ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లపై... హిందూత్వాస్త్రం!
posted on Oct 24, 2016 @ 5:05PM
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరికి వస్తున్న కొద్దీ బీజేపి నేతల గొంతుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి మంత్రం ఎంత పఠించినా యూపీ లాంటి రాష్ట్రంలో హిందూత్వ వాదం ఎత్తుకోకుంటే వర్కవుట్ కాదని నిర్ణయించుకున్నట్టుగా వుంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీయే కరుడుగట్టిన బీజేపి , ఆరెస్సెస్ అంశాల్ని లేవనెత్తుతున్నారు!
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఒక ర్యాలీలో ట్రిపుల్ తలాఖ్ అంశంపై కామెంట్ చేశారు. ముందుగా హిందువుల్లో వున్న భ్రూణ హత్యల అమానుషాన్ని ఆయన ఖండించారు. ఆడపిల్లల్ని చంపుకోవటం దారుణం అన్నారు. ఆ పని చేస్తే హిందువైనా సరే జైలుకి వెళ్లాల్సిందే అన్నారు. కాని, వెంటనే ముస్లిమ్ ల మీదకు టార్గెట్ గురిపెట్టారు. ఫోన్ లో మూడుసార్లు తలాఖ్ చెప్పేస్తే ముస్లిమ్ స్త్రీల జీవితాలు నాశనం అవ్వటం తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తేల్చేశారు. సుప్రీమ్ గవర్నమెంట్ ను అడిగితే ట్రిపుల్ తలాఖ్ ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పామన్నారు. మొత్తం మీద మోదీ ముస్లిమ్ స్త్రీల మేలు కోరుతూనే యూనిఫామ్ సివిల్ కోడ్ తుట్టె కదిపారు! ట్రిపుల్ తలాఖ్ పై సుప్రీమ్ తీర్పు ఇస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తుందనేదే ఇప్పుడు చాలా ముస్లిమ్ ల భయం...
యూనిపామ్ సివిల్ కోడ్ ఇప్పటికిప్పుడు అమల్లోకి వస్తుందా లేదా అంటే చెప్పే పరిస్థితి లేదు. కాని, కోర్టు తీర్పు త్వరలోనే రావొచ్చు. అందుకే, ఆ విషయంపై ఎన్నికల సభల్లో ప్రస్తావించి మోదీ దాన్ని ఎన్నికల అంశంగా మార్చేశారు. యూపీలో హిందూ, ముస్లిమ్ విభజన చాలా ఎక్కువగా వుంటుంది. అందుకే, యూనిఫామ్ సివిల్ కోడ్, అయోధ్య రామ మందిరం లాంటి అంశాలు బీజేపికి హిందూ ఓట్లు సంపాదించి పెట్టే ఛాన్స్ వుంది. కాని, అదే సమయంలో ముస్లిమ్ లు ఎప్పటిలాగే కమలదళానికి దూరంగా వుండిపోయే అవకాశం వుంది...
మోదీనే కాదు బీజేపి నేతలందరూ కాస్త ఘాటైన హిందూత్వ ఎజెండానే అమలు పరుస్తున్నారు. బీజేపి కాంట్రవర్సియల్ ఎంపీ గిరి రాజ్ సింగ్ మరోసారి నోరు విప్పారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలనే తిరిగి చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందూ జనాభ తగ్గిపోతోందని... హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని... ఆయన అన్నారు! స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 90శాతం వున్న హిందూ జనాభా ఇప్పుడు 76శాతానికి తగ్గిపోయిందని అన్నారు. అలాగే, 10శాతం కూడా లేని ముస్లిమ్ లు 24శాతం అయ్యారన్నారు!
గిరి రాజ్ సింగ్ మాటలు విని హిందువులు ఎక్కవ మంది పిల్లల్ని కంటారో లేదోగాని ఈ వాఖ్యలు రాజకీయ దుమారం మాత్రం తప్పకుండా రేపుతాయి. ఎన్నికల్లో తమని తాము యాంటీ ముస్లిమ్ అన్నట్లు బీజేపి ప్రొజెక్ట్ చేసుకుని కరుడుగట్టిన హిందూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేయవచ్చు! అభివృద్ధి మంత్రంతో సాధారణ హిందువుల్ని కూడా తన వైపు తిప్పుకునే ఆలోచనలో వుంది బీజేపి. మొత్తానికి ఉత్తర్ ప్రదేశ్ యుద్ధంలో ఏ అస్త్రమూ వదలటం లేదు మోదీ సేన! చూడాలి మరి... రామ మందిర రాష్ట్రంలో రానున్న కాలపు రాజకీయాలు ఎలా వుండబోతున్నాయో!