ప్రపంచ దేశాల... నమోన్నమః
posted on Oct 17, 2016 @ 12:14PM
మోదీ అనే పేరు లేకుండా ఇప్పుడు భారతదేశంలో రోజు గడవటం లేదు. అది సహజం కూడా! ఎందుకంటే, ఆయన మన ప్రధాని. ప్రధాని చుట్టూ వార్తలు రాయటం, చెప్పటం పత్రికలు, ఛానల్సు చేస్తూనే వుంటాయి. కాని, మోదీ పేరు ఇండియాలోనే కాదు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రముఖంగా వినిపిస్తోంది! అసలు నమోకి నమస్కారాలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది! ఆ లిస్ట్ లో తాజా పేరు... డొనాల్డ్ ట్రంప్!
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న డొనాల్డ్ ట్రంప్ మోదీని ఆకాశానికి ఎత్తేశాడు. అక్కడితో ఆగకుండా హిందువులన్నా, ఇండియన్స్ అన్నా తనకు చాలా అభిమానం అన్నాడు. తాను ప్రెసిడెంట్ అయితే వైట్ హౌజ్ లో ఇండియన్స్ మేలు కోరే మంచి మిత్రుడు వున్నట్లే లెక్కా అంటూ చెలరేగిపోయాడు! అఫ్ కోర్స్, ఇదంతా ట్రంప్ పబ్లిసిటీలో భాగం. అమెరికాలోని ఇండియన్స్ ఓట్లు దండుకోటానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. ఇదేం పెద్ద రహస్యం కూడా కాదు. కాని, మోదీ పేరు ఒక అమెరికా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ తలుచుకోవటం... నాట్ ఏ సింపుల్ థింగ్! గతంలో ఒబామా ఎన్నికల్లో పోటీపడ్డప్పుడు మన్మోహన్ పేరు తలుచుకోలేదుగా? అంతకంటే ముందు అమెరికాలోని భారతీయుల ఓట్ల కోసం ఇందిరా, రాజీవ్ లాంటి ప్రధానుల పేర్లు కూడా అక్కడి అధ్యక్ష అభ్యర్థులు స్మరించుకోలేదు కదా? మోదీని మాత్రమే ఇప్పుడు ట్రంప్ ఎందుకు గుర్తుకు చేసుకోవాల్సి వచ్చింది?
నరేంద్ర మోదీ వచ్చాక అచ్చే దిన్ వస్తాయని భారతదేశం అశించింది. ఆశించినంత ఉత్సాహంగా పరిస్థితులు లేవు. అయినా కూడా గత అరవై ఏళ్ల పరిపాలన చూసిన ఇండియన్స్ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తోన్న కర్మయోగిని బలంగా నమ్ముతున్నారు. ఇవాళ్ల కాకపోతే రేపు భారత్ ఉజ్వలంగా వెలిగిపోతుందని ధీమాతో వున్నారు. అదే ప్రపంచ వ్యాప్తంగా మోదీ పేరు మార్మోగటానికి కారణం! ట్రంప్ అంతటి వాడు కూడా ఆయన పేరు చెప్పి ఓట్లు అడగాల్సి రావటానికి కారణం కూడా అదే!
మోదీ ఖ్యాతి ఇప్పుడు దేశంలో కంటే అంతర్జాతీయంగానే ఎక్కువగా వెలిగిపోతోంది. గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశం అందుకు అత్యంత తాజా ఉదాహరణ! ప్రపంచపు అతి శక్తవంతమైన దేశాల్లో ఒకటైన రష్యా ... బారత్ కు పూర్తి మద్దతు ప్రకటించింది. పాక్ విషయంలో రెండో మాట లేకుండా ఇండియా వైపే నిలిచింది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాద దేశానికి తాము ఆయుధాలుగాని, యుద్ధ విమానాలుగాని అమ్మం అని తేల్చేసింది. స్వయంగా పుతిన్ ఇండియా పట్ల తమ స్నేహాన్ని సుస్ఫస్టం చేశాడు! ఇది ద్వైపాక్షికంగా చాలా పెద్ద విజయం...
రష్యానే కాదు బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భూటాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా మోదీ ముందు తమ భారత్ విధేయతను ప్రకటించుకున్నాయి. ఉగ్రవాదంపై పోరులో తాము ఇండియా వైపే అని మరోసారి చెప్పాయి. పాక్ అంతకంతకు ఒంటరిగా మిగిలిపోతోంది! ఇక బ్రిక్స్ లో భాగమైన బ్రెజిల్, సౌతాఫ్రికా కూడా టెర్రరిజమ్ పై యుద్ధంలో మన వెంట వుంటామని గట్టిగానే చెప్పాయి. ఒక్క చైనా తప్ప మోదీ సారథ్యంలోని ఇండియాకు ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంలో మరే దేశమూ కనిపించలేదు!
మన దేశంలోని కొన్ని పార్టీలు, కొందరు నేతలు, కొన్ని సంస్థలు, కొందరు మేధావులు, ఉద్యమకారులకు నమో నచ్చకపోవచ్చు. వాళ్లు అంతర్జాతీయంగా కూడా ఆయనను అవమానించేందుకు ఎంతకైనా తెగించవచ్చు. కాని, ప్రధానిగా మాత్రం మోదీ మొత్తం ప్రపంచం ఆమోదం పొందుతున్నారు. ఇందుకు సగర్వ ఉదాహరణ... ఆయనను తమ దేశంలోకి రానీయమని వీసా నిరాకరించిన ఆమెరికా... ఇవాళ్ల అధ్యక్ష ఎన్నికల బరిలో ఆయన పేరునే తలుచుకోవటం! అదృష్టం బావుంటే అమెరికాని ఏలే ట్రంపే... మోదీ గ్రేట్ అంటూ కితాబునివ్వటం! ఇదంతా మన మోదీకే కాదు... మన దేశం మొత్తానికీ ఆనంద కారణమే!