరమైన విషయం మాట్లాడటానికి సీనియారిటీ, సిన్సియారిటీ, సెన్సిబిలిటి వున్న ఎందరో నేతలున్నారు. మరీ ముఖ్యంగా, జగన్ కు ఎంతో సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా ఆర్దిక శాస్త్రం చదువుకున్న ఛార్టెడ్ అకౌంటెంటే! అలాంటి వారందర్నీ వదిలిపెట్టి రోజా చేత ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఏమిటి? మొదటి సారి ఎమ్మేల్యే అయిన ఆమెకు కనీసం రాజకీయ అనుభవం వుందని కూడా సరిపెట్టుకోలేని పరిస్థితి!  గబ్బర్ సింగ్ కి రైమింగ్ వచ్చేలా రబ్బర్ సింగ్ అంటూ పవన్ టార్గెట్ చేసిన రోజా మరోసారి ఆయన్నే టార్గెట్ చేసింది. షూటింగ్ లు లేనప్పుడు పవన్ కళ్యాణ్ హోదా కోసం ఉద్యమిస్తాడని వెటకారంగా వ్యాఖ్యానించింది. అసలు ప్రజాప్రతినిధిగా వుంటూ జబర్డస్త్ జడ్జీగా కనిపించటాన్ని రోజా ఎలా సమర్థించుకుంటుంది. తాజాగా రోజా మరో ఛానల్లో మరో పంచాయితీలు తీర్చే షో కూడా ప్రారంభించింది. ఇలాంటి టీవీ షూటింగ్ ల నడుమ అప్పుడప్పుడూ తానొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అందర్నీ తిట్టిపోతే లేని తప్పు... పవన్ హోదా కోసం ఉద్యమిస్తే వచ్చిందా? రోజాకే తెలియాలి! రోజా ఎప్పటిలాగే చేసిన హాట్ హాట్ , మాస్ మసాలా విమర్శల్ని పక్కనపెడితే ... వైసీపీ మొత్తంలో ఆమె ఒక్కతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఏంటి? ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్న పరిణామం ఇదే! జగన్ క్యాంప్ లో ఎందరో సీనియర్స్, మేధావులు వుండగా సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఫస్ట్ టైం ఎమ్మేల్యే రోజా స్పెషల్ స్టేటస్ పై స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టటం ఏంటని వారు ముక్కున వేలేసుకుంటున్నారు!   

రాజ్ భవన్ కి ... మోత్కుపల్లి ఇంకెంత దూరం?

రాష్ట్ర విభజన తరువాత టీ టీడీపి గురించి మాట్తాడితే చాలు వినిపించే పేరు మోత్కుపల్లి నర్సింహులు! రేవంత్ రెడ్డితో పాటూ ఆయన తెలంగాణ టీడీపికి కష్ట కాలంలో అండగా నిలబడ్డాడు. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో తెలంగాణాలో గట్టిగా నిలబడిన టీడీపీ లీడర్లు చాలా తక్కువ మంది. వారిలో మోత్కుపల్లి అత్యంత ప్రముఖుడనే చెప్పాలి. అయితే ఆయన పార్టీ పట్ల చూపిన విధేయతకుగాను గవర్నర్ అవుతారని ఎప్పట్నుంచో టాక్...  మోత్కుపల్లి గవర్నర్ అనే వార్త ఇప్పటికే చాలా సార్లు వచ్చింది. అసలు సోషల్ మీడియాలో అయితే టీడీపి అంటే పడని వారు, మోత్కుపల్లి ప్రత్యర్థులు ... దీనిపై అనేక సెటైర్లు వేస్తున్నారు. అయినా కూడా నిప్పు లేనిదే పొగరాదన్నట్టు గవర్నగిరి వార్తలు మాత్రం వస్తూనే వున్నాయి! తెలంగాణ ఉద్యమ కాలంలో, తరువాత కూడా టీ టీడీపీ అనేక విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ తన దృష్టంతా టీడీపీ పైనే పెట్టింది. అటువంటి గడ్డు కాలంలో కూడా మోత్కుపల్లి పార్టీ జెండా వదలకుండా పోరాడాడు. ఎన్నో నిందలు కూడా భరించాడు. అందుకే, చంద్రబాబు ఆయనకు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ తో మాట్లాడి గవర్నర్ పదవి ఇప్పించాలని నిర్ణయించారు. కాని, ప్రత్యేక హోదా విషయంలో పదే పదే టీడీపీకి, ఎన్డీఏకి భేదాభేప్రాయాలు రావటంతో మోత్కుపల్లి ఇష్యూ కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు ప్రత్యేక హోదా కాస్తా ప్రత్యేక ప్యాకేజ్ గా రూపు మార్చుకుని గొడవ సద్దుమణిగేటట్టుగా వుంది! ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ అయితే మోత్కుపల్లి గవర్నర్ అంశం కూడా ముందుకు కదులుతుందా? అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. ఇంతకాలం ఏపీకి రావాల్సిన వరాలపై తర్జభర్జన జరగటంతో తమ నేత ఆశలు కూడా డోలాయమానంలో పడ్డాయని, ఇప్పుడిక అలాంటిది వుండదని అంటున్నారు. చూడాలి మరి... మోత్కుపల్లి పార్టీ విధేయతకి, స్వామి భక్తికి గవర్నర్ పదవి నజరానాగా లభిస్తుందో లేదో...          

పది ముక్కల్లో ప్రత్యేక హోదా గురించి...

ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక ప్రకటన... ఇవే మాటలు వినిపిస్తున్నాయి! అసలింతకీ ఇవ్వాల్సిందేనని ఆంధ్ర నేతలు పట్టుబడుతోన్నా, ఇవ్వటం కుదరదని కేంద్రం నేతలు చెప్పకనే చెబుతోన్నా... ప్రత్యేక హోదా అంటే ఏంటి? రండి చూసేద్దాం సింపుల్ గా... 1. ప్రత్యేక హోదా అంటే ఆర్దికంగా వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సాయం అందించటం. గ్రాంట్లు, పన్నుల మినహాయింపు లాంటి నిర్ణయాలతో ఆయా రాష్ట్రాలకు పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరిగేలా చూడటం. 2. ప్రత్యేక హోదా కొన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని 1969లో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 11రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగి వున్నాయి. 3. ప్రత్యేక హోదా రావాలంటే ప్రదానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు సభ్యులుగా వుండే జాతీయ అభివృద్ధి మండలి ఒప్పుకోవాలి.  4. ప్రత్యేక హోదా పొందే రాష్ట్రాలకు వుండాల్సిన అర్హతలు... కొండ ప్రాంతాలు, తక్కువ జనసాంద్రత, ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి వుండటం, ఆర్దిక, మౌలిక సదుపాయాలు లేక వెనుకబడటం, ఆర్దికంగా స్థిరమైన వనరులు లేకపోవటం 5. సమైక్యాంధ్ర విభజనతో హైద్రాబాద్ ను కోల్పోయిన నవ్యాంధ్ర తీవ్రమైన ఆర్దిక లోటులో వుంది. దాన్ని ఎదుర్కొని నిలబడటానికి ప్రత్యేక హోదా తప్పనిసరి. 6. ప్రత్యేక హోదా రావటం వల్ల ఏపీకి అనేక విధాలుగా లాభపడుతుంది. ముఖ్యంగా, పన్నుల మినహాయింపు వల్ల వేలాది పరిశ్రమలు రాష్ట్రానికి తరలి వస్తాయి.  7. ప్రత్యేక హోదా కారణంగా పరిశ్రమలు వస్తే వాటితో పాటూ వేలాది ఉద్యోగాలు కూడా వస్తాయి. దీని వల్ల నేరుగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు లబ్ది చేకూరుతుంది! 8. ప్రత్యేక హోదా వస్తే వివిధ రకాల పథకాల్లో కేంద్రం 90శాతం భారం భరిస్తుంది. పోలవరం లాంటి ప్రాజెక్ట్ కూడా దాదాపుగా కేంద్ర నిధులతోనే పూర్తవుతుంది.  9. ప్రత్యేక హోదా వస్తే 100శాతం ఎక్సైజ్ డ్యూటీ, 100శాతం ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వుంటుంది. 10. కేంద్రం ఇచ్చే ప్రాత్సాహకాల వల్ల రాష్ట్రానికి వచ్చే కరెంట్ కూడా సగం ధరకే లభిస్తుంది!   

ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ 'మంచం' పట్టింది!

ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ మంచం పట్టింది! ఇదేదో సెటైర్ కోసం అంటోన్న కామెంట్ కాదు! నిజంగానే యూపీ కాంగ్రెస్ మంచం పట్టింది!  2012లో మోదీని గుజరాత్ సీఎంగా తిరిగి ఎన్నిక అయ్యేలా చేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ల్ ప్రశాంత్ కిషోర్. అతని ప్లానింగ్ తోనే మోదీ 2014లో పీఎం కూడా అయ్యారు. తరువాత బీజేపితో చెడటంతో ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో నితీష్ వైపు చేరాడు. అతనికి ప్లానింగ్ చేయటంతో బీహార్లో బీజేపి ఓటమి పాలై నితీష్ గెలిచాడు! ఇప్పుడు అదే కింగ్ మేకర్ ప్రశాంత్ కిషోర్ యూపీలో కాంగ్రెస్ కోసం పని చేస్తున్నాడు...  మోదీని, నితీష్ ని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రస్ ని, షీలా దీక్షిత్ ని కూడా గెలిపిస్తాడని ధీమాగా వున్నారు హస్తం పార్టీ వారు! ఆ సంగతి ఇప్పుడే తెలియదుగాని రాహుల్ గాంధీ మాత్రం అప్పుడే రంగంలోకి దిగిపోయాడు. ఎలాగైనా తాను నేరుగా ప్రధాని మాత్రమే కావాలనుకున్న ఆయన షీలా దీక్షిత్ సీఎం అవుతారని చెబుతూ 27ఏళ్ల తరువాత తమకు అధికారం ఇవ్వాలంటూ పాదయాత్ర మొదలుపెట్టాడు. మంగళకరంగా మంగళవారం నాడు యువరాజా వారు ప్రారంభించిన ఈ సుదీర్ఘ పాదయాత్ర తొలి రోజే సంచలనం అయింది! అందుకు కారణం... మంచాలే! ప్రశాంత్ కిషోర్ తనదైన స్టైల్లో రాహుల్ గాంధీ చేత రెండు వేల పైచిలుకు కిలో మీటర్ల పాద యాత్ర చేయిస్తున్నాడు. అందులో భాగంగా ఊత్తర్ ప్రదేశ్ రైతులతో ఖాట్ సభలు నిర్వహింపజేస్తున్నాడు. ఖాట్ సభలంటే నులక మంచాలపై కూర్చుని మాట్లాడుకోవటం అన్నమాట! ఊళ్లలో మంచాలపై కూర్చుని రాజకీయాలు చర్చిస్తుంటారు కాబట్టి... ప్రశాంత్ కిషోర్ న్యాచురల్ గా ఇలా ప్లాన్ చేశాడు! మోదీ చేత ఛాయ్ పే చర్చా అంటూ టీ తాగిస్తూ మీటింగ్ లు పెట్టిన ప్రశాంత్ రాహుల్ కి ఖాట్ సభలు ఏర్పాటు చేయటం సంతోషించ దగిన విషయమే కాని... మొదటి రోజు రాహుల్ సభ విన్న రైతులు వెళుతు వెళుతూ మంచాలు కూడా పట్టుకుపోయారు! దాదాపు రెండు వేల మంచాలు వుంటే చాలా వరకూ రైతులు తీసుకెళ్లిపోయారు! ఇలా అయితే , రాహుల్ ఖాట్ సభలన్నీ ముగిసేలోగా కాంగ్రెస్ వేలాది, లక్షలాది మంచాలు కొనాల్సి వస్తుంది. ఆ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి! కాకపోతే, ఎన్ని మంచాలు కొనుక్కొచ్చైనా గత పాతికేళ్లుగా మంచాన పట్టిన యూపీ కాంగ్రెస్ ని లేపి కూర్చోపెట్టాలన్నది ప్రశాంత్ కిషోర్ , రాహుల్ గాంధీల గట్టి ప్రయత్నం!   

మోదీ, నితీష్ ల 'చాణుక్యుడి' కోసం పవన్ ట్రై చేస్తున్నాడా?

మీకు పవన్ కళ్యాణ్ తెలుసు. ప్రశాంత్ కిషోర్ తెలుసా? పవర్ స్టార్ అయితే అందరికీ తెలుస్తాడు కాని మధ్యలో ఈ ప్రశాంత్ కిషోర్ ఎవరు అంటారా? తెలుగు వారికి ప్రశాంత్ కిషోర్ చాలా వరకూ తెలియదు. కాని, కాస్త ఇంగ్లీష్ మీడియా టచ్ వున్న వాళ్లకు ప్రశాంత్ ఎవరు బాగా తెలుసు! ఇక ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సిటీల్లో అయితే, ది కింగ్ మేకర్ ప్రశాంత్ కిషోర్ చాలా చాలా ఫేమస్! మోదీ 2012లో గుజరాత్ ఎన్నికలకు వెళ్లాడు. అప్పటికే సీఎం అయిన ఆయన మళ్లీ గెలవడనీ, గెలవలేడని కథనాలు గుప్పుమన్నాయి! కాని, అనూహ్యంగా మంచి విజయం సాధించాడు! 2014లో ప్రధాని అయ్యేందుకు రూట్ క్లియర్ చేసుకున్నాడు! కాని, 2012 మెదీ విజయం వెనుక వున్నది ఎవరో తెలుసా? ప్రశాంత్ కిషోర్! ప్రశాంత్ కిషోర్ విదేశాల్లో ఉద్యోగం వదులుకుని ఇండియా వచ్చిన ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్! అంటే... రాజకీయ నేతలకి వాళ్ల క్యాంపైన్ ఎలా నడపాలో నేర్పిస్తాడన్నమాట! మోదీకి 2012లో సాయంగా వుండి గెలుపు సంపాదించి పెట్టాడు. తరువాత 2014లో నమో పీఎం అయ్యేందుకు కూడా ప్రశాంత్ కిషోర్ అద్భుతమైన స్ట్రాటజీ వుంది! ప్రశాంత్ అద్భుత విజయాల తరువాత ఆయనని బీహార్ సీఎం నితీష్ కుమార్ అప్రోచ్ అయ్యారు. వెంటనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ తన సత్తా చాటాడు. అసలు బీజేపి గెలుపు ఖాయమనుకున్న ఆ రాష్ట్రంలో నితీష్ ని మళ్లీ సీఎంని చేశాడు!  ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడుతున్నాడు! రాహుల్ గాంధీ చేత పాదయాత్ర చేయించి జనంలోకి తీసుకెళుతున్నాడు! ఉత్తర్ ప్రదేశ్ రైతుల్ని మంచాలు వేసి కూర్చోపెట్టి సభలు నిర్వహిస్తూ కొత్త పంథా ప్రదర్శిస్తున్నాడు! ఉత్తర్ ప్రదేశ్ లో గెలుపుపై కాంగ్రెస్ కు కొత్త ఆశలు కలిగిస్తున్నాడు...  జాతీయ స్థాయిలో ఆల్రెడీ అలజడి రేపిన ప్రశాంత్ కిషోర్ జనసేనకు కూడా తన సేవలు అందించబోతున్నాడా? అవుననే అంటున్నారు కొందరు! ఇప్పుడే పక్కాగా ఏం చెప్పటానికి లేకపోయినా ప్రశాంత్ కిషోర్ ని పవన్ కళ్యాణ్ ని కలవటం కూడా జరిగిందట. అంతా సవ్యంగా సాగితే రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ కి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ వుంటాడట! అప్పుడిక తమ నాయకుడి గెలుపుకి అడ్డే వుండదంటున్నారు పవనిస్టులు!  మోదీని, నితీష్ కుమార్ ని గెలిపించిన ప్రశాంత్ కిషోర్ , పవన్ కళ్యాణ్ నిజంగా చేతులు కలుపుతారా? ఏమో... ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. కాని, వాళ్లిద్దరి మద్యా డీల్ ఓకే అయితే మాత్రం రాజకీయ ప్రత్యర్థులకి ఛాలెంజింగ్ టైమ్సే!  

ఒబామా తల్లి వేశ్య అంటోన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!

  అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా టైం బావున్నట్టు లేదు! అగ్రరాజ్యం అధ్యక్షడుకి ఏం కష్టమొచ్చింది? అంటారా! పెద్ద కష్టమేం కాదు కాని అవమానాలు జరుగుతున్నాయి! అవును... సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్ కి వారంలోనే రెండు అవమానాలు ఎదురయ్యాయి!    అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచం గడగడలాడిపోతుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అమెరికాను ప్రపంచం లైట్ తీసుకుంటోంది. అంటే... మరీ చులకన చేసేస్తోంది అని కాకపోయినా... ముందులా మరీ భయపడిపోవటం లేదన్నమాట! ఇంతకీ విషయం ఏంటంటే... జీ 20 దేశాల సదస్సు కోసం ఒబామా చైనా వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే! ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకకుండా చైనీస్ అధికారులు తీవ్ర అవమానం చేశారు. అంతే కాదు, అమెరికన్ జర్నలిస్టుల్ని కూడా అమెరికా అద్యక్షుడి వద్దకి వెళ్లనీయలేదు. అదేంటి అంటే... మా దేశం, మా ఎయిర్ పోర్ట్, మా ఇష్టం పొమ్మన్నారు!   చైనాలో ఎదురుదెబ్బ తిన్న ఒబామా అక్కడ్నుంచి వియత్నాం చేరుకున్నాడు. అసలు అమెరికాను ఓడించి చరిత్ర సృష్టించిన ఏకైక దేశం వియత్నాం! ఒకప్పుడు ఏకపక్షంగా అమెరికా వియత్నాంపై దాడి చేస్తే అక్కడ ప్రజలంతా సైన్యంగా మారిపోయి చుక్కలు చూపించారు! ఎంత అగ్ర దేశమైనా విర్రవీగితే ప్రమాదం అని అమెరికాకు అప్పుడు అర్థమైంది! ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ అమెరికన్ ప్రెపిడెంట్ వియత్నాం సందర్శించలేదు. ఇప్పుడు ఒబామా వియత్నాంలో కాలుమోపారు! కాని, అంతలోనే ఆయనకు రెండో అవమానం ఎదురైంది!   ఆసియాలోని ఓ చిన్న దేశం ఫిలిప్పీన్స్! దాని ప్రెసిడెంట్ రోడ్రిగో. ఈ మధ్యే అధ్యక్షడైన ఆయన ఏమైందో ఏమోగాని ఒబామాను తిట్టేశాడు. ఊరికే తిట్టడమే కాదు బూతులు తిట్టాడు! ఒబామా వేశ్య కొడుకని ఇంగ్లీష్ లో తిట్టేశాడు! ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే... ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగోతో ఒబామా చర్చలు జరపాల్సి వుంది. వియత్నాంలో వాళ్లిద్దరి మీటింగ్ నిర్ణయమైంది! కాని, తనను పచ్చి బూతులు తిట్టిన శత్రువుతో ఒబామా ఏం మాట్లాడతాడు? అందుకే, మీటింగ్ క్యాన్సిల్ అన్నాడు.రొడ్రిగో లాంటి వాడితో చర్చించటం దండగ అన్నాడు! అంతకన్నా ఇప్పటికిప్పుడు ఒబామా చేయగటిగింది కూడా ఏం లేదు!   ఇంతకీ ఫిలీప్పిన్స్ అధ్యక్షుడు అమెరికన్ ప్రెసిడెంట్ ని ఎందుకు అంతగా తిట్టాడో తెలుసా? తమ దేశంలో డ్రగ్స్ మాఫియాకి కారణమైన వేలాది మందిని రోడ్రిగో చంపించేశాడు ఈ మధ్య! ఎప్పటిలాగే అమెరికా మానవ హక్కుల ఉల్లంఘన అంటూ వాళ్ల అంతర్గత విషయంలో వేలు పెట్టింది. ఒబామా ఫిలీప్పిన్స్ అధ్యుక్షడ్ని హింస ఆపాలంటూ హెచ్చరించాడు! దాంతో మండిపోయిన రొడ్రిగో నోటికొచ్చినట్టు తిట్టేశాడు! కాకపోతే, కొసమెరుపు ఏంటంటే... తాను అలా తిట్టాల్సింది కాదని తరువాత ఫిలీప్పిన్స్ అధ్యక్షడు తాపీగా విచారం వ్యక్తం చేశాడట! మరి కొన్ని రోజుల్లో అమెరికన్ ప్రెసిడెంట్ గిరి నుంచి వైదొలగనున్న ఒబామాకి ఇన్నింగ్స్ చివర్లో ఇలాంటి అవమానాల బౌన్సర్లు రావటం ... నిజంగా షాకింగే! 

యాదాద్రి అభివృద్ధి కోసం కేసీఆర్ 'రియల్' ప్లానింగ్! 

  పుణ్య క్షేత్రాలంటే భక్తికి నిలయాలు! అక్కడికి వెళితే కోరికలు తీరతాయి. ప్రశాంతత లభిస్తుంది! కాని, ఇదంతా నాణానికి ఒక వైపు! ఇంకో వైపు తాజా పరిణామం! పుణ్యక్షేత్రాలు రియల్ ఎస్టేట్ బూమ్ కు కారణం అవుతున్నాయి! అందుకు మంచి ఉదాహరణ తెలంగాణ తిరుపతి వంటి యాదాద్రి!   తెలంగాణ జనం యాదగిరి గుట్ట అని పిలుచుకునే నరసింహ క్షేత్రం ఇప్పుడు యాదాద్రి అయింది! మారింది కేవలం పేరు మాత్రమే కాదు. యాదగిరి గుట్ట మొత్తం స్వరూపమే మారిపోయింది. ఇంకా మారిపోనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ ఫలితంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. త్వరలో ఉప్పల్ నుంచి యాదగిరి గుట్టకు ఎంఎంటీస్ కూడా రానుంది. అదే జరిగితే యాదగిరి నరసింహుడ్ని దర్శించుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది!   యాదాద్రి అభివృద్ధి ఒకవైపు ఆధ్యాత్మిక కోణంలో వున్నా మరో వైపు భీభత్సమైన ఆర్దిక కోణం కూడా కలిగి వుంది! నిజానికి హైద్రాబాద్ కు కొద్దిగా దూరంగానే వున్న యాదగిరి గుట్ట ప్రాంతం నిన్న మొన్నటి వరకూ ఎవ్వరూ పెద్గగా పట్టించుకున్నది కాదు. కాని, క్రమంగా యాదాద్రి అభివృద్ధి బాటలో పయనిస్తుండటంతో రియల్ బూమ్ మొదలైంది. మరీ ముఖ్యంగా త్వరలో 850ఎకరాల్లో టెంపుల్ సిటీ డెవలప్ చేస్తామని సీఎం ప్రకటించటంతో భూముల రేట్లు కళకళలాడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది! అర్జెంట్ గా 250ఎకరాల్లో కాటేజీలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్ట్ లు, పార్కింగ్ స్థలాలు, ఇన్ ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ వచ్చేస్తే యాదాద్రి 'రియల్' డెవలప్ మెంట్ ఊపందుకున్నట్టే!

గణపతినీ వదిలిపెట్టమంటోన్న... సినిమా పిచ్చోళ్లు!

  వినాయక చవితి వచ్చేసింది. వినాయక నవరాత్రులు ఘనంగా మొదలయ్యాయి. అయితే, మిగతా పండగలకి గణేశ ఉత్సవాలకి ఓ తేడా వుంది! అదేంటంటే, గణనాథుని పూజలు ఎవరింట్లో వాళ్లు చక్కగా చేసుకుంటారు. అదే సమయంలో వీదుల్లో కూడా వేలాది పందిళ్లు వెలుస్తాయి. అన్ని కులాల వారు కలిసికట్టుగా కుడుములు పెట్టి బొజ్జ గణపయ్యను పూజించుకుంటారు. నిజానికి ఇలాంటి ఉత్సవం మన దేశంలో ఎంత అవసరం కూడా! మతాలు, కులాలు వారిగా మనం విడిపోయి వుంటాం కాబట్టి ఐకమత్యం తెచ్చే వినాయక ఉత్సవాల్లాంటివి వుంటే చాలా మంచిది!     వినాయకుడు ఇంట్లో పూజించుకున్నప్పుడు క్లాస్ దేవుడే! కాని, వీధిలోకి వచ్చాక మాస్ దేవుడైపోతాడు. ఓన్లీ వేద మంత్రాలు మాత్రమే వుండవు. డప్పులు, డ్యాన్సులతో కోలాహలం రేగుతుంది. ఇది ఒక విధంగా ఛాందస వాదులకి నచ్చదు. దేవుడి ముందు పిచ్చి గంతులు ఏంటని వాళ్లంటారు! అయినా సరే, హైద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో తీన్మార్ డ్యాన్సులు గణపతి నిమజ్జనంలో భాగం అయిపోయాయి. ఇప్పుడు ఆ డ్యాన్సులు పోయేవి కావు. కాబట్టి వాట్ని ఎలాగో ఒప్పుకోవచ్చు. కాని, వినాయక ఉత్సవాల్లో పొడసూపుతున్న మరో లేటెస్ట్ ట్రెండ్ కొంత ఆందోళనకరంగా, చికాకుగా వుంటోంది! దీనిపై అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది...      తెలుగు వారికి సినిమా పిచ్చి కాస్త ఎక్కువే! తమిళ జనమంత క్రేజ్ వుందో లేదో తెలియదుగాని మనకు మాత్రం సినిమా అభిమానం ఓ రేంజ్లో వుంటుంది. అందుకే, మన స్టార్ హీరోలకు ఎక్కడలేని ఫాలోయింగ్! అయితే, ఈ సినిమా వ్యామోహం మెల్లగా గణేశ ఉత్సవాలకు సోకడమే ఇబ్బందిగా మారుతోంది. ఈ సారి ఆంద్రప్రదేశ్ లో ఓ చోట వినాయక గ్యారేజ్ ఏర్పాటు చేశారట! ఇక్కడ అన్ని కొర్కెలు తీర్చబడును అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారట! అంతే కాదు, లోపల వినాయకుడి విగ్రహం జనతా గ్యారేజ్ పోస్టర్ పై ఎన్టీఆర్ ఎలాంటి స్టిల్ లో వున్నాడో... అచ్చం అలాగే పెట్టారట! ఎన్టీఆర్ తొడుక్కున గళ్ల చొక్కా కూడా వినాయకుడికి వేశారట! ఇదేం విడ్డూరం?     ఈ సారి జనతా గ్యారేజ్ ఇన్ స్పిరేషన్ తో వినాయకుడ్ని స్థాపించడమే కాదు... ప్రతీ యేడూ ఈ మధ్య ఇలాగే జరుగుతోంది. ఓ సారి గబ్బర్ సింగ్ గణపతి దర్శనమిస్తే , మరో సారి బాహుబలి బొజ్జగణపయ్య కనిపిస్తాడు! ఇదంతా పైకి వినోదంగా కనిపించినా దీర్ఘకాలంలో చాలా దుష్ఫలితాలు ఇచ్చే ప్రమాదం వుంది. సినిమాలు, సినిమా హీరోల పై అభిమానం వుండటం తప్పు కాదు. వాళ్లను దేవుళ్లలాగా ఆరాధించటం కూడా ఎవరిష్టం వారిది! కాని, అందరి వద్దా చందాలు వసూలు చేసి భక్తి , శ్రద్ధలతో చేసుకోవాల్సిన వినాయక ఉత్సవాల్ని ఇలా గ్లామరైజ్ చేయటం ... ప్రతీ సంవత్సరం విడుదలైన సినిమాను తీసుకొచ్చి మండపంలో ఇరికించటం... ఇదంతా సబబు కాదు! పైగా ఇలాంటి సరదా పనులు ఎక్కువైతే సీరియస్ నెస్ తగ్గిపోయి కొన్నాళ్లకి అసలు ఉత్సవాలే ఎవరూ పట్టించుకోకుండా పోయే ఛాన్స్ వుంది.    గణపతికి సినిమా రంగు పులుమే వాళ్లే కాదు ఆటల్ని తీసుకొచ్చి అద్దేవాళ్లూ వుంటారు! ఓ సారి ఫుట్ బాల్ వాల్డ్ కప్ జరుగుతోంటే చేతిలో ఫుట్ బాల్ పట్టుకుని, నిక్కర్ వేసుకున్న గణపతిని పెట్టారు కొందరు ప్రబుద్ధులు! ఇక మోదీ, చంద్రబాబు వంటి నేతల ప్రేరణతో వినాయకుని, ఆయా నేతల్ని కలిపి మంటపాల్లో ప్రతిష్టించిన సందర్భాలు కూడా వున్నాయి. ఇవన్నీ వినాయక ఉత్సవాల శోభని తగ్గిస్తాయి! అంతే కాక తమకు ఎలాంటి ప్రమేయం లేకున్నా అత్యుత్సాహం చూపే గణపతి ఉత్సవ నిర్వాహకుల వల్ల ... హీరోలు, నేతలు అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది! కాబట్టి , ఇలాంటి విడ్డూరమైన గణపతుల్ని స్థాపించే ముఠాలపై ఏ వీధిలోని పెద్దలు అక్కడే ఓ కన్నేసి వుంచితే... చాలా మంచిది!

రచ్చ రచ్చైపోయిన... ఒబామాస్ 'ఎంటర్ ది డ్రాగన్'!

అమెరికా అధ్యక్షుడు అంటే ఎవరు? ఒక దేశాధినేత! ఇంతే అయితే పెద్దగా డిస్కస్ చేయాల్సింది ఏం లేదు! కాని, అమెరికన్ ప్రెసిడెంట్ అంటే దాదాపూ ప్రపంచ పరిపాలకుడు! ఇది కొంచెం ఓవర్ గా అనిపించినా ఆల్మోస్ట్ నిజం! అసలు అమెరికన్ ప్రెసిడెంట్ చాలా చిన్న చిన్న దేశాలకు వెళ్లనే వెళ్లడు. ఆయన తన పదవీ కాలంలో చాలా ప్రాధాన్యమున్న దేశాలకే వెడుతుంటాడు. వెళ్లినప్పడు కూడా ఆ దేశం మొత్తం కళ్లప్పగించి వైట్ హౌజ్ నాయకుని వైభోగం చూస్తూ వుండిపోతుంది!  ఇండియాకి అమెరికా అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా మన మీడియా హంగామా తెలిసిందే కదా! బిల్ క్లింటన్ నుంచి ఒబామా వరకూ ఎవరొచ్చినా రకరకాల కథనాలు ప్రసారం అవుతూ వుంటాయి ఛానల్స్ లో! ఒబామా కార్ మొదలు ఆయన వాడి పడేసే టిష్యు పేపర్ల వరకూ అన్నీ డైలీ పేపర్స్ లో ఇష్యూస్ అయిపోతాయి. అంతే కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ ఏ దేశానికి వచ్చినా కొన్ని రోజుల ముందే వైట్ హౌజ్ సెక్యురిటీ అక్కడ వాలిపోతుంది. ఆయన బస చేసే హోటల్, ఇతర ప్రాంతాలు అన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని నానా హంగామా చేసేస్తారు అమెరికన్ అఫీషియల్స్! అన్ని దేశాలు ఈ డ్రామాకి ఇష్టం వున్నా లేకున్నా సహకరిస్తాయి. అమెరికా దమ్ము, దర్పం అలాంటివి మరి! ప్రపంచంలో ఎక్కడ కాలుమోపినా తనకు తిరుగులేదనుకునే అమెరికా ప్రెసిడెంట్ కి చైనా రీసెంట్ గా షాకిచ్చింది! అమెరికాతో పొటీపడి వాల్డ్ నెంబర్ వన్ కంట్రీ అవుదామని కలలు కంటున్న డ్రాగన్ ఒబామా వస్తే కనీస మర్యాదలు కూడా పాటించలేదు. ఆయన స్పెషల్ విమానానికి స్టెయిర్ కేస్ కూడా ఏర్పాటు చేయలేదు.  విమానానికి వుండే మెట్ల ద్వారానే దిగి వచ్చాడు ఒబామా. అంతే కాదు, ఆయన దిగి రాగానే ఎదురుగా ఏర్పాటు చేయాల్సిన రెడ్ కార్పెట్ కూడా కనిపించలేదు! ఇక ఫైనల్ గా అమెరికన్ జర్నలిస్టుల్ని ఒబామా వద్దకి అనుమతించను కూడా లేదు చైనీస్ అఫీషియల్స్! వాళ్లు , ఒబామా సెక్యురిటీ సిబ్బంది దీని పై ఆగ్రహం వ్యక్తం చేస్తే.... ఇది మా దేశం, మా విమానాశ్రయం అన్నారట చైనీస్ అధికారులు! ఎదురు సమాధానం అంటే ఏంటో తెలియని వైట్ హౌజ్ సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది! ఒబామా తనకు జరిగిన ఈ అవమానానికి పెద్దగా ఫీలవ్వలేదు! అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయని లైట్ తీసుకున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాని, మన కమల్ హసన్, షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా తమ ఎయిర్ పోర్టుల్లో దారుణంగా అవమానించే అమెరికాకి .... వెలక్కాయ గొంతులో పడితే ఎలా వుంటుందో ఇప్పుడు తెలిసొచ్చింది!  ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఒబామాను ఓ ఆటాడుకున్న చైనీస్ అధికారులు మన మోదీకి మాత్రం రెడ్ కార్పెట్ పరిచి ఘనంగా స్వాగతం పలికారు!