'లీకై'పోతున్న హిల్లరీ ఆశలు...
posted on Oct 22, 2016 @ 4:31PM
అమెరికా అయినా అమేథి అయినా రాజకీయం రాజీకయమే! ఎన్నికలు వస్తే ఎన్ని కథలైనా పడతారు పొలిటీషన్స్! ఇప్పుడు అగ్ర రాజ్యంలో అదే జరుగుతోంది. మన దగ్గర ఎలక్షన్స్ టైంలో స్టింగ్ వీడియోలు వెలుగు చూస్తుంటాయి. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే వారు, లేదా కులాన్నో, మతాన్నో తిడుతు కెమెరాకు బుక్కయ్యే వారు... ఇలా బోలెడు రకాల వీడియోలు వస్తుంటాయి. అవ్వి కాకుండా ఇంక్ చల్లుకోవటాలు, చెప్పులు విసరటాలు వంటి వీడియోలు సంచలనం సృష్టిస్తుంటాయి. అమెరికాలో మన దగ్గర వీడియోలు చేసిన పనే ఈమెయిల్స్ చేస్తుంటాయి....
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతాయి. ఓటర్లు ప్రతీ అంశం పరిగణలోకి తీసుకుని ఓట్లు వేస్తారు. మన దగ్గరిలా కులం కోసమో, భాష కోసమో, ప్రాంతం కోసమో గుడ్డిగా ఓట్లు వేసేయరు. అందుకే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రత్యర్థులు అస్త్ర శస్త్రాలన్నీ బయటకు తీస్తుంటారు. వాటిల్లో మెయిన్ ఈమెయిల్సే! మరీ ముఖ్యంగా ఈ ఈమెయిల్స్ గొడవ హిల్లరీకి చాలా ఎక్కువగా వుంటోంది. గతంలో ఆమె సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా వున్నప్పుడు పర్సనల్ ఈమెయిల్స్ గొడవ తలెత్తింది. మంత్రిగా హిల్లరీ గవర్నమెంట్ సర్వర్ నుంచి కాకుండా తన పర్సనల్ సర్వర్ నుంచి ఈమెయిల్స్ పంపిందని ఆరోపణ వుంది. ఇలా తన పర్సనల్ సర్వర్ వాడటం వల్ల ఆమె ఏం సమాచారం ఎవరెవరికి పంపింది సీక్రెట్ గా మారిపోయింది. ఇది చట్ట విరుద్ధమంటారు ఇప్పటికీ. అయితే, హిల్లరీ తాను అలాంటి పనేం చేయలేదని చెబుతూ వస్తోంది.
ఇప్పటికే గతంలో తాను చేసిన ఈమెయిల్స్ తప్పిదం హిల్లరీని వెంటాడుతుంటే ఇప్పుడు మరో సారి ఈమెయిల్స్ భూతం ఆమె మీదకి వచ్చింది. అయితే, ఈసారి ఒబామా రూపంలో గండం ఎదురవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పంపినా, అందుకున్నకొన్ని ఈమెయిల్స్ ఏకంగా వికీలీక్స్ కే దొరికాయి. వాళ్లు కొన్నిట్ని ట్విట్టర్ లో బయటపెట్టారు! ఒబామా, హిల్లరీ ఇద్దరూ డెమొక్రాట్ పార్టీ అభ్యర్థులే కావటంతో ఇప్పుడు తాజా ఈమెయిల్స్ ఎఫెక్ట్ మిసెస్ క్లింటన్ మీద పడేలా వుంది!
ఒబామాకు సంబంధించిన ఈమెయిల్స్ లో ఒకదాంట్లో జీ 20 సదస్సు గురించి చర్చ వుంది. ఆయన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఎన్నికైన తరువాత అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ సదస్సుకు రమ్మన్నాడు. కాని, వెళ్లవద్దని ఒబామా టీమ్ మెంబర్ జాన్ పొడెస్టా చెప్పాడు. ఎందుకు అన్న వివరణ ఇంకా బయటకి రాలేదు. కాకపోతే, 2008నాటి అప్పటి ప్రెసిడెంట్ బుష్ ఆహ్వానిస్తే కూడా వాషింగ్ టన్ లోనే జరిగిన మీటింగ్ కి ఒబామా డుమ్మా కొట్టాడు. ఈ విషయం పొడెస్టా చెప్పినందుకే జరిగిందని ఇప్పుడు ఈమెయిల్స్ లో బయటపడింది. అమెరికన్ ప్రెసిడెంట్ అలా మరొకరు చెబితే వినటం ఓటర్లపై ప్రభావం చూపవచ్చు!
ఒబామాకు సంబంధించిన హైలీ కాన్ఫిడెన్షియల్ ఈమెయిల్స్ వికీలీక్స్ కి దొరకటం మామూలు విషయం కాదు. దీని వెనుక రష్యా హస్తం వుందని కొందరు భావిస్తున్నారు. కాని, ట్రంప్ కైతే ఈ తాజా ఈమెయిల్ లీక్ అస్త్రం హిల్లరీపై గురి పెట్టటానికి చక్కగా దొరికింది!అతడు దీన్ని సూపర్ గా యూజ్ చేసుకుంటాడంటున్నారు క్రిటిక్స్!