బాలీవుడ్డోళ్ల... మోదీ ఫోబియా... పాక్ సిండ్రోమ్!
posted on Oct 17, 2016 @ 4:36PM
సినిమా గొప్పదా? దేశం గొప్పదా? సినిమానే గొప్పది! ఏంటి చిర్రెత్తుకిచ్చిందా? దేశం కంటే ఎక్కడైనా సినిమా గొప్పదవుతుందా? కాదు కదా! కాని, కొందరు బాలీవుడ్ వాళ్లకు సినిమానే గొప్పదైపోతోంది! ఇంకా చెప్పాలంటే తాము నాలుగు డబ్బులు పెట్టి తీసిన తమ సినిమానే ... దేశం కంటే గొప్పదైపోతోంది!
ఇండియాలో ఉగ్రవాదానికి కారణం ఎవరు? ఈ కొశన్ ఎవరికి వేసినా పాకిస్తాన్ అని ఠక్కున సమాధానం చెబుతారు. కాని, ఎందుకో కొందరు మన బాలీవుడ్ మేధావులకి మాత్రం ఆ విషయం అర్థం కావటం లేదు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చినా, ఇక్కడి మన అమాయకుల్ని, ఆర్మీ వాళ్లని చంపినా, పాకిస్తాన్ సైన్యం మన జవాన్ల తలలు నరికినా ... ఇన్ని చేసినా బాలీవుడ్ గాళ్లకు పక్క దేశంపై ప్రేమపోవటం లేదు! ఈ కోవలో మొట్ట మొదట పెంటలో కాలేశాడు సల్మాన్. పాకిస్తాన్ కళకారులు ఉగ్రవాదులు కాదు. వాళ్లనెందుకు బ్యాన్ చేయటం అన్నాడు! ఇక అక్కడ్నుంచీ రోజుకొకరు తమ పాకిస్తాన్ ప్రేమ చాటుకుంటున్నారు. మహేష్ భట్, కరణ్ జోహర్, ఓంపురి... ఇలా బోలెడు మంది! వీళ్లెవరూ మన మీద ఉగ్ర దాడులు జరిగినా, జవాన్లు మరణించినా అంతకు ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని, మహారాష్ట్రాలోని ఎంఎన్ఎస్ లాంటి పార్టీలు పాకీల్ని దేశంలోకి రానివ్వద్దని అల్టిమేటం ఇవ్వగానే మాత్రం కన్నల్లోంచి బయటకొచ్చారు...
పాకిస్తాన్ ప్రేమతో కోట్లాది మంది దేశభక్తులకు విలన్ అయ్యాడు అనురాగ్ కశ్యప్. ఆ మధ్య పంజాబ్ లో తన ఉడ్తా పంజాబ్ సినిమా విడుదల కానీయకుంటే కూడా నానా రచ్చ చేశాడు ఈ మేధావి. క్రియేటివ్ సినిమాలు తీస్తాడని పేరున్న అనురాగ్ ఎప్పుడు ఏ సమస్య వచ్చిన ట్విట్టర్ లో తాగుబోతులా ట్వీట్స్ చేయటం పనిగా పెట్టుకున్నాడు. పంజాబ్ లో సినిమా విడుదల అవ్వటం కష్టమైతే కూడా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు మాట్లాడాడు అప్పట్లో. ఇక ఇప్పుడు కూడా ఏకంగా మోదీని టార్గెట్ చేసి తన పైత్యం ప్రదర్శించాడు!
అనురాగ్ కశ్యప్ తన కుక్క తోక వంకర బ్యాచీ మిత్రుడైన... కరణ్ జోహర్ గురించి మోదీతోనే యుద్ధానికి దిగాడు. కేజో తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ప్రస్తుతం రిలీజ్ విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుక్కారణం ఆ సినిమాలో హీరోగా పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించటమే. ఉరి ఉగ్రదాడుల్ని ఖండించకుండా తన దేశం చెక్కేసిన ఆ మహానుభావుడు తెరపై కనిపిస్తే ఊరుకునేది లేదని ఎంఎన్ఎస్ , ఆ పార్టీ అధినేత రాజ్ థాక్రే హెచ్చరించారు. ఇప్పుడు అందరి టెన్షన్ అదే...
తన మిత్రుడు కరణ్ జోహర్ సినిమా విడుదల ఆగిపోతే కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అనురాగ్ కశ్యప్ బాధ అర్థం చేసుకోవచ్చు. కాని, అందుక్కారణం హెచ్చరికలు జారీ చేసిన రాజ్ థాక్రే, ఆయన పార్టీ ఎంఎన్ఎస్. కాని, ట్విట్టర్ వీరుడు అనురాగ్ కశ్యప్ మోదీని టార్గెట్ చేశాడు. పైగా అతి తెలివిగా పాకిస్తాన్ హీరోని పెట్టుకుని తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ఆడనివ్వాలని కోరకుండా... నరేంద్ర మోదీ పాకిస్తాన్ పర్యటన గురించి మాట్లాడాడు. ఆయన ట్యాక్స్ పేయర్స్ డబ్బులతో నవాజ్ షరీఫ్ ఇంట్లో విందుకి వెళ్లొచ్చాడట. అందుకు ఈయనగారికి సారీ చెప్పాలట! అసలు దేశ ప్రధానితో ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు బాలీవుడ్ వాళ్లు! ఎవరో రాజ్ థాక్రే సినిమాని ఆపిస్తే మోదీ సారీ చెప్పటం ఏంటి? అనురాగ్ వెర్రి బుర్రకే తెలియాలి!
తమకు ఏ ఇబ్బంది కలిగినా మోదీని టార్గెట్ చేస్తూ ట్విట్స్ చేయటం ఈ మద్య ప్రతీ వాళ్లకూ ఫ్యాషన్ అయిపోయినట్టుగా వుంది. ఆ మధ్య తనని ఎవడో మున్సిపల్ అధికారి లంచం అడిగాడని కపిల్ శర్మ అనే టీవీ కమెడియన్ మోదీని ప్రశ్నించాడు. అచ్చే దిన్ ఏవీ అంటూ పిచ్చి వాగుడు వాగాడు! నిజానికి కపిల్ శర్మ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టాడు. అలాంటి ప్రబుద్ధుడు మోదీని కార్నర్ చేయాలని తాపత్రయపడ్డాడు...
బాలీవుడ్లో ఒక సైడు మహేష్ భట్లు, ఓంపురీలు, కరణ్ జోహర్లు, అనురాగ్ కశ్యప్ లు, ప్రియాంక చోప్రాలు పాకిస్తాన్ కు అనుకూలంగా వేషాలు వేస్తుంటే... మరో సైడు అనుపమ్ ఖేర్లు, మథుర్ బండార్కర్లు, రవీనా టాండన్లు భారతదేశం వైపు నిలుస్తున్నారు. కాకపోతే, తమ సినిమాల గురించి కాకుండా అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు ప్రతీ చిన్న దానికి మోదీని చర్చలోకి తేవటం... శుద్ధమైన అహంకారం, అజ్ఞానం అనిపించుకుంటుంది తప్ప... ఏదో పెద్ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ఛేంజ్ అనిపించుకోదు!