రాంకిషన్ లు ముద్దు... రాంశంకర్ లు వద్దు!
దేశంలో ఇప్పుడు రాంకిషన్ వర్సెస్ రాంశంకర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా? మన దేశంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఇంకా బోలెడు రకాల రాజకీయాలు మామూలే. కాని, మోదీ ప్రధాని అయ్యాక కొత్త కొత్త రకాల రాజకీయాలు ప్రాణం పోసుకుంటున్నాయి. అదీ విషాదంగా... పోయిన ప్రాణాల సాయంతో కొత్త పాలిటిక్స్ ప్రాణం పోసుకుంటున్నాయి. ఆ కోవకు చెందినవే తాజా రాంకిషన్ వర్సెస్ రాంశంకర్ పాలిటిక్స్!
ముందుగా రాంకిషన్ ఎవరో తెలుసుకుందాం. రాంకిషన్ 70ఏళ్ల మాజీ సైనికుద్యోగి. ఆయన విభ్రాంతికర రీతిలో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే చెలరేగిన దుమారం తెలిసిందేగా? దేశాన్ని గతంలో ప్రాణాలకి తెగించి సేవించిన ఒక జవాను ఇప్పుడు నేల రాలిపోతే కాంగ్రెస్, ఆప్ లు తమ రేస్ మొదలుపెట్టాయి. ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆప్ అధ్యక్షడు రంగంలోకి దిగి పరామర్శల పరంపర మొదలు పెట్టారు. వాళ్లని చనిపోయిన రాంకిషన్ డెడ్ బాడీ వద్దకి పోలీసులు అనుమతించలేదు. రాహుల్, కేజ్రావాల్ మీడియా ముందు హంగామాకి సిద్ధపడ్డారు. మోదీ సర్కార్ ఆర్మీ జవాన్లకు వ్యతిరేకమని స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే, ఇక్కడ ఒక అనుమానం రావొచ్చు. ఒక సోల్జర్ మనసును కలచి వేసే రీతిలో ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్షాల నేతలు పరామర్శించవద్దా అని! తప్పకుండా పరామర్శించాలి. కాని, ఇక్కడే రాంశంకర్ తెరపైకి వస్తాడు! ఆయనెవరు?
రాంశంకర్ ఈ మధ్య భోపాల్ సిమి ఉగ్రవాదుల ఉదంతంలో అంతమైన పోలీస్. మరొ నెలలో ఆయన కూతురు పెళ్లి వుండగా టెర్రరిస్టులు తనని గొంతు కోసి చంపారు. తరువాత పారిపోయిన ఆ 8మంది దుర్మార్గుల్నీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయితే, ఓవైసీ, కాంగ్రెస్ నేతలు మొదలైన వారందరికీ ఈ ఎన్ కౌంటర్ పై అనేక అనుమానాలున్నాయి. పెద్ద రచ్చ చేశారు కూడా. కాని, అందరూ కన్వీనియంట్ గా మరిచిపోయిన విషయం ఒకటి వుంది! ఉగ్రవాదుల చేతిలో మరణించిన రాంశంకర్ కు ఏ ఒక్క సో కాల్డ్ సెక్యులర్ నేత కూడా శ్రద్ధాంజలి ప్రకటించలేదు. కేవలం బీజేపి నేతలు మాత్రమే పోలీస్ రాంశంకర్ అంత్యక్రియలకు హాజరై, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు!
ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన రాంశంకర్ కి, ఆత్మహత్య చేసుకున్న రాంకిషన్ కి చాలా తేడా వుంది. అయినా వారిద్దరివీ అమూల్యమైన ప్రాణాలే. పైగా ఇద్దరూ భద్రతా దళాల సభ్యులు. మన దేశానికి ఎంతో కీలకం. అటువంటి పోలీస్, ఆర్మీలకు సంబంధించిన వారితో రాజకీయ నేతలు ఆటలాడుకోవటం అతి పెద్ద విషాదం. అసలు తనకు పెన్షన్ సరిగ్గా రాలేదని ఆత్మహత్య చేసుకున్న రాంకిషన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లిన రాహుల్, కేజ్జీవాల్... ఎందుకని, డ్యూటీలో భాగంగా దేశం కోసం బలి అయిన రాంశంకర్ అంత్యక్రియలకి వెళ్లలేదు? దీనికి సమాధానం చెప్పే వారు ఎవ్వరూ లేరు! కేవలం మోదీ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు సరిగ్గా చేయటం లేదని గోల మాత్రమే వినిపిస్తోంది!
ఓఆర్ఓపీ అమలుపై ప్రతిపక్షలు నిరసనలు చేయటం వాటి హక్కు, బాధ్యత కూడా. కాని, అదే సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం బలవుతోన్న ఆర్మీ, పోలీసుల కుటుంబాల్ని పరామర్శించటం కూడా ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆరితేరిన మన నేతల బాధ్యత. ఎందుకంటే, కేవలం కొన్ని ఓట్ల కోసం చూసుకుని... ఒక వర్గంలోని అతివాదాన్ని మౌనంగా సమర్థించటం ఎప్పటికైనా ప్రమాదమే. రాంకిషన్ ఆత్మహత్యకి హడావిడి చేసి రాంశంకర్ ను అస్సలు పట్టించుకోకపోవటం అమానుషం తప్ప మరొకటి కాదు. గతంలోనూ రాహుల్, కేజ్రీవాల్, ఓవైసీ లాంటి వాళ్లు దాద్రి మృతుడి కుటుంబాన్ని , రోహిత్ వేముల ఫ్యామిలీని సెలక్టివ్ గా పరామర్శించారు. కాని, అదే సమయంలో దేశంలో వరుసగా ఆర్మీ జవాన్లు మరణిస్తున్నా... ఎక్కడా ఏ ఒక్క రోజూ ఎవరి అంత్యక్రియల్లోనూ కనిపించలేదు! ఇది దేనికి సంకేతం? శుద్ధమైన సెక్యులరిజమ్ అయితే కాదు... అదో రకపు కరుడుగట్టిన సెక్యులర్ రాజకీయం!