బాబుగారూ ... ప్రతీ 'చిల్లర' కష్టానికీ టెక్నాలజీయేనా! 

    ఉచితంగా మొబైల్ ఫోన్! ఇదేదో ముఖేష్ అంబానీ జియో నెట్ వర్క్ వాళ్లు ఇస్తున్న బంపర్ ఆఫర్ కాదు! ఏపీ సీఎం చంద్రబాబు మెదడులో మెరిసిన ఐడియా! ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జనానికి ఫ్రీ మొబైల్స్ ఎందుకు ఇస్తానంటారు? అర్థం కావటం లేదా? అయితే, మనం మరోసారి మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తావించుకోవాలి! అమాంతం 500, 1000 నోట్లు నిషేధించే సరికి పరిస్థితి ఎలా వుందో అందరికీ తెలిసిందేగా! జనం నానా తంటాలు పడుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే, చంద్రబాబు ఆంధ్ర ప్రజల చిల్లర ఇబ్బందులకి ఒకింత వింత పరిష్కారం సూచించారు. అదీ ఏకంగా ఆర్బీఐ అధికారులకే తన మనసులో మాట చెప్పారు. అదేంటంటే... రాష్ట్రంలోని ఆర్దికంగా వెనుకబడిన ప్రజలకి ఉచితంగా మొబైల్ ఫోన్స్ అందించటం! దీని వల్ల వంద నోట్ల కోసం జనం పడుతున్న వందల కష్టాలు ఎలా తీరుతాయంటారా? మొబైల్ బ్యాంకింగ్ ద్వారానట!  చంద్రబాబు టెక్నాలజీ క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆయన టెక్ బాబు అని గతంలోనే సీఎంగా వుండగా నిరూపించుకున్నారు. కాని, రాను రాను ఈ టెక్నాలజీ మోజు లాభం కంటే నష్టం ఎక్కువ చేసేలా కనిపిస్తోంది. ఉదాహరణకి ఆయన తీసుకున్న తాజా ఉచిత మొబైల్ ఫోన్ల నిర్ణయమే తీసుకోండి... దీని వల్ల ఆర్దికంగా వెనుకబడిన వారికి నిజంగా లాభమా? ఆర్దికంగా వెనుకబడి ఇప్పటికీ మొబైల్ ఫోన్ లేని వారంటే ... సహజంగానే వాళ్లు నిరక్షరాస్యులని అర్థం కదా! మరి వారికి మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోను చేతిలో పెట్టి పేటీఎం లాంటివి వాడుకోమంటే ఎలా వాడతారు? తమ బేసిక్ ఫోన్లో కాంటాక్ట్స్ లోని తెలిసిన వారి పేర్లే వాళ్లకు చదువుకోవటం రాదు. అలాంటి వారు జేబులో చిల్లర లేక కష్టాలు పడుతున్నారు. పైగా వారికి ఇప్పుడు మొబైల్ ఉచితంగా ఇచ్చి కరెన్సీ కష్టాల నుంచి ఉద్ధరిస్తామంటే ఎలా? వాళ్లకు కావాల్సిన వంద నోటో, పది నోటో త్వరగా వారి చేతిలో పడేలా చూస్తే సరిపోతుంది కదా! ఉచితంగా మొబైల్ ఫోన్ల పంపిణీ ఎంత వరకూ కార్యరూపం దాలుస్తుందో ఇప్పుడే చెప్పలేం కాని... దీని వల్ల అత్యంత దిగువ స్థాయి నిరక్షరాస్యులకు జరిగే మేలు సున్నా! కాని, మధ్యలో ఎంటరయ్యే సదరు మొబైల్ ఫోన్ల సప్లయర్ కి మాత్రం కాసుల పంట పండుతుంది! ఇలాంటివన్నీ చంద్రబాబు ఆలోచించుకుని జనానికి నిజంగా మేలు చేసే నిర్ణయం తీసుకుంటే బావుంటుంది!  

పాత నోట్లు... 300 ఎవరెస్టులకు సమానం!

  కరెన్సీ నోట్లు అంటే ఇప్పుడు దేశంలో అందరూ పాతవా? కొత్తవా? అని అడుగుతున్నారు! కొత్తవేమో తక్కువున్నాయని టెన్షన్. పాతవేమో ఎక్కడ మన దగ్గరే వుండిపోయి పనికి రాకుండాపోతాయోనని భయం! ఇదీ పరిస్థితి.... కొత్త నోట్లు దొరకటం లేదనీ అందరూ ఆలోచిస్తున్నారుగాని పాత నోట్లు ఏం చేయాలా అని ఆర్బీఐ బుర్ర బద్ధలు కొట్టుకుంటోందట! ఎందుకంటే, అంత భారీగా పాత నోట్లు పోగవుతున్నాయి దేశ ప్రధాన బ్యాంకు వద్ద. ఇంకా డిసెంబర్ 30దాకా పాత నోట్లు మార్చుకోటానికి, డిపాజిట్ కి టైం వుండటంతో 500, 1000 నోట్లు సునామీల వచ్చేస్తున్నాయట. ఇలా మొత్తం దేశంలోని పాత నోట్లు అన్నీ రిజర్వ్ బ్యాంకు వద్దకి చేరితే... వాటి పరిమాణం ఎంత వుంటుందో తెలుసా?  ఓల్డ్ నోట్స్ అన్నీ ఒక దాని మీద ఒకటి పెడితే ఎవరెస్ట్ పర్వతాన్ని 300 రెట్లు మించిపోతాయట! లెంగ్తే కాదు విడ్త్ కూడా అంతే దిమ్మ తిరిగిపోయేలా వుంది. పాత నోట్లు ఒక దాని పక్కన ఒకటి పేర్చుకుంటూ పోతే భూమికి, చంద్రుడికి మధ్య దూరాన్ని 5సార్లు కొలవొచ్చట! ఇంత భారీగా పాత పచ్చ నోట్లు పోగవనున్నాయి. మరి వాట్ని ఏం చేస్తారు? మొత్తం ప్రపంచ కరెన్సీలో మన నోట్ల శాతం 1.5. అయితే, చైనా ముద్రించే నోట్లు పక్కన పెడితే ప్రపంచంలో మనవే 75శాతం నోట్లు మనవేనట. అంతగా ముద్రించిన అత్యంత ఖరీదైన పచ్చ కాగితాలు ఇప్పుడు సమాధి అవ్వనున్నాయి. ఆర్బీఐ వెనక్కు వచ్చేసిన పాత నోట్లని పాతరేసే ఛాన్స్ వుంది. అది కాకపోతే, కాల్చేస్తారు. ఊరికే ధ్వంసం చేయడం వద్దనుకుంటే పెద్ద పెద్ద పరిశ్రమలకి చెల్లని పెద్ద నోట్లు పిడకల్లా తరలిస్తారు! అంటే వాట్ని కాల్చి ఇంధనంలా వాడుకుంటారన్నమాట!  నోట్ల మార్పుతో నల్లధనం ఎంత బయటకొస్తుందో ఇప్పుడో తెలియదుగాని... బూడిద మాత్రం భారీగానే వస్తుంది. ఇది పక్కా!      

మోదీ కొత్త నోటుకు ఓటేసిన జనం! 

దేశంలో ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న సమస్య ఏంటి? నోట్ల సమస్యే! 500, 1000 నోట్ల రద్దు తరువాత ఏ బ్యాంక్, ఏటీఎం దగ్గర చూసినా జనం కిటకిటలాడిపోతున్నారు! వంద నోట్ల కోసం కటకటలాడిపోతున్నారు! మరో వైపు విపక్షాలు ఢిల్లీ రోడ్ల మీద నుంచీ పార్లెమంట్ దాకా ప్రతీ చోటా హంగామా చేసేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, మమత, రాహుల్ గాంధీ అయితే మోదీని తెగ ఇరుకున పెట్టేశామని ఫీలైపోతున్నారు. కాని, నిజంగా గ్రౌండ్ లెవల్ పరిస్థితి ఏంటి? ప్రధాన మంత్రిని జనం... రాజకీయ నేతలు, మీడియా విమర్శించనంత విమర్శిస్తున్నారా? నోట్ల కట్టల కోసం వాళ్లలో కోపం కట్టలు తెంచుకుంటోందా?  ప్రజాస్వామ్యంలో పాలకులపై జనానికున్న అభిప్రాయం పక్కగా తెలిసేది ఎన్నికల ద్వారానే. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై కూడా ప్రజల్లో ఏ అబిప్రాయం వుందో తెలియాలంటే ఎలక్షన్స్ రావాల్సిందే. కాని, పూర్తి స్థాయి మెజారీటితో వున్న ప్రస్తుత గవర్నమెంట్ ఫుల్ లెంగ్త్ ఎలక్షన్స్ ఎదుర్కొనేది 2019లో. అంత దాకా జనం బ్యాలెట్ ద్వారా మోదీపై తమ అభిప్రాయం చెప్పే ఛాన్స్ లేదు. కాని, ఇవాళ్ల విడుదలైన బై పోల్స్ రిజల్ట్స్ ఒకింత జనం మనసులో ఏముందో విప్పి చెప్పాయి! నవంబర్ 8న మోదీ నల్లధనం నియంత్రణకి పెద్ద నోట్లు రద్దు చేశాక... నవంబర్ 19న దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. రకరకాల కారణాలతో ఖాళీ అయిన ఈ స్థానాల్లో బీజేపి సిట్టింగ్ ఎంపీలు వున్నవి అసోమ్, మధ్య ప్రదేశ్ లో మాత్రమే. సో... నోట్లు లేక జనం నానా యాతన పడుతున్న సమయంలోనే అసొమ్, మధ్యప్రదేశ్ లలో ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చారన్నమాట. విపక్షాలు, మీడియా ఈ బైపోల్స్ లో బీజేపి ఓటమిపాలైతే ఆ నెపమంతా నోట్ల రద్దుపై రుద్దుదామని ఎదురుచూశాయి. కాని, మోదీ అదృష్టం కొద్దీ బీజేపి గెలిచే అవకాశం వున్న రెండు రాష్ట్రాల్లో తమ పూర్వ స్థానాల్ని అలాగే కాపాడుకుంది. భారీ మెజార్టీలు కూడా నమోదు అయ్యాయి. మొత్తానికి ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూలలో వున్న జనం పోలింగ్ బూత్ క్యూలలో నిలబడి మోదీని శిక్షిస్తారనుకున్న విపక్షాల ఆశ నెరవేరలేదు....  బై పోల్స్ ఇచ్చిన జోష్ లో వున్న మోదీ తమ పార్టీ ఎంపీలకు గట్టి సందేశం ఇచ్చారు. నోట్ల రద్దు నల్లధనం విషయంలో మొదటి మెట్టు మాత్రమేనని స్పష్టం చేశారు. ముందు ముందు ఇంకా చాలా యాక్షన్ వుంటుందని తేల్చేశారు! అంతే కాదు, జనం తన యాప్ లో లాగిన్ అయ్యి తమ అభిప్రాయం చెప్పొచ్చని కూడా పిలుపునిచ్చారు. డిమానిటైజేషన్ నచ్చిందా? లేదా? అంటూ సూటి ప్రశ్న వేశారు! ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అత్యధిక జనం మోదీ వెంట వున్నట్టుగానే కనిపిస్తోంది!   

రేవంత్ రెడ్డి, కేసీఆర్, వైఎస్... కామన్ పాయింట్ ఏంటి?

  మనిషన్నాక కూసింత కళాపోషణ వుండాలి అంటారు! కాని, ప్రతీ మనిషికీ కళా పోషణ వుండొచ్చు. వుండకపోవచ్చు. కాని, అందరికీ వుండేది సెంటిమెంట్! ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ కే లోనవుతున్నారు తెలంగాణ టీడీపీలో వన్ మ్యాన్ ఆర్మీ రేవంత్ రెడ్డి! ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక టీ టీడీపీకి తీవ్రమైన సవాళ్లే ఎదురవుతున్నాయి. ఒక్కొక్కరుగా నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ చేసేశారు. అయినా కూడా పచ్చ కండువా మార్చకుండా పట్టుదలతో వుంటున్నారు రేవంత్ రెడ్డి. అంతే కాదు, ఆయన మీద ఓటుకు నోటు కేసు ఒత్తిడి ఎంత వున్నా కేసీఆర్ ను తెగించి విమర్శించటంలో ముందుంటున్నారు. అందుకే, మీడియాలో రేవంత్ ఏ మాట మాట్లాడినా బ్రేకింగ్ న్యూస్ అవుతూనే వుంటోంది! రేవంత్ కి ... కేసీఆర్ తో రాజకీయంగా పడకపోయినా ఒక్క విషయంలో మాత్రం ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారనిపిస్తోంది! అదే సెంటిమెంట్ల విషయం! ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సెంటిమెంట్ల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాలంటారా? ఆయన ఏం చేసినా సెంటిమెంట్ ప్రకారమే చేస్తారు. రీసెంట్ గా వాస్తు బాగాలేదని తన సెంటిమెంట్ కోసం కొత్త భవనం కట్టిస్తామన్నారు. అప్పుడు విపక్షాలు చేసిన గొడవ అందరికీ తెలిసిందే! రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లా సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నారు. కాకపోతే, ఆయన ప్రజాధనంతో ముడిపడని వ్యక్తిగత నమ్మకాల్ని ఆచరిస్తున్నారు. ఈ మధ్య టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి నుంచి పార్టీ ఆఫీస్ కి సైకిల్ పై వెళ్లారు! ఇలా చేస్తే పెద్దమ్మ అనుగ్రహం తన మీద వుంటుందని ఆయన భావించారట! అంతే కాదు, తాజాగా మరో సెంటిమెంట్ స్టోరీ ఆయనే స్వయంగా చెప్పారు. భూపాలపల్లి నుంచి రైతు పోరు యాత్ర ప్రారంభించిన తనకు టీడీపీ సీనియర్ నేత సీతక్క బొట్టు పెట్టి ఆశ్వీర్వదించి పంపిందన్నారు. సీతక్క ఆశీస్సులతో తన పోరు తప్పకుండా విజయవంతం అవుతుందని రేవంత్ చెప్పుకొచ్చారు! ఇంతకు ముందు చేవెళ్ల చెల్లెమ్మ సబితా గురించి.... వైఎస్, ఇలాగే సెంటిమెంటల్ గా వుండేవారు! ఆయన ఆమె వుంటేనే ప్రచారం మొదలు పెట్టేవారు. ఇప్పుడు రేవంత్ కూడా సీతక్కను  అలాగే భావిస్తున్నారు. చూడాలి మరి, సీతమ్మ ఆశీర్వాదం రేవంత్ ను ఎంత వరకూ కష్టాల నుంచి గట్టెక్కిస్తుందో!   

తగ్గిపోయిన జనం ... నిండిపోయిన ధనం!

  నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకులు ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాయి. ఏటీఎంలు ఎంత ఖాళీగా వుంటున్నాయో బ్యాంకుల్లోని గల్లా పెట్టెలు అంత నిండుగా అంటున్నాయి. అయితే, బ్యాంకుల్లోకి వస్తున్నవన్నీ పాత నోట్లే! కాని, బ్యాంకులు కాకుండా మరో చోట కూడా ఓల్డ్ నోట్స్ వర్షంలా కురుస్తున్నాయట! ఎక్కడంటారా? ఇంకెక్కడా తిరుమలలోని శ్రీవారి హుండీలో! వెంకన్న ఆదాయం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాలా... అయితే, నోట్ల రద్దు నిర్ణయంతో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మరప్పుడు ఆటోమేటిక్ గా ఆదాయం కూడా తగ్గాలి కదా? కాని, పరిస్థితి రివర్స్ గా వుందట! తగ్గాల్సిన ఆపద మొక్కుల వాడి ఆదాయం పెరిగిపోతోంది. సోమవారం నాడు ఒక్క రోజే 4కోట్లు 18లక్షల రూపాయలు హుండీలో పడ్డాయట! ఇంత పెద్ద మొత్తం వసూలవటం గత ఆర్నెళ్లలో ఇదే మొదటిసారట! అంతేకాదు, నోట్లు బ్యానైన తరువాత గత పదకొండు రోజుల్లో స్వామి వారి ఆదాయం 34కోట్లు 3లక్షలు. అసలు నోట్లు రద్దై డబ్బులకు కటకటగా వున్న ఈ సమయంలో ఇంత భారీగా ఆదాయం రావటం ఆశ్చర్యమే కదా! వెంకటేశ్వరుని ఆదాయం భారీగానే వుందిగాని దాంట్లో చాలా వరకూ పాత 500, 1000 నోట్లు వచ్చి వుంటాయని టీటీడీ అనుమానిస్తోంది. బ్లాక్ మనీని ఏం చేయాలో తెలియని నల్ల భక్తులు ఇలా స్వామీ వారి ఖాతాలోకి మనీ ట్రాన్స్ ఫర్ చేసేస్తున్నారు. దీని వల్ల ఎంతో కొంత పుణ్యంతో పాటూ పెద్ద నోట్లు ఏం చేయాలన్న పెద్ద టెన్షన్ కూడా వారికి తప్పుతుండవచ్చు!     

ఏపీలో కరెన్సీ కష్టాలకు బాబు చెక్..!

  ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. పెద్ద నోట్లు చెల్లక..నిత్యావసరాలు కొనలేక సాధారణ జనజీవితం దాదాపు స్తంభించి పోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు నోట్ల దెబ్బకు విలవిలలాడుతున్నారు. వారాంతాల్లో పార్టీలు, పబ్‌లు అంటూ మజా చేసుకునే కార్పోరేట్ ఉద్యోగులు సహా సాధారణ ప్రజలు బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫిసుల వద్ద గంటల తరబడి క్యూలలో పడిగాపులు కాస్తున్నారు. అయినా పని అవుతుందన్న గ్యారేంటి లేదు... తన దాకా వచ్చాకా డబ్బులు అయిపోతాయేమోనన్న భయంతో తిండి, తిప్పలు మాని బ్యాంకుల వద్దే లక్షల మంది జనం బారులు తీరుతున్నారు.   ఏటీఎంలో నో క్యాష్ అన్న బోర్డులు చూసి అసహనంతో ఏటీఎం మెషిన్‌లను ధ్వంసం చేస్తున్నారు ప్రజలు. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంది. ఇప్పుడైనా కన్నుతెరవకపోతే పరిస్థితులు ఇంకా శృతిమించుతాయి..జాగ్రత్త అని కేంద్రాన్ని హెచ్చరించింది. అయినా ప్రయోజనం లేదు. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం అలాంటిది..ముందస్తు ప్రణాళిక లేకపోవడం, తర్వాత పరిణామాల గురించి అంచనా వేయకపోవడం సామాన్యుడి జీవనాన్ని చిక్కుల్లో పడేసింది. అక్కడ.. ఇక్కడా అని కాకుండా దేశం మొత్తం దాదాపు ఇదే పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం.   ఎందుకంటే అక్కడుంది చంద్రబాబు..సంక్షోభాలను హ్యాండిల్ చేయడంలో బాబుది అందెవేసిన చెయ్యి. అందుకే ప్రధాని నుంచి ప్రకటన వెలువడిన తర్వాతి నుంచే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం ప్రతిరోజు అధికారులతో సమీక్షిస్తున్నారు. అదే సమయంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయించారు. ఈ సర్వే ఆధారంగా అసలు సమస్య ఎక్కడుందో కనుగోని పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఏపీలో కరెన్సీ కొరతను అధిగమించేందుకు రాష్ట్రానికి మరో రూ.5వేల కోట్లు పంపాలని ఆర్‌బీఐ గవర్నర్‌కు లేఖ రాశారు ముఖ్యమంత్రి. బాబు విజ్ఞప్తిని మన్నించిన ఆర్‌బీఐ తొలి విడతలో భాగంగా 2200 కోట్లు ఏపీకి ప్రత్యేకంగా పంపింది. ప్రతి జిల్లాకీ ఇంత అని డిస్ట్రిబ్యూషన్ చేసిన అనంతరం గ్రామీణులు పట్టణాల్లోకి రాకుండా గ్రామాల్లోనే ప్రత్యేక కౌంటర్లు లాంటివి ఏర్పాటు చేశారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏపీ వాసులకు కరెన్సీ కష్టాలు కాస్త తప్పినట్లేనని చెప్పవచ్చు.  

మనమెందుకు చావాలి.. చంపేయండి..?

ఉరీ ఘటన తర్వాత పాకిస్థాన్‌ అంటే అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కేంద్ర రక్షణశాఖా మంత్రి మనోహర్ పారికర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మెషీన్‌గన్ గానీ..పిస్టల్ గానీ పట్టుకుని మీవైపు రావడం చూస్తే..వారు మీకు హలో చెప్పడానికి వచ్చారని అనుకోకండి.. మీరు అమరులు కావడానికి ముందే వారిని అంతం చేయండి.. అంటూ ఆయన సైన్యాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. గోవా ఎన్నికల ప్రచారంలో భాగంగా  వాస్కోలో జరిగిన ర్యాలీలో పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ సైన్యం, ఉగ్రవాదులు తరచూ కాల్పులకు తెగబడుతూ భారత సైన్యానికి తీరని నష్టం మిగులుస్తున్నారు. సర్జికల్ స్టైక్స్ జరిగిన తర్వాత కూడా పాక్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోగా.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి.   ఈ నేపథ్యంలో సైనిక బలగాల్లో ఆత్మవిశ్వాసం నూరిపోసేలా పారికర్ వ్యవహరిస్తున్నారు. కశ్మీర్‌లోని సైనిక బలగాలకు ముష్కరులను మట్టుబెట్టేందుకు పూర్తి అధికారాలు ఉన్నాయనీ..టెర్రరిస్టులు కాల్పులకు తెగబడకముందే వారిని హతమార్చాలని పిలుపునిచ్చారు. కశ్మీర్‌లో సైనికులు ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఉగ్రవాదులు ముందు కాల్పులు జరపనిదే.. సైనికులు కాల్పులకు దిగకూడదనే పరిమితులు పెట్టింది. అయితే నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి పరిమితులను రద్దు చేసిందన్నారు. తమపై కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను కాల్చాలా వద్దా అని ఇప్పుడు జవాన్లు అనుమతులు తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు.   శత్రువులకు బుద్ధి చెప్పేందుకు వారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. కానీ ఇంత స్వేచ్ఛ ఉన్నా మన సైనికులు అమరులు కావడం నాకు చెప్పలేనంత బాధగా ఉందని పారికర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే పారికర్‌కు పాక్‌పై మంట ఎక్కడ దాకా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో పఠాన్‌కోట్ దాడి సమయంలోనే భారత సైనికులు గాజులు తొడుక్కుని కూర్చోలేదు అని వ్యాఖ్యానించి తన మనసులో ఏముందో చెప్పకనే చెప్పారు. ఉరీ ఘటన తర్వాత ఆయన కసి రెట్టింపయ్యింది. కానీ ఎంతో ముందు చూపున్న పారికర్ వేగంగా తీసుకున్నా తప్పుడు నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు. అంటే ఇప్పటికిప్పుడు యుద్ధం చెయ్యాల్సి వస్తే సై అనడానికి.. శత్రువును దెబ్బ తీయడానికి తాను రెడీగా ఉండటంతో పాటు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారన్నమాట.

పట్టాలు తప్పిన ప్రయాణం

నిన్న ఉదయం ఇండోరు నుంచి పట్నాకు వెళ్తున్న రైలు, ఘోర ప్రమాదానికి గురి కావడంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజామున ఆదమరచి నిద్రపోతున్న వంద మందికి పైగా ప్రయాణికులు నిద్రలోనే ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదం జరిగిన తీవ్రత దృష్ట్యా... గత పదేళ్లలో ఇదే భారీ రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. ఇంతమంది ప్రాణాలను బలిగొన్న ఈ భారీ ప్రమాదానికి కేవలం మానవ నిర్లక్ష్యమే కారణం అన్న విశ్లేషణ మరింత బాధకి గురిచేస్తోంది.   రోజూ లక్షలాదిమందిని గమ్యస్థానానికి చేర్చడంలో భారతీయ రైల్వేకు ప్రపంచంలో మరే ప్రయాణ సంస్థా సాటిరాదు. కానీ భద్రతాపరంగా తన ముందు ఉన్న సవాళ్లను రైల్వేశాఖ ఇప్పటికీ ఛేదించలేకపోతోందన్న ఆరోపణకు తాజా సంఘటను ఉదాహరణగా నిలుస్తోంది. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు నేతలంతా హుటాహుటిన అక్కడికి చేరుకోవడం, సహాయక చర్యలను చేపట్టడం, భారీ నష్టపరిహారాన్ని అందించడం వరకూ అంతా బాగానే ఉంటుంది. కానీ అసలు ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు సాగుతున్నాయి అన్నదానికి తగిన జవాబులు లభించడం లేదు.   గత రైల్వే బడ్జెటుని మినహాయిస్తే ప్రతిసారీ రైల్వే మంత్రులు ఇన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టాము, ఇన్ని ప్రాజెక్టులను చేపట్టాము అంటూ ఊదరగొట్టేవారు. చేతిలో రైల్వే శాఖ ఉంది కదా అని పుట్టింటికీ, అత్తవారింటికీ మధ్య రైలుని ఏర్పాటుచేసుకున్న మహానుభావులూ లేకపోలేదు. కానీ భద్రత విషయంలోనూ, సౌకర్యాల విషయంలోనూ రైల్వే వ్యవస్థను ప్రక్షాలను చేసే సాహసాన్ని మాత్రం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకరకంగా నిన్న జరిగిన రైల్వే ప్రమాదం అలాంటి నిర్లక్ష్యపు ఫలితమే అని చెప్పుకోవచ్చు.   ప్రమాదం జరిగిన మార్గంలో పట్టాల నిర్వహణ సరిగా లేదని చెబుతున్నారు. ఈ 21వ శతాబ్దంలో రైలు పట్టాలు పగులుబారడం వల్ల వందమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవడంకంటే సిగ్గుచేటు ఉండదు. ఒకవేళ ప్రమాదవశాత్తూ పట్టాలలో పగుళ్లు ఏర్పడ్డాయనుకున్నా లేదా ఏదో ఒక బోగీ చక్రాలు విరిగిపోయాయని అనుకున్నా... కాలం చెల్లిన సాంకేతికత కారణంగానే బోగీలన్నీ ఒకదానిలోకి ఒకటి దిగబడిపోయి నుజ్జునుజ్జయిపోయాయన్నది మాత్రం కాదనలేని వాస్తవం.   అయిపోయిందేదో అయిపోయింది అనుకోవడానికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేవి కావు. కానీ మరింతమంది అభాగ్యులు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వంతెనలు, క్రాసింగులు, పట్టాలు, బోగీలు, సిగ్నలింగ్... ఇలా వ్యవస్థలోని ప్రతి అంశాన్నీ ప్రక్షాళన చేయవలసి ఉంటుంది. అది వదిలేసి ఈ ప్రమాదం మోదీని అప్రదిష్టపాలు చేయడానికి పన్నిన కుట్రగా కొందరు భాజపీ ఎంపీలు విరుచుకుపడటం హాస్యాస్పదంగా ఉంది.

నోట్ల రద్దుపై... నోళ్లలో నానుతున్న ఏడు పుకార్లు!

  500, 1000 నోట్లు రద్దయ్యాయి. దేశం మొత్తం రచ్చరచ్చైపోయింది. ఎక్కడ చూసినా క్యూ లైన్లు. ఊసూరుమంటున్న జనం. మరో వైపు మీడియా వాళ్ల హడావిడి. ఆ రిపోర్ట్స్ విన్నా, చదివిన వారు మరింత ఆందోళన చెందుతున్నారు. పనిలో పనిగా తాము విన్నది, చదివింది కొంచెం మసాలా దట్టించి ప్రచారం చేసేస్తున్నారు. మొత్తానికి ఇలా ఇప్పుడు భారత్ దేశం మొత్తం నోట్లో... నోట్ల రద్దు మాటలతోనే రోజులు గడిపేస్తోంది! ఫలితంగా ఒళ్లు జలదరించే అబద్ధపు గాసిప్స్ కూడా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. అసలు వీట్ని ఎవరు, ఎక్కడ, ఎలా స్టార్ట్ చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు... దేశంలోని 86శాతం డబ్బుని బ్యాన్ చేసి కొత్తగా మళ్లీ అంత మనీని రొటేషన్లోకి తీసుకురావాలంటే చాలా దమ్ము, ధైర్యం కావాలి. అవ్వి మోదీకి మెండుగానే వున్నాయి కాని కాస్త పుకార్లను కంట్రోల్ చేయటంలోనే ఆయన టీమ్ ఫెయిలవుతోంది. కాని, తాజాగా ఆర్దిక శాఖ ఓ క్లారిటీ ఇచ్చింది. అందులో ప్రధానమైన ఏడు వదంతుల్ని పేర్కొంది. అవ్వి ఎలా నిజం కావో వివరణ ఇచ్చింది...  రూమర్ నెంబర్ వన్... 500, 1000 నోట్ల లాగే మోదీ త్వరలో 100, 50 నోట్లని కూడా రద్దు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన త్వరలో రానుంది. ఇది పచ్చి అబధ్ధం అంటోంది ఆర్దిక శాఖ. చిన్న నోట్లు రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదు.  రూమర్ నెంబర్ టూ... కొన్ని వ్యాపార సంస్థలకి, బీజేపీ నేతలకి, బడా వ్యాపార వేత్తలకి నోట్ల రద్దు విషయం ముందే తెలుసు! ఇది కూడా ప్రభుత్వం నిజాయితీపై బురదజల్లే దుర్మార్గ ప్రచారం. ఇందులో ఎలాంటి నిజం లేదు. నోట్ల రద్దు మోదీ ప్రటించే వరకూ ఎవ్వరికీ తెలియదు...  రూమర్ నెంబర్ త్రీ... నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు తేవటం వల్ల వచ్చే లాభం కన్నా అవుతోన్న ఖర్చే ఎక్కువ. ఇది కూడా ఉబుసుపోని మేధావులు సృష్టించిన పుకారే అంటోంది ఫైనాన్స్ డిపార్ట్ మెంట్! నోట్ల రద్దుతో బారతదేశంలో నడుస్తోన్న సమాంతర ఆర్దిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోతుంది. దాని వల్ల ధరలు నల్లధనం లెక్క తేలి ప్రభుత్వ ఖాతాలో చేరి ధరలు తగ్గు ముఖం పడతాయి. అంటే, మధ్యతరగతి, పేద వర్గాలకి ఎంతో లాభం అన్నమాట....  రూమర్ నెంబర్ ఫోర్... కొత్త రెండు వేల రూపాయల నోట్లలో నానో చిప్స్ వున్నాయన్నది మరో క్రియేటివ్ రూమర్! దీని వల్ల నల్లదనం ఎక్కడ వున్నా ఉపగ్రహం పట్టేస్తుందని వదంతలు వ్యాపింపజేశారు. ఇది కేవలం పాంటసీ తప్ప నిజం కాదు. కొత్త నోట్లలో ఎలాంటి చిప్స్ లేవు. అవ్వి నార్మల్ కరెన్సీ నోట్లు మాత్రమే... రూమర్ నెంబర్ ఫైవ్ ... నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ ఏం బయటకు రాదు. ఆల్రెడీ నల్ల ధనం వున్న వాళ్లు వైట్ చేసుకోటానికి మార్గాలు కనిపెట్టేశారు. ఇలాంటి మాటలు చెబితే కూడా జనం నమ్మొద్దంటోంది ఆర్దిక శాఖ. ఎవ్వరూ తమ బ్లాక్ మనీ వైట్ చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు ఎప్పటికప్పుడు కేంద్ర సంస్థలు తీసుకుంటున్నాయి. నిరంతరం నిఘా పెడుతూ అలెర్ట్ గా వున్నాయి...  రూమర్ నెంబర్ సిక్స్ ... 2వేల రూపాయల నోటు తక్కువ క్వాలిటీది. దాని రంగు పోవటమే దీనికి ఉదాహరణ. ఇలాంటి వాదన కూడా కొందరు చే్స్తున్నారు. కాని, నిజం ఏంటంటే... రెండు వేల రూపాయల నోటు రంగు పోతేనే అది ఒరిజినల్. ఈ సెక్యురిటీ ఫీచర్ ని ఇంటాగ్లియో ప్రింటింగ్ అంటారు. ఇలా చేసిన నోటును బట్టతో రుద్దితో రంగు అంటుకుంటుంది! అది చీప్ క్వాలిటి అని అర్థం కాదు...  రూమర్ నెంబర్ సెవన్... ఇది అన్నిటికంటే దుర్మార్గమైన , భయంకరమైన రూమర్. కొందరు సామాన్యుల్ని బ్యాంకు లాకర్లు ప్రభుత్వం సీజ్ చేయనుందని బెంబేలెత్తిస్తున్నారు. వాటిల్లోని బంగారు, వెండి, వజ్రాల నగల్ని సర్కార్ స్వాధీనం చేసుకోనుందని చెబుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మోదీ సర్కార్ కి అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదని తేల్చి చెబుతోంది ఆర్దిక శాఖ! నోట్ల రద్దుతో నానా తిప్పలు పడుతున్న మాట వాస్తవమే కాని అసలు ఇబ్బందుల కంటే ఈ దుష్ఫప్రచారాల గోల ఎక్కువైపోయింది. వార్తల వరద పారుతుండటంతో ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాని గందరగోళ స్థితి దాపురించింది. వాటికి చెక్ పెట్టేందుకే కేంద్ర ఆర్దిక శాఖ తాజా వివరణ ఇచ్చింది!  

ఆసుపత్రుల పాలవుతున్న టాలీవుడ్...

  నల్లధనం ఏం చేయాలో తెలియక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కోటీశ్వరులు హాస్పిటల్స్ పాలు అవుతున్నారు. అంటే... ఏ హార్ట్ ఎటాకో , బీపీనో వచ్చి ట్రీట్ మెంట్ లు తీసుకోవటం లేదు. మరింతకీ మ్యాటర్ ఏంటంటే...  టాలీవుడ్ లో దోచిన, దాచిన నల్ల డబ్బంతా డిసెంబర్ 30 తరువాత పాచిపోయి కంపు గొట్టే పరిస్థితి వచ్చేసింది. అందుకే, రోజుకు కోట్ల కొద్దీ లావాదేవీలు జరిపే కార్పోరేట్ హాస్పిటల్స్ ని మన వాళ్లు ఎంచుకుంటున్నారు. సాధారణంగా  ప్రైవేట్ హాస్పిటల్స్ రాత్రికల్లా పది, పదిహేను కోట్లు ఈజీగా బ్యాంకుల్లో వేస్తుంటాయి. ఇలా ఇన్ని కోట్ల కలెక్షన్స్ ప్రతీ రోజూ మరే రంగంలోనూ వుండవు.  కార్పోరేట్ హాస్పిటల్స్ మ్యానేజ్ మెంట్ తో తమకు వున్న పరిచయాలు, బాంధవ్యాలు వంటివన్నీ ఉపయోగించి ఇప్పుడు టాలీవుడ్ బ్లాక్ మనీని వైట్ చేస్తోంది. హాస్పిటల్స్ నల్లరాయుళ్లతో జత కట్టి పేషెంట్స్ బిల్లుల్లో ఈ బ్లాక్ మనీని కూడా తోసేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పేషెంట్లతో కుమ్ముక్కై దొంగ బిల్లులే సృష్టిస్తున్నారట! అలా లక్షల రూపాయాల బిల్లులు ప్రింటవుట్లు తీసి నల్ల డబ్బును బ్యాంకులకు తరలిస్తున్నారు. మ్యానేజ్ మెంట్లకు కమీషన్ వస్తుంటే నల్ల మారాజులకు పోగా మిగిలింది చేతికొస్తోంది! 

ఆర్బీఐ 'చించేసే' నిర్ణయం తీసుకుంటుందట!

  పది రోజుల కిందటి దాకా ఫుల్ వాల్యూతో గర్వంగా చక్కర్లు కొట్టిన అయిదు వందలు, వెయ్యి నోట్లు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? కోళ్ల ఫారమ్ లోని కోళ్లలా... ఇరుకు డబ్బాల్లో ఇరుక్కుపోయాయి. విలువ లేక బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాయి. డిసెంబర్ 30లోగా జనం వీట్ని బ్యాంకుల్లో పడేస్తారు. అక్కడ్నుంచీ రిజర్వ్ బ్యాంకుకి వెళతాయి. మరి తరువాత ఈ పాత 5వందలు, వెయ్యి నోట్ల గతేంటి?  డిమానిటైజేషన్ దెబ్బకి గ్లామర్ పోయిన పాత నోట్లు త్వరలోనే ముక్కలు కానున్నాయి. దేశం నలుమూలల్లోంచి రిజర్వ్ బ్యాంకు శాఖలకు చేరుకున్న ఈ నోట్లను సాధారణంగా అయితే తగలేయాలి. కాని, దేశంలోని 85శాతం డబ్బు ప్రస్తుతం విలువ లేకుండా పోయిన 500, 1000 నోట్ల రూపంలోనే వుంది. అందుకే, లక్షల కొద్దిగా వచ్చే పాత నోట్లను కాల్చటం కాకుండా చించేయాలని డిసైడ్ అయిందట ఆర్జీఐ. అదే జరిగితే ... స్వతంత్ర భారత చరిత్రలో ఒక శకం ముక్కలైపోయినట్టే లెక్కా!     

నోట్ల రద్దు వైద్యం వికటించిందా? సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమేనా?

  డామిట్ ... కథ అడ్డం తిరిగింది! అసలీ పెద్ద నోట్ల రద్దు మంచిదేనా? కాదా? ఖచ్చితంగా మంచిదే! కాని, ఈ అద్భుతమైన సక్సెస్ ఫుల్ ఆపరేషన్ ... పేషంట్ డెడ్ అనేలా జరుగుతుందేమో మోదీగారూ! అదీ అసలు సమస్య...  నోట్ల రద్దుతో భారీగా బ్లాక్ మనీ వెలికి వస్తుంది. మార్కెట్లో అన్ని ధరలు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ మోదీ భక్తులు చెబుతోన్న లాభాలు. కాని, వాళ్లు చెప్పలేకపోతున్న సత్యాలు బయట మార్కెట్లో వున్నాయి. ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూ లైన్ల గురించి కాదు మనం మాట్లాడేది. అసలు ఒక్కసారి ఆలోచించారా... డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేని అత్యంత పేదల సంగతేంటి? నోట్ల రద్దుతో నోట్లోకి ముద్ద దిగటం కష్టం అవుతోంది వాళ్లకి! వాళ్ల తరువాత నానా యాతన పడుతోంది మధ్య తరగతి వారు. వీళ్లనే మనం క్యూ లైన్లలో చూస్తున్నాం. ఇక అసలు నల్లదనం పోగేసిన నల్ల నక్కలు మాత్రం హాయిగా ఎప్పటిలాగే ఏసీ రూముల్లో, కార్లలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మహా అయితే పాత నోట్లు ఏం చేయాలా అని తలగొక్కుంటూ ఆలోచిస్తున్నారు. అంతే తప్ప బతుకు బస్టాండ్ అయింది మాత్రం మామూలోడికే! మోదీ, ఆయన చుట్టూ మూగిన మేధావులు ఎందుకోగాని మిస్సైపోయిన లాజిక్ వంద నోట్ల కొరత! దేశంలో ఒక్క అయిదు వందల నోటు చెలామణి లోంచి పోతే అయిదు వేరు వేరు వంద నోట్లు అవసరం అవుతాయి. అలాగే, ఒక్క వెయ్యి పోతే పది వంద నోట్లు కావాలి. కాని, అన్ని అయిదేసి, పదేసి వందలు వున్నాయా? లేవు. 85శాతం పెద్ద నోట్లే. కేవలం 15శాతమే వంద, యాభై, పది నోట్లు. అంటే, ఇప్పుడు నోట్ల రద్దు తరువాత దేశం కేవలం 15శాతం డబ్బుతోనే నడుస్తోందన్నమాట! ఇక రెండు వేల నోటు... మరో కొత్త టెన్షన్ లా వుంది! అది అటు ఏటీఎంలో పట్టదట... ఇటు చిల్లర అడుగుతూ షాపుకు వెళ్లితే గిట్టదట! దాన్ని ఏం చేస్తాడు సామాన్యుడు? చూసి మురవటం తప్ప! నోట్ల రద్దు అనేది వైద్యం కావొచ్చు. కాని, పరిస్థితి చూస్తుంటే... రోగానికి కారణమైన నల్ల మారాజులతో పాటూ అందరికీ సమానంగా కషాయం తాగించినట్టు వుంది! దాంతో రోగమూ, రోగ నిరోధక శక్తి రెండూ పోయేలా వున్నాయి! మరి మోదీ జీ అంతిమంగా ఏం చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ! సామాన్యుడి జీవితం తొందరగా కుదుటపడటమే ఇప్పుడు అందరికీ కావాల్సింది!   

మోదీ నిర్ణయాన్ని బిల్ గేట్స్ మెచ్చుకోవటం నిజం కాదా?

  మోదీ నోట్ల రద్దు నిర్ణయం పెద్ద సర్కస్ లా మారిపోయింది! దాని గురించి ఎవరికి వారు తమకు తోచినట్టు చెప్పేస్తున్నారు. ఆఖరుకు ఎంతో పేరున్న న్యూస్ పేపర్స్ , ఛానల్స్ కూడా తమ వంతుగా కన్ ఫ్యూషన్ కు కారణం అవుతున్నాయి. అందుకు ఉదాహరణ, డీమానిటైజేషన్ గురించి బిల్ గేట్స్ ఏమన్నాడు అన్న వార్తే! బిల్ గేట్స్ మోదీ నిర్ణయాన్ని... ఆయన సమక్షంలోనే మెచ్చుకున్నాడని ముందుగా వార్తలొచ్చాయి. దీని వల్ల త్వరలోనే ఇండియా డిజిటలైజ్ అవుతుందని , పారదర్శకత పెరుగుతుందని ఆయన చెప్పారన్నారు. కాని, కొన్ని గంటలు గడిచేలోపే బిల్ గేట్స్ నోట్ల రద్దుపై తనకు ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పాడని మళ్లీ వార్తలొచ్చాయి. అయితే, మోదీ నోట్లు రద్దు చేయటం పై ఎలాంటి ఒపీనియన్ లేకున్నా భారత్ మాత్రం త్వరలో డిజిటలైజ్ అవుతుందని ఆయన రీపీట్ చేశాడట! అసలింతకీ బిల్ గేట్స్ మోదీ డిసీషన్ కి మద్దతిచ్చాడా లేదా? ఏమో... మీడియాకే తెలియాలి. బిల్ గేట్స్ కే తెలియాలి. వంద నోట్ల కోసం వంద పాట్లు పాడుతోన్న జనానికి బిల్ గేట్స్ ఏమన్నా ఇప్పుడు వినిపించే అవకాశమే లేదు!    

ఇండియా Vs పాక్ ... అమెరికా Vs చైనా!

  ఆ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ తరువాత దేశం మొత్తం పాకిస్తాన్ తో యుద్ధం అంటూ ఊగిపోయింది. రేపో మాపో పూర్తి స్థాయి దాడులు తప్పవంటూ మీడియా కూడా హడావిడి చేసింది. సోషల్ మీడియా అయితే దేశభక్తి సెగలతో పొగలుగక్కింది. కాని, ఉన్నట్టుండీ ఆర్దిక సర్జికల్ స్ట్రైక్స్ తో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కంటే ఎక్కువగా 500, 1000 నోట్ల ప్రస్తావన నడుస్తోంది! కాని, అదే సమయంలో పాక్ ఏం చేస్తోంది? ఊరికే వుండదు కదా?  పాక్ అన్ని విధాల యుద్ధానికి సిద్ధం అయిపోతోంది! తాజాగా సరిహద్దు వద్ద తన సైనిక పాటవం చూపటానికి డ్రిల్ కూడా నిర్వహించింది. అయితే, ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, పాకిస్తాన్ యుద్ధ విమానాలతో పాటూ చైనా హెలీకాప్టర్లు కూడా చక్కర్లు కొట్టడం! WZ 10 అనే చైనీస్ హెలీకాపర్ట్స్ పాకిస్తాన్ విమానాలతో పాటూ మన ఆర్మీ వారికి కనిపించాయట. ఇవ్వి అత్యాధునిక హెలికాప్టర్లు. వీటితో ఆయుధాలు తరలించటం, దాడులు చేయటం బాగా తేలికవుతుంది. ఇలాంటివి ప్రస్తుతం ఇండియా వద్ద లేవు...  చైనా తయారు చేసిన WZ 10 హెలికాప్టర్లకు సాటి రాగల హెలికాప్టర్లు అమెరికా వద్ద వున్నాయి. గల్ఫ్ యుద్ధంలో, అఫ్గనిస్తాన్ లో వాడిన ఆ హెలికాప్టర్ల పేరు US AH 64 APACHE. ఇవ్వి మాత్రమే చైనా పాకిస్తాన్ కు అందించిన హెలికాప్టర్లతో పోటీ పడతాయి. భారత్ వీట్ని అమెరికా నుంచి ఇప్పటికే కొనుగోలు చేసింది. కాని, మనకు ఇంకా అందలేదు. అంతలోనే పాక్ వద్ద చైనీస్ హెలికాప్టర్స్ వుండటం అంటే ... చైనా పక్క దేశాన్ని బాహాటంగా సమర్థిస్తుంది అని అర్థం. మొదట్నుంచీ పాక్ వైపే నిలుస్తున్న డ్రాగన్ యుద్ధం వస్తే తన స్టాండ్ ఏంటో చెప్పకనే చెబుతోంది! చైనా ఒకవైపు పాకిస్తాన్ దిశగా సాగుతుంటే అమెరికా ఇండియా వైపు మోహరిస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్ కు అమెరికా సైనిక సాయం అక్కర్లేకున్నా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను కార్నర్ చేయటానికి యూఎస్ మద్దతు మనకు అవసరం. అందుకే, ఎప్పట్నుంచో అమెరికా చేత పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తింపజేయాలని ఇండియా ట్రై చేస్తోంది. ఇప్పుడు ఒబామా పోయి ట్రంప్ వచ్చేస్తుండటంతో ఆయన అంతరింగుకుల్లోని భారత్ సంతతి వారు తమ ప్రయత్నాల్లో తామున్నారు. ట్రంప్ కి దగ్గరగా వుండే ఇండియన్స్, ఇండియన్ ఆరిజిన్ వున్న వారి మాటల ప్రకారం ఆయన త్వరలోనే పాక్ ను టెర్రరిస్ట్ కంట్రీ గా గుర్తించే చాన్స్ వుంది. ట్రంప్ వైట్ హౌజ్ కి రాగానే సాధ్యమైనంత త్వరగా ఇది జరగవచ్చట! పాక్ ను అమెరికా ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తే దానికి ఇప్పుడు అందుతున్న యూఎస్ డాలర్ల వరద తగ్గిపోతుంది. పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. అది జరిగితే ఇండియాకు పాక్ ను లొంగదీయటం పెద్ద కష్టమేం కాదు. అయితే, డ్రాగన్ నిజమైన యుద్ధ సమయంలో ఎంతగా పాకిస్తాన్ కు మద్దతిస్తుందో ఇప్పుడే చెప్పలేం. కాని, చైనా ఎంతగా పాక్ వైపు కదిలితే అమెరికా అంతగా ఇండియా వైపు వస్తు ప్రపంచ పటాన్ని వేడెక్కించే ప్రమాదముంది!   

ఆసుపత్రుల పాలవుతున్న టాలీవుడ్ బ్లాక్ (మనీ) బాబులు!

  దేశంలో అత్యధికంగా నల్ల డబ్బు ఎవరి వద్ద వుంటుంధి? అఫ్ కోర్స్, బిజినెస్ మెన్! అంబానీలు, అదానీలు వగైరా వగైరా మొదటి స్థానంలో వుంటారు. ఇక వారి తరువాత రాజకీయ నాయకులు దొరికిన కాడికి దోచుకుని దాచుకుంటూ వుంటారు. వ్యాపారస్తులు, నేతల తరువాత ఎక్కువ నల్లధనం వుండేది ఎవరి వద్దా? ఖచ్చితమైన యాన్సర్ చెప్పలేకపోయినా జనానికి వెంటనే గుర్తొచ్చేది సినిమా వాళ్లు! పొలిటీషన్స్ తరువాత అంత ఎక్కువగా డబ్బు సంపాదించేది గ్లామర్ ప్రపంచం వాళ్లే! అది కష్టార్జితమే అయినా పన్ను కట్టకుంటే బ్లాక్ మనీనే అవుతుంది కదా... ఇప్పుడు అలాంటి బ్లాక్ మనీనే మన టాలీవుడ్ బ్లాక్ బాసులకి పెద్ద తల నొప్పిగా మారింది! ఏకంగా వాళ్లను ఆసుపత్రుల పాలు చేస్తోంది! నల్లధనం ఏం చేయాలో తెలియక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కోటీశ్వరులు హాస్పిటల్స్ పాలు అవుతున్నారు. అంటే... ఏ హార్ట్ ఎటాకో , బీపీనో వచ్చి ట్రీట్ మెంట్ లు తీసుకోవటం లేదు. ఆరోగ్యంగానే వున్నారు. కాని, తమ ఆర్దిక ఆరోగ్యం దెబ్బతినకుండా వుండటానికి కార్పోరేట్ ఆసుపత్రుల్ని ఎంచుకుంటున్నారు. తమ బ్లాక్ మనీ సూట్ కేసులకి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి వైట్ అండ్ హెల్తీగా మార్పించుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే...  టాలీవుడ్ లో నల్ల దొరలకి కొదవే లేదు. బ్లాక్ మనీతో సినిమాలు తీసేవాళ్లు, తీసిన సినిమాలపై లాభాలు వస్తే దాన్ని బ్లాక్ మనీగా బాక్సుల్లో దాచేవారు... ఇక్కడ బోలెడు! ఇప్పుడు అలా దోచిన, దాచిన నల్ల డబ్బంతా డిసెంబర్ 30 తరువాత పాచిపోయి కంపు గొట్టే పరిస్థితి వచ్చేసింది. అందుకే, రోజుకు కోట్ల కొద్దీ లావాదేవీలు జరిపే కార్పోరేట్ హాస్పిటల్స్ ని మన వాళ్లు ఎంచుకుంటున్నారు. సాధారణంగా ప్రతీ పేషంట్ దగ్గర్నుంచీ లక్షకు అటుఇటుగా బిల్లులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ రాత్రికల్లా పది, పదిహేను కోట్లు ఈజీగా బ్యాంకుల్లో వేస్తుంటాయి. ఇలా ఇన్ని కోట్ల కలెక్షన్స్ ప్రతీ రోజూ మరే రంగంలోనూ వుండవు. అందుకే, భారీగా వసూళ్లు చేసే హాస్పిటల్స్ దగ్గరికి తమ నల్ల సొమ్ము తీసుకుపోతున్నారట టాలీవుడ్ కరోడ్ పతులు! కార్పోరేట్ హాస్పిటల్స్ మ్యానేజ్ మెంట్ తో తమకు వున్న పరిచయాలు, బాంధవ్యాలు వంటివన్నీ ఉపయోగించి ఇప్పుడు టాలీవుడ్ బ్లాక్ మనీని వైట్ చేస్తోంది. హాస్పిటల్స్ నల్లరాయుళ్లతో జత కట్టి పేషెంట్స్ బిల్లుల్లో ఈ బ్లాక్ మనీని కూడా కలిపేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పేషెంట్లతో కుమ్ముక్కై దొంగ బిల్లులే సృష్టిస్తున్నారట! అలా లక్షల రూపాయాల బిల్లులు ప్రింటవుట్లు తీసి నల్ల డబ్బును బ్యాంకులకు తరలిస్తున్నారు. మ్యానేజ్ మెంట్లకు కమీషన్ వస్తుంటే నల్ల మారాజులకు పోగా మిగిలింది చేతికొస్తోంది! మోదీ నోట్ల రద్దు నిర్ణయం లాభమో,నష్టమో ఇప్పడే చెప్పలేం కాని నిజాయితీతో చేసింది. ఆయన ఈ దేశానికి పట్టిన నల్లధనమనే రోగానికి వైద్యం చేద్దామని డిసైడ్ అయ్యాడు. కాని, ఆ వైద్యానికి హాని చేస్తున్నాయి కొన్ని కార్పోరేట్ హాస్పిటల్స్. అదీ సమాజానికి బోలెడు నీతులు చెప్పే సినిమా వాళ్లతో కలిసి! ఇలా అయితే... ఈ దేశానికి సోకిన రోగం తగ్గేదెప్పుదో?   

మోదీ మళ్లీ నిషేధించాడు... నోట్లను కాదు!

  మోదీ ప్రభుత్వం ఒక దాని వెంట ఒకటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వాటి పర్యవసానం ఎలా వుంటుందో నెక్స్ట్ ఎలక్షన్సే తేల్చాలి. సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన నమో ఇప్పుడు నోట్ల రద్దుతో బ్లాక్ డాగ్స్ ని బెంబేలెత్తిస్తున్నాడు. కాని, అదే సమయంలో సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకంటే ఎక్కువగా మీడియా, మేధావులు, ప్రతిపక్ష నేతలు హంగామా చేస్తున్నారు. ఎవరిది నిజమో, ఎవరిది అతో అర్థం కానంత గందరగోళంగా వుంది పరిస్థితి. కాని, ఈ మొత్తం హడావిడిలోనే మరో డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ జరిగిపోయింది మోదీ పాలనలో! అదే జకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎన్జీవోపై నిషేధం! జకీర్ నాయక్ మామూలోడు కాదు. క్రిస్టియన్స్ లో కేఏ పాల్, బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వారికి వున్నట్టుగా ముస్లిమ్స్ లో మంచి ఫాలోయింగ్ వున్నవాడు. కాని, సమస్యల్లా అతని చుట్టూ గత కొంత కాలంగా ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నాడన్న ఆరోపణలు రావటమే! సామాన్యంగా ఇలాంటి ఆరోపణలు ఎన్ని వచ్చినా మన దేశంలోని కాంగ్రెస్ , దాని అనుబంధ సెక్యులర్ పార్టీలు అస్సలు నోరు మెదపవు. ఇక బ్యాన్ చేయటం అయితే ఊహించటమే కష్టం. కాని, విషయం మైనార్టీలకు సంబంధించింది అయినా మోదీ క్యాబినేట్ గో అహెడ్ అనేసింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ బ్యాన్ చేసేసింది. అయిదేళ్ల వరకూ ఈ నిషేధం కొనసాగనుంది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ కు భారీగా విదేశీ నిధులు వస్తుండేవి.వాటిని జకీర్ నాయక్ విచ్చలవిడిగా తన పీస్ టీవీకి మళ్లించాడు. ఇందులో శాంతి గురించి తక్కువ, మత చాందసం గురించి ఎక్కువ మాట్లాడేవాడు. అసలు నాయక్ తాలూకూ ఏ ఒక్క వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో చూసినా ఆయన వాదన , అభిప్రాయం మనకు అర్థం అయిపోతాయి. ఇప్పటికీ భూమి గుండ్రంగా వుందని ఒప్పుకోని కరుడుగట్టిన మత వాది ఆయన! ఆయన వల్లే తమ దేశంలో మారణకాండ జరిగిందని బంగ్లాదేశ్ మన కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చింది. జకీర్ మాటలు టీవీల్లో, యూట్యూబ్ లో విన్న ఒక ఉగ్రవాది ఢాకాలో కిరాతకానికి పాల్పడ్డాడు! ఈ కారణంగానే ఇస్లామిక్ దేశమైనప్పటికీ బంగ్లాదేశ్ జకీర్ నాయక్ ను విచారించాలని కోరింది. అయితే, అప్పట్నుంచీ విదేశాలకు వెళ్లిన జకీర్ ఇంత వరకూ తిరిగి రాలేదు. అరెస్ట్ భయంతో దేశం బయటే కాలం గడుపుతున్నాడు...  ఇప్పటికే దేశంలో లేని జకీర్ కు సంబంధించిన ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ ను తాజాగా కేంద్రం అయిదేళ్ల పాటూ నిషేదించింది. నిజానికి ఉగ్రవాదానికి ఉతం ఇస్తున్నాడని ఒక ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశే ఆరోపించినప్పడు జకీర్ ను సీరియస్ గా తీసుకోవాల్సిందే. అదీ కాక ఢిల్లీలో బీజేపి ప్రభుత్వం స్వంత మెజార్జీతో అధికారంలో వుండటం కూడా ఆయనకి రివర్స్ గా మారింది. కాంగ్రెస్ లాంటి మెతక పార్టీలు వుండి వుంటే ఇలా నిషేధం దాకా పరిస్థితి వెళ్లేది కాదేమో. కాని, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పీస్ టీవీపై గట్టిగానే దృష్టి పెట్టింది. మైనార్టీ సంతుష్టీకరణకు దిగకుండా జాతి శ్రేయస్సుకు నిర్ణయం తీసుకుంది. ఆఫ్ట్రాల్, ఉగ్రవాదానికి ఉతం ఇస్తే ఏ మతం వ్యక్తి అయినా, సంస్థ అయినా కఠిన శిక్షలు అనుభవించాల్సింది. ఇందులో సందేహం లేదు...  

కూతురు కోసం విజయనగర సామ్రాజ్యం

  పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న తిప్పలు ఆ దేవుడికే ఎరుక. చేతిలో డబ్బులుండి కూడా కనీసం భోజనం చేయలేని పరిస్థితిలో ప్రజలు అల్లాడుతున్నారు. పాత నోట్లు మార్చుకునేందుకు పనులు మానుకుని మారి జనం బ్యాంకుల ముందు బారులు తీరుతుండగా..కొందరు అవినీతిపరులు నల్లడబ్బును ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా జైలు జీవితం గడిపివచ్చిన...మైనింగ్ కింగ్ గాలిజనార్థన్ రెడ్డిపై మాత్రం ఈ నోట్ల ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదని చెప్పవచ్చు. గాలి కుమార్తె బ్రహ్మాణి వివాహం, హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ రెడ్డితో నవంబర్ 16న నిశ్చయమైంది. అయితే పెద్ద నోట్ల రద్దు..ఈ వివాహంపై ప్రభావం చూపే అవకాశం ఉందని దేశం మొత్తం భావించింది. కానీ వివాహ వేదిక బెంగళూరు ప్యాలెస్ వద్ద తాజా పరిస్థితిని చూస్తే మాత్రం అవన్నీ పుకార్లేనని అర్థమవుతోంది..పెళ్లికి ఒక్కరోజే సమయం ఉండటంతో అక్కడ అప్పుడే సందడి మొదలైపోయింది.      ఆ సంగతి పక్కనబెడితే పెళ్లి కోసం తనను తాను అభినవ శ్రీకృష్ణదేవరాయుడిగా ఫిలయ్యే గాలి వారు విజయనగర సామ్రాజ్యాన్నే పునర్నిర్మిస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్‌ ఆవరణలోని 36 ఎకరాల స్థలంలో ఈ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. వివాహ వేదికను హంపిలోని ప్రఖ్యాత విజయ విఠల దేవాలయాన్ని పోలి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎనిమిది పురోహితులు వివాహన్ని జరిపించనున్నారు. వీటితో పాటుగా లోటస్ మహల్, మహనవమి దిబ్బను కూడా నిర్మిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బెలగావిలో తాను నివసించిన ఇంటిని కూడా నిర్మించి దానికి కూతురికి, అల్లుడికి కానుకగా అప్పగించనున్నాడు గాలి. ఇక పెళ్లికూతురు అలంకరణ విషయానికి వస్తే పెళ్లిరోజు 17 కోట్లు ఖరీదు చేసే ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన చీరకు తోడుగా 90 కోట్లు విలువచేసే నగలను బ్రహ్మాణికి అలంకరించనున్నారు.

మోడీ దెబ్బకి గాలి ఎదురుదెబ్బ

  ఇప్పుడంటే పెద్దనోట్ల రద్దుతో ఈ విషయం దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది గానీ..అంతకు ముందు దేశం మొత్తం తన గురించి మాట్లాడుకేనేలా చేశాడు..కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి. తన కుమార్తె బ్రాహ్మాణి వివాహాన్ని నవంబర్ 16న నిశ్చయించి ఆ కార్యానికి అందరూ రావాల్సిందిగా.. ఇండియాలో ఇంతవరకు ఎవ్వరూ డిజైన్ చేయించని రేంజ్‌లో వెడ్డింగ్ కార్డ్ తయారు చేయించి వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. వెడ్డింగ్ కార్డే ఈ రేంజ్‌లో ఉంటే ఇక పెళ్లి ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ బాంబు పేల్చారు. ఇప్పటి వరకు చలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అక్రమార్కుల గుండెలు గుభేలుమన్నాయి. కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని సన్నాహాలు చేసుకుంటున్న గాలి గారికైతే నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లైంది. ప్రధాని ప్రకటన అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది. రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు అంగీకరించకపోవడంతో భూముల క్రమ విక్రయాలు, వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. అక్రమార్కులు తాము అక్రమంగా కూడబెట్టుకున్న నగదును ఎలా మార్పిడి చేసుకోవాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు. ఈ దశలో అక్రమ మైనింగ్ ద్వారా కోట్లు ఆర్జించిన గాలి కూడా తన కూతురి వివాహాన్ని ఆపేస్తాడని చాలా మంది భావించారు. కానీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అనుకున్న తేదీనే, అంటే ఇవాళే గాలి గారి కుమర్తె వివాహా జరగనుంది. అదేలా సాధ్యం అనేగా మీ డౌట్. గాలి కుమార్తె వివాహాం ఏడు నెలల క్రితమే నిశ్చయం అయ్యింది. పెళ్లి ఎలా చెయ్యాలి.? భోజనాల మెను తదితర వ్యవహారాల కోసం గాలి అప్పుడే ఒక పకడ్భందీ నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి వ్యవహారాల బాధ్యతను ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించారు. అయితే పెద్ద నోట్లు రద్దు అయ్యే సమయానికి అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. ఆరు నెలల క్రితమే అగ్రిమెంట్ కుదుర్చుకున్నందున అంత భారీ మొత్తం తిరిగిచ్చేందుకు ఆ సంస్థ సాహసించలేదట. పైగా నోట్ల పాట్లు కూడా తామే పడాలని నిర్ణయించుకుందట.

నషా వదిలిస్తున్న నిషేధం

  పోయిన మంగళవారం మోడీ వేసిన నిషేధ మంత్రం సంజీవనిలా మారి ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఆర్ధిక భద్రత కోసం మోడీ తీసుకున్న నిషేద నిర్ణయం దేశభద్రతకి, సాదారణ జనాలు పడే అనేక ఇబ్బందులకి కూడా పరిష్కారాలు చూపిస్తుంది.   ఒక విషయం గమనించారా పోయిన మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు అంటే మోడీ 500, 1000 నోట్లు బాన్ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు కాశ్మీర్ లోయలో ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగలేదు. ఒక్క సారి కూడా నిరసనకారులు రాళ్ళూ రువ్వలేదు, ఒక్క స్కూల్ కూడా తగలపెట్ట లేదు...   అవును నిజమే కాని కాశ్మీర్ లో గొడవలు జరగకపోవడానికి మోడీ బాన్ చేసిన 500,1000 నోట్లకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది అక్కడ ఉన్న వేర్పాటు వాదులు ఇప్పటి వరకు కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ ఉన్న యువతకి, పేదవారికి డబ్బులు ఇచ్చి ప్రసంగాలతో రేచ్చేగొట్టి నిరసనలు, దాడులు చేయించేవారు. భద్రత దళాలపై రాళ్ళు రువ్వితే 500, హింసాఖాండలో పాల్గొంటే 1000 రూపాయలు ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు కట్టి అల్లకల్లోలం సృష్టించేవారు... కానీ ఇప్పుడు వాళ్ళ ఆటలు సాగడం లేదు, కారణం మోడీ 500, 1000 నోట్ల రద్దు చెయ్యడం. నోట్ల రద్దు వలన  పాత నోట్లు తీసుకుని నిరసనలు చెయ్యడానికి నిరసనకారులు నిరాకరించడంతో, నిరసనకారులకు పంచడానికి కొత్తనోట్లు లేక పాత నోట్లు ఏమి చెయ్యాలో అర్ధం కాక వేర్పాటువాదులు  కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మూలుగుతున్న కోట్లకొద్దీ  పాత 500, 1000 నోట్లు (దొంగ నోట్లతో సహా) మూతి తుడుచుకోడానికి కూడా పనికి రాకుండా పోయాయి.   మోడీ దెబ్బకి ఎక్కడో ఆకాశంలో ఉన్న  రియల్ ఎస్టేట్ రెట్లు రేపో మాపో  నేల చూపులు చూడటానికి రెడీ అయిపోయ్యాయి. ఇంకా నిన్నటి వరకు ఎగిరిరేగిరిపడిన పసిడి పరిస్థితి ఐతే అమ్మడానికి అడవి, కొనడానికి కొరివిలా ఉంది. ఐటి నిఘా భయంతో కొనడానికి జనాలు, అమ్మడానికి వ్యాపారులు వెనక్కి తగ్గడంతో అమ్మకాలు లేక పసిడి రెట్లు  రెక్కలు తెగి అందుబాటులోకి వస్తున్నాయి. మోడీ నిర్ణయంతో ఇంకా నల్లబజారు కూడా బేజారు అవుతుంది. కట్టల కొద్దీ డబ్బులు దగ్గర ఉన్నాయి అని క్వింటాలకి క్వింటాలు నిత్యావసరాలు కొని గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచుకుని డబ్బులు గుంజుకునే వారి ఆటలు కూడా ఈ దెబ్బకి, ఇంకా సాగకపోవచ్చు...నల్ల బజారు బాబుల దగ్గర  కట్లపాములు (అదేనండి నోట్ల కట్టలు) లేవు కనుక ఇంకా  నల్లబజారు నడక జోరు కాస్త అయిన తగ్గకపోదు, నిత్యావసరాలు కూడా అంతో ఇంతో అందుబాటులోకి రాకుండా మానవు.   మోడీ చేసిన ఈ పని వలన సాదారణ జనం ఇప్పుడు క్యూ లైన్లలో కొంత కష్టపడుతున్నా, భవిష్యత్తులో ఆమ్ అద్మి... తక్కువ కష్టాలతో ప్రశాంతంగా బతకవచ్చు అనే ఆశ అయితే పెట్టుకోవచ్చు (ఎంత అయినా మనిషి ఆశా జీవి కదా...)