ఆగ్గితో చెలగాటం... ఆసుపత్రుల్లో హాహాకారం!
posted on Oct 18, 2016 @ 12:33PM
ఓ అభాగ్యుడెవరో వర్షం పడుతోందని గుడిలోకి వెళితే... ఆ గుడి పైకప్పే మీద కూలిందట! పాపం... అలా అయింది భూవనేశ్వర్ లోని రోగుల పరిస్థితి. మరో పది కాలాలు బతకాలని వాళ్లు నగరంలోని అతి పెద్ద కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లారు. కాని, తీరా అక్కడే వార్ని మృత్యువు వేటాడింది. మంటల రూపంలో వచ్చింది మింగేసింది...
ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని ఎస్ యూఎం హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం ఎవర్నైనా కదిలించేస్తుంది. ఎందుకంటే, అమాంతం చెలరేగిన మంటలు నిర్ధాక్షిణ్యంగా అభాగ్యుల్ని తినేశాయి. ఎందుకంటే, వాళ్లంతా కనీసం మంచం పై నుంచి లేచి పరుగులు కూడా తీయలేని డయాలిసిస్ చేయించుకుంటున్న రోగులు. భయంకరమైన అగ్ని కీలలు ఎర్రటి నాలుకలు తెరుచుకుని పైకొస్తుంటే నిస్సహయంగా వాటిలో కలిపోయారు! కాని, దీనికి ఎవరిది బాద్యత?
దేశంలో ఎక్కడ ఏ పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా రెడీ మేడ్ గా దొరికే సమాధానం షాక్ సర్య్యూట్. ఎస్ యూఎం హాస్పిటల్ విషయంలో కూడా అదే చెబుతున్నారు. డయాలిసిస్ వార్డ్ లో కరెంట్ తీగల్లోంచి పుట్టిన నిప్పులు మొత్తం ఫ్లోరంతా బూడిద చేసేశాయి. దాదాపు 25మందిని బలి తీసుకుని, 70మందికి తీవ్రగాయాలు చేశాయి. అయితే, ఒడిషాలో జరిగిన ఈ దారుణమే మొదటిది కాదు. మన దేశంలో పదే పదే అగ్ని ప్రమాదాలకు జనం బలవుతుంటారు. మరీ ముఖ్యంగా, లేచి నడవలేని స్థితిలో వుండే పేషెంట్స్ వుండే ఆసుపత్రులు అగ్నికి ఆహుతైతే పరిస్థితి దయనీయంగా వుంటుంది.
2011లో కోల్ కతాలో ఇలాంటి దుర్ఘటనే జరిగింది. ఏఎంఆర్ ఐ హాస్పిటల్ బిల్డింగ్ లో షాక్ సర్య్యూట్ అయ్యి మంటలు పుట్టాయి. 89మందిని కర్కశంగా మాడ్చేశాయి. అయినా మన వ్యవస్థలో ఏ మార్పూ రాలేదు. మళ్లీ నిన్న భువనేశ్వర్ లో అదే దుర్ఘటన జరిగింది. ఇంకో హాస్పిటల్ . వేరే మృతులు అంతే తేడా...
అగ్ని ప్రమాదాలు ఎక్కడ జరిగినా మూల కారణం నిర్లక్ష్యమే. అలాంటిది హాస్పిటల్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అది మరింత దారుణం. మానవ తప్పిదం, నిర్లక్ష్యాల ఖరీదు ఎందరో అమాయకులు, అభాగ్యుల ప్రాణాలు. వాళ్ల కుటుంబాల తీరని వేదన. అయినా కూడా మన ప్రభుత్వాలు, సంబంధిత శాఖలు శాశ్వత ప్రాతిపదికన ఏ చర్యలూ చేపట్టవు. ఇలాంటి షాకింగ్ ఇన్ సిడెంట్స్ జరిగినప్పుడు హడావిడి. తరువాత అంతా మామూలే. హాస్పిటల్స్ మొదలు మల్టీప్లెక్సుల వరకూ ఎక్కడా ఫైర్ నామ్స్ పాటించిన పాపన పోరు. ఫలితంగా వందల మంది జీవితాలు నిరంతరం ప్రమాదం అంచున వేలాడుతుంటాయి. కాపాడాల్సిన మన వ్యవస్థలు నిర్లక్ష్యం, లంచాల మత్తులో తూగుతుంటాయి... ఈ పరిస్థితి మారాలి!