జియో... 'స్పీడ్' బ్రేకర్ దగ్గర 'స్లో' అయిపోతోంది!!
posted on Oct 22, 2016 @ 12:43PM
ముఖేష్ అంబానీ జియో 4జీ ఎందుకు మార్కెట్లోకి తెచ్చాడో తెలుసా? ఆయన కూతురు ''నాన్న ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా వుంది'' అంటూ కంప్లైంట్ చేసిందట! మామూలు నాన్నైతే స్లోగా నెట్ వర్క్ వున్న కంపెనీ మార్చేసి మరో కంపెనీ సర్వీస్ తీసుకోమనే వాడు. కాని, ముఖేష్ అంబానీ అసలు సిసలు బిజినెస్ మ్యాన్ కాబట్టి తన కూతురు అడిగిన స్పీడ్ తో తానే ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించాడు. అదే జియో!
జియో మార్కెట్లోకి రావటం వెనుక వున్న అసలు కారణమే స్పీడ్! మా అంత వేగంగా మరెవ్వరూ మీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయరు అన్నాడు అంబానీ. పైగా 90రోజులు ఫ్రీగా మా ప్రాడక్ట్ రుచి చూడండి అనేసరికి మిగతా కంపెనీలు గడగడలాడిపోయాయి! ఎయిర్ టెల్, ఐడియా లాంటి సంస్థలు ఊపిరిబిగబట్టి పరిణామాల్ని గమనించాయి. కాని, తీరా ఇప్పుడు మార్కెట్లో వున్న జియో... ప్రచారం జరిగినంత సంచలనం ఏం సృష్టించటం లేదు!
జియో అంటేనే డేటా! 4జీ కాబట్టి హై స్పీడ్ డేటా వుంటుందని అందరూ ఆశిస్తారు. పైగా జియోలో ఫోన్ కాల్స్ కూడా ఇంటర్నెట్ ద్వారానే వెళతాయి కాబట్టి డేటా సర్వీస్ చాలా ముఖ్యం. కాని, నిజం ఏంటంటే జియో డేటా సేవలు దారుణంగా వున్నాయట! ఇది చెప్పింది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు. స్వయంగా ప్రభుత్వ సంస్థ అయిన ట్రాయ్ జియో గుట్టు రట్టు చేసేసింది. ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, ఆర్ కామ్ లాంటి కంపెనీలన్నిటి కంటే తక్కువ స్పీడ్ జియోకు వుందని తేల్చేసింది. ఎయిర్ టెల్ ఇంటర్నెట్ సర్వీస్ లో తొలి స్థానంలో వుండగా, తరువాత ఐడియా, వోడాఫోన్, ఆర్ కామ్ లు వున్నాయి. కొత్తగా వచ్చిన జియో అన్నిటికంటే తక్కువ స్పీడ్ తో రన్ అవుతోంది. ఫలితంగా టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్స్ తో జియోదే ఆఖరు స్థానమైంది!
జియో తక్కువ స్పీడ్ తోనే కాదు చాలా చోట్ల కనెక్టివిటి లేక కూడా వెనుకబడిపోతోంది. అయితే, టెలికాం రెగ్యులేటరీ అథారటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్, ఇచ్చిన రిపోర్ట్ తో జియో విభేదిస్తోంది. తమ సర్వీస్ ట్రాయ్ చెప్పినంత దారుణంగా లేదని వాదిస్తోంది. కస్టమర్ వాడుకోవాల్సిన డైలీ ఫ్రీ లిమిట్ అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుందని.... అప్పుడు గమనించి తమ ఇంటర్నెట్ స్పీడ్ అంచనా వేయడం సరికాదంటోంది! ఏదీ ఏమైనా జియో మార్కెట్లోకి వచ్చినప్పుడు సంచలనంగా వచ్చింది! కాని, సంచలనంగానే ఇక మీద కొనసాగుతుందా అంటే డౌటే! మరో వైపు ఎయిర్ టెల్ , ఐడియా లాంటి ప్రత్యర్థి కంపెనీలు మాత్రం జియో బాలారిష్టాలు చూసి ఫుల్ ఖుష్ అవుతున్నాయి...