నగదు లేని సమాజం రానుందా!

  పెద్ద నోట్ల ఒక్క పెట్టున రద్దయిపోయాయి. బస్తాలకొద్దీ దాగిన నల్లధనం చిత్తుకాగితాలుగా మారిపోయింది. బినామీల పేరుతోనో, బంగారం పేరుతోనో ఇందులో కొంత భాగాన్ని చట్టబద్ధం చేసుకున్నా... చాలాభాగం వృధాగా మిగిలిపోక తప్పనిసరి స్థితి. సామాన్యలకు చిల్లర కష్టాల మాట ఎలా ఉన్నా, ఈ సంఘటనతో ఆన్‌లైన్ పేమెంట్ల మీదకి అందరి దృష్టీ మళ్లింది. ఎప్పటికప్పుడు నగదు లావాదేవీల మీద రకరకాల ఆంక్షలు జారీ కావడం, పరిమితులకు మించిన జమాఖర్చుల మీద నోటీసులు అందుకోవలసి రావడంతో... ఆన్‌లైన్ చెల్లింపులే మేలన్న అభిప్రాయానికి ప్రజలు ఈపాటికే వచ్చేశారు. పైగా మున్ముందు ఒక పరిమితికి మించిన నగదు చెల్లింపులను అనుమతించకపోవచ్చునన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కథనాల వెనుక వాస్తవం కూడా లేకపోలేదు. ‘అర్థ క్రాంతి’ సిద్ధాంతాన్ని రూపొందించిన అనిల్‌ బొకిల్ వంటి ఆర్థిక నిపుణుల ప్రకారం నల్లధనాన్ని నివారించేందుకు ఇలాంటి పరిమితులు తప్పనిసరి. నిజానికి 500,1000 రూపాయల నోట్లు రద్దు చేయాలన్న మోదీ ఆలోచన కూడా అనిల్‌ ‘అర్థక్రాంతి’ సిద్ధాంతంలో భాగమే అంటున్నారు.   చిన్నచిన్న లావాదేవీలు మినహాయిస్తే... బిల్లుల చెల్లింపులు, వస్తువుల కొనుగోళ్లు, బకాయిల వసూళ్లు వంటి లావాదేవీలు అన్నీ కూడా ఇక మీదట ఆన్‌లైన్‌లో సాగే రోజులు రావచ్చు. అసలు జేబులో ఒక్క రూపాయి లేకుండా రోజువారీ పనులు సజావుగా సాగిపోయే కాలమూ నిజం కావచ్చు. కానీ ఈ సౌకర్యాన్ని గ్రామీణ భారతం ఎంతవరకూ స్వీకరిస్తుందా అన్నదే అనుమానం! సెల్‌ఫోన్‌ ఆపరేట్ చేయడమే చేతకాని నిరక్షరాస్యులు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వైపుగా ఎంతవరకు మొగ్గుచూపుతారన్నదే సందేహం.   ఏది ఏమైనా నోట్ల రద్దుతో ఆన్‌లైన్ పేమెంట్లకి ఒక నూతన శకం మొదలైందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. దిల్లీలో ఒక టీ కొట్టు యజమాని ఆన్‌లైన్‌ పేమెంటుని అంగీకరించడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రోజుకి 20 లక్షల ఆనలైన్‌ లావాదేవీలు జరిపే పేటీఎమ్ సంస్థ ప్రస్తుతానికి 50 లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహించడం దీనికి పరాకాష్ట కావచ్చు. ఈ ఆన్‌లైన్ వేగం తాత్కాలికం అనుకోవడానికి లేదు. ఎందుకంటే సగటు భారతీయుడిది మధ్యతరగతి మనస్తత్వం. మనం సాంకేతికతకు వీలైనంత దూరంగా ఉంటాం. కానీ ఒక్కసారి అలావాటు పడితే ప్రపంచమంతా మనల్ని చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే! అన్‌లైన్ చెల్లింపులలో పారదర్శకత ఉంటుంది, సమయం వృధా కాదు, లెక్కలకు సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఇకమీదట అవకాశం ఉన్న భారతీయులంతా ఆన్‌లైన్ వైపే మొగ్గు చూపుతారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇదే జరిగితే కొన్నాళ్లకి నగదే లేని సమాజాన్ని చూడవచ్చేమో!

చెల్లని నోట్లతో... ఇక అన్నల ఆటలు చెల్లా?

  మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పెట్రోల్ లో పడ్డ నిప్పు రవ్వలా తయారైంది! పైకి సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్టు , ఏటీఎంల ముందు బారులు తీరుతున్నట్టూ కనిపిస్తుంది కాని ... లోలోన పెద్ద పెద్ద వారు తెగ మథన పడిపోతున్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ మొదలు గల్లీలోని కేడీగాళ్ల దాకా అందరూ పాత నోట్లు తిరిగి అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సమస్య చేతిలో డబ్బులు లేకపోవటమా? పాతవి చెల్లకపోవటమా? రెండోదే అసలు ప్రమాదం అంటూ లోలోపల బిక్క చచ్చిపోతున్నారు చాలా మంది...  500, 1000 నోట్లు చెల్లకపోవటం వల్ల ఎవరెవరు పెద్ద మొత్తంలో నష్టపోతారు? వ్యాపారస్తులు, పొలిటీషన్స్, సెలబ్రిటీస్... ఇలాంటి వారు!కాని, మీరు అస్సలు ఊహించని మరో వర్గం కూడా మోదీపై కుతకుత ఉడికిపోతోంది. నల్లధనం పై పోరు పేరుతో తమ ఆయువుపట్టు మీద కొట్టాడని పిచ్చెక్కిపోతోంది. అదే... భారత మావోయిస్టు పార్టీ!  అవును... నక్సల్స్ కూడా ఇప్పుడు దిక్కుతోచక సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే, వాళ్ల దగ్గర కూడా ఇంత కాలం నుంచీ వున్నది పాత 500, 1000 నోట్లే! కొత్తవి ఎలా వస్తాయి? మావోయిస్టులు తమ ప్రభావిత ప్రాంతాల్లో చేసిన వసూళ్లు దాదాపు 7వేల కోట్లు వున్నాయట. బస్తర్ ప్రాంతంలో వాళ్లు డంప్ చేసి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఇంత పెద్ద మొత్తం ఇప్పుడు బ్యాంకుల్లో వేసుకుంటే తప్ప కొత్త నోట్లు రావు. కాని, అలా చేసేందుకు అదంతా వైట్ మనీ కాదు. పైగా నిషేధిత సంస్థ అయిన మావోయిస్ట్ పార్టీ జనంలోకి వచ్చి క్యూలలో నిలబడి డబ్బులు డిపాజిట్ చేయలేదు. మొత్తంగా చూస్తే అన్నల ఆర్దిక మూలాలకి కన్నం పడ్డట్లే కనిపిస్తోంది! ఈ ఆర్దిక దాడి నుంచి మావోలు ఎలా తప్పించుకుంటారో చూడాలి! మొన్న అంతా సవ్యంగా వున్నప్పుడే భీకరమైన ఎన్ కౌంటర్లో చాలా మంది ప్రముఖ నేతల్ని కోల్పోయింది పార్టీ. ఇప్పుడు ఈ ఆర్దిక ఒత్తిడి ఎర్ర సైన్యానికి ఊపిరాడకుండా చేయవచ్చు.  పోలీసులు మాత్రం మావోల 7వేల కోట్లు ఎట్టి పరిస్థితుల్లో వైట్ కానీయమని గట్టిగా చెబుతున్నారు. మరి అతి త్వరలో మావోయిస్టులు బలహీనంగా వున్న ఈ క్షణంలోనే గవర్నమెంట్ ప్రత్యక్ష దాడులు మొదలు పెడితే? అటు సీమాంతర ఉగ్రవాదులతో జరుగుతున్నట్టే దారుణ రణరంగం ఇంటిలోని తీవ్రవాదులతోనూ జరుగుతుంది. అదే అయితే సాధ్యమైనంత తక్కువ రక్తపాతంతో ధర్మం గెలవాలని కోరుకుందాం....   

పాత వైట్ హౌజ్, కొత్త ట్రంప్, సరికొత్త నిర్ణయాలు!

  పాలిటిక్స్ పాలిటిక్సే! అమెరికా అయినా ఆఫ్రికా అయినా రాజకీయాల్లో కేవలం సిన్సియారిటీ వుంటే సరిపోదు. సంచలనంగా నిలిచే సత్తా వుండాలి. మనం ఏం చేసినా జనం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి చూస్తూ వుండిపోవాలి! అలా మ్యానేజ్ చేసిన వాళ్లే ఇప్పుడు అధికారం చేపడతున్నారు. మ్యాజిక్ చేసేవాళ్లు ఇప్పుడు జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు.  మన దేశంలో ఇప్పుడు జరుగుతోన్న చర్చ దేని గురించి? ఇంకేముంది, నోట్ల రద్దు విషయం గురించే! 500, 1000 నోట్లు మోదీ అనూహ్యంగా నిషేధించారు. దాంతో జనం సమర్థిస్తూ , విమర్శిస్తూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఎవరి వాదనలు వారివి. కాని, ఇక్కడ అంతా గుర్తించాల్సిన విషయం ఒక్కటే! ఎవరికి ఇష్టం వున్నా లేకున్నా మోదీని మాత్రం అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఆయన గురించే మాట్లాడుకోవాల్సి వస్తోంది! మొన్న జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడు కావటంతో అక్కడ కూడా సంచలనాల పరంపర మొదలైంది. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో అక్రమంగా వుంటోన్న వార్ని ఇంటికి పంపిస్తానన్న ట్రంప్ అన్నంత పని చేసేందుకు అప్పుడే ఏర్పాట్లు చేస్తున్నాడట. అయితే , దాని కంటే ముందు అమెరికన్స్ లో ఆశ్చర్యానికి కారణమైన న్యూస్ ట్రంప్ సంవత్సర జీతం! ఇలాంటి వార్తలు మన భారతీయులకు అయితే మామూలేగాని అగ్ర రాజ్యం జనాలకి షాకింగ్ గా వున్నాయట! ఇంతకీ ట్రంప్ తన సంవత్సర జీతం గురించి ఏమన్నాడు?  సాధారణంగా అమెరికన్ ప్రెసిడెంట్ గారి జీతం వన్ ఇయర్ కి కోట్లలో వుంటుంది. అమెరికన్ డాలర్స్ లో చెల్లించే ఈ మొత్తం మన ఇండియన్ రూపీస్ లోకి వస్తే మరింత భారీగా వుంటుంది. ఒక అంచన ప్రకారం 2కోట్లా 60లక్షలు అవుతుందట. కాని, ఇంత మొత్తాన్నీ ట్రంప్ రిజెక్ట్ చేసేశాడు. కేవలం ఒక డాలర్ మాత్రమే జీతం తీసుకుని సంవత్సరమంతా పని చేస్తాడట! ఇలా రూపాయి జీతం, డాలర్ జీతం అనగానే మీకు మన ఎన్జీఆర్ గుర్తొచ్చారు కదా? అప్పట్లో అన్నగారు నెలకు రూపాయి జీతం తీసుకునే వారు. జయలలిత కూడా ఓ సారి నెలకు రూపాయి జీతం కార్యక్రమం నడిపింది! డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మన వాళ్లకంటే మరింత చెలరేపోతూ సంవత్సరం మొత్తానికి ఒకే ఒక్క డాలర్ తీసుకుంటా అంటున్నాడు! అంతే కాదు, మోదీ లాగా ఒక్క హాలీడే కూడా తీసుకోకుండా పని చేస్తానని అమెరికన్స్ కి హామి ఇస్తున్నాడు! ట్రంప్ ఇప్పటి దాకా వైట్ హౌజ్ లో కాలుమోపిన ప్రెసిడెంట్స్ అందరి కంటే భిన్నంగా దూసుకుపోతున్నాడు. అది మంచికో, చెడుకోగాని ప్రస్తుతానికైతే ఒక డాలర్ జీతం న్యూస్ హల్ చల్ చేస్తోంది. ముందు ముందు ఈ 45వ అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాడో... అవ్వి ప్రపంచాన్ని ఎలా కుదిపేస్తాయో? కదిలిస్తాయో? లేక కవ్విస్తాయో! వేచి చూడాలి!

2000 నోటుతో అసలుకే మోసం!

  మోదీవారు పెద్దనోట్లని రద్దుచేసి నాలుగు రోజులు పూర్తవుతోంది. బడాబాబుల సంగతేమో కానీ, సామాన్యులు మాత్రం అల్లల్లాడిపోతున్నారు. నిర్ణయం ఎంత గొప్పదైనా అందులో సన్నద్ధత లేదనీ, యూపీ ఎన్నికలలో విజయం కోసమే తొందరపాటు నిర్ణయం తీసుకున్నారనే ప్రచారమూ జరుగుతోంది. పాత నోట్ల మార్పిడి సంగతేమో కానీ కొత్తగా విడుదల అయిన రెండువేల రూపాయల నోటు కూడా ‘వందల’ కొద్దీ కష్టాలను మిగులుస్తోంది. కొత్తగా ఐదువందల నోట్లు కూడా విడుదల అయినప్పటికీ పని తొందరగా జరిగిపోతుందనో ఏమో బ్యాంకులన్నీ రెండు వేల రూపాయల నోట్లు ఇచ్చేందుకే ఆసక్తి చూపుతున్నాయి. ఫలితం! నిన్నటి వరకూ చెల్లని నోట్లతో తంటాలు పడ్డ జనం ఇప్పుడు చిల్లర రాని నోట్లతో రోడ్ల మీద పడుతున్నారు.   అసలే ఎవరి చేతుల్లోనూ డబ్బులాడని సమయంలో రెండు వేల నోట్ల రూపాయలను ఎవరు తీసుకుంటారు? అన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చినట్లు లేదు. వీలైనంత తొందరగా పాత డబ్బుని మార్పిడి చేసేందుకు విచ్చలవిడిగా రెండువేల నోట్ల రూపాయలని విడుదల చేసేసేంది. కానీ ఇలాంటి పెద్ద నోట్లు విస్తృతంగా చెలామణీ కావడం మొదలుపెడితే మళ్లీ అవినీతికీ, ధరల పెరుగుదలకీ ఊతం ఇచ్చినట్లు అవుతుందన్నది కొందరి ఆరోపణ.   ఇప్పటికే 500, 1000గా ఉన్న ఓటు రేటు త్వరలో జరగబోయే ఎన్నికలలో 2,000కి చేరుకుంటుదని ఇప్పుడే అంచనా వేస్తున్నారు. ఇక నుంచి లంచావతారాల మినిమం ఛార్జీ 2000 కావచ్చునని భయపడుతున్నారు. నల్లధనంగా మార్చుకునేందుకు 2000 అనువుగా ఉంటుందని బడాబాబులు సంబరపడుతున్నారు. ఇక పెద్ద నోట్ల చెలామణీతో ద్రవ్యోల్బణమూ పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే చంద్రబాబు కూడా 2000 నోటు విడుదల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.   ఏదేమైనా విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితెస్తానన్న మోదీ ప్రభుత్వం దేశంలోని నల్లధనం మీదే ఎక్కువ దృష్టి సారించినట్లుంది. ఆ దశలో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయం మొదట్లో ప్రశంసలు కురిపించినా, నిదానంగా విమర్శలకు తావిస్తోంది. ఈసారి మోదీ తన దేశ ప్రజల మీదే సర్జికల్‌ దాడి చేశారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. బడాబాబులను ఇరికించే ప్రయత్నంలో సామాన్యుల పాట్లని ప్రభుత్వం గమనించలేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. కానీ సామాన్యుల నిట్టూర్పులకి విలువేముంటుంది!

టాలీవుడ్‌ చరిత్ర మారిపోనుందా!

    మోదీ అంటే ఒకప్పుడు సినీవర్గాలకు ఓ ఆరాధన. సినీ సెలబ్రెటీలు అందరూ కూడా వీలు కుదిరినప్పుడల్లా మోదీని ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ ఇప్పుడు అదే సినిమా రంగానికి ఓ షాక్‌ ఇచ్చారు మోదీ. నల్లధనాన్ని ఒక్కసారిగా రద్దుచేయడంతో ముఖ్యంగా రెండు రంగాలు నష్టపోతాయని అంచనా వేస్తున్నారు. వాటిలో ఒకటి రియల్ ఎస్టేట్‌ కాగా మరొకటి సిని పరిశ్రమ.   ఒకప్పుడు సినీ పరిశ్రమకు పొలం డబ్బులో, వ్యాపారంలోని లాభాలో పెట్టుబడిగా ఉండేవి. మరికొందరు అంచలంచులుగా ఒకో మెట్టూ ఎక్కతూ నిర్మాత స్థాయిని చేరుకునేవారు. లేదా నటులే నిర్మాతలుగా మారేవారు. శ్రమ విలువ, జీవితం విలువల మీద అవగాహనకి తోడు, కళ మీద అభిరుచి కూడా ఉండటంతో ఇలాంటి నిర్మాతలు తీసిన చిత్రాలు పదికాలాలపాటు నిలిచేవిగా ఉండేవి. వాటిలో ఉన్న విలువల విషయంలో ఏమాత్రం రాజీ పడేవారు కాదు. అందుకే ఆనాటి నిర్మాతలైన బీ.ఎన్.రెడ్డి, రామానాయుడు, అక్కినేని వంటివారి గురించి ఇప్పటికీ చెప్పుకొంటూ ఉంటాం.   ఎప్పుడైతే సినిమా ఒక ఫక్తు వ్యాపారంగా మారిపోయిందో, అప్పటినుంచీ అది దిగజారడం మొదలైందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అక్రమంగా సంపాదించిన ఈజీమనీ, నల్లధనం సినిమాల్లోకి ప్రవహించడం మొదలుకాగానే విలువల వలువలు జారిపోయాయి. ఎలాగొలా రూపాయికి రూపాయి సంపాదించాలనే తపన పెరిగిపోయింది. జూనియర్‌ ఆర్టిస్టుగా పూట గడవనివారు సైతం నల్లధనానికి బినామీలుగా మారి నిర్మాతలైపోయారు. రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు, సారా వ్యాపారస్తులు.... నిర్మాతలుగా చెలామణీ అయ్యేందుకు తహతహలాడిపోయారు. ఫలితంగా లక్షల్లో ఉండాల్సిన వ్యాపారం కాస్తా కోట్లకి ఎగిసిపోయింది. కమెడియన్లకి సైతం లక్షల కొద్దీ పారితోషికాలు ఇచ్చేంత డబ్బు ప్రవహించింది. సినిమా సూపర్‌ హిట్టు అయితే మంచిదే, ఒకవేళ అట్టర్‌ ఫ్లాపై కోట్ల కొద్దీ నష్టం వచ్చినా... మరో పది సినిమాలు తీసేంత ధైర్యం ఈ నిర్మాతలకి ఉండేది. అలాగని ఇప్పటి తరంలో నిజాయితీగా సంపాదించిన డబ్బుతో సినిమా తీసేవారు లేరని చెప్పడం లేదు. కాకపోతే అలాంటివారం సంఖ్య నానాటికీ తగ్గిపోతోందన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని వాస్తవం.   ఇప్పుడు  మోదీ దెబ్బకి కొన్నాళ్లపాటు నల్లధనం కరువైపోతుంది. కనీసం కోట్లు విసిరి సినిమా తీసేంత ధైర్యం బడాబాబులకి ఉండదు. దీంతో మరో పదేళ్ల పాటు టాలీవుడ్‌లో భారీ బడ్జెటు సినిమాలు తీయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించక తప్పదు. ఇలాంటి సమయంలో ప్రతిభ మీద ఆధారపడే చిన్న సినిమాకి మళ్లీ మంచి రోజులు వస్తాయంటున్నారు. నిజాయితీ, అభిరుచి కల్గిన నిర్మాతలు ఆచితూచి నిర్మించే చిత్రాలు కనిపిస్తాయంటున్నారు.

నోట్ల రద్దుతో పాట్లు చిన్నవారికేనా

  తరాల తరబడి నమ్ముకున్న పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుని భద్రంగా దాచుకున్నది ఒకరు. పిల్ల పెళ్లి కోసం ఐదు రూపాయల వడ్డీకి లక్షలు తెచ్చుకున్నది మరొకరు. ఎలాగొలా విదేశాలకు ఎగిరిపోవాలన్న ఆశతో సొమ్ము కూడపెట్టినవారు ఇంకొకరు. ఇప్పడు వీళ్లందరిదీ కక్కలేకా మింగలేకా దిక్కుతోచని పరిస్థితి. పోనీ వారందరి సంగతీ వదిలేద్దాం! ఈ రెండు రోజులూ మిగతా ప్రజలు పడ్డ కష్టం మాటేమిటి. ఏటీఎంల దగ్గరా, బ్యాంకుల వద్దా క్యూలు పల్చబడాలంటే మరో వారం రోజులు పడుతుంది. అప్పటివరకూ సామాన్యుల పరిస్థితి ఏంటి!   పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే! ఆ విషయంలో ఇప్పటికే దేశప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఈ నిర్ణయంతో మోదీ చేతల మంత్రిగా ఒక స్థానం సంపాదించేసుకున్నారు. బడాబాబుల దగ్గర బస్తాలుగా మూలుగుతున్న పెద్ద నోట్లన్నీ ఈ దెబ్బతో చిత్తు కాగితాలుగా మారిపోతాయి. ఆర్థిక ఉగ్రవాదంతో చెలరేగుతున్న పాకిస్థాన్‌కు ఇది శరాఘాతంగా మిగులుతుంది. కానీ నోట్లని రద్దు చేసే ముందు దానికి తగిన సన్నధత ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచించలేదేమో అన్నది ప్రస్తుత ఆరోపణ.   పెట్రోలు బంకుల వద్ద కానీ, రైల్వే స్టేషన్లలో కానీ మోదీ చెప్పిన నోటు చెల్లుబాట్లు జరగనేలేదు. ఇక పాలబూత్‌లూ, గ్యాస్ సిలండర్ల ఏజన్సీల సంగతి సరేసరి! బడాబాబులు నల్ల ధనాన్నంతా విచ్చలవిడిగా బంగారం కిందకి మార్చుకుంటున్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు నోట్ల మార్పిడి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఒకవేళ ఎలాగొలా కష్టపడి నోట్లను మార్చుకున్నా ఎక్కువగా రెండువేల రూపాయల నోట్లే చేతికి రావడంతో, వాటితో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేని పరిస్థితి.   చిన్నవారి పరిస్థితి ఇలా ఉంటే పెద్దవారి పరిస్థితి మరోలా ఉంది. బంగారం కిందకో, బినామీల చేతికో, రుణాలుగానో నల్లధనాన్ని శుభ్రంగా మార్చేసుకుంటున్నారు. పైగా మోదీ ప్రకటన ముందే కొందరు బడాబాబులకి ఈ విషయం తెలిసిపోయిందనీ, వారంతా గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్తపడిపోయారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తగినంత సన్నద్ధత లేకుండానే పెద్దనోట్లని రద్దుచేశారన్న మాట మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. యూపీ ఎన్నికలలో ప్రతిపక్షాలని దెబ్బతీసేందుకు భాజపా ఈ నిర్ణయానికి తొందరపడిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయాలేమీ ఎరుగని నోటు మీద గాంధీతాత చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు.

పవన్‌ సభతో తెదెపాకే లాభం!

  పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సభ పెట్టారు. ఈసారి అనంతపురం వేదికగా సాగిన ఈ సభకి కూడా అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పుడిప్పుడే పవన్‌ సభలకు అలవాటుపడుతున్న మిగతా ప్రజలు ఈసారి పవన్‌ సభ పట్ల అంతగా ఆసక్తి చూపినట్లు లేదు. పైగా వాళ్లిప్పుడు నోట్ల కష్టంలో ఉన్నారు. కానీ పవన్‌ అనంతపురం సభ విశ్లేషకులను మాత్రం విశేషంగానే ఆకర్షించింది. మిగతా సభలతో పోలిస్తే ఈసారి తెదెపా మీద పవన్‌ దూకుడు పెరిగినట్లే కనిపించింది. తెదెపా పాలనలో అవినీతి పెరిగిపోతోందన్న మాట వినిపిస్తోందని, వెనుకబడిన జిల్లాల పట్ల మరింత శ్రద్ధ చూపాలనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనీ... ఇలా అధికార పక్షం మీద సుతిమెత్తటి విమర్శలు ఈసారి చోటు చేసుకున్నాయి.   తాను అనంతపురంలోనే జనసేన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తానని, ఇక్కడి నుంచే తన పోరాటాన్ని ప్రారంభిస్తానని కరతాళ ధ్వనుల మధ్య పవన్‌ పేర్కొన్నారు. కానీ పవన్‌ తన తెదెపా గురించి చేసిన విమర్శల వల్ల ఆ పార్టీకి పెద్దగా నష్టం లేదంటున్నారు విశ్లేషకులు. రోజులు గడుస్తున్న కొద్దీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదన్న విషయం తేలిపోయింది. మరోవైపు రాజధాని నిర్మాణం చాలా మందకొడిగా సాగుతున్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెదెపా పాలన పట్ల ప్రజలలో కాసింత నిరాశ చోటుచేసుకుంటోంది. అసలే రాజధాని విషయంలో గుర్రుగా ఉన్న రాయలసీమలో ఈ పరిస్థితులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. పవన్‌ అనంతపురం పర్యటనతో ఇలాంటి భావాలు సద్దుమణిగిపోక తప్పదు. మీ తరఫున పోరాడటానికి నేనున్నానంటూ పవన్‌ వంటి వ్యక్తి ముందుకు వస్తే అక్కడి ప్రజల్లో అసమ్మతి తగ్గి ఆశలు రేగడం ఖాయం. పవన్‌ తనన ప్రసంగంలో వేర్పాటువాదాలొస్తాయంటూ చేసిన హెచ్చరికలు ఈ వాదానికి బలం చేకూరుస్తున్నాయి.   పవన్‌ నిజంగానే ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపాలనుకుంటే పోరాడేందుకు చాలా సమస్యలు ఉన్నాయి. రాజధాని భూములు, భీమవరం దగ్గర ఆక్వాఫుడ్‌ ప్రాజెక్టు... ఇలా చాలా విషయాలకు సంబంధించి పవన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించి వదిలేశారు. కేవలం ప్రత్యేక హోదా గురించే గట్టిగా మాట్లాడుతున్నారు. దీని వలన ఇప్పుడిప్పుడే ఆంధ్రరాష్ట్రంలో వెంకయ్యనాయుడుగారిని ముందుంచుకుని బలపడదామనుకునే భాజపా పార్టీకి నష్టం కలుగుతోందే కానీ తెదెపాకు కాదు. అందుకేనేమో లోకేష్ బాబు నిన్నటి అనంతపురం సభ గురించి మాట్లాడుతూ ‘పవన్‌ వ్యాఖ్యలను పాజిటివ్‌గానే తీసుకుంటాం’ అంటూ మురిసిపోయారు.

ఇది చెప్పడానికా సభ పెట్టింది..?

కాకినాడ సభ తర్వాత ఇక ఎలాంటి బహిరంగ సభలు పెట్టను అన్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి మళ్లీ అనంతపురం సభకు పిలుపు నిచ్చారు. సినిమాలు వేగంగా కంప్లీట్ చేసి 2019 ఎన్నికల మహా సంగ్రామంలో దూకేందుకు పవన్ సన్నాహాలు చేసుకోబోతున్నారంటూ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం సభ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ఎప్పటిలాగే పవన్ ఈసారి ఏం మాట్లాడతారా.? ఏం నిర్ణయం తీసుకుంటారా అని తండోపతండాలుగా తరలివచ్చిన అభిమానులకు పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను నిజం చేస్తూ 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటిచేస్తున్నట్లు..అది కూడా అనంతపురం నుంచే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.   2019లోపు ఎప్పుడైనా తాను క్రీయాశీలక రాజకీయాల్లోకి రానున్న ప్రకటన పవన్ చేస్తారనుకున్న వారికి ఇది లడ్డూ లాంటి వార్తే. కానీ ఈ వార్త చెప్పడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయాన్ని కాసేపు కదిపి.. దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కొన్ని పంచ్‌లు వేసి జనానికి బోర్ కోడుతుంది అనుకున్న టైంలో ఈ వార్త చెప్పారు. ఈ విషయం చెప్పడానికి దానికి సీమాంధ్ర హక్కుల చైతన్య సభ అని పేరు పెట్టడం దేనికి..హైదరాబాద్ జనసేన కార్యాలయం నుంచో లేదా తన నివాసం నుంచో చిన్న ప్రెస్ మీట్ పెడితే సరిపోయేది. దీని వల్ల ఎన్నో పనులు మానుకుని పవన్ సభకు వచ్చిన వారి టైం వేస్ట్.. సభకు భద్రత కల్పించిన పోలీసుల శ్రమ వృథా... మీటింగ్‌కు స్పాన్సర్ చేసిన వారి డబ్బు దండగ... ఇలా పెదవి విరుస్తున్నారు పవన్ ప్రత్యర్థులు!   

నానో చిప్స్ కాదు... జస్ట్ 'పులిహోర'!

  నానో చిప్ అంటే ఏంటో మీకు తెలుసా? ఆ ఏముంది... నానో కార్ లో కూర్చుని చిప్స్ తినటం అంటారా! అస్సలు కాదు! ఈ మద్య సోషల్ మీడియాలో నానో చిప్ గురించి స్పైసీ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా, మోదీ పెద్ద నోట్లు రద్దు చేశాక ఇంకా బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ నానో చిప్ సంగతేంటంటే... రద్దైన 5వందల నోట్లు స్థానంలో మళ్లీ కొత్తవి రాబోతున్నాయి. అలాగే సరికొత్త టూ థౌజెండ్ నోట్స్ కూడా చెలామణి అవుతాయట! అయితే ఈ రెండు వేల రూపాయల నోట్లలో నానో చిప్స్ వుండబోతున్నాయన్నది ఇప్పుడు అందరికీ పెద్ద ఆసక్తిగా మారిపోయింది! నానో చిప్ అంటే కొత్తగా రానున్న నోట్లలో పెట్టే ఒక చిన్న పరికరం! ఇది కరెన్సీ నోట్లలో వుండటం వల్ల ఆకాశంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలు వెంటనే సదరు నోట్ ఎక్కడ వుందో పసిగ్గట్టేస్తాయట! అంటే సాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్ మన నోట్లలో వుండే నాన్ చిప్ రిసీవ్ చేసుకుని రెస్పాండ్ అవుతుంది. వెంటనే ఆ సిగ్నల్ పసిగట్టిన సాటిలైట్ మనకు ఎన్ని నోట్లు, ఎక్కడ, ఎంత లోతున వున్నాయో చెప్పేస్తుందట! ఒకటి రెండు కాదు ఏకంగా 150మీటర్ల లోతున డబ్బులు పాతేసినా ఇట్టే దొరికిపోతాయట! సూపర్ కదా...  నాన్ చిప్ దెబ్బకి ఇక మీద ఎక్కడ నల్లధనం భారీగా దాచుకునే అవకాశమే వుండదని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు బయలుదేరాయి. కాని, ట్విస్ట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అలాంటి మాట ఇంత వరకూ చెప్పలేదు. నానో చిప్ లాంటిదేదీ కొత్త కరెన్సీ నోట్లలో వుంటుందని ప్రకటించలేదు. ఇన్ ఫ్యాక్ట్, నానో లేదూ పాడూ లేదంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది! సో... నానో చిప్ ఉట్టి గాసిప్పే!   అసలు నానో చిప్ గురించి ఇంకాస్త లోతుగా అధ్యయనం చేస్తే మనకు తెలిసేదేంటంటే దాన్ని రెండు వేల రూపాయల నోటులో అమర్చటం ఖరీదైన వ్యవహారం. ఒక్క నానో చిప్ కరెన్సీ నోట్లో పెట్టాలంటే 50రూపాయలు అవుతుంది! అంటే లక్షల్లో నోట్లు అచ్చేయాలంటే ప్రభుత్వానికి ఆర్దిక భారం తడిసి మోపెడవుతుందన్నమాట! అంతే కాదు, దానికి పవర్ సప్లై కోసం తయారు చేసిన ప్రత్యేక జెనరేటర్ కూడా అమర్చాల్సి వుంటుంది. అప్పుడు దాన్ని నోటు వాడేవారు ముట్టుకున్నప్పుడల్లా ఒత్తిడి ఏర్పడి... శక్తి విడుదలై చిప్ పని చేసేలా చేస్తుంది. కాని, ఇదంతా చాలా టెక్నికల్ విషయం. అంత కష్టపడి వేల కోట్లు ఖర్చు చేసి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు హై  ఎండ్ టెక్నాలజీ నోట్లు తయారు చేస్తుందా? నిస్సందేహంగా కానే కాదు! శ్రీలంకలో హనుమంతుడి గద దొరికింది, దీపావళి రోజు ఇండియాని నాసా ఆకాశంలోంచి ఫోటో తీసింది... ఇవన్నీ ఎలాంటివో... ఈ నానో చిప్ కథ కూడా అలాంటిదే! సోషల్ మీడియాలో ఎవరో టైంపాస్ క్యాండిడేట్స్ వండి వడ్డించిన 'పులిహోర'! దట్సాల్! 

ట్రంప్... అమెరికా వాళ్ల కేసీఆర్!

అమెరికా 250ఏళ్ల ప్రజాస్వామ్య అస్థిత్వం తరువాత కూడా ఒక స్త్రీని అధ్యక్షురాలిగా ఎన్నుకోలేదు!క్లింటన్ కి బదులు కరుడుగట్టిన బిజినెస్ మ్యాన్ ట్రంప్ నే నెత్తిన పెట్టుకుంది! దీనికి కారణం ఏంటి? కొందరు చెబుతున్నట్టుగా పురుషాధిక్యతే కారణమా? అఫ్ కోర్స్, అయ్యి కూడా వుండొచ్చు. కాని, అంతకంటే సీరియస్ పొలిటికల్ కారణం ఒకటి ట్రంప్ ను గెలిపిచిందే! అదే కేసీఆర్ ఫార్ములా!   ట్రంప్ కు , కేసీఆర్ కు ఏంటి సంబంధం అంటారా? ఏ సంబంధమూ లేదు. కాని, వాళ్ల వ్యూహాలు మాత్రం చాలా దగ్గరగా వుంటాయి. అదే పెద్ద లింక్. ఇంతకీ విషయం ఏంటంటే... కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగదోయటానికి ఏం చెప్పేవారు? తెలంగాణని ఆంధ్రవాళ్లు దోచుకుంటున్నారని! ముఖ్యంగా, ఆంద్రా పాలకులపై ఆయన తోచినప్పుడల్లా ఒంటి కాలు మీద లేచేవారు. ట్రంప్ కూడా తన ప్రెసిడెన్షియల్ క్యాంపైన్ లో అదే రూల్ పాటించాడు. అమెరికా అంతటి అగ్రరాజ్యానికి కూడా ట్రంప్ అభద్రత నూరిపోశాడు. ఇండియన్స్ , చైనీస్, సింగపూర్ వాళ్లు, మెక్సికో జనాలు మన అవకాశాలు తన్నుకుపోతున్నారని ఒకటే ఉదరగొట్టాడు. కేసీఆర్ కూడా అచ్చం ఇలాగే చెలరేగిపోయే వారు తమ ఉద్యమ కాలంలో. అలాగే, ఆంధ్రుల పట్ల కేసీఆర్ విపరీత వాఖ్యలు చాలా సందర్భాల్లో పెద్ద రచ్చకి కారణం అయ్యేవి. డొనాల్డ్ ట్రంప్ ముస్లిమ్ ల మీదా , మెక్సికన్ల మీదా చేసిన కామెంట్స్ కూడా అలాగే వుంటాయి. అయిన దానికి, కాని దానికి అన్నిటికి ముస్లిమ్ లే కారణమంటాడు అమెరికా 45వ అధ్యక్షుడు!   కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడింది, ట్రంప్ అమెరికా గురించి మాట్లాడింది అంతా తప్పా? అస్సలు కాదు. వాళ్ల వాదనలో నిజం వుంది. అందుకే, కోట్లాది మంది ప్రత్యక్ష ఎన్నికల్లో వారి వెంట నిలిచారు. కేసీఆర్ కు రాష్ట్రాన్ని, ట్రంప్ కు అమెరికాని అప్పజెప్పారు. కాని, చాలా మందికి కేసీఆర్, ట్రంపుల్లో హర్ట్ చేసే విషయం ఏంటంటే... వాళ్లు ఆరోపణలు చేసే విధానం! పరమ దారుణమైన భాషని ప్రయోగించి తమ ప్రత్యర్థుల్ని, శత్రువుల్ని దెబ్బతీస్తారు ఇద్దరు! అది వాళ్ల వాక్చాతుర్యం అని అభిమానులు అంటే... పొగరని మిగతా వారు అంటుంటారు!   తెలంగాణ జనం తరుఫున మాట్లాడిన కేసీఆర్ అధికారం చేపట్టారు. ట్రంపు కూడా అమెరికన్ల గురించి మాట్లాడి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. వాట్ నెక్ట్స్? కేసీఆర్ ఆంద్రా వాళ్లని వెళ్లగొట్టయే లేదు. హైద్రాబాద్ లో ఎవ్వరి మీదా దాడులు జరగలేదు. పై పెచ్చు ఆంధ్రా జనానికి కేసీఆరే ఇప్పుడు రక్షణగా వుంటానంటున్నారు! ట్రంపుకు కూడా ఇదే మార్గం తప్పక పోవచ్చు!అమెరికాలోని ఇండియన్స్ ని ఉద్యోగాల్లోంచి తీసేసి స్వదేశానికి వెళ్లగొట్టేయటం హిల్లరీపై గెలిచినంత తేలిక కాదు. ఇక ముస్లిమ్స్ ను టార్గెట్ చేసి దాడులు, యుద్దాలు చేస్తూ అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించటం కూడా అంత ఈజీ కాదు. చైనా, రష్యా లాంటి దేశాలు ట్రంప్ ఆధిపత్యాన్ని చూస్తూ ఊరుకోవు. కాబట్టి, అధికారంలోకి వచ్చిన ట్రంప్ మేఘాల మాటుకు చేరుకున్న సూర్యుడిలా వేడి తగ్గించుకోవాల్సిందే! కేసీఆర్ ఈ సూత్రం సీఎం అయిన నాటి నుంచే ఫాలో అవుతున్నారు! 

అమెరికా TRUMPED... హిల్లరీ STUMPED!

  ట్రంప్... ఒకప్పుడు ప్రపంచ మీడియాలో ఈ పేరు కామెడీ! తరువాత ట్రాజెడి! ఇంకా తరువాత హారర్! ఫైనల్ గా ఇప్పుడు ... రియాల్టీ! అసలింతకీ చాలా మంది గెలవడని, గెలువొద్దని చెప్పుకొచ్చిన ట్రంప్ ఎలా ట్రంపింగ్ విక్టరీ సాదించాడు? ఇదో గొప్ప పాఠం... పెద్ద గుణపాఠం! 2014కి ముందు భారతదేశంలో మోదీ చర్చ వుండేది. అసలాయన గుజరాత్ ముఖ్యమంత్రిగానే వుండొద్దని చెప్పే సత్యమంతులు మొదలు ఆయన ప్రధానైతే దేశం వదిలిపోతానని చెప్పుకొనే సాహసవంతుల వరకూ చాలా మంది వుండేవారు. మీడియాకి కూడా యాంటీ మోదీ బ్యాచ్ కి వీలైనంత విలువ ఇచ్చేది. అదే సమయంలో సోషల్ మీడియా అంతకంతకూ మోదీ అనుకూల పూనకంతో ఊగిపోయేది. ఇలా రక్తి కట్టిన 2014ఎన్నికలు చివరకు మోదీ ప్రమాణ స్వీకారంతో ప్రమోదంగా ముగిశాయి. ఈ సారి ఎన్నికల్లో అమెరికాలోనూ అదే జరిగింది! ట్రంప్ పెద్దగా గెలిచే అవకాశాలు వున్న నేత ఏం కాదు. అసలు ఆయన ఫుల్ టైం పొలిటీషనే కాదు. ఏదో తన బిజినెస్ లు తాను చేసుకునే ఫక్తు క్యాపిటలిస్టు. కాని, అమెరికాలోని సో కాల్డ్ అభ్యుదయ వాద మీడియా, మేధావులు, వారికి తోడైన ఆదర్శవాద సామాన్య జనాలు అందరూ కలిసి వైట్ హౌజ్ అప్పగించేశారు. తమకి తాము పెట్టుకుని స్టాండర్డ్స్ తో ట్రంప్ ను పోల్చేసి చులకన చేసి మాట్లాడారు. నిందించారు. వెక్కిరించారు. హేళన చేశారు. అంతిమంగా ట్రంప్ ఏం చెబుతున్నాడో అమెరికన్స్ అంతా జాగ్రత్తగా వినేలా చేశారు! నిజానికి డొనాల్డ్ ట్రంప్ ముస్లిమ్ ల మీద, మెక్సికన్ల మీద చేసిన కామెంట్స్ అత్యంత దారుణమైనవి. ఒక రకంగా జాత్యహంకారం కొట్టొచ్చినట్టు వాటిల్లో ధ్వనించింది. అలాంటి ఒక మత ద్వేషి, ఒక వర్గ ద్వేషి అమెరికా ప్రెసిడెంట్ పదవికి పనికి రాడు. కాని, ఈ విషయం చెప్పటంలోనే అమెరికన్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా తప్పులో కాలేశాయి. ట్రంప్ అరాచకంగా మాట్లడుతున్నాడని చెప్పే తొందర్లో అసలు ఏ పేపరు, ఛానలు అమెరికన్స్ లోని ఉగ్రవాద భయాన్ని గుర్తించలేదు. ట్విన్ టవర్స్ కూలాక అమెరికా ప్రజలు టెర్రరిజాన్ని భూతంలా చూస్తున్నారు. కాని, హిల్లరీ అదేం పెద్ద సమస్య కాదన్నట్టు మాట్లాడుతూ వచ్చింది. కాని ట్రంప్  నేరుగా మూలలు మాట్లాడాడు. ఉగ్రవాదం ఒక మతంలోని కొందరు అతి వాదుల వల్ల ఎక్కువవుతోందనీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు ఫండింగ్ చేస్తున్నాయని సుత్తి లేకుండా చెప్పాడు. ఇదే ఓటింగ్ టైంలో యూఎస్ ను ప్రభావితం చేసింది. ఉద్యోగాల విషయంలో భారత్, చైనా, సింగపూర్లను కూడా టార్గెట్ చేసినా... ట్రంప్ లో ఒక్కటి మాత్రం ఎప్పుడూ మారలేదు. ఇక్కడ మోదీ ఇండియా ఫస్ట్ అన్నట్టే ... ఆయన అమెరికా ఫస్ట్ అన్నాడు! హిల్లరీ లాగా మైనార్టీలు, ఇమ్మిగ్రెంట్స్ అంటూ సమాజాన్ని విడివిడిగా చూడలేదు. మొత్తం అమెరికా అంతా ఒక దేశం. దాని బాగే తన లక్ష్యం అన్నాడు! ఎన్నికల ప్రచారం నడుస్తున్నంత కాలం హిల్లరీ పై ఈమెయిల్స్ కేసు ఆరోపణలు కొనసాగాయి. అది చివరి నిమిషం వరకూ ఆమెను వెంటాడింది. కాని, అంతకంటే ఎక్కువగా ట్రంప్ పై దాడులు జరిగాయి. అతనెప్పుడో చేయి పట్టుకున్నాడనీ, కన్ను కొట్టాడని రోజుకొకరు వచ్చి ఆరోపణలు చేశారు. ఇవన్నీ అతడి పట్ల జనం ఆలోచించే తీరులో మార్పు తెచ్చాయి తప్ప దురభిప్రాయం తీసుకురాలేకపోయాయి. అందుకే, ఒబామా, మిషెల్, హిల్లరీ, బిల్ క్లింటన్, మీడియా, మేధావులు ఇలా ఎందరు ఏకమైనా ట్రంప్ ఒక్కడిని గెలవలేకపోయారు.  మన పత్రికలు, ఛానల్సు తో సహా ప్రపంచ మీడియా ఇప్పటికైనా గుర్తించాల్సింది ఏంటంటే... అది భావిస్తున్నట్టు జనం ఆలోచించటం లేదు. టెర్రరిజమ్ హాజ్ నో రిలీజియన్ అంటే నమ్మటం లేదు. శాంతి ప్రవచనాలు, నైతిక సూత్రాలు చెబుతూ కూర్చుంటే విసిగిపోతున్నారు. దేశం గురించి నిజాయితీగా మాట్లాడనైనా మాట్లాడితే చాలు వాళ్లకు ఓట్లు వేస్తున్నారు. ఇక అలా గెలిచిన మోదీలు, ట్రంప్ లు నిజంగా జానానికి మంచి చేస్తే... అంతకంటే కావాల్సింది, కోరుకునేది ఏమంటుంది? 

పోపుల డబ్బాపై సర్జికల్ స్ట్రైక్!

మోదీ పాత 500, 1000 నోట్లు ఎందుకు రద్దు చేశారు? నల్లధనం అరికట్టడానికి! కాని, ఆయన ఎంత మాత్రం ఊహించని చోట్ల లోంచి నల్లధనం బయటకొస్తుందంటున్నారు హ్యాపీ హజ్బెండ్స్! అదేంటి, హజ్బెండ్స్ కి, బ్లాక్ మనీకి ఏంటి సంబంధం అంటారా? వుంది! అంతే కాదు, దేశ వ్యాప్త బ్లాక్ మనీ పై యుద్ధానికి వంటిళ్లలోని పోపుల డబ్బాలకి కూడా లింక్ వుంది! ఆ ఫన్నీ మ్యాటర్ ఏంటో చూద్దాం రండి... ఉద్యోగాలు చేసే ఆడవాళ్ల సంగతేమోగాని ఇంటి పట్టునుండే గృహలక్ష్ములు తమ లక్ష్మీదేవిని ఎక్కడ దాచిపెడతారు? అదేనండీ డబ్బులు ఎక్కడ వుంచుతారు? పోపుల పెట్టెలో. అక్కడ వుంటే భర్తకి అస్సలు తెలిసే ఛాన్స్ వుండదు. అందుకే, ధైర్యంగా అక్కడ దాచేస్తుంటారు హౌజ్ వైవ్స్. అయితే, అవ్వి వాళ్లు అవసరం వచ్చినప్పుడు కుటుంబానికే వాడుతుంటారనుకోండి.... అది వేరే విషయం. కాని, మొత్తానికి ఈ పోపుల పెట్టెలోని డబ్బు మాత్రం ఒక విధంగా ఆ ఇంటిలోని బ్లాక్ మనీనే!. ప్రతీ ఇంట్లో పోపుల పెట్టెలో పోగైన నల్లదనం ఇప్పుడు మోదీ 500, 1000నోట్ల నిషేధం నిర్ణయంతో బయటకొస్తోందట! ఇంత కాలం హజ్బెండ్స్ కి తెలియకుండా వుంచిన డబ్బంతా వాళ్లకు అప్పగించేస్తున్నారట భార్యలు. తీసుకెళ్లి బ్యాంకుల్లో వేయమని అర్ధించటమో, ఆర్డర్ వేయటమో చేస్తున్నారట! ఈ పరిణామంతో మొగుడ్స్ కూడా పెళ్లామ్స్ సీక్రెట్స్ బయటపడ్డందుకు ఫుల్ ఖుష్ అవుతున్నారు! మోదీ నల్లధనంపై పోరు అంటే... బిజినెస్ మెన్, పొలిటీషన్స్, పాకిస్తాన్, ఫేక్ కరెన్సీ... ఇవన్నీ ఆలోచించి వుంటారు కాని... కిచెన్ లో పోపు డబ్బాని అస్సలు ఊహించి ఉండరు!  

నిజమైతే బావుండనిపించే గాసిప్... నానో చిప్!

  నానో చిప్ అంటే ఏంటో మీకు తెలుసా? ఆ ఏముంది... నానో కార్ లో కూర్చుని చిప్స్ తినటం అంటారా! అస్సలు కాదు! ఈ మద్య సోషల్ మీడియాలో నానో చిప్ గురించి స్పైసీ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా, మోదీ పెద్ద నోట్లు రద్దు చేశాక ఇంకా బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ నానో చిప్ సంగతేంటంటే... రద్దైన 5వందల నోట్లు స్థానంలో మళ్లీ కొత్తవి రాబోతున్నాయి. ఎప్పుడో తెలియదు కాని... ఇదైతే గాసిప్ కాదు. కాని, గాసిప్ ఏంటంటే... కొత్తగా రాబోతోన్న ఫై హండ్రెడ్ నోట్స్, అలాగే సరికొత్త టూ థౌజెండ్ నోట్స్ ... వీటిల్లో నానో చిప్స్ వుండబోతున్నాయట! నానో చిప్ అంటే కొత్తగా రానున్న నోట్లలో పెట్టే ఒక చిన్న పరికరం! ఇది కరెన్సీ నోట్లలో వుండటం వల్ల ఆకాశంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలు వెంటనే సదరు నోట్ ఎక్కడ వుందో పసిగ్గట్టేస్తాయట! అంటే సాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్ మన నోట్లలో వుండే నాన్ చిప్ రిసీవ్ చేసుకుని రెస్పాండ్ అవుతుంది. వెంటనే ఆ సిగ్నల్ పసిగట్టిన సాటిలైట్ మనకు ఎన్ని నోట్లు, ఎక్కడ, ఎంత లోతున వున్నాయో చెప్పేస్తుందట! సూపర్ కదా...  నాన్ చిప్ దెబ్బకి ఇక మీద ఎక్కడ నల్లధనం భారీగా దాచుకునే అవకాశమే వుండదని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు బయలుదేరాయి. కాని, ట్విస్ట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అలాంటి మాట ఇంత వరకూ చెప్పలేదు. నానో చిప్ లాంటిదేదీ కొత్త కరెన్సీ నోట్ల వుంటుందని ప్రకటించలేదు. సో... నానో చిప్ ఉట్టి గాసిప్పే అనుకోవాలి ప్రస్తుతానికి. చూడాలి మరి... పాక్ దాడి చేసినా, నోట్లు రద్దు చేసినా అనూహ్యంగా చేసే మోదీ... ఈ నానో చిప్ సంగతి కూడా అవసరం అనుకున్నప్పుడు బయటపెడతారో... లేక ఇదంతా కేవలం టైం పాస్ క్యాండిడేట్ల క్రియేటివిటినో... కాలం తేల్చాలి!  

బ్లాక్ మనీ నోట్లతో... డిసెంబర్ చలి మంటలేసుకోవాల్సిందే!

మోదీ నిర్ణయం నిన్న విన్న వారందరికీ షాకిచ్చింది. కాని, ఇవాళ్ల మెల్లమెల్లగా ఎఫెక్ట్ ఏంటో అవగాహనకు వస్తోంది. 500, 1000 నోట్లు రద్దు చేస్తే జరిగేదేంటి? 100 నోట్ల కోసం సామాన్య జనం ఇబ్బంది పడాల్సి వస్తుంది! ఇంతే అనుకున్నారు అంతా... కాని, మ్యాటర్ అంత కంటే చాలా ఎక్కువే వుంది... మోదీ ఒక్క మాటతో డమ్మీ అయిపోయిన పెద్ద నోట్ల విలువ ఎంతో తెలుసా? 15లక్షల కోట్లు! చెలామణిలో వున్న నోట్ల సాధారణ విలువ 2320 కోట్లు. కాని, అమెరికన్ డాలర్ తో మన మారకం విలువ పెరుగుతూ, తరుగుతూ వుంటుంది కాబట్టి మార్కెట్ విలువ 15లక్షల కోట్లు అవుతుంది. ఇంత పెద్ద అమౌంట్ ఇప్పుడు లిట్మస్ పరీక్ష ఎదుర్కోబోతోంది. డిసెంబర్ దాటుకుని కొత్త సంవత్సరంలోకి వెళ్లేలోపు ఈ భారీ మొత్తం అటు ఇటో తేలిపోనుంది! 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంతో ఇప్పుడు అవ్వి వున్న వారంతా బ్యాంక్ లకు పరుగులు తీయాలి. అంటే దాచుకున్నదంతా లీగల్ చేసుకోవాలన్నమాట. అదీ ఆధార్ లాంటి గుర్తింపు కార్డు చూపి మరీ బ్యాంక్ లో వేసుకోవాలి. ఇక్కడే బ్లాక్ డాగ్స్ అడ్డంగా దొరికిపోయేది. ఇంత కాలం పరుపుల కింద, బీరువాల్లో, ఓవర్ హెడ్ ట్యాంకుల్లో దాచుకున్నదంతా బ్యాంక్ లకు తీసుకువెళ్లలేరు. అలాగని డిసెంబర్ దాటితే వాటికి చిత్తు కాగితలంత విలువ కూడా వుండదు. ఇదే మోదీ నిర్ణయంలోని అసలు మతలబు. పొగబెట్టి కలుగుల్లోని ఎలుకల్ని బయటకి లాగటమే లక్ష్యం. 15లక్షల కోట్లలో ఎంత వరకూ లీగలైజ్ అవుతుందో డిసెంబర్ తరువాత గాని తెలియదు. కాని, అంతలోపు మాత్రం పెద్ద దెబ్బ పడే శాల్తీలు బ్లాక్ మనీ డాన్స్ , దేశ ద్రోహ అంతర్గత ఉగ్రవాదులు, ఎన్జీవోల ముసుగులో దందాలు చేసే వారు... వీళ్లంతా! మొత్తానికి మోదీ పెద్ద నోట్ల రద్దు నీర్ణయం... సామాన్యులకి కాదుగాని... చాలా మంది దొంగలకి, దొరలకి డిసెంబర్ చలి లేకుండా చేయనుంది! వేడి పుట్టించి ఒళ్లు కందిపోయేలా చేస్తుంది!

గాలి వారి మ్యారేజ్ మెనూ... 1000 రకాలు! 100 కోట్లు!

  గాలి వారి పెళ్లి! కొన్ని రోజుల క్రితం ఈ వార్త పెనుగాలిలా దుమారం రేపింది! మళ్లీ అంత త్వరగానే సద్దుమణిగింది. చాలా మంది గాలి జనార్దన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో వుండి రావటం, ఇప్పటికీ సీరియస్ కేసులు ఎదుర్కుంటూ వుండటం, అయినా భారీగా కూతురు పెళ్లికి సిద్ధపడటం అనేది జీర్ణించుకోలేకపోయారు. నెగటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చానల్స్ కూడా ప్రైమ్ టైంలో గాలి వారి పెళ్లిని ఆన్ ఎయిర్ డిస్కషన్ గా మర్చేశాయి! అయితే, ఇప్పుడు మరోసారి గాలి కుమార్తె వివాహం గురించి ఓ వార్త బయటకొచ్చింది! పెళ్లి అన్నాక తాళి, తలంబ్రాలు ఎంత ముఖ్యమో మన వాళ్లకు తిండీ అంతే ముఖ్యం కదా? జనార్దన్ రెడ్డి తన రేంజ్ కు తగ్గట్టుగా జనానికి తినిపించి పంపే ఏర్పాట్లు చేస్తున్నారట. వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఆయన కూతురు పెళ్లిలో ఆహార్యాలకు ఇచ్చినంత ప్రాధాన్యం ఆహారాలకు కూడా ఇస్తున్నారట! వస్తోంది మరి మామూలు వారు కాదు కదా! బెంగుళూరు పొలిటీషన్స్ , అక్కడి కన్నడ సినిమా వాళ్లు మన తెలుగు రాజకీయ, సినిమా ప్రముఖులు... ఇలా అందరికందరూ పోలోమంటున్నారు! అసలు బాలీవుడ్ నుంచి సాండల్ వుడ్ దాకా ఎన్ని సినిమా రంగాల ఎందరు సెలబ్రిటీలు వస్తారో ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. వాళ్ల కాకుండా రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల వాళ్లు కూడా ఎలాగూ వుంటారు! సామాన్యుల పెళ్లికి మొత్తంగా వచ్చే జనం కన్నా జనార్డన్ రెడ్డి ఇంటి పెళ్లికి వచ్చే సెలబ్రిటీలే ఎక్కువగా వుండే ఛాన్స్ వుండటతో బోజనాల సంగతి కూడా ప్రత్యేకంగా పట్టించుకుంటున్నారట. మొత్తం ఎన్ని ఐటెమ్స్ టేబుల్స్ పై వుంటాయో తెలుసా? వెయ్యి! అవును, వెయ్యి రకాల ఆహారాలు ఆవురావురుమనిపిస్తాయట! అవ్వి కేవలం కర్ణాటక స్పెషల్ వంటకాలు మాత్రమే కాదు. మొత్తం దేశంలోని అన్ని ఫేమస్ ఫుడ్ ఐటెమ్స్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహంలో దర్శనమిస్తాయి. అంతే కాదు, ప్రపంచంలోని బాగా ఫేమస్ రెసిపీస్ కూడా మనోళ్ల పెళ్లిలో పొగలుగక్కుతాయట! ఇంతకీ, ఈ క్యాటరింగ్ మొత్తానికి ఎంత ఖర్చవుతోందనుకుంటున్నారు? వంద కోట్లట!  ఒక్క పెళ్లికి మరీ ఇంత ఖర్చు చేసి వండించటం అవసరమా అని మీకు డౌట్ రావొచ్చు. కాని, ఇందులో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే, కర్ణాటక మాజీ మంత్రి అయిన గాలి జనార్దన్ రెడ్డి ఆ రాష్ట్ర యావత్ ప్రజానీకానికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు! నవంబర్ 16న ఆయన కూతురు పెళ్లికి జనం ఎవ్వరైనా వెళ్లి భోజనం చేసి రావొచ్చు! మరి అటువంటప్పుడు వంద కోట్లు ఖర్చు అవ్వవంటరా? అయితే, ఇందులో మరో లాభం కూడా వుంది. ఇప్పుడు గాలి వారి ఇంటి రుచికరమైన భోజనం తిన్న జనం భవిష్యత్ లో ఎప్పుడైనా అది గుర్తొచ్చి ఓట్లు వేయోచ్చు. మరోసారి ఆయన్ని మంత్రిని కూడా చేయోచ్చు! కాదంటారా?    

అరేబియాని గడగడలాడిస్తున్న ఆరుగురు పిల్లల తల్లి!

ఆమె రెండు సార్లు విడాకులు తీసుకుంది. మొత్తం ఆరుగురు పిల్లలు. వయస్సు 42ఏళ్లు. ట్విట్టర్ లో చాలా సూటిగా, సంచలనాత్మకంగా స్టోస్ల్ లు పెడుతుంది. స్త్రీల హక్కుల గురించి దైర్యంగా మాట్లాడుతుంది. ఆమె ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న ఉద్యమకారిణి! అయితే, ఇదంతా పెద్ద విశేషంలా అనిపించటం లేదు కదా? ఎందుకంటే, ఇలాంటి పనులు చేసే చైతన్యవంతులైన మహిళలు బోలెడు మంది వుంటుంటారు. కాని, మనం ఇంత దాకా చెప్పుకున్న స్త్రీ ఏ దేశంలో పుట్టి, పెరిగి, తన ఉద్యమం సాగిస్తోందో తెలుసా? సౌదీ అరేబియా! సౌదీ అరేబియాలో స్త్రీల హక్కుల కోసం ఉద్యమం... ఇప్పుడు మొత్తానికి మొత్తంగా కాంటెక్ట్సే మారిపోయింది కదా? ప్రపంచ ఇస్లాం మతానికి కేంద్రమైన సౌదీలో మహిళల స్వేచ్ఛ అందరికీ తెలిసిందే. కరుడుగట్టిన మత ఛాందసం అక్కడి రాచరిక వ్యవస్థలో అంతర్భాగం. కనీసం స్వంతంగా కార్ నడపటం కూడా అక్కడి ఆడవాళ్లకు నిషిద్ధం. అటువంటి దేశంలో ఒకామె ఆడవారి గురించి గొంతు ఎత్తుతోంది. ఏకంగా ట్విట్టర్ లో కామెంట్లు చేస్తూ ఆ దేశ మత పెద్దల్నే టార్గెట్ చే్స్తోంది. ఆమె పేరు... సవద్ అల్ షమ్మరి! 42ఏళ్ల వయస్సులో రెండు సార్లు విడాకులు తీసుకుని ఆరుగురు పిల్లల్ని పెంచుతోన్న షమ్మరి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె చాలా మంది పేద సౌదీ అమ్మాయిల్లాగే చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంది. తన కంటే చాలా పెద్దవాడైన ఆ మొదటి భర్తతో ఒక పాప పుట్టగానే విడాకులు తీసుకుంది. కాని, తరువాత తనకు డైవోర్స్ ఇప్పించిన జడ్జీనే వివాహమాడింది. అతనితో 5గురు పిల్లలు పుట్టారు. అయితే, మొదటి భర్త షమ్మరి పై కోర్టుకు వెళ్లి తన కారణంగా పుట్టిన ఆమె కూతుర్ని తీసేసుకున్నాడు. షమ్మరి తన పెద్ద కూతురు తనతో వుండాలని ఎంతో పోరాటం చేసింది. కాని, సౌదీ అరేబియాలోని మత కోర్లులు ఆమె మాట పట్టించుకోలేదు. కూతురు సవతి తండ్రి వున్న ఇంట్లో వుండటానికి వీలు లేదని... స్వంత తండ్రితోనే వుండాలని తీర్పునిచ్చాయి. అలా తన మొదటి సంతానాన్ని మొదటి భర్తకు వదులుకోవాల్సి వచ్చింది, షమ్మరి.  ఒక సారి తన కూతుర్ని భర్తకు కో్ల్పోయాక సౌదీలోని స్త్రీల ఇబ్బందులపై మాట్లాడాల్సిన అవసరం గుర్తించింది అల్ షమ్మరి. ట్విట్టర్ లో యాక్టివ్ గా మారిపోయింది. అంతే కాదు ఒక ఆన్ లైన్ గ్రూప్ ఏర్పాటు చేసి అరబ్ మహిళల కష్టాలు, కన్నీళ్ల గురించి ప్రచారం, చర్చ చేస్తోంది! అంతే కాదు, తాను పెళ్లి చేసుకున్న రెండో భర్తకు కూడా ఆమె ఇప్పుడు విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం తన రెండో వివాహం వల్ల కలిగిన 5గురు పిల్లలతో పాటూ మొదటి భర్త తీసుకు వెళ్లిన మొట్ట మొదటి సంతానాన్ని కూడా వెనక్కి తెచ్చుకుని ఆరుగురితో జీవిస్తోంది. షమ్మరి తన ఫస్ట్ హజ్బెండ్ జబ్బు పడటంతో అతడి వద్ద వున్న బిడ్డని కోర్టు ఆర్డర్ ద్వారా వెనక్కి తెచ్చుకుంది.  సౌదీ లాంటి మత ఛాందసవాద రాచరిక వ్యవస్థలో షమ్మరి సింగిల్ మదర్ గా వుండటమే చాలా పెద్ద సక్సెస్. కాని, ఆమె అక్కడితో ఆగకుండా తన దేశంలోని అరాచాకాలపై ఆన్ లైన్ యుద్ధం చే్స్తోంది. రీసెంట్ గా ఆమె గడ్డాలు పెంచుకున్న వివిధ మతస్థుల ఫోటోలు పోస్ట్ చేసింది ట్విట్టర్ లో! అందులో మన సిక్కు మొదలు కమ్యూనిస్టుల వరకూ అందరూ వున్నారు. అయితే, ఇందులో విశేషం ఏంటంటే షమ్మరి ఆ గడ్డాలున్న వ్యక్తులందర్నీ చూపిస్తూ... కేవలం గడ్డాలు పెంచుకుంటే మత పెద్దలు, పవిత్ర ముస్లిమ్ లు అయిపోరని చురకలంటించింది! ఇలా నేరుగా సౌదీలోని అత్యంత శక్తివంతులైన మత పెద్దల్ని టార్గెట్ చేయటం... ప్రాణాలకి తెగించటమే! అల్ షమ్మరి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ కి గానూ మూడు నెలలు జైలు శిక్ష అనుభవించింది. జనాన్ని రెచ్చగొట్టడం అనే అభియోగం ఆమెపై మోపారు. అయినా ఆమె తన ఉద్యమం ఆపలేదు. జైల్లో కూడా స్త్రీలకి ప్రోత్సాహానిస్తూ గడిపింది. ఓ బుక్ కూడా రాసింది. ఎందుకంటే నేను మనిషిని అన్న ఆ పుస్తకం సౌదీలో బ్యాన్ కూడా చేసేశారు! అసలు ఆమె ఏ విధంగా ప్రభుత్వ పెద్దల్ని బెంబేలెత్తిస్తోంది ఈ బ్యాన్ తోనే అర్థమైపోతుంది! షమ్మరి ఆడవాళ్లు కార్ నడపొచ్చని, అందంగా అలంకరించుకోవచ్చని, సంగీతం వినొచ్చని... తన వద్దకు వచ్చే మహిళలకు సూచిస్తుంది. ఇవన్నీ సౌదీలోని షరియా చట్టానికి వ్యతిరేకం. మరి ఇలా తమకు వ్యతిరేకంగా పోరాడుతోన్న ఉద్యమకారిణి అరేబియా ఎంత కాలం భరిస్తుందో చూడాలి? అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా మరణ శిక్షలు చాలా సులువుగా వేసేస్తుంటారు. అందుకే, షమ్మరి ప్రాణానికి అనుక్షణం గండమే వుంది ఇప్పుడు. కాని, ఆమె వెంట మొత్తం ప్రపంచం నిలవాలని మనమూ కోరుకుందాం. ఆఫ్ట్రాల్ ఎక్కడైనా స్త్రీలకు స్వేచ్ఛా, సమానత్వం దక్కటం ప్రపంచ శాంతికి చాలా కీలకం. అందుకైనా ఈ అరేబియా ధీర నారికి అందరూ అండగా నిలవాలి!  

ఆడాళ్లందరికీ... శబరిమలకు స్వాగతం! 

కార్తీకం వస్తే ఎక్కడ చూసినా నల్ల బట్టలతో అయ్యప్ప స్వాములు కనిపిస్తుంటారు! అయితే, చాలా వరకూ ఈ అయ్యప్ప మాల వేసుకున్న వారు మగవారే. 10ఏళ్ల కంటే చిన్న పిల్లలు, 50ఏళ్ల కంటే పెద్దవారు మాత్రమే ఆడవారు కనిపిస్తారు. యవ్వనంలో వున్న మహిళలెవరూ అయ్యప్ప దీక్ష చేయరు. ఇది నియమం. కాని, అతి త్వరలో మొత్తం పరిస్థితి అంతా మారిపోనుందా? సుప్రీమ్ కోర్టు , కేరళ ప్రభుత్వం వాలకం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది! సుప్రీమ్ కోర్టులో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలని అనుమతించాలన్న పిటీషన్ పై విచారణ నడుస్తోంది. ప్రస్తుతం అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అన్న కారణం చేత ఋతు స్రావం జరిగే మహిళల్ని కొండపైకి అనుమతించరు. ఇది శతాబ్దాలుగా అమలు అవుతూ వస్తోన్న ఆచారం. దీనికి  శాస్త్రీయత అంటూ ఏమీ లేకపోయినా తరతరాలుగా వస్తోన్న ఒక విశ్వాసం మాత్రమే ఆధారం. కాని, దాన్ని ప్రశ్నించే వ్యక్తులు చాలా రోజులుగా వుంటూనే వున్నారు. కేరళలోని ఇతర శాస్తా ఆలయాల్లో ఆడవార్ని మామూలుగానే అనుమతిస్తారు. ఒక్క శబరిమల మీద మాత్రమే నెలసరి వచ్చే స్త్రీలని అనుమతించరు. ఇది ఆడవారి సమానత్వానికి, గౌరవానికి భంగమే అంటూ కొందరు కోర్టుకెక్కారు. ఇప్పుడు శబరిమల ఆలయం ఆచారం కాస్తా కోర్టు నిర్ణయంపై ఆధారపడి వుంది! కోర్టు అటు అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించే దేవస్థానం బోర్డును, ఇటు కేరళ ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. అందుకు, కేరళలోని ఒకప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం స్త్రీలు ఆలయంలో ప్రవేశించవచ్చని సమాధానం ఇచ్చింది. కాని, తరువాత వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని సర్కార్ కుదరదని చెప్పింది. ముందు గవర్నమెంట్ ఇచ్చిన అఫీడవిట్ లో అచ్చు తప్పు పడిందని కూడా చెప్పింది! తమ అభిప్రాయం ప్రకారం అన్ని వయస్సుల ఆడవాళ్లు ఆలయంలో ప్రవేశించకూడదని కోర్టుకు చెప్పింది. అయితే, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి లెప్ట్ ప్రభుత్వం రావటంతో కథ మొదటికి వచ్చింది. అన్ని వయస్సుల్లోని మహిళలు కొండపైకి రావచ్చని గవర్నమెంట్ అంటోంది! ఒక హిందూ దేవాలయంలోకి స్త్రీలని అనుమతించకపోవటం సామాజికంగా తప్పే కావచ్చు. మహారాష్ట్రలోని శని సిగ్నాపూర్ మూల విగ్రహం వద్దకి ఆడవార్ని అనుమతించకపోవటం కూడా ఇలానే వివాదాస్పదం అయింది. ఉద్యమకారులు రంగంలోకి దిగి భారీగా పోరాటం చేశారు. అయితే, అక్కడ ఎట్టకేలకు మహిళలకు అనుమతి లభించింది. కాని, ఇప్పటికిప్పుడు శని సిగ్నాపూర్ లో ప్రధాన మూర్తి దగ్గరికి ఎంత మంది స్త్రీలు వెళుతున్నారు? లాజిక్ తో సంబంధం లేకుండా విశ్వాసంపై ఆధారపడ్డ ఆచారాలు అంత త్వరగా పోయేవి కావు. అనుమతి వున్నా లేకున్నా జనం నమ్మకంతో ఒక ఆచారం పాటిస్తున్నప్పుడు పాటిస్తూనే వుంటారు. పైగా సతీ, బాల్య వివాహాల వంటి వాటిల్లో వున్నట్లు ప్రత్యక్ష హాని కూడా లేనప్పుడు అంత త్వరగా సామాన్య జనం అభిప్రాయం మార్చుకోకపోవచ్చు. అది గుడి అయినా, దర్గా అయినా కోర్టు ఒప్పుకుంది కాబట్టి ఆడవారు విశ్వాసాల్ని పటాపంచలు చేసుకుని వెళ్లిపోరు. చాలా కాలం పట్టవచ్చు.  శబరిమల అనుమతి విషయంలో కూడా కోర్టు, కేరళ ప్రభుత్వం, దేవస్థానం బోర్టు... వీటి అభిప్రాయం ఏమంత ప్రధానం కాదు. ఎందుకంటే, కేరళలో ప్రతీ అయిదేళ్లకోసారి మారే ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చినట్లు అభిప్రాయలు మార్చుకుంటున్నాయి. ఇది ఒక విధంగా హిందూ సమాజం మనోభావాలతో ఆటలాడుకోవటమే. అయితే అభ్యుదయ పంథాకో, లేదంటే సంప్రదాయవాదానికో కట్టుబడాలి. కాని, కేరళలో కాంగ్రెస్ ఆచారం ముఖ్యం అంటే కమ్యూనిస్టులు సమానత్వమే గొప్ప అంటున్నారు. అందుకోసం స్త్రీలు అయ్యప్ప ఆలయంలో ప్రవేశించాలంటున్నారు. ఇదంతా రాజకీయ కోణం. ఫైనల్ గా సుప్రీమ్ కోర్టు చెప్పేదే అందరికీ శిరోధార్యం అవుతుంది. అప్పుడు కూడా కేవలం న్యాయస్థానం చెప్పింది కాబట్టి తరతరాల విశ్వాసాల్ని పక్కన పెట్టి ఎంత మంది స్త్రీలు కొండ మీదకి వస్తారనేది పెద్ద ప్రశ్న! దాని కంటే ముందు తేలాల్సిన ఇంకో విషయం, అసలు కోర్టులు మత సంబంధమైన విషయంలో ఎంత వరకూ జోక్యం చేసుకోవచ్చు? చేసుకుంటే అన్ని మతాల్లోని అసమానత్వాల్ని కోర్టులు రూపుమాపుతాయా? అదెంత వరకూ సాధ్యం? ఇలా బోలెడు ప్రశ్నలు! సమాధానం కాలమే చెప్పాలి...   

గెలిచి ఓడనున్న హిల్లరీ... ఓడి గెలవనున్న ట్రంప్? 

  అమెరికన్ ఎలక్షన్స్ డెడ్ లైన్ దగ్గరపడిపోతోంది. నవంబర్ 8త్ జడ్జిమెంట్ డే వచ్చేస్తోంది. అందుకు తగ్గట్టే యూఎస్ లో డ్రామా కూడా హైలెవల్లో నడుస్తోంది! క్లైమాక్స్ ఫైట్ భలే రక్తి కడుతోంది! ఈ సారి ఎన్నికల్లో మొదట్నుంచీ సెన్సేషన్ గా నిలుస్తోన్న ట్రంప్ చివర్లో కూడా తన తడాఖా చూపిస్తున్నాడు. అసలు ఒక దశలో పార్టీలోనే గెలిచి బయటకు రాలేడని భావించిన మన బిజినెస్ మ్యాన్ ఇప్పుడు వాషింగ్ టన్ రేస్ లో వైట్ హౌజ్ దగ్గరి దాకా వచ్చేశాడు. కేవలం తనకు మనీ పవర్ అండ్ మౌత్ పవర్ దాకా బండి ఇక్కడి దాకా లాక్కొచ్చాడు. ఫైనల్ స్టేజ్ లో కూడా ట్రంప్ అదే చేసేస్తున్నాడు. పొలిటికల్ తనకంటే ఎంతో ఎక్స్ పీరియన్స్ వున్న హిల్లరీని ఆయన తెలివిగా కన్నా దూకుడుగా ఎదుర్కొంటున్నాడు. పదే పదే కామన్ అమెరికన్స్ కనెక్ట్ అయ్యే విషయాలు చర్చిస్తున్నాడు. అందుకోసం భారత్, చైనా, సింగపూర్, మెక్సికో లాంటి ఇతర దేశాల పేర్లు కూడా యథేచ్చగా వాడుకుంటున్నాడు! ట్రంప్ క్యాంపైన్ హైలైట్ అవ్వటానికి ప్రధాన కారణం ఆయన తీసుకున్న కాంట్రవర్సియల్ స్టాండే! ముస్లిమ్ ల మీదా, మెక్సికన్ల మీద అతని ప్రకటనలు రచ్చ రచ్చ అయిపోయాయి. అయితే ఆ తరువాత అంత ఎక్కువగా ట్రంప్ టార్గెట్ చేసింది ఇండియన్స్ , చైనీస్ జనాల్నే. వాళ్లొచ్చి మన ఉద్యోగాలు దొంగలించేస్తున్నారని అమెరికన్స్ ను నమ్మించాడు. అందులో నిజం కూడా లేకపోలేదు. కాని, ట్రంప్ విజయవంతంగా భూతద్దంలో పెట్టి చూపాడు. ఎలక్షన్ క్యాంపైన్ చివరి దశలో కూడా డోనాల్డ్ అదే పని చేశాడు...  అమెరికన్స్ కు రావాల్సిన ఉద్యోగాలు ఇండియన్, చైనీస్ కంపెనీలు తన్నుకుపోతున్నాయని ట్రంప్ తన చివరి సభలో కూడా నొక్కి చెప్పాడు. ఆ మధ్య మోదీ ఫ్యాన్ అని, హిందువుల స్నేహితుడినని తెగ మునగ చెట్టు ఎక్కించిన ఆయన లాస్ట్ స్పీచ్ లో మాత్రం అమెరికన్స్ ఉద్యోగాలు ఇండియన్స్ వల్ల పోతున్నాయని గట్టిగా చెప్పాడు. చైనీస్, సింగపూర్, మెక్సికన్ కంపెనీల్ని కూడా ట్రంప్ టార్గెట్ చేశాడు. కాకపోతే, ట్రంప్ చేస్తోన్న ఈ ఉద్యోగాల దొంగతనం ఆరోపణ ఎంత వరకూ ఓట్ల రూపంలో కలిసొస్తుందో రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది...  ఇప్పటికీ గెలిచే ఛాన్స్ కాస్త ఎక్కువగా వున్న హిల్లరీ చివరి నిమిషంలో హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. ఆమెపై వున్న అక్రమ ఈమెయిల్ సర్వర్ వివాదం సుఖాంతమైంది.ఎఫ్ బీఐ హిల్లరీపై ఓపెన్ చేసిన దర్యాప్తు ఆమెను నిర్ధోషిగా తేల్చింది. హిల్లరీ పంపిన 6లక్షలకు పైగా ఈమెల్స్ ఏవీ తప్పుడు మెయిల్స్ కావని తేల్చేశారు అధికారులు! ఇంత త్వరగా అన్ని మెయిల్స్ ఎలా వెరిఫై చేశారని ట్రంప్ గోల చేస్తున్నా మిసెస్ క్లింటన్ క్లీన్ అండ్ గుడ్ అని ఎఫ్ బీఐ చెప్పేసింది! ఓట్లు పడటానికి కొన్ని గంటల ముందు ట్రంప్ కు వ్యతిరేక పరిస్థితులే వున్నట్టు ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. సర్వేలు కూడా అదే అంటున్నాయి. కాని, రిజల్ట్ వెలువడే సమయంలో ఏదైనా జరగొచ్చు. ఆఫ్ట్రాల్ ట్రంప్ ఇక్కడి దాకా వచ్చి ఓడినా అతడు బాదపడాల్సింది ఏం లేదు! ఎందుకుంటే, ఆతనొక మామూలు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మార్మోగిపోవటం ఎలా చూసినా లాభమే! కాని, హిల్లరీకి మాత్రం ఇది పెద్ద పరీక్షే! సంవత్సరాల తరబడి రాజకీయాల్లో వున్న ఈ మాజీ ప్రెసిడెంట్ గారి పెళ్లాం అనూహ్యంగా ఓడిపోతే అది పెద్ద చరిత్ర అయిపోతుంది! తక్కువ మార్జిన్ తో గెలిచినా... అది డెమొక్రాట్లకు ఎంతో కొంత పరాభవమే! హిల్లరీ క్లింటన్ భారీ మెజారీటితో గెలిస్తే తప్ప ట్రంప్ క్రెడిట్ ను ఇప్పుడు ఎవ్వరూ కొట్టేయలేని పరిస్థితి నెలకొంది!  

వివాదాలకి ప్రణనామం... సంయమనానికి ఎగనామం!

  మన దేశంలోని హిందూ దేవాలయాలకు రెండే రెండు సమస్యలు! కొన్నిటికి డబ్బు లేకపోవటం! మరి కొన్నిటికి డబ్బులు విపరీతంగా వుండటం! ఈ రెండో కోవకు చెందినదే తిరుమల వెంకన్న ఆలయం! ఇక్కడ డబ్బులకి ఏ కొదవా వుండదు. బోలెడన్ని నిధులు. అయినా నిత్యం ఏదో ఒకరకంగా రచ్చకెక్కుతుంటారు తిరుమల అధికారులు, పూజారులు, జీయర్లు, ఉద్యోగులు... అందరూ. దానికి తోడు అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నట్లు కాచుకుని కూర్చుంటాయి మీడియా భానల్స్. వాటి ఆశయం తిరుమల బాగు కాదు... ఆశ కేవలం టీఆర్పీలే. తిరుమల అన్న పేరు చెప్పి ఏ న్యూస్ ఇచ్చినా జనం చూస్తారు కాబట్టి అవ్వి ఎగబడుతుంటాయి. వివాదం దొరికితే అవసరానికి మించి రాజేస్తుంటాయి... తాజా నామాల గొడవ అలాంటిదే! తిరుమలలో జరిగే ప్రతీ గొడవకి మీడియా కారణం కాదు. అయితే, అక్కడ ఏ చిన్న అవకతవక చోటు చేసుకున్నా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు బద్ధలైపోతుంటాయి. వాటి వల్ల వేంకటేశ్వరుడి క్షేత్రానికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ. జనం కొండపైన ఏదో జరిగిపోతోందని విభ్రాంతికి గురైపోతారు. కాని, అక్కడ రకరకాల వర్గాల మధ్య ఆధిపత్య పోరు నిత్య సత్యం. ఎవరి గోల వారిదే...  ఈ శుక్రవారం నాడు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఎప్పటిలాగే శ్రీవారికి నామం దిద్దారు. కాని, అది వుండాల్సిన విధంగా కాక యూ ఆకారంలోకి మారిందని జీయర్లు ఆగ్రహించారు. కాని, వెంకన్న స్వామి నామం ఎలా వుండాలి? నాలుగు మూలలతో ఒక బాక్స్ ఆకారంలో వుండాలి. ఇది ఇప్పుడు కాదు బ్రిటీషర్ల టైంలో నిర్ణయింపబడ్డ విషయం. అప్పట్లో కూడా తిరుమలలోని రెండు వైష్ణవ వర్గాలు గొడవపడితే తెల్లవారు కలగజేసుకుని సంధి చేశారట. తెంగలై వర్గంగా పిలవబడే వైష్ణవులు వై ఆకారంలో నామాలు వుండాలంటే ... వడగలై వర్గం వారు యూ ఆకారం అన్నారు. ఇద్దరిదీ కాదు యూకి , వైకి మధ్యస్థంగా వుండే ఆకారం స్వీకరిద్దాం అన్నారు మధ్య వర్తులు. అదుగో అప్పట్నుంచీ శ్రీనివాసుని ప్రత్యేక నామం అమల్లోకి వచ్చింది. నిజానికి తిరుమలేశుని ముఖాన వున్న లాంటి నామం వైష్ణవులు ఎవరూ తమ ముఖాలపై పెట్టుకోరు. పెట్టుకోవటం కుదరదు కూడా...  తెంగలై, వడగలైల మధ్య గొడవలన్నీ కేవలం నామాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. వాళ్ల మధ్య నుదుటన పెట్టుకునే తిరునామాల విషయంలోనే కాదు ఇంకా అన్ని విషయాల్లోనూ అభిప్రాయ భేదాలే వున్నాయి. అంతకు మించి ఆధిపత్య పోరు కూడా వుంది. ఒక వైపు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వడగలై వైష్ణవుడైతే, జీయర్లు తెంగలై వైష్ణవులు. ఇలా రెండు బలమైన కేంద్రాలుగా ఇరు వర్గాలు మోహరించటంతో ఏదో ఒక గొడవకి దారి తీస్తుంటుంది. కొన్నేళ్ల కిందట కూడా రమణ దీక్షితులు మీద నామాల ఆకారం మార్చారని ఆరోపణలు వచ్చి నానా యాగీ జరిగింది. మొన్నటికి మొన్న ఆయనే తన మనవడ్ని గర్భాలయంలోకి తీసుకెళ్లాడని దుమారం రేగింది. ఇలా పదే పదే ఒక్క అర్చకుడి మీదే దృష్టి పడుతోందంటే అతను నిజంగానే ఏదైనా తప్పు చేస్తూ వుండాలి. లేదంటే అతనంటే పడని వారు ఏకమై మీడియాకి ఎక్కుతూ వుండాలి.  తిరుమల లాంటి పెద్ద వ్యవస్థలో సమస్యలు, సతమతమవటాలు వుంటూనే వుంటాయి. అయితే, వాటిని అంతర్గతంగా పరిష్కరించుకోకుండా ఛానల్స్ కు లీక్ లు ఇవ్వటం , రో్డ్డున పడటం ఎంత మాత్రం మెచ్చుకోదగ్గది కాదు. ఆ మాటకొస్తే ఆర్మీ లాంటి వ్యవస్థల్లో కూడా లోపల ఎన్నో లుకలుకలు వుంటాయి. అన్నిటికి జనం మధ్యలో వచ్చి పంచాయితీ పెట్టుకోవటం లేదు కదా? తిరుమలను కూడా టీటీడీ అలా గంభీరంగా, నిజాయితీగా నడిపిస్తే ఎంతో బావుంటుంది. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వుంటాయి...