అమరావతి అభివృద్ధికి... ముందు ఇవ్వి వుండాలి!
posted on Oct 20, 2016 @ 10:40AM
దేశమంటే మట్టికాదోయ్.... దేశమంటే మనుషులోయ్ అన్నాడు కవి. కాని, ఇప్పుడు మారిపోయిన ప్రపంచ పరిస్థితుల్లో దేశమంటే మట్టిలాగే తయరైపోయింది! భూమి, భూమిలో వేసే వాటర్, సుయెజ్ పైపులు, భూమిపై వేసే రోడ్లు... ఇలాంటి మౌలిక సదుపాయాలే ఇప్పుడు అభివృద్ధిని నిర్దేశిస్తున్నాయి. నిర్వచిస్తున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతికి కూడా ఇప్పుడు కావాల్సింది మౌలిక సదుపాయాలే...
హైద్రాబాద్ నుంచి అమరావతికి గవర్నమెంట్ ఆఫీసుల షిఫ్టింగ్, తాత్కాలిక సెక్రటేరియట్ ఇలాంటి పరిణామాలు ఎన్ని జరుగుతున్నా కొత్త రాజధానిలో ఇంత వరకూ ప్రత్యక్ష అభివృద్ధి ప్రజలకు కనిపించటం లేదు. అందుకే, ఏపీ సీఏం చంద్రబాబు డెవలప్ మెంట్ కి ఊతమిచ్చే కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకి దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రానికి రాజధాని అంటే అత్యంత ప్రధానం కనెక్టివిటి. అందుకే, రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అలాగే, తాగు నీరు, మురుగు పారుదల వ్యవస్థలపై కూడా రానున్న నాలుగేళ్లలో పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టాలన్నారు. ఇక అభివృద్ధికి అత్యంత ప్రధానమైన విద్యుత్ సరఫరా పై కూడా సమరోత్సాహంతో పని చేయాలని సూచించారు. విద్యుత్, తాగు నీరు, రోడ్లు... ఇలాంటివి అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి అభివృద్ధి ఆసాధ్యమేం కాదు!
అమరావతి నగర అభివృద్ధి కోసం రానున్న నాలుగేళ్లలో దాదాపు 33వేల కోట్లు, మొత్తం పదేళ్ల కాలంలో 43వేల కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఇంత పెద్ద మొత్తం సమర్థంగా రాజధాని నగరంపై పెట్టుబడి పెడితే ఖచ్చితంగా అమరావతి రూపు రేఖలే మారిపోయే అవకాశం వుంది. కాకపోతే, సీఎం సారథ్యంలో ప్రభుత్వం, అటు బ్యూరోక్రాట్స్ చిత్తశుద్ధితో కృషి చేయాలి. నిధుల్ని సాధ్యమైనంత త్వరగా పోగు చేసి ప్రజలకి అభివృద్ధి అనుభవంలోకి వచ్చేలా చేయాలి. అత్యునత స్థాయి విద్యా సంస్థలు, ఇతర సంస్థలు, పేరు మోసిన హోటల్స్... ఇలాంటివన్నీ తమ సిటీలోకి వస్తేనే జనం సంతోషించేది. లాభపడేది. అదే 2019లో టీడీపికి అతి పెద్ద బలం కూడా అవుతుంది!