తండ్రి, సవితి తల్లి, ఓ సీఎం!
posted on Oct 24, 2016 @ 12:39PM
భారతదేశంలోని అతి పెద్ద ప్రాంతీయ పార్టీ ఏదో తెలుసా? సమాజ్ వాది పార్టీ! దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ ను ఏలే ఎస్పీ ఇండియాలోనే అతి పెద్ద రీజినల్ పార్టీ. కాని, ఇది త్వరలోనే వమ్ము కాబోతోంది! సమాజ్ వాది పార్టీ అతి పెద్ద నుంచి ఒకానొక ప్రాంతీయ పార్టీగా మారబోతోంది! అందుక్కారణం ఎవరో కాదు పార్టీ వ్యవస్థాపకుడు, ఆయన కుమారుడే...
సమాజ్ వాది పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది ములాయం సింగ్ యాదవ్. ఇప్పుడు ఆ ములాయం ఇంట్లోనే ముసలం పుట్టింది. మొత్తం కుటుంబం రెండు వర్గాలుగా చీలి పార్టీని కూడా చెరి సగం చేసుకునే పరిస్థితికి వచ్చేశారు. ఒకవైపు ములాయం , ఆయన చిన్న తమ్ముడు, చిన్న భార్య, చిన్న కొడుకు వుంటే... మరో వైపు ప్రస్తుత యూపీ సీఎం అఖిలేష్, ఆయన పెద్ద బాబాయి, ఇంకా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్నారు! మొత్తానికి వ్యవహారం ఎంత దాకా వచ్చిందంటే అఖిలేష్ వేరు కుంపటి పెట్టడం దాదాపు ఖాయమైపోయింది. కాని, కుంపటి ఎప్పుడు రాజేస్తాడన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్...
అగ్రకులాల ఆధిపత్యానికి పెట్టింది పేరైన ఉత్తర్ ప్రదేశ్ లో బీసీల రాజ్యం తెచ్చాడు ములాయం. ఇంకా స్పష్టంగా చెప్పుకుంటే యాదవుల రాజ్యం తెచ్చాడు. ముస్లిమ్ నేతల హంగామాకి కారకుడయ్యాడు. కాని, గత ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయం సాధించాక కొడుకు అఖిలేష్ ను సీఎం చేసి తాను సెంట్రల్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టాడు. కాని, నితీష్ కుమార్, మాయావతి లాగే ప్రధాని అవుదామనుకున్న మన సైకిల్ పార్టీ బాస్ మోదీ హవాలో కొట్టుకుపోయాడు. ఇక ఇప్పుడు పీఎం అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు. మరో ములాయం ఇంట్లో కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ బాగా దెబ్బతిన్నాయి...
ములాయం మొదటి భార్య కొడుకు అఖిలేష్. రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్. ఇప్పుడు సమాజ్ వాది పార్టీలో గందరగోళానికి ఈ ఇద్దరు వారసులే కారణం. అఖిలేష్ ఆల్రెడీ సీఎంగా జనం ముందుకి వచ్చేస్తే... అతని సవతి తమ్ముడు ప్రతీక్ యాదవ్ తల్లి సాధన గుప్తా వ్యూహంతో ముందుకొస్తున్నాడు. ములాయం రెండో భార్య సాధన తన కొడుకు ప్రతీక్ ని నెక్స్ట్ సీఎం చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆమెకు అండగా ములాయం చిన్న తమ్ముడు శివపాల్ యాదవ్ కూడా వున్నాడు. ఈ టీంలోనే అమర్ సింగ్, మన జయప్రద కూడా వున్నారు! ఇక అఖిలేష్ ని నాయకుడుగా కోరుకుంటున్న వారు కూడా తక్కువేం లేరు. ముఖ్యంగా ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ బలంగా మద్దతిస్తున్నాడు. అంతే కాదు, మొత్తం 229 మంది ఎమ్మేల్యేల్లో అఖిలేష్ వైపు 183మంది ప్రజా ప్రతినిధులు వున్నారు. వీళ్లందరి అండతోనే అఖిలేష్ తిరుగుబాటుకి రెడీ అయ్యాడు! ములాయం తనని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే అఖిలేష్ ఆయన మనుషులుగా ముద్రపడ్డ నలుగురు మంత్రుల్ని క్యాబినేట్ నుంచి తొలగించాడు! ఉత్తర్ ప్రదేశ్ లో నేతాజీ అని అందరూ గొప్పగా చెప్పుకునే ములాయంకే చుక్కలు చూపిస్తున్నాడు!
వచ్చే సంవత్సరంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు వెళ్లబోతోంది. ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ బీజేపి అతి పెద్ద పార్టీ అని చెబుతున్నాయి. అంటే ఎస్పీ అధికారం కోల్పోవటం దాదాపు ఖాయం. ఆ భరోసా ఇచ్చేలాగే అఖిలేష్ అరాచక పాలన సాగింది గత నాలుగు సంవత్సరాల్లో. కాని, అసలు వచ్చే అవకాశమే లేని అధికారం కోసం ములాయం కుటుంబ సభ్యులు, పార్టీ వారు రోడ్డున పడి గొడవ పడుతున్నారు. ఇది నిజంగా విచిత్రమే! రాజకీయ వినోదమే! అటు పోయి ఇటు పోయి బీఎస్పీకో, బీజేపికో మేలు చేసేది కూడా కావొచ్చు! కాని, ఆశ్చర్యం ఏంటంటే... ఉత్తర్ ప్రదేశ్ లో అయోధ్య వుంది! అక్కడే తండ్రి మాట కోసం రాజ్యాన్ని వద్దన్న రాముడు పుట్టాడు! ఇప్పుడు ఈ కలియుగంలో ... అక్కడే... తండ్రిని ధిక్కరించి రాజ్యాధికారం సంపాదించాలనుకుంటున్న అఖిలేష్ వార్తల్లో నిలుస్తున్నాడు! కాకపోతే, ఈ యువరాజు రాముడూ కాదు... ఆ ముసలాయన, ములాయం... దశరథుడంతటి వాడూ కాదు!